ఎస్. కలైవాణి: ఉజ్వల భవిష్యత్తు దిశగా దూసుకెళ్తున్న యువ బాక్సర్ - ISWOTY

కలైవాణి
ఫొటో క్యాప్షన్, యువ బాక్సర్ ఎస్.కలైవాణి

ఆర్థిక ఇబ్బందులు, సమాజం నుంచి ఎన్నో ఒత్తిళ్లు ఎదుర్కున్న ఎస్. కలైవాణి చివరకు భారత్‌లో అత్యంత ప్రతిభావంతులైన కొత్త తరం మహిళా బాక్సర్లలో ఒకరుగా నిలిచారు.

విజయనగరంలో 2019లో జరిగిన సీనియర్స్ నేషనల్ బాక్సింగ్ చాంపియన్‌షిప్‌లో రజత పతకం సాధించి, 18 ఏళ్ల వయసులోనే ఆ పోటీల్లో 'మోస్ట్ ప్రామిసింగ్ బాక్సర్‌'గా ఎంపికైన తమిళనాడుకు చెందిన ఎస్. కలైవాణి భారత బాక్సింగ్ రంగంలో ఒక సంచలనం.

బాక్సింగ్‌లో ఆమె ఇప్పుడు ఒక స్థాయికి చేరుకున్నారు. కానీ, అక్కడివరకూ చేరుకోడానికి ఆమె ఎన్ని ఆర్థిక సమస్యలు, సామాజిక కట్టుబాట్లు ఎదుర్కోడానికి ఎంత పోరాటం చేశారో, ఎన్ని మాటలు పడ్డారో ఎవరూ గుర్తించడం లేదు.

వ్యతిరేకత ఎదురైనా కఠిన నిర్ణయాలు

కలైవాణి 1999 నవంబర్ 25న చెన్నైలో అప్పటికే బాక్సింగ్ నేపథ్యం ఉన్న ఒక కుటుంబంలో జన్మించారు. ఆమె తండ్రి ఎం.శ్రీనివాసన్ యువకుడుగా ఉన్నప్పుడు ఒక బాక్సర్. ఆమె సోదరుడు ఒక జాతీయ స్థాయి బాక్సర్.

తండ్రి సోదరుడికి శిక్షణ ఇస్తున్నప్పుడు, చూస్తూవచ్చిన కలైవాణికి కూడా మెల్లమెల్లగా బాక్సింగ్ మీద ఆసక్తి పెరిగింది. దాంతో, తండ్రి ఆమెను కూడా ప్రోత్సహించాడు. బాక్సింగ్‌లో శిక్షణ ఇచ్చాడు.

కుటుంబం నుంచి మద్దతు ఉన్నప్పటికీ, ఉపాధ్యాయులు, బంధువుల నుంచి కలైవాణికి అడ్డంకులు ఎదురయ్యాయి. "బాక్సింగ్ మీద ఉన్న శ్రద్ధ చదువు మీద పెట్టమని" స్కూల్లో టీచర్లు ఆమెకు చెప్పేవారు.

అలాగే, బంధువుల్లో కొందరు ఆడపిల్లకు బాక్సింగ్ శిక్షణ ఇవ్వడం ఏంటని కలైవాణి తండ్రినే అడిగేవారు. "బాక్సింగ్ నేర్పడం కొనసాగిస్తే ఆమెకు పెళ్లి కావడం కూడా కలగా మిగిలిపోతుందని" హెచ్చరించేవారు.

సమాజంలో ఒత్తిడికి తోడు, ఒక క్రీడాకారుడికి అవసరమైన అత్యాధునిక జిమ్, మౌలిక సదుపాయాలు, ఆధునిక కోచింగ్, తగిన డైట్ లాంటివి లేకపోవడం కూడా కలైవాణిని ఇబ్బంది పెట్టాయి.

ఎన్నో సవాళ్లు ఎదురైనా ఆమె తండ్రి వెనక్కు తగ్గలేదు. బాక్సింగ్‌లో తన కొడుకును ఎంత ప్రోత్సహించారో అలాగే కూతురికి కూడా అండగా నిలిచారు. శిక్షణ కొనసాగించారు.

తను ఇప్పుడు ఈ స్థాయి బాక్సర్ అయ్యానంటే, దానికి తన తండ్రి, సోదరుడు ఇచ్చిన ప్రోత్సాహమే ప్రధాన కారణం అంటారు కలైవాణి.

ఆమె కుటుంబం కష్టం వృథా పోలేదు. కలైవాణి సబ్ జూనియర్ లెవల్ బాక్సింగ్ టోర్నీల్లో పతకాలు సాధించడం మొదలుపెట్టారు. ఆ విజయాలు చివరికి ఆమె టీచర్లు, బంధువుల వైఖరిలో కూడా మార్పు తీసుకొచ్చాయి. తర్వాత వారందరూ ఆమెలోని ప్రతిభను గుర్తించడం ప్రారంభించారు.

కలైవాణి
ఫొటో క్యాప్షన్, యువ బాక్సర్ ఎస్.కలైవాణి

ఒక్కో మెట్టూ ఎక్కుతూ...

2019లో సీనియర్ నేషనల్ చాంపియన్‌షిప్ ఫైనల్స్‌కు చేరినపుడు కలైవాణి బాక్సింగ్ కెరీర్ మలుపు తిరిగింది. కానీ, ఆ పోటీల్లో పంజాబ్‌ బాక్సర్ మంజు రాణి చేతిలో ఆమె ఓడిపోయారు.

ఆ టోర్నీలో రన్నరప్‌గా నిలిచిన కలైవాణి, భారత బాక్సింగ్ దిగ్గజం, ఆరుసార్లు వరల్డ్ చాంపియన్‌గా నిలిచిన మేరీ కోమ్ నుంచి రజత పతకం అందుకున్నారు.

ఆ విజయం కలైవాణిలో ఆత్మవిశ్వాసాన్ని పెంచడంతోపాటూ, మెరుగైన అవకాశాలు అందుకోడానికి తలుపులు తెరిచింది. తర్వాత ఆమె ఇటాలియన్ బాక్సింగ్ కోచ్ రఫేల్ బెర్గామస్కో నుంచి కోచింగ్ తీసుకోవడం ప్రారంభించారు.

దానితోపాటూ కర్ణాటకలోని జేఎస్‌డబ్ల్యు ఇన్‌స్పైర్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ స్పోర్ట్స్‌లో ఆమెకు ఆధునిక శిక్షణ సౌకర్యాలు కూడా లభించాయి. ఇవి ఆమె బలాన్ని, టెక్నిక్స్‌ను మరింత తీర్చిదిద్దాయి.

కలైవాణి బాక్సింగ్ కెరీర్‌లో అత్యంత ముఖ్యమైన విజయం, ఖాట్మండూలో 2019లో జరిగిన ఏసియన్ గేమ్స్‌లో దక్కింది. ఆ పోటీల్లో ఆమె 48 కిలోల విభాగంలో నేపాల్‌కు చెందిన మహర్జన్ లలితను ఓడించి, స్వర్ణ పతకం అందుకున్నారు.

కలైవాణి
ఫొటో క్యాప్షన్, కోచ్‌తో కలైవాణి

భవిష్యత్తులో స్పష్టమైన లక్ష్యాలు

ఈ యువ బాక్సర్‌లు చాలా స్పష్టమైన లక్ష్యాలతో ముందుకు దూసుకెళ్తున్నారు. మొదట కామన్‌వెల్త్ గేమ్స్‌లో స్వర్ణం గెలవాలని కలైవాణి కోరుకుంటున్నారు. తర్వాత 2024లో ఒలింపిక్ చాంపియన్‌గా నిలవాలని భావిస్తున్నారు.

కలైవాణి ప్రస్తుతం 48 కిలోల విభాగంలో పోటీపడుతున్నారు. ఇది ఒలింపిక్ క్రీడల్లో ఉండదు. అందుకే రెండేళ్ల పాటు 48 కిలోల విభాగంలో పోటీపడిన తర్వాత, అంతకంటే ఎక్కువ కిలోల విభాగంలో అడుగుపెట్టాలని ఈ యువ బాక్సర్ ప్లాన్ చేస్తున్నారు.

తన బాక్సింగ్ కెరీర్ నుంచి రిటైర్ అయిన తర్వాత కోచ్‌గా మారాలని, దేశంలో భవిష్యత్ తరం మహిళా బాక్సర్లకు శిక్షణ ఇవ్వాలని కలైవాణి కలలు కంటున్నారు.

భారత మహిళలు క్రీడల్లో రాణించాలంటే జనాల మనస్తత్వం మారాల్సి ఉంటుందని, క్రీడల్లో ఉన్న మహిళలను మరింత ప్రోత్సాహించాలని కలైవాణి కోరుతున్నారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)