జంతర్ మంతర్ నిరసన: ముందస్తు అరెస్టులు, భారీ సంఖ్యలో కేంద్ర బలగాలు

- రచయిత, పవన్ కాంత్ దిగవల్లి
- హోదా, బీబీసీ ప్రతినిధి
- ప్రచురణ
- చదివే సమయం: 5 నిమిషాలు
భారత ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేశ్ కుమార్ రాజీనామాను డిమాండ్ చేస్తూ.. దిల్లీలో నేడు (అక్టోబర్ 10) భారీ ఎత్తున నిరసనలు చేపట్టాలని కాక్రోచ్ జనతా పార్టీ (సీజేపీ), విద్యార్థి సంఘాలు, ఇండియా బ్లాక్ పార్టీలు పిలుపునిచ్చాయి.
ఈ నిరసనల నేపథ్యంలో.. కేంద్ర ప్రభుత్వం కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు, ముందస్తు జాగ్రత్త చర్యలు తీసుకుంది.
నిరసనలకు అనుమతి లేదని శుక్రవారం మధ్యాహ్నం దిల్లీ జాయింట్ కమీషనర్ ఐపీఎస్ నూపుర్ ప్రసాద్ ప్రకటించారు.
ప్రస్తుతం సెంట్రల్ దిల్లీ వ్యాప్తంగా భారతీయ నాగరిక సురక్షా సంహిత (బీఎన్ఎస్ఎస్) 163 సెక్షన్ అమల్లో ఉందని తెలిపారు.
సెంట్రల్ దిల్లీలోని జంతర్ మంతర్‌కు ఎవ్వరూ చేరుకోలేకుండా అటువైపుగా వెళ్లే రోడ్డు మార్గాలను బ్యారీకేడ్లతో మూసేశారు. అన్ని జంక్షన్లలోనూ భారీగా భద్రతా బలగాలను మోహరించారు.


ఫొటో సోర్స్, Reuters
దిల్లీలో భారీ సంఖ్యలో కేంద్ర బలగాలు
దిల్లీ పోలీసులకు మద్దతుగా 221 కంపెనీల కేంద్ర పారా మిలిటరీ బలగాలను అంటే దాదాపుగా 23 వేల మంది బలగాలను మోహరిస్తున్నారని ద హిందూ, ఇండియన్ ఎక్స్‌ప్రెస్ పత్రికలు రాశాయి.
వీటిలో 40 సీఆర్పీఎఫ్ కంపెనీలకు చెందిన 4 వేలమంది సిబ్బందిని పశ్చిమ బెంగాల్ నుంచి, 30 సీఆర్పీఎఫ్ కంపెనీలకు చెందిన 3 వేలమందిని ఛత్తీస్‌గఢ్ నుంచి దిల్లీకి రప్పించారని ది హిందూ పత్రిక కథనం పేర్కొంది.
ప్రస్తుతం దిల్లీ వ్యాప్తంగా రోడ్లపైన ఎక్కడ చూసినా దిల్లీ పోలీసుల బలగాలు, ర్యాపిడ్ యాక్షన్ బలగాలు, సీఆర్పీఎఫ్ బలగాలు భారీ సంఖ్యలో కనిపిస్తున్నాయి.
స్పెషలైజ్డ్ రాయిట్ కంట్రోల్ బలగాలు కూడా కనిపిస్తున్నాయి. వాటర్ కేనన్ వాహనాలు, రయిట్ కంట్రోల్ వాహనాలు, టియర్ గ్యాస్ షాట్స్‌ను పేల్చే వాహనాలను సెంట్రల్ దిల్లీలో దాదాపుగా అన్ని జంక్షన్లలోనూ మోహరించారు.
భద్రతా బలగాలు మోహరింపు వివరాల గురించి దిల్లీ పోలీసులను అడిగినపుడు, '' ఇవన్నీ అంతర్గత ఆపరేషనల్ వివరాలు. వీటిని అధికారికంగా మేం బయటికి చెప్పడానికి లేదు'' అని దిల్లీ పోలీసు విభాగం పీఆర్వో, ఏసీపీ రాంజయ్ అత్రీష్య బీబీసీతో చెప్పారు.
అలానే.. దిల్లీ వ్యాప్తంగా పది డిటెన్షన్ కేంద్రాలను ఏర్పాటు చేశారన్న కథనాల గురించి అడిగినప్పుడు కూడా ఏసీపీ రాంజయ్ అత్రీష్య వివరాలు వెల్లడించేందుకు నిరాకరించారు.

ఫొటో సోర్స్, ANI
రైల్వే స్టేషన్లు మూసివేతపై సుప్రీంకోర్టు ఏమంది?
శుక్రవారం రాత్రి నుంచి అంటే అక్టోబర్ 9 రాత్రి 9 గంటల నుంచీ అక్టోబర్ 10 వరకూ దిల్లీ వ్యాప్తంగా 57 మెట్రో స్టేషన్లను మూసివేస్తామని దిల్లీ జాయింట్ కమీషనర్ ఆఫ్ పోలీస్ - ట్రాన్స్ పోర్ట్ రేంజ్ కార్యాలయం నుంచి ప్రకటన విడుదలైంది.
అయితే, కాక్రోచ్ జనతా పార్టీ(సీజేపీ) నిరసనల నేపథ్యంలో దిల్లీ నుంచి రాకపోకలు సాగించే కొన్ని రైళ్లను రద్దు చేయడం, 57 మెట్రో స్టేషన్లను మూసివేయడంపై సుప్రీంకోర్టు ప్రభుత్వానికి కొన్ని సూచనలు చేసింది.
సీనియర్ న్యాయవాది కపిల్ సిబల్ దాఖలు చేసిన పిటిషన్‌ను విచారించిన సుప్రీంకోర్టు... ‘‘రైలు సర్వీసులు పూర్తిగా నిలిచిపోకుండా ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకోవాలి’’ అని సూచించినట్లు లైవ్‌లా వెబ్‌సైట్ పేర్కొంది.
మెట్రో స్టేషన్ల మూసివేత విషయంలోనూ సుప్రీంకోర్టు సూచనలు చేసిందని, ప్రజలకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా సేవలు ఉండాలని పేర్కొందని లైవ్‌లా వెబ్‌సైట్ తెలిపింది.
సీనియర్ న్యాయవాది కపిల్ సిబల్ సుప్రీంకోర్టులో దాఖలు చేసిన ఒక పిటిషన్‌లో, "అన్ని రైళ్లను రద్దు చేశారు, మెట్రో స్టేషన్లను మూసివేశారు, మీరు ఎక్కడికీ వెళ్లలేరు. దేశంలో ఇదే జరుగుతోంది" అని పేర్కొన్నారు.

ఫొటో సోర్స్, Jwala Kotesh/NurPhoto via Getty Images
మధ్యప్రదేశ్‌లో నిరసనకారులను అడ్డుకున్న పోలీసులు
ఇక దక్షిణాది రాష్ట్రాలు, మహారాష్ట్ర నుంచి రైళ్లలో దిల్లీకి ప్రయాణిస్తున్న నిరసనకారులను మధ్యప్రదేశ్ పోలీసులు ఆ రాష్ట్రవ్యాప్తంగా వేర్వేరు రైల్వే స్టేషన్లలో అడ్డుకుని అదుపులోకి తీసుకున్నారు.
ఈ విషయంపై మధ్యప్రదేశ్‌కు చెందిన ఒక ఏడీజీ స్థాయి పోలీస్ అధికారి స్పందిస్తూ.. భోపాల్, ఇటార్సి సహా వివిధ రైల్వే స్టేషన్లలో శుక్రవారం సాయంత్రం వరకు 41 మందిని అదుపులోకి తీసుకున్నట్లు బీబీసీకి ధృవీకరించారు. ఆయన తన పేరు వెల్లడించరాదన్న షరతుతో ఆయన ఈ వివరాలు తెలియజేశారు.
ఆయన తెలిపిన వివరాల ప్రకారం.. నేడు (అక్టోబర్ 10న) న్యూదిల్లీలో జరిగే నిరసనల్లో పాల్గొనేందుకు మహారాష్ట్రతో పాటు దక్షిణాది రాష్ట్రాల నుంచి మధ్యప్రదేశ్ మీదుగా రైలులో ప్రయాణిస్తున్న వారిపై మధ్యప్రదేశ్ పోలీసులు నిఘా ఉంచారు.
రైల్వే శాఖ కూడా మధ్యప్రదేశ్ పోలీసులకు అవసరమైన సమాచారం అందించింది.
అందిన సమాచారంలో రైళ్లలో ప్రయాణిస్తున్న వారిని గుర్తించగలిగామని, వారిని అదుపులోకి తీసుకోగలిగామని ఆ అధికారి స్పష్టం చేశారు.
మహారాష్ట్ర, దక్షిణాది రాష్ట్రాల నుంచి రైళ్లలో దిల్లీ వెళ్తున్న నిరసనకారులను అడ్డుకోవాలని, ఎక్కడికక్కడే ఆపాలని కేంద్ర ప్రభుత్వం సంబంధిత రాష్ట్ర పోలీసులకు ఆదేశాలు జారీ చేసిందని మధ్యప్రదేశ్‌కు చెందిన ఏడీజీ ర్యాంక్ అధికారి బీబీసీకి తెలిపారు.
అదుపులోకి తీసుకున్న వారిని అక్టోబర్ 10 తర్వాత విడుదల చేసి, వారి సొంత రాష్ట్రాలకు తిప్పి పంపనున్నారు. ఇప్పటివరకూ అదుపులోకి తీసుకున్న వారిలో తెలంగాణ ఎక్స్‌ప్రెస్‌తో పాటు కర్ణాటక, పుణె నుంచి వస్తున్న రైళ్లలో ప్రయాణిస్తున్నవారు ఉన్నారు.
సంబంధిత రాష్ట్రాల్లో నిరసనకారులను అడ్డుకోవడంలో విఫలమైన పోలీసు డిపార్ట్‌మెంట్, మధ్యప్రదేశ్ పోలీసులకు సమాచారం అందిస్తోందని, రైల్వే విభాగం కూడా అవసరమైన సమాచారాన్ని షేర్ చేస్తోందని ఆ అధికారి చెప్పారు.

ఫొటో సోర్స్, Indranil MUKHERJEE / AFP via Getty Images
'పోలీసులు అదుపులోకి తీసుకున్న వారిలో తెలుగోళ్లు'
మధ్యప్రదేశ్‌లోని భోపాల్, ఇటార్సి, గ్వాలియర్ రైల్వే స్టేషన్ల నుంచి కొందరు సీజేపీ సభ్యులను ఆ రాష్ట్ర పోలీసులు అదుపులోకి తీసుకున్నారని, వాళ్లను వెంటనే విడిచిపెట్టాలని, హైదరాబాద్‌కు చెందిన సీజేపీ సభ్యులు, తెలంగాణ క్లైమేట్ ఫ్రంట్ యాక్టివిస్ట్ రుచిత్ ఆశా కమల్ డిమాండ్ చేశారు.
''ఇప్పటి వరకూ మాకు తెలిసి తెలంగాణకు చెందిన నలుగురిని, ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ముగ్గురిని మధ్యప్రదేశ్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వాళ్లందరినీ ఎక్కడికి తీసుకెళ్లారు, ఎప్పుడు విడిచిపెడతారనే వివరాలేవీ మాకు తెలియట్లేదు'' అని శుక్రవారం రుచిత్ ఆశా కమల్ బీబీసీతో అన్నారు.

ఫొటో సోర్స్, Elke Scholiers/Getty Images
వెనక్కి తగ్గని సీజేపీ
అయితే, ఈ నిరసనలకు పోలీసులు అనుమతి ఇవ్వనప్పటికీ.. సీజేపీ వెనక్కి తగ్గడం లేదు. తమ మద్దతుదారులను చట్టవిరుద్ధంగా అదుపులోకి తీసుకుంటున్నారని సీజేపీ ఆరోపించింది.
ఈ విషయంపై సీజేపీ వ్యవస్థాపకుడు అభిజీత్ దీప్కే సామాజిక మాధ్యమం ఎక్స్‌లో పోస్టు చేస్తూ.. ''అక్టోబర్ 10న జరిగే మా నిరసనలకు ముందు దేశవ్యాప్తంగా వేలాది మంది యువతను బీజేపీ ప్రభుత్వం అదుపులోకి తీసుకుంది. మోదీ, మీ బెదిరింపులు పనిచేయవు. ఈ దేశ యువత ఇక మీకు భయపడరు. నేను దిల్లీకి చేరుకుని, ఏది ఏమైనా జంతర్ మంతర్ వరకు ర్యాలీగా వెళ్తాను'' అని రాశారు.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)





























