స్మార్ట్ ఫిట్‌నెస్ మిర్రర్: ఈ అద్దంలో చూస్తూ ఎక్సర్‌సైజ్ చేస్తే ఏమవుతుంది

స్మార్ట్ ఫిట్‌నెస్ మిర్రర్

ఫొటో సోర్స్, IFIT

    • రచయిత, కిట్టీ పల్మాయి, విల్ స్మేల్
    • హోదా, బీబీసీ బిజినెస్ రిపోర్టర్స్

ఫిట్‌నెస్ మీద మోజు ఉన్నవాళ్లు సహా, చాలామందికి వర్కవుట్ చేస్తున్న సమయంలో తమను తాము అద్దంలో చూసుకోవడం మీద పెద్దగా ఆసక్తి ఉండదు. జిమ్‌లో ట్రెడ్‌మిల్ మీద చెమటలు చిందిస్తూ, బరువులు మోస్తూ తమను తాము చూసుకోవడం కొందరికి ఇబ్బందిగా ఉంటుంది.

అయితే కొంతమందికి మాత్రం అద్దంలో చూసుకుంటూ ఎక్సర్ సైజులు చేయడం మహా సరదా. తమ బాడీ సౌష్టవాన్ని చూసుకుని మురిసి పోతుంటారు. ఇంకా ఇందులో కూడా కొత్తగా వచ్చిన అద్దాలలో తమను చూసుకుని థ్రిల్లయిపోవడం లేటెస్ట్ ట్రెండ్‌గా మారింది. ఆ అద్దాలనే స్మార్ట్ ఫిట్‌నెస్ మిర్రర్స్ అంటున్నారు.

ఈ అద్దాలు 6 అడుగుల ఎత్తుంటాయి. వీటికి కంప్యూటర్ అనుసంధానించి ఉంటుంది. అది ఇంటర్నెట్‌తో కనెక్టయి ఉంటుంది. దాంతోపాటు వీడియో స్క్రీన్‌లాగా కూడా పని చేస్తుంది. ఈ అద్దాల ఏర్పాటు ప్రధాన ఉద్దేశం ఆన్‌లైన్ ట్రైనర్‌‌కు కనెక్ట్ చేయడం. ఆ మిర్రర్ మీద మీతోపాటు ట్రైనర్ కూడా కనిపిస్తుంటారు.

ఈ అత్యాధునిక అద్దాలకు కెమెరాలు, స్పీకర్‌లు అమర్చి ఉంటాయి. అంటే మీ కదలికలను ట్రైనర్ నేరుగా చూస్తూ మీకు సలహాలు, సూచనలు ఇస్తుంటారు. ఇందులో పర్సనల్, గ్రూప్ ట్రైనింగ్‌లకు కూడా అవకాశం ఉంది. వెయిట్ లిఫ్టింగ్, కార్డియో, పిలేట్స్, యోగాలాంటి అనేక వ్యాయామ పద్ధతులు నేర్పుతారు.

అయితే, ఈ మిర్రర్లలో వీడియోలు, ఆడియో అన్నీ వన్ వేగా ఉంటాయి. ట్రైనర్ చెప్పేది వినడం మాత్రమే చేయగలరు. మీరు వారితో మాట్లాడలేరు. చాలా క్లాసులు లైవ్ కాదు. లైబ్రరీ నుంచి తీసుకున్నవి, స్ట్రీమింగ్ వీడియోలు మాత్రం ఉంటాయి.

హైఎండ్ మోడల్ మిర్రర్ అయినా, బేసిక్ మిర్రర్ అయినా, దాన్ని కొనాలంటే కనీసం 1000 యూరోలు (రూ. 80 వేలకు పైమాటే) ఉంటుంది. దీనికి నెలనెలా సబ్‌స్క్రిప్షన్ అదనం.

ఈ స్మార్ట్ మిర్రర్లలో సెన్సర్లు ఉంటాయి

ఫొటో సోర్స్, CARE OS

ఫొటో క్యాప్షన్, ఈ స్మార్ట్ మిర్రర్లలో సెన్సర్లు ఉంటాయి. అవి ఆరోగ్య సమస్యలను గుర్తిస్తాయి

ఈ అద్దాలకు సెన్సర్లను అమరుస్తారు. అది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌కు అనుసంధానమై ఉంటుంది. ఇది ఎక్సర్‌సైజ్ మూవ్‌మెంట్ మీద ఎప్పటికప్పుడు ఫీడ్‌బ్యాక్ ఇస్తుంటుంది. శరీర సౌష్టవాన్ని ఎలా మెరుగుపరుచుకోవాలో సూచనలు చేస్తుంది.

'వహా' పేరుతో యునైటెడ్ కింగ్‌డమ్‌లో తొలిసారి ఇలాంటి మిర్రర్ ఒకటి అమ్మకానికి వచ్చింది. అదే పేరున్న జర్మన్ కంపెనీ దీన్ని తయారు చేసింది. టోనాల్, మిర్రర్, నోర్డిక్ ట్రాక్, పోర్ట్ల్, ప్రోఫామ్ పేరుతో మరికొన్ని బ్రాండ్లు కూడా ఉన్నాయి.

బాడీ ఫిట్‌నెస్ మానసిక, శారీరక వికాసం కోసం ప్రభావవంతమైన విధానాలు, సమర్ధవంతమైన సెషన్‌లను అందిస్తామని వహా కంపెనీ ప్రకటించుకుంది.

వీడియో క్యాప్షన్, "తల్లిదండ్రులు మమ్మల్ని ట్రాన్స్‌జెండర్లుగా గుర్తిస్తే, మేం ఇలా వీధిన పడం"

నిజంగా ఎక్సర్‌సైజ్ చేసే సమయంలో మనల్ని మనం అద్దంలో చూసుకోవడం వల్ల ప్రయోజనం ఉందా?

''మిర్రర్‌లో చూస్తూ ఎక్సర్‌సైజ్ చేయడం వల్ల శారీరక కదలికలను చాలా జాగ్రత్తగా, అవసరమైన రీతిలో చేయగలుగుతారు. దీనివల్ల మంచి ఫలితాలు సాధించడమేకాక, గాయపడేందుకు కారణమయ్యే సందర్భాలను నివారించవచ్చు'' అని ఐఫిట్ సంస్థలో పబ్లిక్ రిలేషన్స్ ఆఫీసర్‌గా పని చేస్తున్న కలీన్ లోగాన్ అన్నారు. ఐఫిట్ సంస్థ నోర్డిక్ ట్రాక్, ప్రోఫామ్ సంస్థలకు అమెరికాలో మాతృ సంస్థగా వ్యవహరిస్తోంది.

అయితే, దీనిలో కొన్ని ప్రయోజనాలున్నప్పటికీ సమస్యలు కూడా ఉన్నాయని లఫ్‌బరా యూనివర్సిటీలో ఫిట్‌నెస్ సైకాలజిస్టుగా పని చేస్తున్న డాక్టర్ ఆంథోనీ పాపథోమాస్ అన్నారు.

అందం మీద అతిగా విశ్వాసం వారు తమలో లోపాలను తట్టుకోలేరు

ఫొటో సోర్స్, CAREOS

''సైకాలజీ పరంగా చూస్తే అద్దం ముందు ఎక్సర్‌సైజ్ చేయడం వల్ల మనం చేస్తున్న వర్కవుట్లో లోపాలపై ఫీడ్‌బ్యాక్ అందుతుంది. పైగా ఇది ఎక్సర్‌సైజ్ చేసేవాళ్లకు మంచి ప్రోత్సాహాన్ని కూడా ఇస్తుంది'' అన్నారాయన.

''అయితే సమస్య ఏంటంటే, తమ శరీరాన్ని చూసుకుకుని కుంగుబాటుకు లోనయ్యే వారు దీన్ని చూసి ఎలా ఫీలవుతారు? లైఫ్ స్టైల్ మార్చుకోవాలనుకునే వారికి ఇదొక సమస్య కావచ్చు కదా?'' అని అన్నారాయన.

''రెగ్యులర్‌గా ఎక్సర్‌సైజులు చేసేవారిలో కూడా బాడీ డిస్‌మార్ఫియా(శరీరంలో లోపాలను చూసుకుని బాధపడేతత్వం), ఈటింగ్ డిజార్డర్లు ఉన్నవారు తమను తాము అద్దంలో చూసుకుంటూ ఎక్సర్‌సైజులు చేయడం వల్ల ఇబ్బంది పడొచ్చు'' అన్నారు.

స్మార్ట్ వెల్‌నెస్ మిర్రర్ అనే పేరుతో కాస్త అలాంటివే మరో కొత్తరకం మిర్రర్లు మార్కెట్‌లోకి వస్తున్నాయి. ఇవి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సాయంతో యూజర్ల్ శరీరాన్ని, ఆరోగ్యాన్ని కూడా అంచనా వేస్తాయి.

ఫ్రెంచ్ కంపెనీ కేర్ ఓఎస్ ఇలాంటివే రెండు ప్రోడక్ట్‌లను తయారు చేసింది. వీటిని బాత్ రూమ్ షింక్ పైన ఉండే అద్దాల స్థానంలో పెట్టుకోవాలి.

స్మార్ట్ మిర్రర్ కారణంగా మెరుగైన ఎక్సర్‌సైజ్‌లు చేయవచ్చు

ఫొటో సోర్స్, IFIT

ఈ మిర్రర్‌కు కెమెరా ఉంటుంది. అల్ట్రా వయెలెట్, ఇన్‌ఫ్రారెడ్ లైట్ సెన్సర్లు మీ శరీరాన్ని, ఉష్ణోగ్రతలను విశ్లేషిస్తాయి. వీటి ఆధారంగా వ్యక్తులు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో చెబుతాయి.

''బాత్ రూమ్‌లో మీరు తడిచి ఉంటారు. మీ చేతికి సబ్బుల్లాంటివి ఉంటాయి. అందువల్ల మీరు ఈ అద్దాన్ని ముట్టుకోవాల్సిన అవసరం లేదు. దాని ముందు నిలబడితే చాలు. అది మిమ్మల్ని అసెస్ చేస్తుంది'' అని వయోలైయానే మోన్‌మార్చే అన్నారు. ఆమె కేర్ఓఎస్ సహ వ్యవస్థాపకురాలు.

''వీటిలోని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఫేషియల్ రికగ్నిషన్ లాంటి అత్యాధునిక సౌకర్యాలు ప్రజలు తమ ఆరోగ్యాన్ని మేనేజ్ చేసుకోవడంలో ఉపయుక్తంగా ఉంటాయి'' అని లండన్‌లోని హార్లీ స్ట్రీట్ స్పెషలిస్ట్ హాస్పిటల్‌లో మెడికల్ ఈస్థటిక్ కన్సల్టెంట్‌గా పని చేస్తున్న డాక్టర్ అనూబ్ పక్కర్-హల్ అన్నారు.

''అయితే టచ్ లేకుండా ఆరోగ్యాన్ని విశ్లేషించడంలో కొన్ని సమస్యలు ఉండొచ్చు'' అన్నారు డాక్టర్ అనూబ్.

''తమ శరీరాన్ని చూసి బాధపడే వారు ఇలాంటి మిర్రర్ల కారణంగా మరింత కుంగుబాటుకు లోనయ్యే ప్రమాదం కూడా ఉంది. కొందరు తాము పర్ఫెక్ట్‌గా ఉన్నామని నమ్ముతారు. కానీ చిన్న చిన్న లోపాలు కనిపిస్తే తట్టుకోలేరు'' అని కన్సల్టెంట్ సైకాలజిస్ట్ డాక్టర్ ఎలెనీ టౌరోనీ అన్నారు.

వీడియో క్యాప్షన్, శ్రీశైలం రోప్ వే: గాలిలో తేలిపోతూ... నదిలోకి దూకుతున్నట్లు

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)