పాలపిట్ట: మూడు రాష్ట్రాల అధికార పక్షి..భవిష్యత్తులో కానరాదా?

పాలపిట్ట

ఫొటో సోర్స్, Sri Ram Reddy

    • రచయిత, అమరేంద్ర యార్లగడ్డ
    • హోదా, బీబీసీ ప్రతినిధి

తెలంగాణ రాష్ట్ర అధికార పక్షి పాలపిట్ట అంతరించిపోతోందా?

ఈ ప్రశ్నకు ‘ఆ దిశలోనే ఉంది’ అంటున్నారు పక్షి ప్రేమికులు.

ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో ఈ పక్షుల సంఖ్య గణనీయంగా తగ్గిపోతుండటం ఆందోళన కలిగిస్తోంది.

‘త్వరలో అంతరించిపోనున్న పక్షి జాతుల జాబితా’లో పాలపిట్టను నిరుడు ఇంటర్నేషనల్ యూనియన్ ఫర్ కన్జర్వేషన్ ఆఫ్ నేచర్ (ఐయూసీఎన్) చేర్చింది.

''ఇప్పటికిప్పుడు కాకపోయినా వెంటనే సంరక్షణ చర్యలు తీసుకోకపోతే రాబందుల తరహాలోనే పాలపిట్టలు అంతరించిపోతాయి'' అని ఉస్మానియా యూనివర్సిటీ జువాలజీ ప్రొఫెసర్ సి.శ్రీనివాసులు బీబీసీతో చెప్పారు.

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి
ఫొటో క్యాప్షన్, బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

పాలపిట్టల సంఖ్య తగ్గుదల ఇలా..

పాలపిట్టను నీలకంఠ పక్షి లేదా బ్లూ బర్డ్ అని కూడా పిలుస్తారు. దీని శాస్త్రీయ నామం కోరేషియస్ బెంగాలెన్సిస్.

దేశంలోని 13 ప్రభుత్వ సంస్థలు, విశ్వవిద్యాలయాలు, స్వచ్ఛంద సంస్థలు కలిసి 'స్టేట్ ఆఫ్ ఇండియాస్ బర్డ్స్ 2023' నివేదిక తయారు చేశాయి.

భారత్‌లో గత 12 ఏళ్లలో పాలపిట్టల సంఖ్యలో 30శాతం తగ్గుదల కనిపించిందని ఈ నివేదిక స్పష్టం చేసింది.

సాధారణంగా పాలపిట్టల వయసు 3.87 సంవత్సరాలు ఉంటుంది. అంటే పాలపిట్టల మూడు తరాల కాలాన్ని పరిశీలిస్తే వాటి సంఖ్య 30శాతం మేరకు తగ్గిపోయిందన్నమాట.

అదే 2000-2023 మధ్య కాలాన్ని తీసుకుంటే ఈ తగ్గుదల 32శాతం వరకు ఉందని ఈ నివేదిక స్పష్టం చేస్తోంది.

పాలపిట్ట

ఫొటో సోర్స్, Sri Ram Reddy

ఫొటో క్యాప్షన్, ఆంధ్రప్రదేశ్‌లో పాలపిట్ట జనాభాలో 25-30శాతం మేర తగ్గుదల కనిపించింది.

'సమీప భవిష్యత్తులో అంతరించిపోయే ప్రమాదం'

ఇంటర్నేషనల్ యూనియన్ ఫర్ కన్జర్వేషన్ ఆఫ్ నేచర్ (ఐయూసీఎన్) రెడ్ లిస్ట్ పునఃపరిశీలన కోసం పాలపిట్టతో సహా 14 పక్షి జాతులను సిఫార్సు చేసినట్లు ఈ నివేదిక చెబుతోంది.

దీనిపై 2025 జూన్‌లో ఐయూసీఎన్ సమీక్ష జరిపింది. 'సమీప భవిష్యత్తులో అంతరించిపోయే పక్షు’ల జాబితాలో పాలపిట్టను చేర్చినట్లు ప్రకటించింది.

ఏపీ, తెలంగాణలో పాలపిట్టల సంఖ్యలో భారీగా తగ్గుదల కనిపిస్తోందని ప్రొఫెసర్ సి.శ్రీనివాసులు చెప్పారు.

స్టేట్ ఆఫ్ ఇండియాస్ బర్డ్స్ 2023 నివేదిక ప్రకారం గత 12 ఏళ్లలో ఆంధ్రప్రదేశ్‌లో 25-30శాతం మేర తగ్గుదల కనిపించింది.

‘‘తెలంగాణకు వచ్చేసరికి మా అంచనా మేరకు సుమారు 70శాతం మేర తగ్గుదల కనిపిస్తోంది. దీనిపై పూర్తి వివరాలు ఇంకా బయటకు రావాల్సి ఉంది'' అని ఆయన వివరించారు.

పాలపిట్ట

ఫొటో సోర్స్, Sri Ram Reddy

ఫొటో క్యాప్షన్, తెలంగాణలో దసరా రోజున పాలపిట్టను చూడటాన్ని సంప్రదాయంగా భావిస్తారు.

మూడు రాష్ట్రాల అధికార పక్షి

తెలంగాణ రాష్ట్ర పక్షిగా పాలపిట్టను ఎంపిక చేస్తూ 2014 నవంబరులో తెలంగాణ ప్రభుత్వం ప్రకటన విడుదల చేసింది.

అంతకు ముందు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పక్షిగా కూడా పాలపిట్టే ఉండేది. రాష్ట్ర పునర్విభజన తర్వాత తమ రాష్ట్ర పక్షిగా రామచిలుకను ఎంపిక చేసింది ఏపీ ప్రభుత్వం. ప్రస్తుతం తెలంగాణతో పాటు కర్ణాటక, ఒడిశాలకు కూడా పాలపిట్టే రాష్ట్ర పక్షి.

తెలంగాణలో దసరా రోజున పాలపిట్టను చూడటాన్ని సంప్రదాయంగా భావిస్తారు.

2014లో పాలపిట్టను రాష్ట్ర పక్షిగా ఎంపిక చేసిన సమయంలో ముఖ్యమంత్రి కార్యాలయం విడుదల చేసిన ప్రకటనలో ఈ విధంగా ఉంది.

''తెలంగాణ రాష్ట్రం విజయపథంలో నడవడానికి శుభ సూచకంగా పాలపిట్టను రాష్ట్ర అధికారిక పక్షిగా ఎంపిక చేశాం'' అని అప్పటి ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు చెప్పారని ఆ ప్రకటనలో ఉంది.

పాలపిట్ట

ఫొటో సోర్స్, Getty Images

హైదరాబాద్ బర్డ్ అట్లాస్ సర్వేలో ఏం తేలిందంటే..

నగరంలోని అవుటర్ రింగు రోడ్డు లోపల పక్షులపై 2025లో హైదరాబాద్ బర్డ్ అట్లాస్ పేరుతో ఓ సర్వే నిర్వహించారు.

ఇందులో పాలపిట్టలు సహా వివిధ పక్షుల పరిస్థితిపై రెండుసార్లు సర్వే చేశామని బీబీసీతో బర్డ్ వాచర్ శ్రీరామ్ రెడ్డి చెప్పారు.

శ్రీరామ్ రెడ్డి 'ఈ-బర్డ్ డాటాబేస్'కు తెలంగాణ కోఆర్డినేటర్. సుమారు 3వేల మందితో సర్వే నిర్వహించి పాలపిట్టల పరిస్థితిని అంచనా వేశారు.

గతేడాది శీతాకాలంలో 22 ప్రాంతాల్లో 26 పాలపిట్టలు కనిపించాయని శ్రీరామ్ రెడ్డి చెప్పారు.

''వర్షాకాలంలో జరిపిన సర్వేలో ఈ సంఖ్య బాగా పడిపోయింది. మూడు ప్రాంతాల్లో నాలుగు పక్షులు మాత్రమే కనిపించాయి'' అని చెప్పారు.

ప్రస్తుతం తాము చేసినది ఒక ఏడాదికి సంబంధించిన సర్వే మాత్రమేనని, వచ్చే రెండేళ్లలో జరిపే సర్వేలో మరిన్ని వివరాలు బయటకు వస్తాయని వివరించారు.

పాలపిట్ట

ఫొటో సోర్స్, Sri Ram Reddy

ఫొటో క్యాప్షన్, పాలపిట్టలు చిట్టడవులు, గడ్డి భూములు, బీడు భూములలో ఎక్కువగా కనిపిస్తుంటాయి.

పాలపిట్టలు తగ్గడానికి కారణాలు అనేకం

పాలపిట్టలు ఓపెన్ హ్యాబిటాట్ (బహిరంగ ఆవాసం)లో జీవించేందుకు ఇష్టపడతాయి. చెట్ల తొర్రల్లో గూళ్లు ఏర్పాటు చేసుకుంటాయి.

''పట్టణీకరణ కారణంగా పాలపిట్టల సంఖ్య తగ్గిపోతోంది. ఎండిపోయిన చెట్లు తగ్గిపోతున్నాయి. ఈ పక్షులు కీటకాలను తిని జీవిస్తుంటాయి. కీటకాలు కూడా తగ్గిపోవడంతో వాటి ఆహారంపై ప్రభావం పడుతోంది'' అని ఆయన వివరించారు.

పాలపిట్టలు చిట్టడవులు, గడ్డి భూములు, బీడు భూములలో ఎక్కువగా కనిపిస్తుంటాయి.

''ఇది ఆమ్నీఓరస్ జీవి. కీటకాలు, పురుగులు, చిన్నచిన్న సరీసృపాలను ఆహారంగా తీసుకుంటుంది. వేటగాళ్లు వాటిని పట్టుకుని గింజలను ఆహారంగా వేస్తుంటారు. వాటిని తినలేక అవి చనిపోతుంటాయి'' అని చెప్పారు ప్రొఫెసర్ శ్రీనివాసులు.

దసరా సమయంలో పాలపిట్టలను కొందరు పట్టుకుని ప్రదర్శిస్తుంటారు. పాలపిట్టల సంఖ్య తగ్గిపోవడానికి అది కూడా ఓ కారణమని పక్షి ప్రేమికులు చెబుతున్నారు.

''పాలపిట్టలను పట్టుకుని దసరా సందర్భంగా ప్రదర్శిస్తుంటారు. తర్వాత వదిలేస్తున్నామని చెబుతున్నారు. అలా పట్టుకోవడం వల్ల ఒత్తిడికి గురై అవి చనిపోతున్నాయని మా పరిశీలనలో తేలింది'' అని శ్రీరామ్ రెడ్డి బీబీసీతో చెప్పారు.

పాలపిట్ట

ఫొటో సోర్స్, Getty Images

పార్లమెంటులో కేంద్ర ప్రభుత్వం ఏం చెప్పిందంటే..

పాలపిట్టల సంఖ్య తగ్గిపోతున్న నేపథ్యంలో వాటి సంరక్షణకు తీసుకుంటున్న చర్యలపై గత డిసెంబరులో రాజ్యసభ సభ్యుడు కె.లక్ష్మణ్ కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించారు.

వన్య ప్రాణుల సంరక్షణ, వాటి ఆవాసాల నిర్వహణ బాధ్యత ప్రాథమికంగా రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్ర పాలిత ప్రాంతాలపై ఉందని కేంద్ర అటవీ, పర్యావరణ శాఖ మంత్రి భూపేంద్ర యాదవ్ తెలిపారు.

వన్యప్రాణి సంరక్షణ చట్టం-1972లోని షెడ్యూల్-2లో పాలపిట్టలను లిస్ట్ చేశామని, వాటిని వేటాడటంపై నిషేధం ఉందని స్పష్టం చేశారు.

పాలపిట్టల సంరక్షణ విషయంలో అవగాహన లోపం కూడా కనిపిస్తోందని, ప్రత్యేక చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని ప్రొఫెసర్ సి.శ్రీనివాసులు బీబీసీతో చెప్పారు.

వీలైనంత త్వరగా కన్జర్వేషన్ జాబితాలోకి తీసుకురావాలని స్పష్టం చేశారు.

పాలపిట్ట

ఫొటో సోర్స్, Sri Ram Reddy

ఫొటో క్యాప్షన్, పాలపిట్టలను పట్టుకోవడం, బంధించడం, ప్రదర్శనల్లో వినియోగించడం వన్యప్రాణి సంరక్షణ చట్టం ప్రకారం నేరం.

పాలపిట్టలను బంధించడం నేరం

సాధారణంగా పాలపిట్టలు ఒకేచోట గుంపులు గుంపులుగా ఉంటాయని, దానివల్ల వేటాడటానికి సులువుగా ఉంటుందని వికారాబాద్ జిల్లా అటవీ శాఖాధికారి జ్ఞానేశ్వర్ బీబీసీతో చెప్పారు.

ఆడ, మగ పక్షులు రెండూ కలసి వాటి పిల్లల్ని పెంచడం వీటి ప్రత్యేక లక్షణమని వివరించారు.

''పాలపిట్టలను కాపాడటంపై అవగాహన కల్పిస్తున్నాం. వేటాడే వారిపై నిఘా పెట్టి అరెస్టు చేస్తున్నాం'' అని ఆయన వివరించారు.

1972లో వచ్చిన వన్యప్రాణి సంరక్షణ చట్టం ప్రకారం, పాలపిట్టలను పట్టుకోవడం, బంధించడం, ప్రదర్శనల్లో వినియోగించడం నేరం.

చట్టాన్ని ఉల్లంఘిస్తే మూడేళ్ల జైలు లేదా రూ.25 వేల జరిమానా లేదా రెండూ విధించే అవకాశం ఉంటుంది. అదే నేరానికి రెండోసారి పాల్పడితే మూడు నుంచి ఏడేళ్ల వరకు జైలు, రూ.25 వేల జరిమానా విధిస్తారు.

పాలపిట్టలను కన్జర్వేషన్ జాబితాలోకి తీసుకొస్తే కచ్చితంగా ప్రయోజనం ఉంటుందనీ, అయితే సమాజంలోనే మార్పు రావాల్సిన అవసరం ఉందని ప్రొఫెసర్ సి.శ్రీనివాసులు అన్నారు.

పాలపిట్ట

ఫొటో సోర్స్, @iamkondasurekha/X

ఫొటో క్యాప్షన్, కొండా సురేఖ

ప్రభుత్వం ఏమంటోంది?

పాలపిట్టలను పట్టుకోవడం, రవాణా చేయడం, వాటి నివాస ప్రాంతాల నాశనం చేసే చర్యలను నివారించేందుకు తెలంగాణ ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నట్లుగా తెలంగాణ అటవీ, పర్యావరణ శాఖ మంత్రి కొండా సురేఖ బీబీసీతో చెప్పారు.

''అటవీ శాఖ, ఫారెస్ట్ క్రైమ్ కంట్రోల్ సెల్, హైదరాబాద్ ప్రధాన కార్యాలయం సంయుక్త ఆధ్వర్యంలో 24 గంటల హెల్ప్‌లైన్ ఏర్పాటు చేశాం. అక్రమంగా పట్టుకోవడం, లేదా అక్రమంగా వ్యాపారంపై సమాచారం అందిన వెంటనే తక్షణ చర్యలు తీసుకునే విధంగా వ్యవస్థను అమలు చేస్తున్నాం'' అని మంత్రి చెప్పారు.

తెలంగాణ రాష్ట్ర పక్షి అయిన పాలపిట్ట జనాభా కొంతమేర తగ్గుదల దిశగా ఉందని ప్రభుత్వం కూడా గమనించిందని చెప్పారు.

''పండుగల సమయంలో (దసరా వంటి సందర్భాలలో) పాలపిట్ట పక్షిని పట్టివేయడం లేదా ప్రదర్శించడం నివారించేందుకు ఎన్‌జీఓల సమన్వయంతో విస్తృత అవగాహన కార్యక్రమాలు చేపడుతున్నాం. దేవాలయ ప్రాంగణాల్లో పాలపిట్టను ప్రదర్శనకు పెట్టకుండా దేవాలయ అధికారులకు ముందస్తు సూచనలు జారీ చేస్తున్నాం'' అని మంత్రి చెప్పారు.

పాలపిట్ట పక్షి సంరక్షణ, అవగాహన, ప్రజల భాగస్వామ్యం అంశాలపై కేంద్ర పర్యావరణ, అటవీ మరియు వాతావరణ మార్పుల మంత్రిత్వ శాఖతో సమన్వయం చేసుకుంటూ అవసరమైన అన్ని చర్యలను తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తోందని మంత్రి వివరించారు.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)