మోదీ: 'వచ్చేది వానాకాలం... జాగ్రత్తగా ఉండాలి, 80 కోట్ల మందికి నవంబర్ దాకా ఉచిత రేషన్'..

ఫొటో సోర్స్, ANI
కరోనావైరస్ వ్యాప్తి ఆందోళనల నడుమ ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ మంగళవారం ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. "మనం అన్‌లాక్-2తోపాటు దగ్గు, జలుబు, జర్వం ఎక్కువగా వచ్చే కాలంలోకి అడుగుపెడుతున్నాం. ఈ సమయంలో దేశ ప్రజలందరూ చాలా జాగ్రత్తగా ఉండాలి" అని ప్రధాని సూచించారు.
ఒకవైపు కరోనావైరస్ వ్యాప్తి, మరోవైపు లద్దాఖ్‌లోని గల్వాన్ లోయలో చైనా-భారత్ సరిహద్దుల్లో ఉద్రిక్తతలు కొనసాగుతున్న సమయంలో మోదీ ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. కోవిడ్ ఆందోళనల నడుమ మోదీ ప్రజలను ఉద్దేశించి మాట్లాడడం ఇది ఆరోసారి.
ప్రసంగానికి ముందుగా కరోనావైరస్ వ్యాప్తి, టీకా అభివృద్ధికి సన్నాహాలపై ఆయన ఉన్నతస్థాయి అధకారులతో సమీక్ష నిర్వహించారు.
కరోనావైరస్‌పై భారత్ పోరాటం ఇంకా కొనసాగుతోందని, ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని చెబుతూ ప్రధాని మోదీ తన ప్రసంగాన్ని మొదలుపెట్టారు.

ఫొటో సోర్స్, Getty Images
"మనం అన్‌లాక్-2తోపాటు దగ్గు, జలుబు, జర్వం ఎక్కువగా వచ్చే కాలంలోకి అడుగుపెడుతున్నాం. ఈ సమయంలో దేశ ప్రజలందరూ చాలా జాగ్రత్తగా ఉండాలి."
"కరోనావైరస్ పోరాటంలో మిగతా దేశాలతో పోలిస్తే భారత్ పరిస్థితులు కాస్త మెరుగ్గానే ఉన్నాయి. సరైన సమయంలో తీసుకున్న చర్యలు, నిర్ణయాలు ప్రధాన పాత్ర పోషిస్తున్నాయి."
"అన్‌లాక్-1 అనంతరం సిబ్బందిలో అలసత్వం, ప్రజల్లో నిర్లక్ష్యం పెరిగినట్లు అనిపిస్తోంది. ఇదివరకు అందరూ చాలా జాగ్రత్తగా మాస్క్‌లు పెట్టుకొనేవారు. సామాజిక దూరం కూడా పాటించేవారు."
"లాక్‌డౌన్ సమయంలో.. పేదలు ఆకలితో నిద్రపోయే పరిస్థితి రాకుండా చూడాలని లక్ష్యంగా పెట్టుకున్నాం. కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం, ప్రజా సంఘాలు.. ఇలా అందరూ పేదల కోసం పనిచేశారు."
"గత మూడు నెలల్లో 20 కోట్ల మంది పేదల జన్‌ధన్ ఖాతాల్లో 31 వేల కోట్లు రూపాయలను జమచేశాం. తొమ్మిది కోట్ల మంది రైతుల ఖాతాలో 18 వేల కోట్లను జమచేశాం."

ఫొటో సోర్స్, Getty Images
"వర్షాకాలంలో మనం మరింత పనిచేయాల్సి ఉంటుంది. ముఖ్యంగా వ్యవసాయ రంగంలో.. మిగతా సెక్టార్లలలోనూ ఆర్థిక వృద్ధి మందగించింది. మరోవైపు జులై నుంచి పండుగ వాతావరణం మెల్లగా మొదలవుతుంది. ఈ సారి పండుగల వల్ల మన అవసరాలు బాగా పెరుగుతాయి. దీంతో ఖర్చులూ ఎక్కువవుతాయి. వీటన్నింటినీ దృష్టిలో పెట్టుకొని ప్రధాన మంత్రి గరీబ్ కల్యాన్ అన్న యోజనను నవంబర్ వరకూ పొడిగిస్తున్నాం. దీనిలో భాగంగా 80 కోట్ల మందికి మరో ఐదు నెలలపాటు ఉచిత రేషన్ అందుతుంది."అని మోదీ చెప్పారు.
రైతులు, నిజాయితీతో పన్నులు చెల్లిస్తున్న వారి వల్లే దేశంలోని పేదల కడుపు నింపగలుగుతున్నామని ఆయన అన్నారు.
గరీబ్ కల్యాణ్ అన్న యోజనలో భాగంగా ప్రభుత్వం పేద కుటుంబంలోని ప్రతి ఒక్కరికీ ఐదు కేజీల గోధుమ లేదా బియ్యం అందిస్తోంది.
"ఒకే దేశం ఒకే రేషన్ కార్డు విధానాన్ని అమలు చేయాలని ప్రణాళికలు రచిస్తున్నాం. దీనిలో భాగంగా దేశం మొత్తం చెల్లుబాటయ్యే రేషన్‌కార్డులు జారీచేస్తాం. దీని వల్ల సొంత గ్రామాలను వదిలిపెట్టి వేరే ప్రాంతాల్లో పనిచేసుకొనే పేదలకు ఎంతో ప్రయోజనం చేకూరుతుంది."అని మోదీ వివరించారు.
ఇవి కూడా చదవండి:
- రైతుబంధు సాయంలో సగం పెద్ద రైతులకేనా
- చైనాలో మరో కొత్త వైరస్, మహమ్మారిగా మారనుందా
- భారత్ బయోటెక్: జులై నుంచి మనుషులపై కరోనా వ్యాక్సిన్ ప్రయోగాలు
- చైనా ప్రభుత్వానికి మేం భారతీయ యూజర్ల డాటా ఇవ్వలేదు: టిక్ టాక్
- ‘నా దగ్గర వేరే దారి లేదు, నేనెలాగూ చనిపోతా’ - సోనియాతో రాజీవ్ గాంధీ
- రెండు నెలలకు సరిపడా గ్యాస్ సిలెండర్లను సిద్ధం చేసుకోవాలని ప్రభుత్వం ఆదేశం.. యుద్ధానికి సూచనా?
- నిజంగానే భారత్ మహిళలకు అత్యంత ప్రమాదకర దేశమా? రాయిటర్స్ నివేదికలో వాస్తవమెంత?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








