నిమిష ప్రియకు మరణశిక్ష అమలు తేదీ ఖరారు, ఈ కేరళ నర్సును ఇక కాపాడలేరా?

2017లో జరిగిన ఒక హత్య కేసులో, కేరళకు చెందిన నర్సు నిమిష ప్రియకు యెమెన్‌లో మరణశిక్ష విధించారు.
ఆమెను విడిపించేందుకు ఒకవైపు ఆమె కుటుంబం ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నా, జూలై 16న ఆమెకు మరణశిక్ష అమలు చేయాలని నిర్ణయించినట్లు మానవ హక్కుల కార్యకర్త, నిమిష ప్రియ తల్లి తరఫున కేసు వ్యవహారాలు చూస్తున్న శామ్యూల్ జెరోమ్ తెలిపారు.
నిమిష ప్రియ ప్రస్తుతం యెమెన్ రాజధాని సనాలోని సెంట్రల్ జైలులో ఉన్నారు. సేవ్ నిమిష ప్రియ ఇంటర్నేషనల్ యాక్షన్ కౌన్సిల్, నిమిష ప్రియ తల్లి ప్రేమ కుమారి ఆమెను ఎలాగైనా విడిపించేందుకు శతవిధాలా ప్రయత్నిస్తున్నారు. అందుకోసం భారత ప్రభుత్వం నుంచి ప్రత్యేకంగా అనుమతి తీసుకుని గత ఏడాది ఏప్రిల్‌లో ప్రేమ కుమారి యెమెన్ వెళ్లారు.
యెమెన్‌లో షరియా చట్టం అమల్లో ఉన్నందున, హత్యకు గురైన వ్యక్తి కుటుంబానికి 'బ్లడ్‌మనీ'గా పిలిచే పరిహారం చెల్లించి, ఆ కుటుంబం నుంచి క్షమాభిక్ష పొందగలిగితే మాత్రమే నిమిష ప్రియ ఈ మరణశిక్ష నుంచి బయటపడగలరు.
అందుకోసం ప్రయత్నాలు కొనసాగుతుండగానే, యెమెన్ అధ్యక్షుడు మహదీ అల్-మషాత్(హూతీ వర్గం) జనవరిలో నిమిష ప్రియ మరణశిక్షకు ఆమోదం తెలిపారు.

మరణశిక్ష అమలు తేదీ ప్రకటన
నిమిష ప్రియకు మరణశిక్ష అమలు తేదీ నిర్ణయమైనట్లు సనాలోని సెంట్రల్ జైల్ అధిపతి తెలియజేశారని శామ్యూల్ తెలిపారు.
ఆయన బీబీసీతో మాట్లాడుతూ, ''నిన్న నాకు సెంట్రల్ జైల్ చీఫ్ నుంచి ఫోన్ వచ్చింది. జూలై 16న నిమిష మరణ శిక్ష అమలవుతుందని చెప్పారు. ఈ విషయాన్ని సౌదీ అరేబియాలోని భారత రాయబార కార్యాలయానికి తెలియజేశా. వారి సూచన మేరకు, సనాలోని భారత అధికారులు స్వయంగా వెళ్లి మరణశిక్ష అమలు పత్రాన్ని చూసి, దానిని ధ్రువీకరించారు'' అని అన్నారు.
''నేను కూడా యెమెన్ వెళ్తున్నా. అక్కడికి వెళ్లాక మనముందు ఇంకా ఏమేం అవకాశాలు ఉన్నయో పరిశీలిస్తాం. భారత ప్రభుత్వం ఇప్పటికీ ఈ విషయంలో జోక్యం చేసుకోవచ్చు'' అన్నారు శామ్యూల్.
గత కొన్నేళ్లుగా యెమెన్‌లో అంతర్యుద్ధం నడుస్తోంది. హూతీ వర్గం నియంత్రణలో ఉన్న సనా జైలులో నిమిష ప్రియను ఉంచారు. వారితో భారత్‌కు దౌత్యసంబంధాలు లేకపోవడంతో, సౌదీ అరేబియాలోని భారత రాయబార కార్యాలయం ఈ కేసు వ్యవహారాలు చూస్తోంది.

నిమిష ప్రియను కాపాడే మార్గముందా?
నిమిష ప్రియ కేసును తమిళనాడుకి చెందిన శామ్యూల్ జెరోమ్ మీడియా దృష్టికి తీసుకొచ్చారు. ఈయన చాలా ఏళ్ల నుంచి యెమెన్‌లో ఏవియేషన్ కన్సల్టెంట్‌గా పనిచేస్తున్నారు. నిమిషకు మహదీ కుటుంబం నుంచి క్షమాభిక్ష కోసం చేస్తున్న ప్రయత్నాల్లో కీలకంగా వ్యవహరిస్తున్నారు.
2023లో ఆయన బీబీసీతో మాట్లాడుతూ, ''క్షమాభిక్ష ప్రక్రియలో డబ్బు ప్రధాన అంశం కాదు. బ్లడ్ మనీ క్షమాభిక్షకు చిహ్నం మాత్రమే. కొన్ని సందర్భాల్లో బాధిత యెమెన్ కుటుంబాలు 5 మిలియన్ డాలర్లు (దాదాపు రూ.42 కోట్లు) చెల్లించేందుకు ముందుకొచ్చినా క్షమించలేదు. అందుకే మహదీ కుటుంబంతో అనేక దశల్లో చర్చలు జరిగాయి'' అని ఆయన అన్నారు.
క్షమాభిక్ష గురించి వివరిస్తూ, ''మరణశిక్షకు యెమెన్ అధ్యక్షుడి ఆమోదం తర్వాత, పబ్లిక్ ప్రాసిక్యూటర్ కార్యాలయానికి చేరుతుంది. ఆ తర్వాత వారు, మరణశిక్ష అమలుకు ఉత్తర్వులు జారీ చేస్తారు. దీనికి ముందు, మహదీ కుటుంబాన్ని సంప్రదించి నిమిషకు మరణశిక్ష అమలుపై అభ్యంతరాలు ఏవైనా ఉన్నాయా అని అడుగుతారు. అప్పుడు వాళ్లు, మేం మరణశిక్షను కోరుకోవడం లేదని కానీ, క్షమించగలమని కానీ చెబితే వెంటనే శిక్ష అమలు నిలిపివేస్తారు'' అని ఆయన అన్నారు.
ప్రస్తుత పరిస్థితిలో, హత్యకు గురైన మహదీ కుటుంబం పరిహారం స్వీకరించి.. నిమిషకు క్షమాభిక్ష ప్రసాదించడమే ఆమెను మరణశిక్ష నుంచి తప్పించేందుకు ఉన్న ఏకైక మార్గం అని ఆయన గతంలో బీబీసీతో చెప్పారు.

నిమిష ప్రియ కేసు ఏంటి? ఏం జరిగింది?
నిమిష ప్రియ తల్లి ప్రేమ కుమారి గతంలో బీబీసీతో మాట్లాడారు. కేసు గురించిన వివరాలు వెల్లడించారు.
ఆమె చెప్పిన వివరాల ప్రకారం,
కేరళలోని పాలక్కాడ్‌కు చెందిన 35 ఏళ్ల నిమిష ప్రియ నర్సు ఉద్యోగం కోసం 2008లో యెమెన్ వెళ్లారు. అక్కడ కొన్ని ఆస్పత్రుల్లో పనిచేసిన తర్వాత, 2011లో కేరళకు తిరిగొచ్చి టామీ థామస్‌ను వివాహం చేసుకున్నారు. ఆ తర్వాత ఆమె తన భర్తతో కలిసి యెమెన్ వెళ్లారు.
వారికి ఒక కూతురు ఉంది. నర్సుగా వస్తున్న జీతం సరిపోక జీవనం కష్టమైంది. దీంతో 2014లో టామీ థామస్ తన కూతురిని తీసుకుని కేరళకు వచ్చేశారు. నిమిష యెమెన్‌లోనే పనిచేస్తూ ఉన్నారు.
''తన కుటుంబాన్ని యెమెన్ తీసుకెళ్లేందుకు, ఆర్థిక పరిస్థితిని మెరుగుపరుచుకునేందుకు నిమిష సొంతంగా చిన్న ఆస్పత్రి ఏర్పాటు చేయాలనుకుంది. అయితే, యెమెన్ చట్టాల ప్రకారం ఆస్పత్రి ఏర్పాటుకు స్థానికులెవరైనా భాగస్వామిగా ఉండాలి.''
''అందువల్ల 2015లో, ఆమె యెమెన్ వాసి తలోల్ అబ్దో మహదీతో కలిసి ఆస్పత్రి ప్రారంభించారు. ఈ ఆస్పత్రి కోసం నిమిష తన స్నేహితులు, బంధువుల నుంచి దాదాపు రూ.50 లక్షల రూపాయలు అప్పుగా తీసుకుంది'' అని ప్రేమ కుమారి తెలిపారు.
ఆ తర్వాత తన భర్తను, కుమార్తెను తిరిగి యెమెన్ తీసుకువెళ్లేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్న సమయంలో, అక్కడ అంతర్యుద్ధం మొదలైంది. దీంతో వారు యెమెన్ వెళ్లలేకపోయారు.
2015లో భారత ప్రభుత్వం ''ఆపరేషన్ రహాద్''పేరుతో యెమెన్‌లో నివసిస్తున్న వేలాది మంది భారతీయ పౌరులను కాపాడి, తిరిగి తీసుకొచ్చింది. ఆ సమయంలో అక్కడే ఉండాలని నిర్ణయించుకున్న కొద్దిమంది భారతీయుల్లో నిమిష ఒకరు.
ఆస్పత్రి బాగా వృద్ధిలోకి వచ్చిన అనంతరం, నిమిషకు ఆమె భాగస్వామి మహదీకి మధ్య విభేదాలు మొదలయ్యాయి. వీటి గురించి తమకు ఫోన్‌లో చెబుతూ ఉండేదని ఆమె కుటుంబం చెబుతోంది.

''మహదీ నిమిషను శారీరకంగా వేధించారు, ఆస్పత్రి ఆదాయమంతా లాగేసుకున్నారు'' అని నిమిష తల్లిని యెమెన్‌కు పంపడానికి అనుమతి కోరుతూ దిల్లీ హైకోర్టులో దాఖలు చేసిన పిటిషన్‌లో 'సేవ్ నిమిష ప్రియ ఇంటర్నేషనల్ యాక్షన్ కౌన్సిల్' ఆరోపించింది.
చాలా సందర్భాల్లో ''నిమిషను మహదీ తుపాకీతో బెదిరించారు. దేశం వదిలి వెళ్లకుండా అడ్డుకోవడం కోసం నిమిష పాస్‌పోర్టును లాగేసుకున్నారు'' అని అందులో పేర్కొంది.
నిమిష యెమెన్ పోలీసులకు ఫిర్యాదు చేస్తే, ''మహదీపై ఎలాంటి చర్యలు తీసుకోకుండా నిమిషనే ఆరు రోజులపాటు జైల్లో పెట్టారు.''
''తన పాస్‌పోర్ట్ కోసం మహదీకి మత్తుమందు ఇవ్వాలని నిమిష భావించింది. కానీ, మత్తుమందు అధిక మోతాదు కారణంగా మహదీ మరణించారు. ఈ కేసులో నిమిష కూడా బాధితురాలు. ఆమెను నేరస్తురాలిగా పరిగణించలేం'' అని న్యాయవాది కేఎల్ బాలచంద్రన్ అన్నారు.
ఎన్నారై కమిషన్ రంగంలోకి దిగడానికి ముందు, 2018లో నిమిష తరఫు న్యాయవాది కేఎల్ బాలచంద్రన్.
''ఈ కేసు మొదట్లో నిమిషకు సరైన న్యాయసహాయం అందలేదు. ఫలితంగా, ఆమె తన వాదనను సమర్థంగా వినిపించలేకపోయింది. ఆమెకు భాష తెలియకపోయినా, వారు చూపించిన అన్ని పత్రాలపై సంతకం చేశారు'' అని బాలచంద్రన్ చెప్పారు.
తలోల్ అబ్దో మహదీ హత్య కేసులో నిమిష 2017లో అరెస్ట్ అయ్యారు.
2020లో, యెమెన్ రాజధాని సనాలోని ఒక కోర్టు ఆమెకు మరణశిక్ష విధించింది. 2023 నవంబర్‌లో యెమెన్ సుప్రీంకోర్టు నిమిష అప్పీల్‌ను తిరస్కరిస్తూ, ఆమెకు విధించిన మరణశిక్షను సమర్థించింది.
యెమెన్ అధ్యక్షుడు మహదీ అల్-మషాత్ ఈ శిక్ష అమలుకు ఆమోదం తెలిపారు.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














