కాలేయం పంచుకుని పుట్టిన పిల్లలు విజయవంతంగా వేరయ్యారు

ఫొటో సోర్స్, EPA
ఆస్ట్రేలియాలో భూటాన్‌కు చెందిన అవిభక్త కవలలను ఆరు గంటలపాటు సర్జరీ చేసి వేరు చేశారు. వీరు పరిపూర్ణ ఆరోగ్యవంతులవడానికి మంచి అవకాశాలున్నాయని వైద్యులు తెలిపారు.
15 నెలల వయసున్న ఈ ఆడపిల్లల పేర్లు నీమా, దావా.
మొండెం కలిసిపోయి ఉన్న వీరిద్దరూ ఒక కాలేయాన్ని పంచుకుని ఇంతవరకూ జీవించారు.
ప్రధాన వైద్యులు డా.జోయ్ క్రేమరి మీడియాతో మాట్లాడుతూ, ఆపరేషన్ జరిగిన ఆరుగంటలసేపు పిల్లలు ఇద్దరూ ఏమాత్రం ఇబ్బంది పెట్టలేదు. సర్జరీ విజయవంతమైందని ఈ పిల్లల తల్లికి చెబుతున్నపుడు చాలా ఆనందమేసింది'' అన్నారు.
నీమా, దావా ఇద్దరూ ఇంతకాలం ఒకరికొకరు అభిముఖంగా జీవించారు. ఇద్దరూ పక్కపక్కనే కూర్చోలేరు. కానీ నిలబడగలరు అది కూడా ఒకేసారి!
గత నెలలోనే పిల్లలను తీసుకుని వాళ్ల అమ్మ మెల్‌బోర్న్ చేరారు.
కానీ పిల్లలకు సరైన పౌష్టికాహారం ఇవ్వాలని, వైద్యులు ఆపరేషన్‌ను ఇప్పటి దాకా వాయిదా వేశారు.
మెల్‌బోర్న్‌లోని రాయల్ చిల్డ్రన్స్ హాస్పిటల్‌లో జరిగిన ఈ సర్జరీలో ఒక అమ్మాయికి 9 మంది చొప్పున మొత్తం 18 మంది వైద్యులు పాల్గొన్నారు.

ఫొటో సోర్స్, AFP

ఫొటో సోర్స్, AFP
ఈ కవలల కాలేయాన్ని కూడా వైద్యులు విజయవంతంగా వేరు చేశారు.
''మేం విజయం సాధిస్తామన్న నమ్మకం ముందు నుంచీ ఉంది. కానీ వాళ్ల దేహం లోపలిభాగాలు ఎలావుంటాయోనని ఆలోచించేవాళ్లం. కానీ మేం భయపడినట్లు ఏం జరగలేదు'' అని డా.జోయ్ క్రేమరి అన్నారు.
''ఎలాంటి కేసులోనైనా సర్జరీ ముగిశాక 24గం. నుంచి 48గంటల సమయం కీలకం. మాకు సత్ఫలితాలు వస్తాయని మేం ధీమాగా ఉన్నాం'' అని డా.జోయ్ అన్నారు.
అవిభక్త కవలలు చాలా అరుదుగా పుడతారు. రెండులక్షల జననాల్లో ఒకటి ఇలాటుందని అంటారు. అవిభక్త కవలల ప్రసవాల్లో 40-60% పిల్లలు మృత శిశువులుగానే తల్లి గర్భం నుంచి బయటకు వస్తారు.
ఆస్ట్రేలియాకు చెందిన 'చిల్డ్రన్ ఫస్ట్ ఫౌండేషన్' స్వచ్ఛందసంస్థ సహకారంతో ఈ భూటాన్ కుటుంబం ఆస్ట్రేలియా రాగలిగింది.
స్వచ్ఛందసంస్థకు చెందిన ఎలిజబెత్ లాడ్జ్ మాట్లాడుతూ ‘‘పిల్లల తల్లి మొదట్లో కాస్త భయపడ్డారు ఇప్పుడు ప్రశాంతంగా ఉన్నారు..’’ అని అన్నారు.

ఫొటో సోర్స్, EPA
''తన పిల్లల్ని చూసి, చెరొక ముద్దు పెట్టింది ఆ తల్లి. ఇప్పడు ఎవరికివారు స్వయంగా ఊపిరి తీసుకోగలుగుతున్నారు. ఇద్దరూ తొలిసారి వేరువేరుగా పడుకున్నారు'' అని స్వచ్ఛందసంస్థ తెలిపింది.
ఈ సర్జరీ కోసం ఆస్ట్రేలియాలోని విక్టోరియా రాష్ట్రం 2,55,000 డాలర్లను ఖర్చుపెట్టడానికి ముందుకు వచ్చింది.
పిల్లలు కోలుకున్నాక వీరి కుటుంబం తిరిగి భూటాన్ వెళ్లనుంది. ప్రపంచంలోని అత్యంత పేద దేశాల్లో భూటాన్ ఒకటి.
2009లోకూడా ఈ హాస్పిటల్‌లో బంగ్లాదేశ్‌కు చెందిన తృష్ణ, కృష్ణ అనే అవిభక్త కవలలకు విజయవంతంగా సర్జరీ చేశారు.
ఈ ఆడపిల్లలిద్దరి తలలూ ఒక్కటిగా కలిసిపోయి ఉండేవి.
ఇవి కూడా చదవండి
- చరిత్ర: మొదటి ప్రపంచ యుద్ధానికి వందేళ్లు. ఆ యుద్ధంలో భారత సైనికుల త్యాగాలు తెలుసా
- 96 ఏళ్ల వయసులో మూడో తరగతి పాసైన కేరళ బామ్మ
- అడ్వాణీని కోలుకోలేకుండా చేసిన ఆ ఒక్క తప్పు
- ప్రపంచంలో అత్యంత ప్రమాదకరమైన ఐదుగురు మహిళా గూఢచారులు
- తెలంగాణ ఎన్నికలు.. బీబీసీ ప్రత్యేక కథనాలు
- తెలంగాణ ఎన్నికలు : ఏ ఎమ్మెల్యేపై ఎన్ని కేసులు?
- ఇందిరాగాంధీ: మెదక్ అంటే ఎందుకంత అభిమానం?
- అభిప్రాయం: "పేర్ల మార్పును ఒకప్పుడు బీజేపీనే వ్యతిరేకించింది"
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








