బాలల సంరక్షణ కేంద్రాల్లో ఆడపిల్లలే ఎందుకు ఎక్కువగా ఉన్నారు

దేశంలో ఉన్న బాలల సంరక్షణ కేంద్రాల్లో ఆడపిల్లల సంఖ్యే ఎక్కువగా ఉంటోంది.

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, దేశంలో ఉన్న బాలల సంరక్షణ కేంద్రాల్లో ఆడపిల్లల సంఖ్యే ఎక్కువగా ఉంటోంది.
    • రచయిత, అర్జున్ పర్మార్
    • హోదా, బీబీసీ గుజరాతీ

సూరత్‌లోని భేస్తాన్ ప్రాంతంలో ఉన్న ఒక మురికి కుప్ప దగ్గర అక్టోబరు 28న ఒక పసిపాప దొరికింది.

ఆ పాపను భరత్ భాయ్ భేల్ మురికికుప్ప దగ్గర నుంచి బయటకు తీసి వెంటనే ఆసుపత్రిలో చేర్చారు. ఆ నిమిషంలో ఆయన ఆ పాపను చూసి ఉండకపోతే, ఆ పసికందు బతికి ఉండేది కాదు.

ఆ 15 రోజుల చిన్నారికి సూరత్ సివిల్ ఆసుపత్రిలో చికిత్స జరుగుతోంది.

"ఆ మురికి కుప్ప దగ్గర పడి ఉన్న పసికందును గుర్తు తెచుకుంటుంటే, ఇప్పటికీ నా కళ్ళల్లో నీళ్లు తిరుగుతున్నాయి. ఆ పసికందులో కనిపించిన అమాయకత్వానికో.. లేదా మనసు లేకుండా ఆ పసికందును విసిరేసిన తల్లితండ్రుల క్రూరత్వానికో నాకు తెలియదు" అని భరత్ భాయ్ బీబీసీతో అన్నారు.

ఆ పసికందును ఎవరో ఒక సంచిలో పెట్టి పడేశారు. వీధి కుక్కలు ఆ పసికందును బయటకు లాగేందుకు ప్రయత్నిస్తుండగా, భరత్ భాయ్ ఆ దృశ్యాన్ని చూసి, ఆ పాపను సంచిలోంచి బయటకు తీశారు. పసికందును శుభ్రం చేసి నోట్లోకి గాలిని ఊదారు. స్పృహ లేకుండా పడి ఉన్న ఆ పసికందుకు ప్రాణాన్ని పోశారు.

భారతదేశంలో స్త్రీలను దేవతలుగా చూడమని చెబుతారు. అలాంటి దేశంలో ఇలా మురికి కుప్పల దగ్గర పసిపిల్లలు దొరకడం ఇదేమి మొదటిసారి కాదు.

ఈ అంశాన్ని మరింత లోతుగా అర్థం చేసుకునేందుకు, ఆడపిల్లలను వదిలించుకునే ప్రయత్నాలకు వెనుక గల కారణాలను తెలుసుకునేందుకు బీబీసీ ప్రయత్నించింది.

చాలా మంది ఆడపిల్లలను విడిచిపెట్టేస్తున్నారు.

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, చాలా మంది ఆడపిల్లలను విడిచిపెట్టేస్తున్నారు.

ఆడపిల్లల్నే ఎందుకు ఎక్కువగా వదిలేస్తారు?

ప్రకాశ్ కౌర్ పంజాబ్‌లోని జలంధర్‌లో యూనీక్ కేర్ అనే బాలల సంరక్షణ కేంద్రాన్ని నిర్వహిస్తున్నారు.

తల్లితండ్రులను ఆడపిల్లలను వదిలించుకోవాలని చూస్తుండటం వాస్తవం అని ఆమె అన్నారు.

ప్రకాశ్ కౌర్ బాలల సంక్షేమం కోసం చేస్తున్న కృషికి 2018లో భారత ప్రభుత్వం ఆయనకు పద్మ శ్రీ ప్రదానం చేసింది.

"ఆడపిల్లల్ని వదిలేయడం చాలా తీవ్రమైన సామాజిక సమస్య" అని ఆమె అన్నారు.

అబ్బాయిల కంటే కూడా అమ్మాయిలను ఎక్కువగా విడిచిపెట్టేస్తున్నట్లు తెలిపారు.

"అమ్మాయిలను భారంగా చూసే సమాజం, నిరక్షరాస్యత, విద్యావిధానంలో ఉన్న సమస్యలతో పాటూ దూరదృష్టి లేని మన సామాజిక వ్యవస్థ ఇందుకు కారణం" అని ఆమె అన్నారు.

సమాజం ఆలోచించే విధానాన్ని కూడా ఆమె తప్పుపట్టారు.

"ఈ రోజుకీ భారతీయ సమాజంలో కొడుకును వారసుడిగా, కుటుంబ పరువును నిలబెట్టేవాడిగా చూస్తారు. అదే అమ్మాయిని మాత్రం భారంగా చూస్తారు. నమ్మినా నమ్మకపోయినా ఇది మనం రోజూ చూస్తున్న వాస్తవం" అని అన్నారు.

"అమ్మాయిలు అబ్బాయిలు సమానమే అన్న విషయాన్ని మనం అబ్బాయిలకు నేర్పించం.

ఇవన్నీ సమస్యలకు కారణాలు" అని ఆమె అంటారు.

పసికందుల్ని ఊరి మీద విసిరేసే వారి పై కఠిన చర్యలు తీసుకోవాలని ఆమె అంటారు.

"పిల్లల్ని వదిలిపెట్టిన నేరానికి బెయిల్ దొరుకుతుంది. దాంతో, తప్పు చేసినా సులభంగా బయటపడిపోతారు. కానీ, పిల్లల జీవితానికి పొంచి ఉన్న ముప్పు గురించి మాత్రం ఆలోచించరు" అని అన్నారు.

ఇలాంటి పనులు చేసేవారికి భయం కలగాలంటే, కఠినమైన చట్టాలు రావాలని ఆమె అంటారు.

చాలా మంది ఆడపిల్లలను విడిచిపెట్టేస్తున్నారు.

ఫొటో సోర్స్, Dejan Mijovic / EyeEm

ఫొటో క్యాప్షన్, చాలా మంది ఆడపిల్లలను విడిచిపెట్టేస్తున్నారు.

పిల్లల్ని విడిచిపెట్టడం దారుణమైన నేరమని సెంట్రల్ అడాప్షన్ రిసోర్స్ అథారిటీ మాజీ చైర్మన్ ఎలోమా లోబో అన్నారు.

"అమ్మాయిలను ఎక్కువగా విడిచిపెట్టేస్తున్నారనేది వాస్తవం" అని ఆమె అన్నారు.

దత్తత కోసం

బాలల సంరక్షణ కేంద్రాల్లో ఉన్న అమ్మాయిల సంఖ్యను తెలుసుకునేందుకు బీబీసీ గుజరాతీ సెంట్రల్ అడాప్షన్ రిసోర్స్ అథారిటీలో ఆర్‌టీఐ దరఖాస్తు ఫైల్ చేసింది.

దేశవ్యాప్తంగా ఉన్న బాలల సంరక్షణ కేంద్రాల్లో దత్తత నిమిత్తం 1032 మంది అబ్బాయిలు ఉండగా, అమ్మాయిలు 1432 మంది ఉన్నట్లు తెలిసింది.

దత్తత కోసం అందుబాటులో ఉన్న అమ్మాయిల సంఖ్య అబ్బాయిల కంటే 38 శాతం ఎక్కువగా ఉంది.

వీడియో క్యాప్షన్, ‘రూ.37 వేలకు ఈ పాపను అమ్మేశాను.. ఎందుకంటే’

0-2 సంవత్సరాల వయస్సు వారిలో 188 మంది అబ్బాయిలు దత్తతకు అందుబాటులో ఉన్నారు. ఇదే వయసు వారిలో 241 మంది అమ్మాయిలు ఉన్నారు.

అంటే, అబ్బాయిల కంటే అమ్మాయిలు 28శాతం ఎక్కువగా ఉన్నారు.

ప్రతీ సంవత్సరం దత్తత కోసం అబ్బాయిల కంటే, అమ్మాయిలు 40 శాతం ఎక్కువగా ఉంటారు. అయినప్పటికీ, బాలల సంరక్షణ కేంద్రాల్లో అమ్మాయిల సంఖ్య ఎక్కువగానే ఉంటోంది.

సమాజంలో నెలకొన్న ఆలోచనా ధోరణులే ఇందుకు కారణమని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

బాలల సంరక్షణ కేంద్రాల్లో ఆడపిల్లలే ఎందుకు ఎక్కువగా ఉంటున్నారు.

ఫొటో సోర్స్, Kenishirotie

ఫొటో క్యాప్షన్, బాలల సంరక్షణ కేంద్రాల్లో ఆడపిల్లలే ఎందుకు ఎక్కువగా ఉంటున్నారు.

"అమ్మాయిలు ఎక్కువగా అందుబాటులో ఉండటం వల్ల కూడా దత్తతకు తీసుకుంటున్న వారిలో వారి సంఖ్య ఎక్కువగా ఉంటోంది" అని ఎలోమా లోబో అన్నారు.

"సమాజంలో చాలా కారణాల వల్ల అమ్మాయిలను భారంగా చూస్తారు. అందుకే అమ్మాయిలను విడిచి పెట్టేస్తూ ఉంటారు. వైకల్యంతో జన్మించినవారిని, ఆడపిల్లలను వదిలిపెట్టే అవకాశాలు ఎక్కువ. అదే అబ్బాయి అయితే మాత్రం తమతోనే ఉండనివ్వాలని చూస్తారు. ఇది విచారకరం" అని ఆమె అన్నారు.

ఆడపిల్లలను స్వీకరించమని ప్రకాష్ కౌర్ విజ్ఞప్తి చేస్తున్నారు. పిల్లల్ని విడిచిపెట్టాలని అనుకుంటే, యూనీక్ కేర్ సంస్థను సంప్రదించి ఆ పిల్లల్ని తనకు అప్పగించమని సూచించారు.

"అమ్మాయిల ప్రేమ సముద్రమంత విశాలంగా ఉంటుంది. వారిని వదిలిపెట్టకండి. మీరు వదిలిపెట్టాలని అనుకుంటే మాత్రం మాకు ఇచ్చేయండి. మేమే మీ దగ్గరకు వచ్చి ఆ పాపను తీసుకుంటాం. కానీ, వాళ్ళను విసిరేసి చంపేయకండి. వారిని బతకనివ్వండి" అని అన్నారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)