భారత్, చైనా సరిహద్దు వివాదం: చైనాతో ఘర్షణ విషయంలో భారత్ చేస్తున్న ప్రకటనల్లో ఎందుకిన్ని తేడాలు?

ఫొటో సోర్స్, Getty Images
- రచయిత, బ్రజేశ్ మిశ్రా
- హోదా, బీబీసీ ప్రతినిధి
ఇండియా-చైనా సరిహద్దుల్లో ఉద్రిక్తతలు పెరుగుతున్నాయి. రెండు దేశాలు పరస్పరం ఆరోపణలు చేసుకుంటున్నాయి.
కేంద్రంలోని మోదీ ప్రభుత్వానికి ఇప్పుడు రెండు వైపుల నుంచి సవాళ్లు ఎదురవుతున్నాయి. మొదటి సవాలు చైనాతో సంబంధాలు పునరుద్ధరించుకోవడం కాగా, రెండోది రాజకీయపరమైనది.
చైనాతో మోదీ ప్రభుత్వం అనురిస్తున్న తీరును ప్రతిపక్షం నిత్యం విమర్శిస్తూనే ఉంది. తన సందేహాలకు సమాధానాలు కోరుతూనే ఉంది.
గల్వాన్ లోయలో ఇరు దేశాల సైనికుల మధ్య ఘర్షణ తర్వాత ప్రభుత్వం తరఫు నుంచి స్పష్టమైన ప్రకటన ఏదీ వెలువడలేదు. పైగా అప్పుడప్పుడు చేస్తున్న ప్రకటనల్లో సమన్వయం లోపించినట్లు స్పష్టంగా కనిపిస్తోంది. దీనికితోడు చైనాలో భారత రాయబారి చేసిన ప్రకటనతో పరిస్థితి మరింత సంక్లిష్టంగా మారింది.
''రెండు దేశాల మధ్య ఉద్రిక్తతలను తగ్గించడానికి చైనా తన దళాలను తిరిగి ఎల్‌ఏసీ (వాస్తవాధీన రేఖ) వైపు నడిపిస్తుందని ఇండియా ఆశావహంగా ఉంది'' అని చైనాలో భారత రాయబారి వ్యాఖ్యానించినట్లు పీటీఐ పేర్కొంది.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది
ప్రధాని నరేంద్ర మోదీ అంతకు ముందు చేసిన ప్రకటనకు, భారత రాయబారి ప్రకటన పూర్తిగా భిన్నంగా ఉంది. మన భూభాగంలోకి ఎవరూ ప్రవేశించలేదని, ఏ పోస్ట్‌ను ఆక్రమించలేదని జూన్ 19న జరిగిన అఖిలపక్ష సమావేశంలో ప్రధాని నరేంద్ర మోదీ స్పష్టంగా చెప్పారు.
రెండు దేశాల మధ్య ఉద్రిక్తత, ఘర్షణల కారణంగా 20 మంది భారతీయ సైనికులు మరణించారని ప్రధాని అన్నారు.
రకరకాల సమాధానాలతో పుట్టుకొస్తున్న ప్రశ్నలు
ప్రధాని ప్రకటనకు, చైనాలో భారత రాయబారి ప్రకటనకు మధ్య ఉన్న తేడాను చూపి, చైనా ముందు భారత వ్యూహం విఫలమైందని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. అవి ప్రభుత్వాన్ని మరింత లోతుగా ప్రశ్నించడం మొదలు పెట్టాయి. అయితే ప్రతిపక్షాలకు ప్రభుత్వం సమాధానం ఇస్తున్నప్పటికీ అందులో తేడాలు కనిపిస్తున్నాయి.
ప్రధానమంత్రి మోదీ నాయకత్వంలో, కరోనా వైరస్‌తో పాటు సరిహద్దుల్లో చైనాతో కూడా భారత్ పోరాడుతోందని, రెండు యుద్ధాల్లోనూ ఇండియా గెలుస్తుందని కేంద్రం హోంమంత్రి అమిత్‌షా ఏఎన్‌ఐకి ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పారు.
లద్దాఖ్‌లో భారత భూభాగంపై కన్నేసిన వారికి తగిన సమాధానం చెప్పామని ఆదివారంనాడు మన్ కీ బాత్ కార్యక్రమంలో ప్రధానమంత్రి మోదీ వ్యాఖ్యానించారు.
కానీ ప్రతిపక్షాలు లేవనెత్తుతున్న ప్రశ్నల వల్ల ప్రభుత్వానికి ఇబ్బందులు పెరుగుతున్నట్లు కనిపిస్తోంది. దీనికి మరో కారణం కూడా ఉంది.
దేశంలోని ఒకవర్గం చైనా వస్తువులను బహిష్కరించాలంటూ ఉద్యమాన్ని నడుపుతోంది. కానీ చైనా వస్తువులను పూర్తిగా బహిష్కరించడం ఆర్ధికంగా, దౌత్యపరంగా భారతదేశానికి అంత సులభం కాదు.

ఫొటో సోర్స్, Getty Images
ప్రభుత్వం తనను తాను ఎందుకు సమర్ధించుకోలేక పోతోంది?
చైనాతో ఘర్షణను రాజకీయంగా సమర్ధించుకోవడంలో నరేంద్ర మోదీ, అమిత్ షా ఇబ్బంది పడుతున్నారా? అన్న అనుమానాలు కలుగుతున్నాయి. ప్రతిపక్షాలు పదేపదే సమాధానాలు కోరుతున్నాయి. మరి ప్రభుత్వంపై ఒత్తిడి ఏ స్థాయిలో ఉంది?
ప్రభుత్వం చేస్తున్న ప్రకటనలను చూస్తుంటే వారు ఇబ్బంది పడుతున్నట్లు స్పష్టంగా కనిపిస్తోందని సీనియర్ జర్నలిస్ట్ రాధికా రామశేషన్ అన్నారు. ఒక ప్రకటనకు మరో ప్రకటనకు పొంతన లేకపోవడంతో సమస్య మరింతగా పెరిగిందని ఆమె అభిప్రాయపడ్డారు.
"చైనా స్థానంలో పాకిస్థాన్ ఇలాంటి పని చేసి ఉంటే, భారతదేశ వ్యూహం, దాని ప్రతీకారం భిన్నంగా ఉండేవి" అని రాధికా రామశేషన్ బీబీసీతో అన్నారు.
''ఇక్కడ చైనా కావడంతో, దానితో సంబంధాల విషయంలో ప్రభుత్వం ఎక్కడో ఇబ్బంది పడుతోంది. వైరస్‌తోపాటు, సరిహద్దు పోరాటంలో చైనాను కూడా ఓడిస్తామని అమిత్ షా చెప్పారు. కానీ మనం గణాంకాలను పరిశీలిస్తే వాస్తవాలు వేరేలా ఉన్నాయి. భారతదేశంలో వైరస్ పాజిటివ్ కేసులను గమనిస్తే దక్షిణ ఆసియాలోనే అత్యధిక కేసులు నమోదయ్యాయి. ఈ యుద్ధంలో భారత్ ఎక్కడ గెలిచినట్లు ? సరిహద్దు పోరాటం విషయానికొస్తే చైనాపై ఏ చర్య తీసుకుందో స్పష్టంగా తెలియదు. ఎంత స్వాధీనం చేసుకున్నారు, ఎక్కడ స్వాధీనం చేసుకున్నారు? చైనా సైనికులను భారత్ వెనక్కి పంపగలిగిందా ? వీటిపై స్పష్టత లేదు'' అన్నారామె.
ప్రధానమంత్రి మోదీ కోరుకుంటే 'మన్ కి బాత్'లో భారతదేశం ఏ స్థితిలో ఉందో చెప్పగలిగేవారని రాధికా రామశేషన్ అన్నారు.
అయితే సీనియర్ జర్నలిస్టు, రాజకీయ విశ్లేషకులు ప్రదీప్ సింగ్ వాదన మాత్రం ఇందుకు భిన్నంగా ఉంది. భారత్, చైనా సంబంధాలు మామూలుగానే ఉన్నాయని, ప్రతిపక్షాల పాత్రే సందేహాస్పదంగా ఉందని ఆయన అన్నారు.
"కాంగ్రెస్, లెఫ్ట్ పార్టీలను వదిలేస్తే, మొత్తం విపక్షమంతా ప్రభుత్వానికి మద్దతుగా నిలబడింది. జాతీయ భద్రత విషయంలో ప్రభుత్వంపై ఇలాంటి ప్రశ్నలు లేవనెత్తడం మంచిది కాదు. శరద్‌పవార్ ఒక ప్రకటనలో పరోక్షంగా రాహుల్ గాంధీని హెచ్చరించారు. జాతీయభద్రత అంశం ఒక జోక్ కాదని, సీరియస్ విషయాలలో రాజకీయాలకు అతీతంగా వ్యవహరించచాల్సి ఉంటుందని ఆయన సూచించారు'' అని ప్రదీప్ సింగ్ చెప్పారు.
ప్రతిపక్షాల దూకుడు వైఖరి కూడా ప్రభుత్వాన్ని ఇబ్బంది పెడుతోంది. ప్రభుత్వం లేదంటే బీజేపీ నేతల ప్రకటనలలో ఇది స్పష్టంగా కనిపిస్తుంది. ఈ విషయంపై కాంగ్రెస్ ప్రశ్నలు సంధిస్తుంటే, పార్లమెంటుకు వచ్చి చర్చించాలని హోంమంత్రి అమిత్ షా అంటున్నారు. 1962 నుండి ఇప్పటి వరకు ప్రతి సమస్యకు రెండు కోణాలు ఉంటూనే ఉన్నాయి.

ఫొటో సోర్స్, TWITTER / NARENDRAMODI
చైనా పేరెత్తితే 1962 గుర్తుకు వస్తుంది
అమిత్ షా ప్రకటనపై రాధిక రామశేషన్ స్పందించారు. 1962లో పరిస్థితి భిన్నంగా ఉందని, అప్పుడేం జరిగిందో చరిత్రలో స్పష్టంగా ఉందన్నారు. యుద్ధంలో భారతదేశం ఓడిపోయిందని, ప్రధాని నెహ్రూ ఈ ఓటమిని స్వయంగా అంగీకరించారని, పారిపోలేదని ఆమె అన్నారు. సరిహద్దు సమస్య చాలా సంవత్సరాల వరకు పరిష్కారం కాకపోతే ఇలాంటి సమస్యలు వస్తాయని ఆమె అన్నారు.
"చైనాతో సంబంధాలు సరిగ్గాలేవన్నది నిజం. అలాగని చైనాను పూర్తి శత్రువుగా పరిగణించలేం. తన వైఫల్యాలను దాచుకోవడానికి, ఇంటెలిజెన్స్ వైఫల్యాలను కప్పి పుచ్చుకోవడానికి ప్రభుత్వం కాంగ్రెస్‌పై దూకుడుగా వ్యవహరిస్తోంది. కాంగ్రెస్ కూడ ఈ ఆటలో పావుగా మారుతోంది'' అని ఆమె అన్నారు. "కాంగ్రెస్ ప్రభుత్వపు వలలో చిక్కుకుంది. ప్రతిపక్షంగా ఆ పార్టీ సరైన పాత్ర పోషించడం లేదు'' అని రామశేషన్ వ్యాఖ్యానించారు.
చైనా భారత్ వ్యవహరిస్తున్న తీరు ప్రస్తావనకు వచ్చినప్పుడల్లా 1962నాటి ఘటనలు గుర్తుకు వస్తాయని సీనియర్ పాత్రికేయులు ప్రదీప్‌సింగ్ అన్నారు. "పాకిస్థాన్ గురించి మాట్లాడితే 1947, 1965, 1971, కార్గిల్ ఘటనలు గుర్తుకొస్తాయి. ఈ రెండు దేశాలతో సరిహద్దు సమస్యలు చర్చకు వచ్చినప్పుడు ఇవన్నీ ప్రస్తావనకు వస్తాయి. ఇది ఇవాళే వచ్చిన సమస్య కాదు. సంవత్సరాలుగా కొనసాగుతోంది'' అని అన్నారాయన.
"1962లో మనం కొంత భూమిని కోల్పోయాం. కాబట్టి ఆ సమస్య అలాగే ఉంటుంది. అక్సాయ్ చిన్‌లాంటి ప్రదేశం మన చేతుల నుంచి జారిపోయింది. అందుకే ఆ విషయం పదే పదే గుర్తుకు వస్తుంది. ప్రస్తుతం సమస్య చొరబాట్లు. 10 సంవత్సరాల యూపీఏ పాలనలో ఇలాంటి చొరబాట్లు జరగలేదు కాబట్టి ఈ సమస్య రాలేదు. రాహుల్ గాంధీ ఆ విషయాలన్నీ గుర్తు పెట్టకోవాలి. చైనా ఎప్పుడూ ఒకేమాట మీద ఉండదు. అందుకే ఇలాంటి పరిస్థితులు తలెత్తుతుంటాయి'' అన్నారు.

ఫొటో సోర్స్, Getty Images
నష్టాన్ని పూడ్చుకోడానికి ఆప్షన్లేంటి?
భారతదేశం చైనాపై యుద్ధం ప్రకటించదు. వాణిజ్యానికి సంబంధించి ఎటువంటి తీవ్ర నిర్ణయాలను తీసుకోదు. ఎందుకంటే భారతదేశం చాలా విషయాలలో చైనాపై ఆధారపడి ఉంది. అటువంటి పరిస్థితిలో తనకు రాజకీయంగా జరిగిన నష్టాన్ని ప్రభుత్వం ఎలా భర్తీ చేసుకుంటుంది?
"పరిస్థితులు ఇలా ఉంటే భారతదేశమే కాదు చైనా కూడా నష్టపోతుంది. చైనాకు భారత్ అతి పెద్ద మార్కెట్'' అన్నారు ప్రదీప్ సింగ్. "దిగుమతులను ఆపేస్తే వాటిని ఎలా భర్తీ చేస్తారో కూడా భారతదేశం ఆలోచించాలి. భారత్ ముందున్న ఆప్షన్ ఏంటంటే ఇతర దేశాల నుంచి దిగుమతి చేసుకునే సరుకును మనమే సొంతంగా తయారు చేసుకోవడం. దీని గురించి మనం భయపడాల్సిన పనిలేదు. వియాత్నాంలాంటి చిన్న దేశం అమెరికాతో పోరాడింది. కానీ తనకు నష్టం జరుగుతుందని భావిస్తే వియాత్నాం ఈ యుద్ధం చేసేది కాదు. ప్రతి విషయంలో లాభ నష్టాల గురించి ఆలోచించకూడదు. దేశ సార్వభౌమత్వం విషయంలో రాజీ పడకూడదు. లాభాలు, నష్టాలు పరిస్థితులను బట్టి మారుతుంటాయి'' అని ప్రదీప్‌సింగ్ అన్నారు.
ఈ సమస్యపై రాజకీయ నష్టాన్ని భర్తీ చేయడానికి ప్రభుత్వం ప్రసార సాధనాలను ఉపయోగించుకుంటుందని, చైనా వస్తు బహష్కరణ అవి ఊదరగొడతాయని రాధికా రామశేషన్ అన్నారు. ''వాస్తవమేమిటంటే చైనా వస్తువులను బహిష్కరించాలన్న డిమాండ్ అర్థరహితం. మన దైనందిన జీవితంలో చైనీస్ వస్తువులు చాలా ఉన్నాయి. వాటిని మనం విస్మరించలేం'' అన్నారు రాధికా రామశేషన్.
"బీజేపీ ఎప్పుడూ జాతీయవాదం గురించి మాట్లాడుతుంది. కానీ చైనా స్థానంలో పాకిస్థాన్ ఉంటే పరిస్థితి వేరేలా ఉండేది. చైనా ప్రభుత్వం గట్టిది కాబట్టి దాన్ని ఎదుర్కోవడానికి బీజేపీ ప్రభుత్వం వివిధ మార్గాలను అన్వేషిస్తోంది'' అన్నారు రాధిక.
ప్రతిపక్షాలు దాడి చేయడానికి అవకాశం కల్పించిన భారత రాయబారి ప్రకటనతో ప్రభుత్వం డిఫెన్స్‌లో పడినట్లే కనిపిస్తోంది. వాస్తవానికి ఈ ప్రకటన వెలువడిన వెంటనే విదేశాంగ మంత్రి జయశంకర్ విలేకరుల సమావేశమో, ఇంటర్వ్యూనో ఏర్పాటు చేసి దాన్ని ఖండించడం లేదంటే భారత్ భూభాగంలోకి చైనా ప్రవేశించిందనో, భారత దళాలు వాటిని వెనక్కి పంపాయనో చెప్పాలి. కానీ అలాంటిదేమీ జరగలేదు. ఇప్పుడు దీనిపై స్పష్టమైన ప్రకటన చేయాల్సిన బాధ్యత విదేశాంగ మంత్రి పైనే ఉంది.
ఇవి కూడా చదవండి:
- భారత్ - చైనా సరిహద్దు ఘర్షణ: భారతదేశం ఎల్ఏసీని ఎలా సంరక్షించుకుంటుంది?
- తమ సరిహద్దు గ్రామాలు 60 ఏళ్లుగా చైనా అధీనంలోనే ఉన్నా నేపాల్ ఎందుకు మాట్లాడడం లేదు?
- చైనాతో పోరులో భారత్‌కు అమెరికా అండగా ఉంటుందా లేక ముఖం చాటేస్తుందా?
- 1962 చైనాతో యుద్ధానికి ముందే నెహ్రూ ఆధిపత్యానికి అంతం మొదలైంది ఇలా..
- భారత్, చైనా చర్చలు: బలగాల ఉపసంహరణకు అంగీకారం
- ‘హిందీ-చీనీ భాయీ భాయీ’ వినీ వినీ చెవులు పగిలిపోయాయి' - చైనాలో భారత యుద్ధ ఖైదీ
- భారత్ - చైనా: లద్ధాఖ్ పుట్టుకలోనే సంఘర్షణ ఉందా... అక్కడి పరిస్థితులు సియాచిన్ కన్నా దారుణమా?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








