గుజరాత్: ‘రామ్‌పాత్ర’ అంటే ఏమిటి? ఈ గిన్నెలకు కులానికి సంబంధమేంటి?

రామ్ పాత్ర

ఫొటో సోర్స్, INDU ROHIT

    • రచయిత, పార్థ్ పాండ్య
    • హోదా, బీబీసీ గుజరాతీ

గుజరాత్‌లోని గ్రామాల్లో ఇళ్ల వసారాలో కానీ ఇంటి బయట కానీ ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన చిన్న అరలో లేదా ఇంటి చూరులో ఓ గిన్నెను చూడవచ్చు. వాటిని చాలా గ్రామాల్లో “రామ్ పాతర్” లేదా “రామ్‌పాత్ర” అని పిలుస్తూ ఉంటారు.

ఇటీవల అమ్రెలి జిల్లాలో దళితులపై దురాగతానికి పాల్పడ్డారన్న ఘటన వెలుగులోకి వచ్చింది. దీంతో దళితులపై వివక్షతో పాటు రామ్‌పాత్ర అంశం కూడా మరోసారి తెరపైకి వచ్చింది. ఈ ఘటన అమ్రెలి జిల్లాలో మెరియానా అనే గ్రామంలో జరిగింది. 38 ఏళ్ల సనా చౌహాన్‌ను అదే గ్రామంలోని అగ్రకులానికి చెందిన ఓ వ్యక్తి కొట్టారని ఎఫ్ఐఆర్ నమోదయ్యింది. ఈ ఘటన జూన్ 21న జరిగింది.

ఎఫ్ఐఆర్‌లో ఉన్న వివరాల ప్రకారం సనా చౌహాన్‌ను రానా బదోర్ అనే వ్యక్తి కొట్టారు. బదోర్ తన ఇంట్లో జరుగుతున్ననిర్మాణపు పనుల కోసం సనా చౌహన్‌ను పిలిచారు. ఆయన ఇంట్లో ఇచ్చిన టీని తాగి తన సాసర్‌ను రానా తాగిన సాసర్ పక్కనే పెట్టారు. దీంతో తీవ్రంగా ఆగ్రహించిన రానా ఆయన్ను తిట్టడమే కాదు కులం పేరు పెట్టి దూషించారు. ఆపై చేయి చేసుకున్నారు కూడా.

ఈ ఘటనపై సనా చౌహన్ బీబీసీతో మాట్లాడారు. తను మధాల గ్రామంలో నివసిస్తున్నానని, పని కోసం మరియానా గ్రామానికి వెళ్లానని చెప్పారు. అప్పుడే ఈ ఘటన జరిగిందన్నారు. “మేం దళితులం. అందుకే మేం తాగే సాసర్‌ను ప్రత్యేకంగా ఉంచుతారు. పొర పాటున నేను ఆ రోజు తాగిన సాసర్ ఆయన(రానా) సాసర్ పక్కన పెట్టాను. దాంతో ఆయన కోపం వచ్చి నన్ను కొట్టడం మొదలు పెట్టారు” అని సనా తెలిపారు.

రామ్‌పాత్ర గురించి మాట్లాడుతూ ఈ పద్ధతి తమ చుట్టుపక్కల గ్రామాలన్నింటిలోనూ ఉందని చెప్పారు. “ ఎక్కడ మేం పనికి వెళ్లినా మేం వాడే పాత్రల్ని మేమే తీసుకెళ్లాలి. వాటిల్లోనే మాకు భోజనాన్ని పెడతారు. టీ ఇస్తుంటారు. ఒక వేళ మేం మా గిన్నెల్ని తీసుకువెళ్లడం మర్చిపోతే అప్పుడు వారి దగ్గర పశువులశాలల్లో చూరులో ఉంచిన రామ్‌పాత్రను మాకు ఇస్తారు. అందుకే మేం సాధారణంగా మా పాత్రల్నే తీసుకెళ్తూ ఉంటాం” అని సనా చౌహాన్ చెప్పుకొచ్చారు.

రామ్ పాత్ర

ఫొటో సోర్స్, Indu Rohit

అసలు ఏమిటీ ‘రామ్‌పాత్ర’?

“అండర్ స్టాండింగ్ అన్‌టచ్‌బిలిటీ” పేరిట కెన్నెడీ సెంటర్ ఫర్ జస్టిస్ అండ్ హ్యూమన్ రైట్స్, నవసర్జన్ ట్రస్ట్ చేసిన పరిశోధనలోఈ ప్రశ్నకు సమాధానం ఇలా ఉంది.

“చాలా గ్రామాల్లో తమ ఇళ్లకు వచ్చే దళితుల కోసం టీ ఇచ్చేందుకు లేదా భోజనం పెట్టేందుకు అగ్ర కులాలకు చెందిన వాళ్లు ప్రత్యేక పాత్రలను, గిన్నెలను, ప్లేట్లను ఉపయోగిస్తుంటారు. వాటినే ‘రామ్‌పాత్ర’ అని అంటారు” అని ఆ పరిశోధన పేర్కొంది.

దళితుల పట్ల వివక్షకు ఈ విధానం నిదర్శనమని దళిత హక్కుల సంఘాలు, సామాజికవేత్తలు, ప్రొఫెసర్లు చెబుతుంటారు. “రామ్‌పాత్ర” అన్నది వాడుక పదం. నిజానికి దాని అర్థం దేవుడైన రాముడి వంట పాత్ర అని అర్థం.

గ్రామాల్లోని ఇళ్లల్లో సాధారణంగా ఉపయోగించే వంట పాత్రలతో కాకుండా ఈ రామ్‌పాత్రను దళితుల కోసం ప్రత్యేకంగా దాచి పెడతారు. “ఓ రకంగా ఇది తినే విషయంలో చూపించే వివక్ష” అని ఆ పరిశోధన పత్రంలో పేర్కొన్నారు.

దళితులపై జరుగుతున్న దుర్మార్గాలపై అధ్యయనం చేశారు సర్దార్ పటేల్ విశ్వ విద్యాలయానికి చెందిన పొలిటికల్ సైన్స్ ప్రొఫెసర్ బల్దేవ్ అగ్జ.

“ఇప్పటికి కూడా గుజరాత్‌లోని కొన్ని గ్రామాల్లో టీ కొట్లలోనూ, ఇళ్లల్లోనూ మంచినీళ్లు, టీ లను దళితులకు ప్రత్యేకంగా ఉంచిన గ్లాసుల్లోనే ఇస్తుంటారు. ఇది కూడా 98 రకాల అంటరానితనాల్లో ఒకటి” అని ఆయన అభిప్రాయపడ్డారు.

ఇదే అంశంపై గుంజన్ వేదా ‘ద మ్యూజియం ఆఫ్ బ్రోకెన్ టీ కప్స్’ అని ఓ పుస్తకాన్ని రాశారు. రామ్‌పాత్రను అర్థం చేసుకునే విషయంలో మరిన్ని వివరాలను పేర్కొంటు దళిత కార్యకర్త మార్టిన్ మాక్వాన్‌ను కూడా ఆ పుస్తకంలో ప్రస్తావించారు.

సాధారణంగా గుజరాత్‌లో తమ ఇళ్లకు వచ్చే అతిథులకు మంచినీళ్లు, టీ ఇవ్వడం ఆచారం. కానీ దళిత కులానికి చెందిన వ్యక్తి వస్తే మాత్రం వాళ్లను అంటరాని వ్యక్తులుగానే చూస్తారు. అందుకే వారి కోసం ప్రత్యేకంగా టీ కప్పు, సాసర్‌లను ఉంచుతుంటారు అని మార్టిన్ మాక్వాన్ చెప్పారు.

“ప్రత్యేకంగా పాత్రలను ఉపయోగించడం అన్నది ఓ రకంగా కుల వివక్ష అని చెప్పవచ్చు. సమాజంలోని రెండు వర్గాల మధ్య ఉన్న అంతరానికి ఇది ప్రతీక. ఇన్నేళ్లు గడిచినా పరిస్థితుల్లో చెప్పుకోదగ్గ మార్పు రాలేదు. చాలా గ్రామాల్లో ఇప్పటికీ సర్పంచ్‌లుగా దళితుల్ని ఎన్నుకోరు” అని దళిత్ శక్తి కేంద్ర సంస్థ జాయింట్ డైరక్టర్ ఇందుబహెన్ రోహిత్ చెప్పారు.

నిరసన ప్రదర్శన

98% గ్రామాల్లో రామ్‌పాత్ర

గుజరాత్‌లోని గ్రామాల్లో అంటరానితనం ఇంకా ఏ మేరకు ఉందో తెలుసుకునేందుకు మార్టిన్ మాక్వాన్‌కు చెందిన నవసర్జన్ ట్రస్టు ఓ పరిశోధనను నిర్వహించింది.

ఆ పరిశోధనలో భాగంగా మొత్తం 1589 గ్రామాలలో పర్యటించి, 5,462 మంది వ్యక్తుల్ని ప్రశ్నించింది. మొత్తం నాలుగేళ్ల పాటు సాగిన ఆ పరిశోధన 2010లో పూర్తయ్యింది.

ఆ పరిశోధన ప్రకారం 98శాతం దళితులు కాని వారి ఇళ్లల్లో దళితుల కోసం ప్రత్యేకంగా రామ్‌పాత్రను ఉంచే ఆచారం ఉంది. అంతేకాదు రామ్‌పాత్రతో ముడి పడి మరో రెండు ఆచారాలు కూడా ఉన్నాయి. పని కోసం వచ్చే కూలీల్లో కూడా భోజన సమయంలో దళితులు వేరుగా, దళితులు కాని వారు వేరుగా కూర్చొని భోజనం చేస్తారు. మొత్తం 1589 గ్రామాల్లో 96 శాతం మంది ఉన్నత కులాల వారు ఈ ఆచారాన్ని పాటిస్తున్నారు.

అంతేకాదు సామూహిక భోజనాల సమయంలో దళితులు ఎవరి పాత్రలు వారు తెచ్చుకోవాల్సిందే. అది కూడా అగ్ర కులాల వాళ్లంతా భోజనం చేసిన తర్వాతే వారు భోజనానికి కూర్చోవాలి. ఈ ఆచారం కూడా 94శాతం గ్రామాల్లో అమలవుతోంది.

రామా్ పాత్ర భీంపాత్ర ఉద్యమం

రామ్‌పాత్ర-భీంపాత్ర ఉద్యమం

రామ్‌పాత్ర ఆచారానికి వ్యతిరేకంగా మార్టిన్ మాక్వాన్‌ 2003లో ఉద్యమాన్ని ప్రారంభించారు. ‘రామ్‌పాత్ర నహీ - భీంపాత్ర సహీ’, రామ్‌పాత్రను ఛోడో-భీం పాత్ర అపనావ్’ అన్నవి ఆ ఉద్యమ నినాదాలు. “1977లో నా ప్రొఫెసర్‌తో కలిసి కంబత్ జిల్లాలో పర్యటించాను. అప్పటికి నేను నా కాలేజీ మొదటి సంవత్సరం చదువుతున్నాను. అప్పుడే ఈ రామ్‌పాత్ర ఆచారం గురించి నాకు తెలిసింది” అని మార్టిన్ మాక్వాన్‌ చెప్పారు.

“ఆ సంఘటన అలా నా మనస్సులో నిలిచిపోయింది. 25 ఏళ్ల తర్వాత మేం దానిపై ఓ ఉద్యమాన్ని ప్రారంభించాం. సుమారు 100 రోజుల పాటు 475 గ్రామాల్లో పర్యటించాం. పెద్ద సంఖ్యలో జనం మాతో పాటు ఉద్యమంలో పాల్గొన్నారు” అని మాక్వాన్‌ వివరించారు.

“16-17 ఏళ్ల వయసు ఉన్నప్పుడు ర్యాలీ జరుగుతుంటే అందులో చేరాను. ఆ సమయంలో మేం గ్రామాలకు వెళ్లి రామ్‌పాత్ర ఆచారానికి వ్యతిరేకంగా ప్రచారం చేశాం” అని ఇందుబహెన్ రోహిత్ అన్నారు.

ఇప్పటికీ గుజరాత్‌లో రామ్‌పాత్ర విధానం కొనసాగుతోందా?

అమ్రెలి జిల్లాలోని మరియానాలో జరిగిన ఘటన తర్వాత ఈ ప్రశ్న మళ్లీ తలెత్తింది. వివిధ జిల్లాల్లో ఉన్న కార్మికులతో మాట్లాడి ఈ ప్రశ్నకు సమాధానం తెలుసుకునే ప్రయత్నం చేసింది బీబీసీ.

“న్యూస్ వెబ్ సైట్ ‘ద క్వింట్’ జనవరి 17న ప్రచురించిన ఓ కథనంలో గుజరాత్‌లోని గ్రామాల్లో ఇప్పటికీ రామ్‌పాత్ర, తాగు నీటి కోసం ప్రత్యేక బావుల ఏర్పాటు, దళితుల పట్ల వివక్ష కొనసాగుతున్నాయని పేర్కొంది.

“రామ్‌పాత్ర ఆచారం కొనసాగుతుందని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. నేను పర్యటించిన గ్రామాల్లో కూడా చాలా సార్లు ఈ విషయం నా దృష్టికి వచ్చింది” అని ప్రొఫెసర్ అగ్జ అన్నారు.

భావ్‌నగర్ జిల్లాలోని వల్లభాయ్‌పూర్ తాలుకాకు చెందిన అరవింద్ మక్వానా నవసర్జన్ ట్రస్ట్‌తో కలిసి పని చేస్తున్నారు. ఆయన అభిప్రాయం ప్రకారం ఇప్పటికీ భావ్‌నగర్ జిల్లాలోని గ్రామాల్లో రామ్‌పాత్ర ఆచారం కొనసాగుతోంది. “ రెండేళ్ల క్రితం మా తాలుకాలోని ఇటాలియా గ్రామంలో సామూహిక భోజనాల కార్యక్రమం జరిగింది. దళితుల కోసం ప్రత్యేక పాత్రల విషయంలో వివాదం చెలరేగింది. పోలీసుల్ని కూడా పిలిపించారు. చివరకు ఆ వివాదం ఎలాగోలా సద్దుమణిగింది. కానీ అప్పటి నుంచి సామూహిక భోజనాల కార్యక్రమాన్ని మాత్రం ఆ గ్రామం నిలిపేసింది” అని అరవింద్ మక్వానా తెలిపారు.

పఠాన్ జిల్లాకు చెందిన మరో కార్యకర్త నరేంద్రభాయ్ పర్మార్ కూడా తమ జిల్లాలో ఇంకా రామ్‌పాత్ర ఆచారం కొనసాగుతోందని బీబీసీకి చెప్పారు.

“తాజాగా లాక్ డౌన్ సమయంలో వివిధ గ్రామాల్లో ఈ వివక్ష ఎలా ఉందో నేను నా స్నేహితులతో ఫోన్లో మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేశాను. వారిలో 35 నుంచి 40 గ్రామాలకు చెందిన నా స్నేహితులు ఇప్పటికీ తమ గ్రామాల్లో దళితుల కోసం ప్రత్యేకంగా రామ్‌పాత్రను ఉంచే ఆచారం కొనసాగుతోందని చెప్పారు” అని నరేంద్రభాయ్ పర్మార్ అన్నారు.

పేదరికం, పవిత్రత ఈ రెండింటికి గుర్తు ‘రామ్‌పాత్ర’ అని మాక్వాన్‌ అభిప్రాయపడ్డారు. “దళితులు కానీ వాళ్లంతా పవిత్రులు, దళితులంతా అపవిత్రులు. అలాగే దళితులు ముట్టుకునే పాత్రలు కూడా తమను అపవిత్రుల్ని చేస్తాయి అన్న మానసిక భావనే వారి కోసం ప్రత్యేకంగా పాత్రల్ని ఉంచేలా చేస్తోంది” అని ఆయన వివరించారు.

బాధితులు

మట్టి పాత్రలకు బదులుగా ప్లాస్టిక్ రామ్‌పాత్ర

గతంలో మట్టి గిన్నె లేదా ప్లేటును రామ్‌పాత్ర పేరుతో ఉంచేవారని మెహ్‌సనా జిల్లాకు చెందిన కార్యకర్త భరత్‌భాయ్ పర్మార్ తెలిపారు.

“ఆ తరువాత కొన్నాళ్లకు మా జిల్లాలోని గ్రామాల్లో స్టీల్ రామ్‌పాత్రలు కనిపించడం మొదలయ్యింది. ఇప్పుడు ప్లాస్టిక్ రామ్‌పాత్రలు వచ్చేశాయి” అని భరత్ ప్రస్తుత పరిస్థితిని వివరించారు.

దళితులు, దళితేతరుల ఇళ్లకు వెళ్లినా, టీ స్టాల్‌కు లేదా పంచాయతీ కార్యాలయం బయట కూర్చున్నా వాళ్లకు ప్లాస్టిక్ గ్లాసుల్లో టీ ఇస్తారు. అదే దళితులు కాని వారికి మాత్రం స్టీలు గ్లాసుల్లో ఇస్తారు. ఇన్నేళ్లలో వచ్చిన మార్పు ఏదైనా ఉందంటే అది మట్టి గ్లాసులకు బదులుగా ప్లాస్టిక్ రావడం...అంతే. మిగిలినదంతా సేమ్ టు సేమ్ అని భరత్ అన్నారు.

దళిత సంఘాలకు, దళితేతర సంఘాలకు వివక్షపై పూర్తి అవగాహన వచ్చిందని రాజ్ కోట్ జిల్లాకు చెందిన దహ్యాభాయ్ దఫ్లా అనే కార్యకర్త అభిప్రాయపడ్డారు. “ఉద్యమాల కారణంగా పరిస్థితులయితే మారాయి. కానీ రామ్‌పాత్ర ఆచారానికి మాత్రం ఇంకా ఫుల్ స్టాప్ పడలేదు. రాజ్ కోట్ జిల్లాలో ఇప్పటికీ ఆ ఆచారం కొనసాగుతునే ఉంది. దళితుల కోసం ప్రత్యేకంగా గ్లాసుల్ని, ప్లేట్లను ఉంచుతున్నారు.

దళిత వాస్‌లో వాల్మీకి సమాజం కోసం రామ్‌పాత్ర

దళితేతరుల ఇళ్లల్లో దళితుల కోసం ఎలాగైతే రామ్‌పాత్రను ప్రత్యేకంగా ఉంచుతున్నారో, అలాగే దళితుల ఇళ్లల్లో వాల్మికి కులానికి చెందిన వారి కోసం రామ్‌పాత్రలను ఉంచే ఆచారం కూాడా ఉంది.

దీనిపై మార్టిన్ మాక్వాన్‌ ఇలా చెప్పుకొచ్చారు. “ ఓ సారి నేను ఓ గ్రామానికి వెళ్లాను. ఓ దళితుని ఇంటి చూరులో నేను రామ్‌పాత్రను చూశాను. అగ్రకులాలకు చెందిన వాళ్లు మీ ఇంట్లో ఈ వస్తువును ఉంచారా? అని అడిగాను. అందుకు ఆయన సమాధానంగా కాదండి.. ఎవరైనా వాల్మికి కులానికి చెందిన వాళ్లు మా ఇంటికి వస్తే అందులో వారికి టీ ఇస్తాం అని చెప్పారు. మమ్మల్ని దళిత కులంలో ఉన్నత వర్గంగా భావిస్తాం అని ఆయన అన్నారు” అని మాక్వాన్‌ వివరించారు. అంతేకాదు ఆయన మాటలు తనకు దిగ్భ్రాంతిని కల్గించాయని అన్నారు. రామ్‌పాత్ర ఆచారాన్ని వ్యతిరేకించే దళితులు తమ ఇళ్లల్లో మాత్రం వాల్మికి కులానికి చెందిన వారి కోసం అదే రామ్‌పాత్ర ఆచారాన్ని పాటిస్తున్నారు. పఠాన్ జిల్లాలో కూడా ఆ పరిస్థితి ఉందని నరేంద్రభాయ్ పర్మార్ తెలిపారు.

చర్యలెందుకు తీసుకోరు?

గుజరాత్‌ రాష్ట్రంలోని అనేక గ్రామాల్లో ఇప్పటికీ దళితుల పట్ల వివక్ష కొనసాగుతున్నప్పటికీ ఎందుకు ఎవరూ ఫిర్యాదులు చెయ్యడం లేదన్న ప్రశ్న కచ్చితంగా వస్తుంది. ఇందుకు సమాధానం తెలుసుకోవాలంటే గ్రామాల్లోని సామాజిక నిర్మాణాన్ని అర్థం చేసుకోవాలని ప్రొఫెసర్ అగ్జ అన్నారు. సాధారణంగా దళితేతరులతో పోల్చితే గ్రామాల్లో నివసించే దళితుల సంఖ్య తక్కువగా ఉంటుందని చెప్పారు.

“ఒక వేళ దళితులు ఆందోళన చేస్తే వాళ్లు గ్రామ బహిష్కరణకు సిద్ధంగా ఉండాలి. అటువంటి పరిస్థితుల్లో ఇరు వర్గాల వారు ఇటువంటి ఆచారాలను అంగీకరిస్తున్నారు” అని ప్రొఫెసర్ అగ్జ అన్నారు.

ఇటువంటి ఆచారాలను చాలా గ్రామాల్లోని దళితులు అంగీకరిస్తున్నారని నరేంద్రభాయ్ చెప్పారు. ఒక వేళ కొన్ని సార్లు గొడవలు తలెత్తి ఫిర్యాదు చేసేంత వరకు వెళ్లినా, గ్రామస్థులంతా కలిసి ఇరువర్గాల మధ్య రాజీ కుదిర్చి ఆ గొడవను అక్కడికక్కడే పరిష్కరిస్తారని ఆయన వివరించారు.

ఫిర్యాదు చేసిన తర్వాత దళితుల్ని గ్రామ బహిష్కరణ చేసిన ఘటనలు ఎన్నో చోటు చేసుకున్నాయని అరవింద్ భాయ్ అన్నారు.

“సామాజిక బహిష్కరణ జరిగితే దళితులకు ఎటువంటి ఉపాధి దొరకదు. ఊరి నుంచి వారిని వెలి వేస్తారు. అటువంటి భయాల కారణంగా చాలా మంది మారు మాట్లాడకుండా ఉంటారు” అని అరవింద్ వివరించారు.

“ఏళ్ల తరబడి వాళ్లను జాగృతం చేస్తున్నా రామ్‌పాత్ర ఆచారం పెద్ద ఎత్తున కొనసాగుతునే ఉంది. ఇప్పటికీ దానికి ఫుల్ స్టాప్ పడలేదు. కులం ఆధారంగా కొనసాగుతున్న వివక్షను రూపుమాపగల్గితేనే ఇటువంటి ఆచారాలను కూడా లేకుండా చేయగలం” అని మార్టిన్ మాక్వాన్‌ అభిప్రాయపడ్డారు.

ఇదే విషయంలో ప్రభుత్వ విధానం ఏంటో తెలుసుకునేందుకు

బీబీసీ ప్రతినిధి పార్థ పాండ్య ప్రయత్నించారు. గుజరాత్ సామాజిక న్యాయశాఖ మంత్రి(సోషల్ జస్టిస్ మినిస్టర్) ఈశ్వర్ భాయ్ పర్మార్‌ను అనేక సార్లు ఫోన్ ద్వారా, ఎస్ఎంఎస్ ద్వారా సంప్రదించారు. అయితే వారి నుంచి ఎటువంటి సమాధానం రాలేదు. అలాగే ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొన్న వారి స్పందన గురించి కూడా బీబీసీ ప్రయత్నించింది. ఆయన కూడా అందుబాటులో లేరు.

ఇవి కూడా చదవండి

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)