పుట్టగానే ప్రపంచ రికార్డ్ బ్రేక్ చేసిన పసిపాప : ప్రెస్ రివ్యూ

పసిపాప

ఫొటో సోర్స్, Getty Images

27 ఏళ్లు దాచిన పిండానికి ఒక తల్లి జన్మనిచ్చిదంటూ ఈనాడు కథనం ప్రచురించింది. ఆ బిడ్డ... 27 ఏళ్ల తర్వాత పుట్టడమేంటి? ఆశ్చర్యంగా ఉంది కదూ! ఈ ఆశ్చర్యాన్ని వాస్తవం చేసింది ఆధునిక వైద్యశాస్త్రం.

ఒకటి కాదు, రెండు కాదు, ఏకంగా 27 ఏళ్ల పాటు దాచి ఉంచిన పిండం సాయంతో అమెరికాలోని టెన్నెసీ రాష్ట్రానికి చెందిన టీనా గిబ్సన్‌ ఓ అందమైన శిశువుకు జన్మనిచ్చిందని పత్రిక రాసింది.

టీనా గిబ్సన్‌ గర్భాశయంలోకి పంపిన పిండాన్ని 1992లో సేకరించారు. అప్పటి నుంచి క్రయోజనిక్‌ ఫ్రీజర్‌లో భద్రపరిచారు. అలా ఉంచిన పిండాన్ని ఈ ఏడాది ఆరంభంలో గిబ్సన్‌ గర్భాశయంలోకి పంపారు.

ఆమె అక్టోబర్‌ 26న మాలీ ఎవ్రెట్‌ గిబ్సన్‌కు జన్మనిచ్చింది. ఇలా శీతలీకరించిన పిండం ద్వారా శిశువుకు జన్మనివ్వడం గిబ్సన్‌కు కొత్త కాదు.

ఆమె మొదటి కుమార్తె ఎమ్మా రెన్‌ గిబ్సన్‌ కూడా 24 ఏళ్లపాటు భద్రపరిచిన పిండం నుంచి జన్మించిందే. అప్పటికి అది రికార్డు.

ఇప్పుడు ఆ రికార్డును మాలీ ఎవ్రెట్‌ గిబ్సన్‌ అధిగమించింది. ఆసక్తికరమైన విషయమేంటంటే, ఈ రెండు పిండాలు 1992లో ఒకే వ్యక్తి నుంచి సేకరించినవే అని ఈనాడు వివరించింది.

వజ్రాల ఉంగరం

ఫొటో సోర్స్, FB/Renani Jewels

12 వేల వజ్రాల ఉంగరం రికార్డ్ బ్రేక్

హైదరాబాద్‌కు చెందిన నగలవ్యాపారి వజ్రాల ఉంగరం రికార్డును ఉత్తరప్రదేశ్ వ్యాపారి బ్రేక్ చేశారని సాక్షి కథనం ప్రచురించింది.

హైదరాబాద్‌కు చెందిన నగల వ్యాపారి కొట్టి శ్రీకాంత్‌ నెల క్రితమే 7,801 వజ్రాలు పొదిగిన ఉంగరం తయారు చేసి గిన్నిస్‌ రికార్డుల్లోకి ఎక్కిన విషయం తెలిసిందే.

తాజాగా, ఉత్తరప్రదేశ్‌కు చెందిన నగల దుకాణదారు ఆ రికార్డును బద్దలు కొట్టారు. మీరట్‌కు చెందిన హర్షిత్‌ బన్సాల్‌ ఏకంగా 12,638 వజ్రాలు పొదిగిన రింగ్‌ను తయారు చేశారు.

8 పొరలతో 165.45 గ్రాముల బరువున్న ఉంగరానికి మారిగోల్డ్‌ డైమండ్‌ రింగ్‌ అనే పేరు పెట్టారు. ఇది గిన్నిస్‌ ప్రపంచ రికార్డుల్లో స్థానం సంపాదించిందని సాక్షి రాసింది.

రూపశిల్పి, 25 ఏళ్ల హర్షిత్‌ మాట్లాడుతూ.. ‘6,690 వజ్రాలతో తయారైన ఉంగరం గిన్నిస్‌ రికార్డుల్లో ఉన్నట్లు 2018లో తెలుసుకున్నాను. అనంతరం 2018లో మొదలుపెట్టిన ఈ బృహత్తర కార్యక్రమం చివరికి 2020 ఫిబ్రవరిలో ముగింపునకు వచ్చింది. గిన్నిస్‌ ప్రపంచ గుర్తింపు లభించింది. ఇలా భారీ సంఖ్యలో వజ్రాలు పొదిగిన ఉంగరాన్ని రూపొందించడం క్లిష్టమైన పనే’ అని చెప్పారు.

ఉంగరం తయారీలో ఇంటర్నేషనల్‌ జెమాలజీ లేబొరేటరీ ధ్రువీకరించిన శుద్ధమైన వజ్రాలను వినియోగించినట్లు ఆయన తెలిపారని సాక్షి వివరించంది.

కేటీఆర్

ఫొటో సోర్స్, FB/KTR

తెలంగాణ అంతటా ఐటీ పరిశ్రమ విస్తరణ- మంత్రి కేటీఆర్

తెలంగాణ అంతటా ఐటీ పరిశ్రమను విస్తరిస్తామని మంత్రి కేటీఆర్ చెప్పారని నమస్తే తెలంగాణ ఒక కథనం ప్రచురించింది.

ఐటీ పరిశ్రమను హైదరాబాద్‌లోని ఇతర ప్రాంతాలతోపాటు రాష్ట్రంలోని ద్వితీయ శ్రేణినగరాలకు విస్తరించేందుకు వేగంగా చర్యలు తీసుకొంటున్నట్టు ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి కే తారకరామారావు తెలిపారు.

రాష్ట్రవ్యాప్తంగా ఐటీ విస్తరణకోసం వేగంగా అడుగులు పడుతున్నాయని చెప్పారు. వివిధ నగరాలకు ఐటీ విస్తరణ, పరిశ్రమల రాక.. మౌలిక సౌకర్యాల కల్పన తదితర అంశాలపై శనివారం ప్రగతిభవన్‌లో మంత్రి కేటీఆర్‌ సమీక్ష నిర్వహించారు.

ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్‌ మాట్లాడుతూ.. ఇప్పటికే వరంగల్‌, మహబూబ్‌నగర్‌, ఖమ్మం నగరాలకు ఐటీ పరిశ్రమ విస్తరించేందుకు ముమ్మరంగా ఏర్పాట్లుచేస్తున్నామని పేర్కొన్నారు.

సోమవారం ఖమ్మంలో ఐటీ టవర్‌ను ప్రారంభిస్తున్నామని ఆయన వెల్లడించారు. వరంగల్‌లో ఇప్పటికే పలు ఐటీ కంపెనీలు కార్యకలాపాలు కొనసాగిస్తున్నాయని, రెండో దశలో మరిన్ని ఐటీ కంపెనీలు వరంగల్‌లో తమ కార్యకలాపాలు ప్రారంభించేందుకు సిద్ధంగా ఉన్నాయని పేర్కొన్నారు.

మహబూబ్‌నగర్‌ జిల్లా దివిటిపల్లి ప్రాంతంలో అనేక ఐటీ కంపెనీలు పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వస్తున్నాయని, వాటికి సంబంధించి కూడా పూర్తి వివరాలను త్వరలోనే ప్రకటిస్తామని ఆయన వివరించినట్లు పత్రిక చెప్పింది.

టెడ్రోస్ అడానమ్ గెబ్రైసిస్

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, డబ్ల్యుహెచ్ఓ డైరెక్టర్ జనరల్ టెడ్రోస్ అడానమ్ గెబ్రైసిస్

కరోనా అంతం గురించి కలలు కనే సమయం-డబ్ల్యుహెచ్ఓ

కరోనా అంతం గురించి కలలు కనొచ్చని ప్రపంచ ఆరోగ్య సంస్థ చెప్పినట్లు వెలుగు పత్రిక ఒక వార్త ప్రచురించింది.

కరోనా వైరస్ ముగింపుపై కలలు కనే టైం వచ్చిందని ప్రపంచ ఆరోగ్య సంస్థ డబ్ల్యుహెచ్ఓ తెలిపింది. వైరస్ ను అరికట్టే వ్యాక్సీన్ల సానుకూల ఫలితాలపై డబ్ల్యుహెచ్ఓ ఈ ప్రకటన చేసిందని పత్రిక రాసింది.

వైరస్ వెలుగులోకి వచ్చినప్పటి నుంచి జాగ్రత్తగా ఉండాలంటూ హెచ్చరించిన డబ్ల్యుహెచ్ఓ ప్రస్తుతం సానుకూల ప్రకటనలు చేస్తోంది.

అయితే, వ్యాక్సీన్ విషయంలో పేద దేశాలపై… ధనిక దేశాలు ఆధిపత్యం కొనసాగించవద్దని డబ్ల్యుహెచ్ఓ డైరెక్టర్ జనరల్ టెడ్రోస్ తెలిపారని కథనంలో రాశారు.

కరోనా అంతానికి సమయం దగ్గరపడ్డప్పటికీ…. ఆ దిశగా వెళుతున్న మార్గమే కొంత అనుమానాస్పదంగా ఉందన్నారు.

పేద దేశాలకు టీకా అందుబాటులోకి రావడంపై ఉన్న సందేహాలను వ్యక్తం చేశారు టెడ్రోస్. వైరస్ కాలం ప్రపంచవ్యాప్తంగా ఉన్న మంచితో పాటు చెడునూ వెలుగులోకి తెచ్చిందన్నారు.

పేదరికం, ఆకలి, అసమానత, పర్యావరణ మార్పుల వంటి శాశ్వత సమస్యలకు ఎలాంటి వ్యాక్సిన్ పరిష్కారం చూపలేదన్నారు.

వ్యాక్సీన్ ను ప్రైవేట్ వినియోగ వస్తువుగా చూడరాదని.. అందరికీ అందుబాటులోకి వచ్చేలా పంపిణీ వ్యవస్థ ఉండాలని టెడ్రోస్ పేర్కొన్నట్లు పత్రిక వివరించింది.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)