వీడియో: చైనాలో భారీ అగ్నిప్రమాదం.. మంటల్లో చిక్కుకున్న 42 అంతస్తుల భవనం

వీడియో క్యాప్షన్, చైనా: మంటల్లో చిక్కుకున్న 42 అంతస్తుల భవనం
    • రచయిత, లియో శాండ్స్
    • హోదా, బీబీసీ ప్రతినిధి

చైనాలోని ఛాంగ్షా నగరంలో ఒక ఆకాశహర్మ్యం భారీ మంటల్లో చిక్కుకుందని ప్రభుత్వ మీడియా నివేదించింది.

42 అంతస్తుల ఎత్తైన ఈ భవనం మంటల్లో కాలిపోతున్న వీడియోలు సోషల్ మీడియాలో పోస్టయ్యాయి. మంటల్లో చిక్కుకున్న భవనం నుంచి బయటపడేందుకు అందులోని ఉద్యోగులంతా పరుగులు తీశారు.

చైనా టెలికాం ప్రాంతీయ కార్యాలయంగా ఉన్న ఈ భవనం మంటల్లో కాలిపోతుండగా, భారీ స్థాయిలో నల్లటి పొగలు చుట్టుముట్టాయి.

ఈ మంటలను అదుపు చేశామని, ఇప్పటి వరకూ ఒక్కరు కూడా ప్రాణాలు కోల్పోలేదని అధికారులు ప్రకటించారు.

బీబీసీ రెడ్ లైన్ Red Line
  • ఈ భవనం చైనా టెలికాం ప్రాంతీయ కార్యాలయం
  • దీని ఎత్తు 715 అడుగులు
  • ఇందులో 42 అంతస్తులు ఉన్నాయి
  • ఈ అగ్నిప్రమాదంలో ఒక్కరు కూడా ప్రాణాలు కోల్పోలేదని అధికారులు ప్రకటించారు
బీబీసీ రెడ్ లైన్ Red Line

నల్లని పొగ, మంటలు కమ్ముకుపోయిన 715 అడుగుల ఎత్తైన ఈ భవనాన్ని రక్షించేందుకు అగ్నిమాపక సిబ్బంది ప్రయత్నిస్తున్న ఫొటోలు కూడా సోషల్ మీడియాలో పోస్టయ్యాయి.

ఈ ఆకాశహర్మ్యం ఒకవైపు మొత్తం మంటల్లో చిక్కుకుపోయినట్లు అనిపించింది.

మరొక వీడియోలో ఎత్తైన భవనంపై నుంచి మంటలు అంటుకున్న శిథిలాలు కిందపడుతున్నాయి. దీంతో అక్కడ ఉన్న పదుల సంఖ్యలో ప్రజలు పరుగులు తీస్తున్నారు.

అయితే, ఈ వీడియోలను బీబీసీ ఇంకా స్వతంత్రంగా ధృవీకరించలేదు. ఈ ప్రమాదానికి కారణాలు ఏంటనేది కూడా ఇంకా స్పష్టంగా తెలియదు.

చైనా: మంటల్లో చిక్కుకున్న 42 అంతస్థుల భవనం

ఫొటో సోర్స్, Jinan Times

ప్రభుత్వ మీడియా కథనాల ప్రకారం.. 2000వ సంవత్సరంలో నిర్మాణం పూర్తి చేసుకున్న ఈ భవనం ఛాంగ్షా నగరంలోని ప్రధాన రింగ్ రోడ్డుకు సమీపంలో ఉంది. దక్షిణ మధ్య చైనాలోని హునాన్ ప్రావిన్సు రాజధాని అయిన ఈ నగరంలో దాదాపు కోటి మంది జీవిస్తున్నారు.

ఏఎఫ్‌పీ వార్తా సంస్థ కథనం ప్రకారం చైనా ప్రభుత్వ టెలీకమ్యూనికేషన్ల కంపెనీ చైనా టెలికాం ఈ అగ్నిప్రమాదాన్ని ధృవీకరించింది. స్థానిక కాలమానం ప్రకారం సాయంత్రం 4.30 గంటలకు ఈ ప్రమాదం జరిగిందని తెలిపింది.

''ఎలాంటి ప్రాణాపాయం కనిపించలేదు. కమ్యూనికేషన్లకు అంతరాయం ఏర్పడలేదు'' అని కంపెనీ అధికార ప్రతినిధి తెలిపారు.

భారీస్థాయిలో మంటలు చెలరేగడం చైనాలో సాధారణం అయిపోయింది. ఈ ఏడాది ప్రారంభంలో షాంఘై నగరంలోని ఒక కెమికల్ ప్లాంటు కూడా భారీ స్థాయి మంటల్లో చిక్కుకుంది.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)