ఆంధ్రప్రదేశ్ ఏడేళ్లలో లక్ష కోట్ల రుణం తీర్చాలని చెప్పిన కాగ్ రిపోర్ట్ : ప్రెస్ రివ్యూ

ఫొటో సోర్స్, FB/Comptroller & Auditor General of India
ఆంధ్రప్రదేశ్‌పై రుణబారం పెరిగిందని, ఏడేళ్లలో లక్ష కోట్ల రూపాయలు తీర్చాలని కాగ్ నివేదిక ఇచ్చినట్లు ఈనాడు దినపత్రిక కథనం రాసింది.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం 2026 చివరి నాటికి రూ.1,03,550 కోట్ల రుణం తీర్చాల్సి ఉంటుందని కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ (కాగ్)నివేదిక స్పష్టం చేసింది.
2019 మార్చి చివరి నాటి గణాంకాలను పరిగణనలోకి తీసుకొని ఈ నిర్ధారణకు వచ్చింది.
ఈ రుణాలను చెల్లించడానికి రాష్ట్ర ప్రభుత్వం అదనపు రెవెన్యూ వనరులను సమకూర్చుకోవాల్సి ఉంటుందని పేర్కొంది. అదే సమయంలో వివేచనతో కూడిన రుణ వ్యూహం అమలు చేయాలని సూచించిందని ఈనాడు రాసింది.
ఈ అప్పు తీర్చేందుకు సరైన ప్రణాళిక లేకపోతే అభివృద్ధి పనులు చేయడం కష్టమే అని విశ్లేషించింది. 2019 మార్చితో ముగిసిన ఆర్థిక సంవత్సరంలో రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై కాగ్ రూపొందించిన నివేదికను రాష్ట్ర ప్రభుత్వం శుక్రవారం శాసనసభకు సమర్పించిందని కథనంలో చెప్పారు.
కాగ్ తాజా గణాంకాల మేరకు 2019 మార్చి నాటికి రాష్ట్ర ప్రభుత్వ అప్పు రూ.2,57,510 కోట్లకు చేరింది. 2017-18తో పోలిస్తే 2018-19 ఆర్థిక సంవత్సరంలో రుణాలు 15.11శాతం మేర పెరిగినట్లు వివరించింది.
తీసుకున్న రుణాలతో పోలిస్తే తిరిగి చెల్లించాల్సిన రుణాల నిష్పత్తి ఆ రోజు నాటికి తగ్గినట్లు గుర్తించింది. కొత్తగా చేసిన అప్పు అంతా పాత అప్పు తీర్చేందుకే వినియోగించడం తగ్గిన విషయాన్ని ఇది సూచిస్తోందని పేర్కొంది.
అప్పుల కోసం ప్రభుత్వం ఇచ్చే గ్యారంటీలు కూడా పరిమితికి లోబడే ఉన్నాయని కాగ్ స్పష్టం చేసినట్లు ఈనాడు వివరించింది.

మేయర్ ఎన్నిక ఎలా జరుగుతుంది
జీహెచ్ఎంసీ చట్టం నిబంధనల ప్రకారం మెజార్టీ ఉన్న పార్టీకే మేయర్ పీఠం దక్కుతుందని నమస్తే తెలంగాణ పత్రిక కథనం ప్రచురించింది.
జీహెచ్‌ఎంసీ మేయర్ ఎన్నికల్లో కార్పొరేటర్లతోపాటు, ఎక్స్‌అఫీషియో సభ్యులను కూడా కలిపి లెక్కిస్తారు.
దీనిప్రకారం హాజరైన మొత్తం సభ్యుల్లో సగం కంటే ఎక్కువమంది మద్దతు ఉన్నపార్టీ మేయర్, డిప్యూటీ మేయర్ పదవులను దక్కించుకుంటుంది.
కానీ, తాజాగా వెలువడిన గ్రేటర్ ఫలితాల్లో ఏ పార్టీకీ స్పష్టమైన మెజార్టీ రాకపోవడంతో ఈ రెండు పదవుల ఎన్నికపై చర్చ కొనసాగుతున్నది.
వాస్తవంగా మేయర్, డిప్యూటీ మేయర్ ఎన్నికకు జీహెచ్‌ఎంసీ చట్టంలో ప్రత్యేక నిబంధనలను పొందుపర్చారు. కొత్తపాలకవర్గం కొలువుదీరడానికి ముందుగా హైదరాబాద్ కలెక్టర్‌ను రిటర్నింగ్ అధికారిగా నియమించి.. మేయర్, డిప్యూటీ మేయర్ ఎన్నికకు రాష్ట్ర ఎన్నికల సంఘం నోటిఫికేషన్ జారీచేస్తుందని పత్రిక తెలిపింది.
ఈ క్రమంలోనే ఎక్స్‌అఫీషియో సభ్యులుగా నమోదు చేసుకొనేందుకు అవకాశమిస్తూ రిటర్నింగ్ అధికారి మరో నోటిఫికేషన్ ఇస్తారు.
గ్రేటర్ పరిధిలో ఓటుహక్కు ఉండి, ఇతర ఏ మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో గతంలో ఓటుహక్కును వినియోగించుకోని లోక్‌సభ, రాజ్యసభ సభ్యులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఎక్స్‌అఫీషియో సభ్యులుగా నమోదు చేసుకోవచ్చు.
అనంతరం 150 మంది కార్పొరేటర్లు, ఎక్స్‌అఫీషియోలతో కలిపి మేయర్ ఎన్నిక కోసం ఓటర్ల జాబితాను రూపొందిస్తారు.
ఎన్నిక కోసం ప్రత్యేక సమావేశాన్ని ఏర్పాటుచేస్తారు. మొత్తం కార్పొరేటర్లు, ఎక్స్‌అఫీషియో సభ్యుల్లో కనీసం సగం మంది (కోరం) ఉంటేనే సమావేశాన్ని నిర్వహిస్తారని కథనంలో రాశారు.
ఆ సమావేశంలో కార్పొరేటర్లుగా గెలిచినవారు ప్రమాణ స్వీకారం చేశాక ఎన్నిక ప్రక్రియను మొదలుపెడతారు. సమావేశంలో మేయర్ అభ్యర్థిని ఒక సభ్యుడు ప్రతిపాదిస్తే, మరొక సభ్యుడు మద్దతు తెలుపాల్సి ఉంటుంది.
కార్పొరేటర్‌గా ఎన్నికైనవారే మేయర్, డిప్యూటీ మేయర్ పదవులకు అర్హులు. ఎక్స్‌అఫీషియో సభ్యులకు పోటీచేసే అవకాశం ఉండదు. మేయర్, డిప్యూటీ మేయర్ పదవుల కోసం ఏ పార్టీఅయినా తమ అభ్యర్థులను పోటీలో ఉంచవచ్చు.
ఆయాపార్టీల అభ్యర్థులు నామినేషన్లు సమర్పించాక.. గుర్తింపుపొందిన పార్టీలు విప్‌లు జారీచేస్తాయి. ప్రత్యేకాధికారి నామినేషన్లవారీగా పోటీలో ఉన్న అభ్యర్థులను పిలిచి చేతులెత్తే విధానంలో మేయర్, డిప్యూటీ మేయర్ ఎన్నికను నిర్వహిస్తారు.
ఇలా పోటీలోఉన్న ప్రతి అభ్యర్థి ఓట్లను లెక్కించి.. ఎక్కువమంది సభ్యుల మద్దతు ఉన్నవారిని మేయర్, డిప్యూటీ మేయర్‌గా ప్రకటిస్తారని నమస్తే తెలంగాణ వివరించింది.

ఫొటో సోర్స్, Alla Nani/FB
ఫిబ్రవరిలో ఎన్నికలపై అసెంబ్లీ తీర్మానం
కరోనా వల్ల ప్రస్తుతం రాష్ట్రంలో ఎన్నికలు నిర్వహించే పరిస్థితులు లేవని ప్రవేశపెట్టిన తీర్మానానికి ఏపీ అసెంబ్లీ ఆమోదముద్ర వేసిందని సాక్షి వార్తాపత్రిక కథనం ప్రచురించింది.
ప్రజల ఆరోగ్యం, భద్రత దృష్ట్యా రాష్ట్రంలో ఫిబ్రవరిలో స్థానిక సంస్థల ఎన్నికలను నిర్వహించే పరిస్థితులు లేవని డిప్యూటీ సీఎం, వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ల నాని స్పష్టం చేశారు.
సరైన సమయంలో ఎన్నికలు నిర్వహిస్తామని తేల్చిచెప్పారు. ఈ మేరకు ఆయన శుక్రవారం ప్రవేశపెట్టిన తీర్మానానికి శాసనసభ మూజువాణి ఓటుతో ఏకగ్రీవంగా ఆమోదం తెలిపినట్లు సాక్షి రాసింది.
అలాగే ఇటువంటి పరిస్థితులు తలెత్తినప్పడు వ్యవహరించాల్సిన తీరుపై స్పష్టమైన నిబంధనలు ఉండేలా ఏపీ పంచాయతీరాజ్ యాక్ట్–1994లో మార్పులు చేయాలని తీర్మానంలో పేర్కొన్నారు.
ఈ సందర్భంగా ఆళ్ల నాని మాట్లాడుతూ.. ప్రభుత్వానికి ప్రజల ధన, మాన, ప్రాణాలు కాపాడాల్సిన బాధ్యత ఉందన్నారని కథనంలో రాశారు.
రాష్ట్రంలో ఇంకా కరోనా ఉన్నందున స్థానిక సంస్థల ఎన్నికలను ఇప్పుడే నిర్వహించడం ప్రజల ప్రాణాలకు అత్యంత ప్రమాదకరమని చెప్పారు.
ఇప్పటికే కరోనా వల్ల రాష్ట్రంలో 7,014 మంది మరణించారని ఆళ్ల నాని గుర్తు చేశారు. కరోనా నియంత్రణలో ప్రాణాలు విడిచిన ఫ్రంట్‌లైన్ వారియర్స్ త్యాగాలను వృథా కానీయరాదన్నారు.
వ్యాక్సిన్ అందుబాటులోకి రాకుండా ఎన్నికలు నిర్వహిస్తే ప్రజల ఆరోగ్యం, భద్రత ప్రమాదంలో పడతాయని శాసనసభ భావిస్తోందని ఆయన అన్నారని సాక్షి వివరించింది.

ఫొటో సోర్స్, NURPHOTO
8న భారత్ బంద్
కేంద్రం వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా రైతులు బంద్‌కు దిగనున్నట్లు ఆంధ్రజ్యోతి దినపత్రిక కథనం ప్రచురించింది
కేంద్రం తీసుకొచ్చిన మూడు సాగు చట్టాలను వ్యతిరేకిస్తూ ఈ నెల 8వ తేదీన రైతు సంఘాలు భారత్ బంద్‌కు పిలుపునిచ్చాయి.
శుక్రవారం 35 రైతు సంఘాల నేతలు సమావేశమై భవిష్యత్తు కార్యాచరణను ప్రకటించారు. కేంద్రంతో జరుగుతున్న చర్చల తీరుతెన్నులు, మోదీ ప్రభుత్వ వైఖరి తదితర అంశాలపై చర్చించారు.
అందులో భాగంగా ఈ నెల 8వ తేదీన భారత్ బంద్‌కు పిలుపునిస్తున్నట్లు భారతీయ కిసాన్ యూనియన్ ప్రధాన కార్యదర్శి లాఖోవాల్ ప్రకటించారని పత్రిక రాసింది.
5వ తేదీన దేశవ్యాప్తంగా మోదీ ప్రభుత్వ దిష్టిబొమ్మలు దహనం చేయాలని నిర్ణయించామని తెలిపారు. చట్టాలను రద్దు చేయాల్సిందేనని, లేదంటే దేశవ్యాప్తంగా ఆందోళనలను ఉధృతం చేస్తామని స్పష్టం చేశారు.
శనివారం రైతు సంఘాల నేతలతో కేంద్ర ప్రభుత్వం మరో దఫా చర్చలు జరపనుంది.
వ్యవసాయ మంత్రి నరేంద్ర తోమర్ చెబుతున్నదాని ప్రకారం... ఈ చర్చల్లో ఏదో ఒకటి తేలిపోవచ్చు. అటు ఆర్‌ఎ్‌సఎస్ అనుబంధ సంఘమైన భారతీయ కిసాన్ సంఘ్ కూడా రైతుల డిమాండ్లకు మద్దతు పలికింది.
కనీస మద్దతు ధర వ్యవస్థను కొనసాగించాలని, ప్రభుత్వ, ప్రైవేటు మండీల్లో కూడా ఎంఎస్పీ రేటే అమలుకావాలని, ఇందుకు చట్టం చేయాలని, ఎంఎస్పీ కంటే చౌక ధరకు కొనడం నేరమని చట్టంలో చేర్చాలని బీకేఎస్ ప్రధాన కార్యదర్శి బదరీనారాయణ చౌధురి మీడియాతో అన్నారని కథనంలో చెప్పారు.
మరోవైపు, దేశరాజధాని ప్రాంతంలో రైతుల నిరసనలు 9వ రోజుకు చేరుకున్నాయి. ఆందోళనలను మిన్నంటాయి.
సింఘూ, టిక్రీ, గాజీపూర్, నోయిడా సరిహద్దుల్లో రహదారులపై రైతులు నిరసనలు సాగిస్తున్నారు.
కేంద్రానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. గజ గజ వణికిస్తున్న చలిలోనూ రాత్రంతా రోడ్లపైనే నిద్రిస్తున్నారు. అక్కడే వండుకొని ఆహారాన్ని తింటున్నారు.
నిరసనల వల్ల పలు రహదారులను మూసివేశారు. నిరసనల్లో పలువురు తెలంగాణకు చెందిన రైతులు కూడా పాల్గొన్నారని ఆంధ్రజ్యోతి వివరించింది.
ఇవి కూడా చదవండి:
- కరోనావైరస్: వినోద రంగం భవిష్యత్తేంటి?
- కరోనా వైరస్ సోకిన తల్లులు బిడ్డకు పాలివ్వొచ్చా.. ప్రపంచ ఆరోగ్య సంస్థ ఏం చెబుతోంది
- పాకిస్తాన్ చొరబాట్లకు గట్టిగా జవాబు ఇచ్చే భారత్ చైనాపై మౌనంగా ఎందుకు ఉంటోంది?
- బిచ్చగాడు అనుకుని దానం చేయబోయారు.. ఆయనెవరో తెలిసి సెల్యూట్ చేశారు
- ఆలయంలో ముద్దు సీన్, నెట్‌ఫ్లిక్స్‌పై సోషల్ మీడియాలో ఆగ్రహం
- జర్మనీ: ఇక్కడి ప్రజలు పబ్లిగ్గా న్యూడ్‌గా తిరగడానికి ఎందుకు ఇష్టపడతారు?
- ఒక ఉల్కను అమ్మేసి, రాత్రికి రాత్రే కోటీశ్వరుడు అవుదామనుకున్నాడు. కానీ...
- వ్యాపారం కోసం వచ్చి ఇండియాలో మారణహోమం సాగించిన కంపెనీ కథ
- బ్రిటిష్ వారిని గడగడలాడించిన టిప్పు సుల్తాన్ కథ ఎలా ముగిసిందంటే...
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








