వందేళ్లు పూర్తి చేసుకున్న రూపాయి నోటు

ఫొటో సోర్స్, Mintage world
- రచయిత, జాహ్నవి మూలే
- హోదా, బీబీసీ మరాఠి ప్రతినిధి
ఇవాళ్టితో ఒక రూపాయి నోటు సరిగ్గా వందేళ్లు పూర్తి చేసుకుంది. ఈ వందేళ్లలో పరిస్థితులు చాలా మారాయి. ఈ వందేళ్ల కాలంలో వచ్చిన రూపాయి నోట్లన్నీ ఆ మార్పులను ప్రతిబింబిస్తాయి.
30 నవంబర్, 1917లో మొట్టమొదటి రూపాయి నోటు విడుదలైంది.
మొట్టమొదటిసారి విడుదల చేసిన రూపాయి నోట్లను ఇంగ్లండ్‌లో ముద్రించారు. నోటు ఎడమ వైపున ఐదవ జార్జి రాజు చిత్రం ఉండేది.
నోటు వెనకాల ఎనిమిది భాషలలో 'ఒక రూపాయి' అన్న పదాలు ఉండేవి. బ్రిటిష్ ప్రభుత్వం 19వ శతాబ్దం నుంచి కాగితం నోట్లను ముద్రించడం ప్రారంభించిందని ఆన్‌లైన్ మ్యూజియం 'మింటేజ్‌వరల్డ్' సీఈఓ సుశీల్ కుమార్ అగర్వాల్ తెలిపారు.
దానికి ముందే బ్రిటిష్ ఇండియా కంపెనీ బెంగాల్‌లో కాగితం నోట్లను ప్రవేశపెట్టింది.
కానీ మొదటి రూపాయి నోటును మాత్రం 1917లో ముద్రించారు. ఆ తర్వాత పోర్చుగీసు, ఫ్రెంచి పాలకులు తమ సొంత రూపాయి నోట్లను ముద్రించడం ప్రారంభించారు. వాటిని నోవా గోవా నోట్లు, ఫ్రెంచి రూపీ అనేవాళ్లు.

ఫొటో సోర్స్, Mintage world
కొన్ని సంస్థానాలకు వాటిదైన సొంత కరెన్సీ ఉండేది. హైదరాబాద్, కాశ్మీర్ సంస్థానాలు తమ సొంత రూపాయి నోట్లను ముద్రించుకునేందుకు అనుమతించారు.
రెండో ప్రపంచ యుద్ధం సందర్భంగా.. బర్మాలో వినియోగించేందుకు ప్రత్యేకమైన రూపాయి నోట్లను జారీ చేశారు.
భారతదేశ కరెన్సీని దుబాయ్, ఒమన్ లాంటి కొన్ని మధ్య ప్రాచ్య దేశాలలో కూడా ఉపయోగించేవారు. ఇందుకోసం భారత ప్రభుత్వం 'పర్షియా రూపాయి' అన్న పేరుతో ప్రత్యేక సిరీస్‌ను విడుదల చేసింది.
భారతదేశ విభజన తర్వాత కూడా కొంతకాలం పాటు రూపాయి నోట్లు పాకిస్తాన్‌లో చెల్లుబాటయ్యాయి.
స్వాతంత్య్రానంతరం భారతీయ నోట్లపై బ్రిటన్ రాజముద్రల స్థానంలో అశోక చక్రం, మూడు సింహాలు వచ్చి చేరాయి. రూపాయి నోటు దానికి మినహాయింపు కాలేదు.
గత వందేళ్లలో 28 రకాల డిజైన్లలో సుమారు 125 భిన్నమైన రూపాయి నోట్లను ముద్రించారు.
భారతదేశం తన కరెన్సీ విలువను తగ్గించడంతో రూపాయి ప్రాభవం తగ్గింది. కానీ కాలక్రమంలో రూపాయి నోటు ప్రాధాన్యత మాత్రం పెరిగింది.

ఫొటో సోర్స్, Getty Images
రూపాయి వింతలు, విశేషాలు
మన రూపాయికి సంబంధించి ఎన్నో వింతలు, విశేషాలు ఉన్నాయి. భారత కరెన్సీలో రూపాయి నోటే అతి చిన్నదైనా, దానికి చాలా ప్రాధాన్యత ఉంది.
మిగతా అన్ని నోట్లను భారతీయ రిజర్వ్ బ్యాంక్ జారీ చేస్తే, రూపాయి నోటును భారత ప్రభుత్వం జారీ చేస్తుంది.
అందుకే మిగతా నోట్లపై 'రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా' అని ఉంటే, ఈ నోటుపై 'గవర్నమెంట్ ఆఫ్ ఇండియా' అని ఉంటుంది.
రూపాయి నోటు విలువ కన్నా, దానిని ముద్రించేందుకు ఎక్కువ ఖర్చవుతుంది. అందుకే 1995లో ప్రభుత్వం వాటి ముద్రణ నిలిపేసింది.
2015 నుంచి కొత్త సిరీస్‌తో రూపాయి నోట్లను తిరిగి ప్రవేశపెట్టారు. కానీ చలామణిలో ఉన్న నోట్ల సంఖ్య చాలా తక్కువ. అందుకే కరెన్సీని సేకరించే హాబీ ఉన్నవాళ్లు రూపాయి నోట్ల కోసం అన్వేషిస్తుంటారు.

ఫొటో సోర్స్, Getty Images
లక్షల్లో రూపాయి నోటు విలువ !
అసలు రూపాయి నోట్లే తక్కువగా ఉండగా.. మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ ఆర్థిక కార్యదర్శిగా ఉన్నప్పుడు ఆయన సంతకంతో విడుదలైన నోట్లకు ఇంకా డిమాండ్ ఉంది.
పాత రూపాయి నోట్లను కొన్నిసార్లు లక్షలు పెట్టి కొనుగోలు చేస్తున్నారు.
ఈ ఏడాది ప్రారంభంలో 1985లో ముద్రించిన ఒక రూపాయి నోటును గుజరాత్‌కు చెందిన క్లాసికల్ న్యూమిస్‌మాటిక్స్ గ్యాలరీ రూ.2,75,000కు విక్రయించింది.
టాడీవాలా ఆక్షన్స్ సంస్థ 100 నోట్లు ఉన్న రూపాయి నోట్ల కట్టను రూ.1,30,000కు విక్రయించింది.
ఈ రోజుల్లో రూపాయితో ఏం కొనగలమంటారా? దానికి సమాధానం మీ చేతిలో ఎప్పటి రూపాయి నోటు ఉందన్న దానిపై ఆధారపడి ఉంది.
మా ఇతర కథనాలు:
- రూపాయికి ఏమేం కొనొచ్చో చూడండి
- నార్వే: జీతాల దాపరికంలేని దేశం
- 'హిందుత్వను రెండు వేల నోటులా ఉపయోగిస్తారా?'
- ఇలా మొదలైంది ప్రిన్స్ హ్యారీ, మేఘన్‌ల లవ్ స్టోరీ!
- తిరుమలలో తన మతం గురించి సోనియా గాంధీ ఏం చెప్పారు?
- 'కొరియా చూసొద్దామని వెళ్తే కిమ్ జోంగ్కి మొక్కించారు'
- వాళ్లు వైద్యం నాడి పట్టుకొని వ్యాపారంలోకి దిగారు!
- మొట్టమొదటి మెట్రో ఎప్పుడు మొదలైందో తెలుసా!
- లక్షన్నర మంది బాలికల్ని బడికి పంపిన సామాన్య మహిళలు
- ఎర్ర పీతలు: ఇవి చూడ్డానికే.. తినటనికి కాదు
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లోనూ సబ్‌స్క్రైబ్ చేయండి.)








