ఐఫోన్ 11 కెమెరాలను చూస్తే భయమేస్తోందా... అయితే మీకు ట్రైపోఫోబియా ఉన్నట్లే

ఫొటో సోర్స్, Apple
హెచ్చరిక: ఈ కథనంలో రేఖాగణిత ఆకృతులు, రంధ్రాల కూర్పుల చిత్రాలు ఉన్నాయి. ఇవి ట్రైపోఫోబియా రుగ్మత ఉన్నవాళ్లకి ఆ రుగ్మత లక్షణాలను ప్రేరేపించవచ్చు.
యాపిల్ కంపెనీ తన ఉత్పత్తులను చాలా అందంగా డిజైన్ చేస్తుందని పేరు. కొత్త ఐఫోన్ 11 అలాంటి మరో సొగసైన ఆధునికమైన మోడల్. కానీ ఈ ఫోన్ వెనుక ఉన్న మూడు గుండ్రని కెమెరాలను కొందరు తట్టుకోలేరు.
ఇలా తట్టుకోలేకపోవటం వెనుక ట్రైపోఫోబియా అనే అరుదైన రుగ్మత ఉంది.
ట్రైపోఫోబియా అంటే.. రేఖాగణిత ఆకృతులు, కూర్పులు - ప్రత్యేకించి రంధ్రాలు, చాలా చిన్న చతురస్రాల ఆకృతులు, కూర్పులను చూసినపుడు కలిగే భయం, వికర్షణ.
యాపిల్ సంస్థ సెప్టెంబర్ 10న కొత్త ఉత్పత్తులను ఆవిష్కరించటంతో ఈ రుగ్మత ఇప్పుడు పతాక శీర్షికలకు ఎక్కింది.
ట్రైపోఫోబియాతో పుట్టే భయానికి మంచి ఉదాహరణ.. తామర పువ్వులోని విత్తనాల అమరిక చిత్రంతో పుట్టే భయం.
తేనె తుట్టె లేదా సముద్ర పాచి (సీ స్పాంజ్)లో రూపొందే రేఖాగణిత నిర్మాణం కూడా ఇలాంటి భయాన్నే రేకెత్తిస్తుంది.

ఫొటో సోర్స్, Getty Images
ఇలాంటి రూపాలు, ఆకృతుల పట్ల కొందరిలో కలిగే విముఖతకు కారణం.. ఒక ఆత్మరక్షణ ప్రతిక్రియ కావచ్చునని యూనివర్సిటీ ఆఫ్ ఎసెక్స్‌కు చెందిన ఇద్దరు పరిశోధకులు ప్రొఫెసర్ అర్నాల్డ్ విల్కిన్స్, డాక్టర్ జెఫ్ కోల్ భావిస్తారు.
ఎందుకంటే.. కొన్ని రకాల సాలీళ్లు, పాములు, తేళ్లు వంటి చాలా ప్రాణాంతక జంతువులకు ఇలాంటి చిహ్నాలు ఉంటాయి కాబట్టి ఈ తరహా ఆకృతుల పట్ల విముఖత పరిణామక్రమంలో ఇమిడిపోయిన ఆత్మరక్షణ ప్రక్రియ అని.. అది కొంతమందిలో కొనసాగుతూ వస్తోందని వారు వివరిస్తున్నారు.
అయితే.. ఈ రుగ్మతను వైద్యపరమైన పరీక్షలతో గుర్తించలేరు. అయినా దీనిని పునరావృత ఆకృతులను చూస్తే కలిగే భీతి (రిపిటిటివ్ పాటర్న్ ఫోబియా) గా గుర్తిస్తుంటారు.
కొత్త ఐఫోన్ మోడళ్ల వెనుక ఉన్న మూడు గుండ్రని కెమెరాల ఆకృతి సరిగ్గే ఇదే.

ఫొటో సోర్స్, Getty Images
నిజానికి.. ఆపిల్ ఆవిష్కరించిన ఐఫోన్ 11, ఐఫోన్ 11 ప్రో, ఐఫోన్ 11 ప్రో మ్యాక్స్‌లో ఉన్న అతి పెద్ద వినూత్న ఫీచర్లలో ఈ కెమెరాలు ఒకటి. ఇవి ఒకే సమయంలో బహుళ వీడియోలను రికార్డు చేయగలవు.
ప్రో మోడళ్లలో టెలీఫొటో, వైడ్, అల్ట్రా వైడ్ కెమెరాలు ఉన్నాయి. అతి తక్కువ వెలుగులో సైతం ఫొటోలు తీయటానికి వీలుకల్పించే నైట్ మోడ్ కూడా ఉంది.
కానీ.. ట్రైపోఫోబియా ఉన్న వాళ్లకి ఇవి ఒక పీడకల లాంటివే. ఎందుకంటే వీటిని చూసినపుడు వారి గుండె కొట్టుకునే వేగం పెరుగుతుంది. కొన్నిసార్లు వాంతులు వచ్చినట్లు, తల తిరిగినట్లు అనిపిస్తుంది. కొందరికి ఒళ్లు గగుర్పొడుస్తుంది.

ఫొటో సోర్స్, Reuters
కాబట్టి.. కొంతమంది ఈ కారణంతో కొత్త మోడల్ ఐఫోన్‌ను కొనకుండా ఉండిపోవచ్చు.
ఇంకొంతమంది.. కొత్త ఐఫోన్ వెనుకవైపు చూసినపుడు తమకు ఏమనిపించిందో చెప్తూ సోషల్ మీడియాలో కామెంట్లు చేశారు.
ఐఫోన్ ప్రో ఫొటోలను చూసిన ఒక మహిళ.. ''దీని నిండా కెమెరాలే'' అని ట్విటర్‌లో వ్యాఖ్యానించారు.
ట్రైపోఫోబియా రుగ్మత ఉన్నవాళ్లు.. పాత ఐఫోన్ మోడళ్ల వల్ల తమకు భయం కలగలేదని చెప్పారు. అలాంటి వారిలో న్యూయార్క్‌కు చెందిన ఒక విద్యార్థి ఉన్నారు. సదరు విద్యార్థి తనకు ట్రైపోఫోబియా ఉన్న విషయాన్ని స్వయంగా నిర్ధారిస్తూ 2009లోనే ఒక ఫేస్‌బుక్ పేజీలో రాశారు.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది, 1
ఐఫోన్ 8, ఎక్స్ఆర్ మోడల్ ఫోన్ల వెనుక ఒకే కెమెరా ఉంది. అది ఎలాంటి విచిత్ర ఆకృతిలో లేదు.
అయితే.. ఐఫోన్ 11 ప్రో, 11 ప్రో మ్యాక్స్ వెర్షన్లు మూడు కెమెరాలతో రావటంతో.. వాటి ఆకృతి ట్రైపోఫోబియా ఉన్న వాళ్లని కలవరపరుస్తోంది.
యాపిల్ కంపెనీ డిజైనర్లు తమ ప్రఖ్యాత ఉత్పత్తిలో ఇలా మూడు కెమెరాలను చేర్చేటపుడు.. అరుదైన ఈ రుగ్మత గురించి ఆలోచించలేదన్నది స్పష్టమవుతోంది.
ఆ రుగ్మత ఉన్నవాళ్లలో చిన్న రంధ్రాలను చూసినపుడు కలిగే ప్రతిస్పందన చాలా తీవ్రంగా ఉండొచ్చు.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది, 2
ముఖ్యంగా కొత్త మోడళ్లు ఎన్ని రంగుల్లో వస్తున్నాయో ప్రదర్శించటం కోసం కొన్ని ఫోన్లను కలిపి తీసిన ఫొటోల్లో ఆ ఆకృతులు మరింత ఎక్కువగా ఇలాంటి వారికి భయం కలిగిస్తాయి.
''మనందరికి ఎక్కువగానో తక్కువగానో ట్రైపోఫోబియా ఉంటుంది. మనకు ఆ ఫోబియా ఏ స్థాయిలో ఉందనే దానిని బట్టి ప్రతిస్పందిస్తుంటాం'' అని డాక్టర్ కోల్ బీబీసీతో పేర్కొన్నారు.
ఐఫోన్ 11 ఆవిష్కరణతో.. ట్రైపోఫోబియా అనే పదం ట్విటర్‌లో ట్రెండయింది. దానితో పాటు ఆ రుగ్మతను ప్రేరేపించే ఫొటోలు కూడా విస్తృతంగా పోస్టయ్యాయి.
తమకు ట్రైపోఫోబియా ఉందని చెప్తున్న వాళ్లలో అమెరికన్ హారర్ స్టోరీ సిరీస్ నటి సారా పాల్సన్, మోడల్ కెండాల్ జెనర్‌లు కూడా ఉన్నారు.
ఇవి కూడా చదవండి
- ఏ సెల్‌ఫోన్‌తో ఎంత ప్రమాదం?
- మీ చేతిలోని స్మార్ట్ ఫోనే మీకు శత్రువుగా మారితే...
- మీ ఫోన్ హ్యాక్ అయ్యిందా, కాలేదా.. ఈ 7 సంకేతాలే చెబుతాయి!
- గూగుల్ మ్యాప్ గుర్తించిన నీటమునిగిన కారు, అందులో ఓ అస్థిపంజరం... దాని వెనుక 22 ఏళ్ళ నాటి కథ
- బ్యాంకు ఖాతాలో 90 లక్షలు వచ్చాయి... డ్రా చేశారు, ఖర్చుపెట్టేశారు... ఆ తర్వాత ఏం జరిగింది?
- ఓలా, ఉబెర్ల వల్ల కార్ల అమ్మకాలు తగ్గాయా... ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ వాదనలో నిజమెంత?
- 'నన్ను రేప్ చేశారు... ఇప్పుడు నా కూతుళ్లనూ అలా చేస్తారేమోనని భయపడుతున్నా'
- మలేరియా వ్యాధి నిరోధక టీకా.. ప్రపంచంలోనే మొదటిసారి అందుబాటులోకొచ్చిన వ్యాక్సిన్
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








