BBC 100 మంది మహిళలు: 12 ఏళ్ల అమ్మాయి నుంచి 82 ఏళ్ల బామ్మ వరకు...

రిధిమా పాండే

ఫొటో సోర్స్, twitter/ridhimapandey7

ఫొటో క్యాప్షన్, రిధిమా పాండే

ప్రతి ఏడాది లాగే ఈసారి కూడా ప్రపంచవ్యాప్తంగా స్ఫూర్తిదాయకంగా, ప్రభావవంతంగా నిలిచిన 100 మంది మహిళల పేర్లతో బీబీసీ ‘100 వుమెన్’ జాబితాను ప్రకటించింది.

నలుగురు భారతీయులు ఇందులో చోటు దక్కించుకున్నారు.

పర్యావరణ పరిరక్షణ కార్యకర్త రిధిమా పాండే, గాయకురాలు ఇసైవాణి, పారా అథ్లెట్ మానసీ జోషి, ఉద్యమకారిణి బిల్కిస్ బానో... భారత్ నుంచి ఈ జాబితాలో స్థానం సంపాదించుకున్నారు.

ప్రపంచవ్యాప్తంగా ఒడిదొడుకులు నెలకొన్న ఈ సమయంలో మార్పుకు దారి చూపుతూ ముందుకు సాగుతున్న మహిళలకు ప్రాధాన్యతను ఇస్తూ ఈసారి బీబీసీ ‘100 వుమెన్’ జాబితాను రూపొందించింది.

రిధిమా పాండే

రిధిమా పాండే పర్యావరణ పరిరక్షణ కోసం కృషి చేస్తోంది. ఆమె వయసు 12 ఏళ్లు.

వాతావరణ మార్పుల విషయంలో భారత ప్రభుత్వం ప్రదర్శిస్తున్న అలసత్వాన్ని ప్రశ్నిస్తూ తొమ్మిదేళ్ల వయసులోనే ఆమె నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్‌లో పిటిషన్ వేసింది.

2019లో గ్రెట్ థన్‌బెర్గ్ లాంటి మరో 15 మంది బాల కార్యకర్తలతో కలిసి ఐదు దేశాలకు వ్యతిరేకంగా ఐరాస బాలల హక్కుల కమిటీలో ఫిర్యాదు చేసింది.

పర్యావరణం, జీవ వైవిధ్యాన్ని కాపాడుకోవాల్సిన అవసరం గురించి తోటి విద్యార్థులను జాగృతం చేసేందుకు ఇప్పుడు ఆమె కృషి చేస్తోంది. ప్రపంచవ్యాప్తంగా వివిధ సదస్సుల్లో పాల్గొంటోంది.

ఇసైవాణి

ఫొటో సోర్స్, Isaivani/Instagra,

ఫొటో క్యాప్షన్, ఇసైవాణి

ఇసైవాణి

ఉత్తర చెన్నైకి ప్రత్యేకమైన ‘గానా’ పాటలను పాడుతూ గుర్తింపు తెచ్చుకున్నారు ఇసైవాణి.

ఈ ‘గానా’ పాటల్లో మగవారి ఆధిపత్యమే ఎక్కువగా ఉంటుంది. వారితో కలిసి పాడే అవకాశం రావడమే ఘనతగా భావిస్తుంటారు.

అలాంటి చోట ఇసైవాణి వారికి దీటుగా తన పాటలతో పాపులర్ అయ్యారు.

గానా పాటలు పాడేందుకు మరింత మంది యువతులు ముందుకు రావడానికి స్ఫూర్తిగా నిలిచారు.

మానసీ జోషి

ఫొటో సోర్స్, twitter/joshimanasi11

ఫొటో క్యాప్షన్, మానసీ జోషి

మానసీ జోషి

మానసీ జోషి ఓ పారా అథ్లెట్. పారా బ్యాడ్మింటన్‌లో ప్రస్తుతం ఆమె ప్రపంచ ఛాంపియన్‌గా ఉన్నారు.

2020 జూన్‌లో బ్యాడ్మింటన్ వరల్డ్ ఫెడరేషన్ ప్రకటించిన ర్యాకింగ్స్‌లో ఎస్ఎల్3 సింగిల్స్ విభాగంలో ఆమె ప్రపంచ నెం.2గా నిలిచారు.

మానసీ ఓ ఇంజినీర్ కూడా.

అంగ వైకల్యం, పారా క్రీడల విషయంలో భారతీయుల వైఖరిలో సానుకూల మార్పు తెచ్చేందుకు మానసీ కృషి చేస్తున్నారు.

ఇటీవల టైమ్ మ్యాగజీన్ ప్రకటించిన ‘‘నెక్స్ట్ జనరేషన్ లీడర్’ జాబితాలోనూ మానసీ చోటు దక్కించుకున్నారు. భారత్‌లో వికలాంగుల హక్కుల పోరాడుతున్న వ్యక్తిగా టైమ్ మ్యాగజీన్ ఆసియా ఎడిషన్ కవర్‌ పేజీపైనా కనిపించారు.

బిల్కిస్ బానో

ఫొటో సోర్స్, twitter/DadiBilkis

ఫొటో క్యాప్షన్, బిల్కిస్ బానో

బిల్కిస్ బానో

భారత్‌లో వివాదాస్పదమైన పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా దిల్లీలో శాంతియుతంగా ఉద్యమించిన మహిళల్లో బిల్కిస్ బానో ఒకరు.

ఆమె వయసు 82 ఏళ్లు.

షహీన్‌బాగ్‌లో చాలా రోజుల పాటు కొనసాగిన నిరసన కార్యక్రమానికి ఆమె ముఖచిత్రంగా నిలిచారు.

బిల్కిస్‌ను ‘పీడిత పక్షాల గొంతుక’గా భారత విలేఖరి, రచయిత రానా ఆయూబ్ వర్ణించారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)