కోవిడ్ కారణంగా కోటీశ్వరులు భారత్ నుంచి ఇతర దేశాలకు వెళ్లిపోతున్నారా

రాహుల్ ఈడీ అధికారుల వేధింపులు భరించలేక దుబయి వెళ్లిపోయానని చెప్పారు
ఫొటో క్యాప్షన్, రాహుల్ ఈడీ అధికారుల వేధింపులు భరించలేక దుబయి వెళ్లిపోయానని చెప్పారు
    • రచయిత, నిఖిల్ ఇనాందార్
    • హోదా, బీబీసీ బిజినెస్

రాహుల్ (పేరు మార్చాం) ఆరేళ్ల కిందట భారతదేశం వదిలిపెట్టి వెళ్లాలని నిర్ణయించుకున్నారు.

దిల్లీలో ఎగుమతుల వ్యాపారానికి చెందిన ప్రముఖ కుటుంబాలలో రాహుల్ రెండో తరానికి చెందిన వారు.

భారత్‌లో ఆయనకు ఎగుమతుల వ్యాపారం ఉంది. కానీ, ఇక్కడ వ్యవహారాలను వదిలిపెట్టి సంస్థ కార్యకలాపాలను విదేశీ స్థాయిలో విస్తరించేందుకు రాహుల్ 2015లో దుబయి వెళ్లిపోయారు.

కరీబియన్ దేశాల్లో పెట్టుబడి పెట్టడంతో ఆ దేశపు పౌరసత్వం కూడా ఆయనకు లభించింది.

తాను దేశం వీడడానికి భారత్‌లో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ వేధింపులు కూడా ఒక ముఖ్య కారణమని ఆయన అన్నారు.

"ప్రపంచవ్యాప్తంగా వ్యాపారాలు విస్తరించుకుంటున్న వారికి ఇది మరింత సమస్యగా పరిణమిస్తున్నట్లు నాకనిపిస్తోంది" అని ఆయన అన్నారు.

విదేశీ పాస్‌పోర్టు ఉండటం వల్ల అనవసరమైన కార్యనిర్వాహక పనులు చాలా వరకు తగ్గిపోయాయని ఆయన అన్నారు.

"అకస్మాత్తుగా వేసే పన్ను భారాలు గురించి నేనిప్పుడు ఎక్కువ చింతించడం లేదు" అని ఆయన అన్నారు.

భారతీయ కార్పొరేట్ దిగ్గజాలకు "ట్యాక్స్ టెర్రర్" అనేది నిరంతరం వేధించే సమస్య.

కాఫీ డే

ఫొటో సోర్స్, Getty Images

2019లో ఆత్మహత్య చేసుకుని మరణించిన ప్రముఖ కాఫీ చెయిన్ కేఫ్ కాఫీ డే అధిపతి ఆదాయపు పన్ను శాఖలో ఒక మాజీ డైరెక్టర్ జనరల్ తనను వేధించినట్లు ఆరోపించారు. కానీ, ప్రభుత్వం మాత్రం వ్యాపార సంస్థల అధిపతుల చుట్టూ తన ఉచ్చును బిగిస్తూనే ఉంది.

గత కొన్నేళ్లుగా భారతదేశంలో ఆదాయపు పన్ను శాఖ నిర్వహించే పన్ను తనిఖీలు మూడింతలు పెరిగాయని ఒక నివేదిక చెబుతోంది.

నల్ల ధనాన్ని నివారించేందుకు ఈ తనిఖీలను నిర్వహిస్తున్నట్లు ప్రభుత్వం చెబుతోంది.

ఆదాయపు పన్ను లక్ష్యాలను చేరేందుకు ఉద్యోగులపై పెట్టే అదనపు భారం వల్ల కూడా అవసరానికి మించి తనిఖీలు జరుగుతున్నాయని కొంతమంది విమర్శకులు అంటున్నారు.

అయితే, రాహుల్ వివిధ ఇతర కారణాలు కూడా చెబుతున్నారు. దేశంలో పెరుగుతున్న విభజించి పాలించే రాజకీయ వాతావరణం కూడా తన ఈ నిర్ణయానికి కారణమైందని అంటారు.

ఇలాంటి విభజిత వాతావరణంలో తన పిల్లలు పెరగాలని కోరుకోవడం లేదని చెప్పారాయన.

ఆయనకు తెలిసిన వారిలో చాలా మంది దేశ పౌరసత్వాన్ని వదులుకుని విదేశాలకు వెళ్లేందుకు సిద్ధమవుతున్నట్లు తెలిపారు.

భారతదేశంలో 2014 నుంచి సంపన్న వర్గాలకు చెందిన సుమారు 23,000 మంది దేశం విడిచి వెళ్లినట్లు మోర్గన్ స్టాన్లీ 2018లో విడుదల చేసిన నివేదిక చెబుతోంది.

ఫొటో సోర్స్, GETTY IMAGES

ఫొటో క్యాప్షన్, భారతదేశంలో 2014 నుంచి సంపన్న వర్గాలకు చెందిన సుమారు 23,000 మంది దేశం విడిచి వెళ్లినట్లు మోర్గన్ స్టాన్లీ 2018లో విడుదల చేసిన నివేదిక చెబుతోంది.

భారతదేశంలో 2014 నుంచి సంపన్న వర్గాలకు చెందిన సుమారు 23,000 మంది దేశం విడిచి వెళ్లినట్లు మోర్గన్ స్టాన్లీ 2018లో విడుదల చేసిన నివేదిక చెబుతోంది.

ఒక్క 2020లోనే సుమారు 5000 మంది కోటీశ్వరులు.. అంటే అధిక నెట్‌ వర్త్ కలిగిన వారిలో 2 శాతం మంది దేశం వదిలిపెట్టి వెళ్లినట్లు గ్లోబల్ వెల్త్ మైగ్రేషన్ నివేదిక చెబుతోంది.

తమ పెట్టుబడులకు తగిన ఫలితాలను పొందేందుకు ఇతర దేశాలకు వెళ్తున్నవారిలో భారతీయులు అగ్ర స్థానంలో ఉన్నట్లు లండన్ బేస్డ్ సంస్థ హెన్లీ అండ్ పార్టనర్స్ (హెచ్ & పి) తన నివేదికలో పేర్కొంది.

భారతదేశంలోని సంపన్నులు ఇతర దేశాలకు వెళ్లడానికి కోవిడ్-19 కూడా దోహదం చేసిందని హెన్లీ అండ్ పార్టనర్స్ నివేదిక పేర్కొంది.

ఈ సంస్థ అందించే సేవలకు డిమాండ్ పెరగడంతో లాక్‌డౌన్ సమయంలో భారతదేశంలో ఆఫీసును తెరిచింది.

ఎయిర్‌పోర్ట్

ఫొటో సోర్స్, Getty Images

"ఈ మహమ్మారి రెండో సారో, మూడో సారో వచ్చే వరకు వేచి చూడాలని క్లయింట్లు అనుకోవడం లేదు. ఇంటి దగ్గర ఉండగానే చాలా మంది వారి పనులు పూర్తి చేసుకోవాలని అనుకున్నారు. దీనిని మేం బీమా పథకం కింద గాని, ప్లాన్ బి గా గాని పరిగణిస్తాం" అని హెన్లీ అండ్ పార్టీన్మెర్స్ ప్రైవేట్ గ్రూప్ హెడ్ డొమినిక్ వోలెక్ చెప్పారు.

భారతదేశంలో సంపన్న వర్గాల వారు గోల్డెన్ వీసా ప్రోగ్రాం అందించే పోర్చుగల్, మాల్టా, సైప్రస్ లాంటి దేశాలు ఎక్కువగా వెళ్లేందుకు చూస్తారు అని హెచ్ అండ్ పి చెప్పింది.

ఇంత పెద్ద మొత్తంలో ధనం విదేశాలకు తరలి వెళ్లడం శాశ్వతం కాదు.. కొతాత్కాలికంగా వేరే దేశంలో పెట్టుబడి పెట్టేందుకు కొన్ని సార్లు ఇలా చేస్తారు.

అయితే, ఇలాంటి చర్యలు భారతదేశం లాంటి దేశాలకు లాభదాయకం కాదని నిపుణులు అంటున్నారు.

"ఇలా జరిగినప్పుడు వారు స్వదేశంలో వ్యాపార దక్షత నుంచి, తమ ఆదాయాన్ని వనరులను తమను తాము పన్నులు చెల్లించే వర్గాల నుంచి తొలగించుకుంటారు. ఇది దేశానికి దీర్ఘ కాలంలో చాలా నష్టం కలిగిస్తుంది. ఇలా సంపన్న వ్యాపార వర్గాలు వారు దేశం వదిలి పెట్టి వెళ్లడం దేశంలో వ్యాపార పరిస్థితులకు ఉన్న వాతావరణం గురించి చెడు సంకేతాలను పంపిస్తుంది" అని ఆసియా పసిఫిక్ ఫౌండేషన్ ఆఫ్ కెనడాలో ఫెలో గా ఉన్న రూప సుబ్రమణ్య అన్నారు.

"సంపన్న వర్గాల వారు దేశం వదిలి పెట్టి వెళ్లడం రానున్న దారుణ పరిస్థితులకు సంకేతం" అని జోహనెస్బర్గ్ కి చెందిన వెల్త్ ఇంటెలిజెన్స్ గ్రూప్ న్యూ వరల్డ్ హెల్త్ రీసెర్చ్ హెడ్ ఆండ్రూ అమొయిల్స్ బిజినెస్ స్టాండర్డ్ పత్రికతో అన్నారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)