సూపర్ బ్లడ్ మూన్: ఇండియాలో కనిపిస్తుందా.. సూపర్ మూన్, బ్లడ్ మూన్, బ్లూ మూన్ మధ్య తేడాలేంటి

సూపర్ బ్లడ్ మూన్

ఫొటో సోర్స్, Getty Images

మే 26న గ్రహణం ఏర్పడేటప్పుడు కనిపించబోయే చంద్రుడిని ‘‘సూపర్ బ్లడ్ మూన్’’గా శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఆ రోజు రాత్రి చంద్రుడు ఎర్రగా కనిపిస్తాడు.

‘‘మే 26న చంద్రుడు పూర్తిగా భూమి నీడలోకి వెళ్తాడు. నీడలో లేని సమయంలో చంద్రుడు చాలా పెద్దగా, ప్రకాశవంతంగా కనిపిస్తాడు’’అని అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ నాసా తెలిపింది.

2021లో ఇది రెండో సూపర్ మూన్. మొదటి సూపర్ మూన్ ఏప్రిల్ 26న ఏర్పడింది.

ఈ చంద్ర గ్రహణం భారత కాలమానం ప్రకారం మధ్యాహ్నం 3.15 నిమిషాలకు మొదలవుతుందని పీటీఐ వార్తా సంస్థ తెలిపింది. సాయంత్రం 6.22 వరకు ఇది ఉంటుందని పేర్కొంది.

సంపూర్ణ చంద్ర గ్రహణాన్ని ఉత్తర అమెరికా, పశ్చిమ దక్షిణ అమెరికా, తూర్పు ఆసియాల్లో చూడొచ్చు. ఇక్కడ బ్లడ్ మూన్ 14 నుంచి 15 నిమిషాల పాటు కనిపిస్తుంది.

సూపర్ బ్లడ్ మూన్

ఫొటో సోర్స్, BOSTON GLOBE / GETTY IMAGES

ఫొటో క్యాప్షన్, సూపర్ బ్లడ్ మూన్

సూపర్ మూన్, బ్లడ్ మూన్ అంటే ఏమిటి?

సూపర్‌మూన్: భూమికి చంద్రుడు అత్యంత సమీపంలోకి వచ్చినప్పుడు ‘‘సూపర్ మూన్’’గా పిలుస్తారు. ఈ సమయంలో చంద్రుడు సాధారణ రోజుల్లో కంటే 14 శాతం పెద్దగా, మరింత ప్రకాశవంతంగా కనిపిస్తాడు. సూపర్ మూన్‌నే పెరీజీ మూన్‌గా కూడా పిలుస్తారు. భూమి చుట్టూ చంద్రుడు దీర్ఘ వృత్తాకార కక్ష్యలో తిరుగుతుంటాడు. ఈ కక్ష్యలో భూమికి చేరువగా ఉండే పాయింట్‌ను పెరీజీగా పిలుస్తారు. దూరంగా ఉండే పాయింట్‌ను అపోజీ అంటారు.

భూమికి 3,60,000 కిలోమీటర్లు, అంతకంటే తక్కువ దూరంలో ఉన్నప్పుడు చంద్రుణ్ని సూపర్ మూన్‌గా పిలుస్తారు.

మే 26న 7.23 నిమిషాలపాటు చంద్రుడు పెరీజీ స్థానంలో ఉంటాడు. ఆ సమయంలో చంద్రుడు, భూమి మధ్య దూరం 3,57,309 కి.మీ. ఉంటుంది.

సూపర్ మూన్‌తో చెడు జరుగుతుందని కొందరు భావిస్తారు. అయితే, ఇలా చెప్పడానికి ఎలాంటి ఆధారాలూ లేవు. అయినప్పటికీ సూపర్ మూన్‌తో భూకంపాలు, అగ్ని పర్వత విస్పోటాలు, సునామీలు, వరదలు వస్తాయని కొందరు నమ్ముతుంటారు.

చంద్రుడి ప్రభావం సముద్ర తరంగాలపై ఉంటుందన్న మాట వాస్తవమే. పౌర్ణమి, అమావాస్య సమయాల్లో సముద్ర అలలు ఉవ్వెత్తున ఎగసి పడటమే దీనికి ఉదాహరణ. అయితే, చంద్రుడు పెరీజీలో ఉన్నప్పుడు అలల ఎత్తు పెరుగుదల సాధారణ పౌర్ణమి, అమావాస్యలతో పోలిస్తే... సగటున ఐదు సెం.మీ. కంటే మించి ఉండదు.

చంద్ర గ్రహణం

ఫొటో సోర్స్, NURPHOTO / GETTY IMAGES

ఫొటో క్యాప్షన్, చంద్ర గ్రహణం

బ్లడ్ మూన్: చంద్రుడు, సూర్యుడు మధ్యలోకి భూమి వచ్చినప్పుడు చంద్రగ్రహణం ఏర్పడుతుంది. అయితే, భూమి నీడపడి చంద్రుడు పూర్తిగా కనిపించకపోవడాన్ని సంపూర్ణ చంద్ర గ్రహణంగా పిలుస్తారు. ఒక్కోసారి సంపూర్ణ చంద్రగ్రహణ సమయంలో సూర్యకాంతి నేరుగా భూమిపై పడి, భూవాతావరణం గుండా పరావర్తనం చెంది చంద్రుడిపై పడుతుంది. అప్పుడు చంద్రుడు ఎర్రగా కనబడతాడు. దీన్నే బ్లడ్ మూన్‌గా పిలుస్తారు.

బ్లూమూన్: ఇది నెలలో వచ్చే రెండో పౌర్ణమి. దీని కంటూ ఎలాంటి ప్రత్యేకతా లేదు.

సూపర్‌మూన్, చంద్ర గ్రహణం అనేవి రెండు వేర్వేరు పరిణామాలు. ఒక్కోసారి ఇవి రెండూ కలసి వస్తుంటాయి.

సూపర్ బ్లడ్ మూన్

ఫొటో సోర్స్, HINDUSTAN TIMES / GETTY IMAGES

ఫొటో క్యాప్షన్, సూపర్ బ్లడ్ మూన్

బ్లడ్ మూన్ భారత్‌లో కనిపిస్తుందా?

కనిపించదు. సంపూర్ణ చంద్రగ్రహణం ఉత్తర అమెరికా, పశ్చిమ దక్షిణ అమెరికా, తూర్పు ఆసియాల్లో మత్రమే కనిపిస్తుంది. అయితే, గ్రహణం చివరి ఘట్టాలను భారత్‌లోని తూర్పు ప్రాంతాల్లో ఉండేవారు చూడొచ్చు.

‘‘తూర్పు భారత్‌లోని కొన్ని ప్రాంతాల్లో మాత్రమే గ్రహణం చివరి ఘట్టాలు చూసేందుకు అవకాశం ఉంటుంది’’అని ఖగోళ నిపుణుడు దేబీప్రసాద్ దువారీ చెప్పారు.

అంటే దిల్లీ, ముంబయి, చెన్నై సహా చాలా ప్రధాన నగరాల్లో జీవించే ప్రజలకు ఈ సూపర్ బ్లడ్ మూన్ చూసేందుకు వీలుపడదు.

ఈ గ్రహణాన్ని చూడటం ఎలా?

చంద్ర గ్రహణాన్ని ప్రపంచ వ్యాప్తంగా ఉన్న చాలా అబ్జర్వేటరీలు జాగ్రత్తగా గమనిస్తుంటాయి. సాధారణ ప్రజలు కూడా టెలిస్కోప్ లేదా నేరుగా చంద్రగ్రహణాన్ని చూడొచ్చు.

కానీ సూర్య గ్రహణాన్ని మాత్రం నేరుగా చూడకూడదు. సూర్యుని కిరణాలు నేరుగా కంటిలో పడకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలి.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)