Ramsay Hunt syndrome: జస్టిన్ బీబర్‌ను బాధపెడుతున్న ఈ వ్యాధి ఎలాంటిది?

ఫొటో సోర్స్, Getty Images
సింగర్ జస్టిన్ బీబర్ తాను ఫేసియల్ పెరాలసిస్‌తో బాధపడుతున్నట్లు వెల్లడించారు. ఈ వారం జరగాల్సిన తన ప్రదర్శనలను రద్దు చేసిన అనంతరం ఆయన ఈ విషయం బహిర్గతం చేశారు.
రామ్సే హంట్ సిండ్రోమ్ అనే అనారోగ్యం వల్ల తనకు ఈ ఫేసియల్ పెరాలసిస్ వచ్చిందని బీబర్ ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసిన వీడియోలో వివరించారు. కెనడాలో జన్మించిన బీబర్ ప్రస్తుత వయసు 28 ఏళ్లు.
''మీకు కనిపిస్తోంది కదా.. ఈ కన్ను బ్లింక్ కావటం లేదు. ముఖంలో ఈ వైపు నవ్వలేకపోతున్నాను. అంటే నా ముఖం మీద ఈ పక్క పూర్తి పక్షవాతం వచ్చింది'' అని చెప్పారు.
Ramsay Hunt syndrome అంటే ఏంటి?
షింగ్లిస్ వైరల్ ఇన్ఫెక్షన్ వల్ల చెవుల దగ్గర ఉండే ముఖ నరాల మీద ప్రభావం చూపటాన్ని రామ్సే హంట్ సిండ్రోమ్‌గా వ్యవహరిస్తామని వైద్య నిపుణులు చెప్తున్నారు.
బీబర్ గత ఫిబ్రవరిలో జస్టిస్ వరల్డ్ టూర్ ప్రారంభించారు. ఆ పర్యటనలో ప్రకటించిన మూడు ప్రదర్శనలు వాయిదా పడతాయని ఈ వారం ఆరంభంలో ప్రకటించారు.
''నా చెవిలోని నరం మీద, నా ముఖపు నరాల మీద దాడి చేసే ఈ వైరస్ వల్ల నా ముఖానికి పక్షవాతం సోకింది'' అని తన ముఖంలోని కుడి పక్కను సూచిస్తూ ఆ వీడియోలో బీబర్ చెప్పారు.
కాబట్టి రాబోయే ప్రదర్శనలను నిర్వహించే పరిస్థితి తనకు లేదన్నారు. తన అభిమానులు సహనం పాటంచాలని కోరారు.
తన ముఖంలోని కుడి పక్క భాగం ఎలా కదలటం లేదో 24 కోట్ల మంది తన ఫాలోయర్లకు చూపించటానికి ఆయన ఆ వీడియోలో నవ్వారు, కళ్లు ఆర్పారు.
''ఇది చాలా సీరియస్ విషయం. ఇలా జరగకుండా ఉంటే బాగుండేది. కానీ నేను కాస్త నెమ్మదించాలని నా శరీరం చెప్తోంది. మీరు అర్థం చేసుకుంటారని నేను ఆశిస్తున్నా. ఈ సమయాన్ని విశ్రాంతి తీసుకోవటానికి ఉపయోగిస్తాను. నేను ఏ పని చేయటానికి పుట్టానో ఆ పని చేయటం కోసం వంద శాతం కోలుకోవటానికి ప్రయత్నిస్తాను'' అని పేర్కొన్నారు.
సాధారణ స్థితికి తిరిగి రావటం కోసం తాను ఫేసియల్ ఎక్సర్‌సైజులు చేస్తున్నానని బీబర్ తెలిపారు. కానీ కోలుకోవటానికి ఎంత కాలం పడుతుందనేది తనకు తెలియదన్నారు.

ఫొటో సోర్స్, INSTAGRAM/JUSTIN BIEBER
జస్టిన్ బీబర్ షోస్ వాయిదా...
బీబర్ ఈ వారం ఆరంభంలో వాషింగ్టన్ డీసీ, టొరంటోల్లో ప్రదర్శనలు నిర్వహించాల్సి ఉండింది. రాబోయే వారాల్లో న్యూయార్క్, లాస్ ఏంజెలెస్ నగరాల్లోనూ పాటల కచేరీలు నిర్వహించాల్సి ఉంది.
''రామ్సే హంట్ సిండ్రోమ్ వల్ల నొప్పి పుట్టించే షింగ్లెస్ దద్దుర్లు రావటంతో పాటు.. ఫేసియల్ పెరాలసిస్ కూడా రావచ్చు. ప్రభావిత చెవిలో వినికిడి సామర్థ్యం దెబ్బతినవచ్చు'' అని మేయో క్లినిక్ వివరించింది.
చాలా మందిలో ఈ రామ్సే హంట్ సిండ్రోమ్ లక్షణాలు తాత్కాలికమేనని, కానీ అవి శాశ్వతంగా మారే అవకాశమూ ఉందని మేయో క్లినిక్ చెప్తోంది.
ఈ రుగ్మత బారిన పడిన రోగులు ఒక కంటిని మూయలేకపోవటం వల్ల కన్ను నొప్పి కూడా రావచ్చునని, వారి చూపు మసకబారవచ్చునని తెలిపింది. ఈ రుగ్మత 60 ఏళ్ల దాటిన వారిలో చాలా అధికంగా కనిపిస్తుందని చెప్పింది.
జస్టిన్ బీబర్ భార్య హేలీ బీబర్‌కు గత మార్చి నెలలో మెదడులో రక్తం గడ్డకట్టటం వల్ల ఆస్పత్రిలో చేర్చారు.
తనకు స్ట్రోక్ వచ్చిందని, గుండెలో ఒక రంధ్రాన్ని మూసివేయటానికి సర్జరీ చేయించుకోవాల్సి వచ్చిందని ఆ తర్వాత ఆమె చెప్పారు.
ఇవి కూడా చదవండి:
- వయసు పెరగకుండా చరిత్రలో జరిగిన ప్రయోగాలేంటి... తాజాగా సైన్స్ కనిపెట్టింది ఏమిటి?
- ఇంటర్నెట్ ద్వారా ఆదాయం.. ఎంత సేపు బ్రౌజ్ చేస్తే అంత సంపాదించగలిగితే ఎలా ఉంటుంది?
- లక్ష కోట్ల చెట్లతో గాలిలోని కార్బన్ డై ఆక్సైడ్‌ను నిర్మూలించవచ్చా?
- Viagra: మహిళల్లో సెక్స్ కోరికలు పెంచే ‘వయాగ్రా’ను తయారుచేయడం ఎందుకంత కష్టం?
- కాథలిక్కుల్లో కులం సంగతేంటి? ఒక దళితుడు కార్డినల్ కావడానికి ఇంతకాలం ఎందుకు పట్టింది?
- ముస్లింలలో కుల వ్యవస్థ ఎలా ఉంది... ఈ మతంలో ఒక కులం వారు మరో కులం వారిని పెళ్ళి చేసుకుంటారా?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)













