కరోనావైరస్ ప్రభావం: నగదు నిల్వలు తీవ్ర స్థాయిలో తగ్గిపోతున్నాయని హెచ్చరించిన 'ఎయిర్ బస్'

ఫొటో సోర్స్, Getty Images
'ఎయిర్ బస్' విమానాల తయారీ సంస్థపై కరోనావైరస్ ప్రభావం తీవ్రంగా పడిందని ఆ సంస్థ సీఈవో గిల్లామ్ ఫారి వెల్లడించారు.
సంస్థ ఖాతాలో నగదు నిల్వలు ఊహించని విధంగా అంతకంతకూ తగ్గిపోతున్నాయని తన సంస్థ ఉద్యోగులకు రాసిన లేఖలో ఆయన తెలిపారు.
ఈ నెలలో విమానాల ఉత్పత్తిని 75 శాతం మేర తగ్గిస్తామని చెప్పారు.
కోవిడ్-19 విమానయాన రంగంపై తీవ్ర ప్రభావం చూపనుందనే అంచనాలు వస్తున్న నేపథ్యంలో ఈ ప్రకటన వెలువడింది.
ఎయిర్ బస్ విమాన తయారీ సంస్థలో పని చేస్తున్న 1,35,000 ఉద్యోగులు కూడా కొంత ఉద్యోగాల కోతకు సిద్ధంగా ఉండాలని, సత్వర చర్యలు తీసుకోని పక్షంలో సంస్థ మనుగడకే ప్రమాదం ఉందని ఫారి హెచ్చరించినట్లు రాయిటర్స్ సంస్థ ప్రచురించింది.
ఎయిర్ బస్ తన తొలి వార్షిక త్రైమాసిక ఆర్థిక ఫలితాలని విడుదల చేయడానికి కొన్ని రోజుల ముందే ఈ ప్రకటన వెలువడింది.
కరోనావైరస్ ప్రభావంతో మార్చి నెలలో చాలావరకు అంతర్జాతీయ విమానయాన సంస్థలు తమ సేవలను నిలిపివేశాయి. ప్రపంచవ్యాప్తంగా విమానయాన రంగంలో అనిశ్చితి నెలకొంది.
కరోనావైరస్ ప్రపంచ విమానయాన రంగంపై చూపనున్న ప్రభావం గురించి విశ్లేషిస్తూ 'విమానయాన రంగం గురించి వేసిన అంచనాలన్నీ తలకిందులయ్యాయి' అని ఏవియేషన్ పరిశ్రమ న్యూస్ వెబ్ సైట్ ఫ్లైట్ గ్లోబల్ కి చెందిన గ్రెగ్ వాల్డ్రన్ అన్నారు.
ఎయిర్ బస్ విషయంలో కూడా సానుకూలంగా ఉన్న అంచనాలన్నీ ఇప్పుడు ప్రతికూలంగా మారాయని అన్నారు.
ప్రస్తుత పరిస్థితుల్లో కొత్త విమానాలకు ప్రత్యేకంగా డిమాండ్ లేదు.
ఇప్పటికే ఎయిర్ బస్ ఫ్రాన్సులో 3,000 మంది సిబ్బందిని తొలగించింది. ఈ సంస్థ తయారు చేసే చిన్న పాటి జెట్లను నెలకు 40కి పరిమితం చేయనున్నట్లు ప్రకటించింది.
బ్రిటన్ లో ఎయిర్ బస్ కి 13,500 మంది ఉద్యోగులు ఉన్నారు. నార్త్ వేల్స్ లో ఉన్న బ్రోటోన్ లో, బ్రిస్టల్ లోని ఫిల్టన్ లో ఉన్న కర్మాగారాలలో విమానాల రెక్కలు తయారు అవుతాయి.
"ఈ విపత్తు నుంచి ఎయిర్ బస్ బయట పడుతుందనే ఆశ ఉన్నప్పటికీ ఉద్యోగాల కోత లేకుండా అది జరగదు" అని వాల్డ్రన్ అభిప్రాయపడ్డారు.
యూరప్ పారిశ్రామిక ప్రగతిలో ఎయిర్ బస్ వహించే పాత్రకి చాలా ప్రాముఖ్యం ఉన్నందున సంస్థ మనుగడకు యూరప్ తగిన చర్యలు తీసుకుంటుందని ఆయన ఆశిస్తున్నారు.
అయితే, సంస్థ ఉత్పత్తి తగ్గిస్తే, ఉద్యోగాలు కూడా అదే స్థాయిలో తగ్గిపోయే ప్రమాదం ఉందని ఆయన అన్నారు.
భవిష్యత్తులో ఎయిర్ బస్ ఒక చిన్న స్థాయి విమానయాన సంస్థగా మారిపోతుందేమోనని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.
ఎయిర్ బస్ నుంచి ఈ విషయం పై పూర్తి వివరాలు తెలుసుకునేందుకు బీబీసీ ప్రయత్నించింది. కానీ, ఆ సంస్థ ప్రతినిధులు అందుబాటులోకి రాలేదు.
ఇవి కూడా చదవండి.
- కరోనావైరస్: ఈక్వెడార్ గ్వాయాక్విల్‌లో వేలల్లో మృతులు... మార్చురీలు మూసేయడంతో రోడ్ల మీద మృతదేహాలు
- కరోనావైరస్ నుంచి ఎలా కాపాడుకోవాలి... లాక్డౌన్ ఒత్తిడి నుంచి ఎలా బయటపడాలి?
- కరోనావైరస్ లాక్ డౌన్: ఆంధ్రప్రదేశ్‌లో పడిపోయిన పాలు, పాల ఉత్పత్తుల విక్రయం... కష్టాల్లో పాడి రైతులు
- "పేదల చేతుల్లో డబ్బులు ఉండేలా చూడాలి.. అందుకోసం భారత్ డబ్బులు ముద్రించొచ్చు" - నోబెల్ బహుమతి గ్రహీత అభిజిత్ బెనర్జీ
- కరోనావైరస్: కోవిడ్ రాకుండా తొలిసారిగా బ్రిటన్‌లో వ్యాక్సీన్ ట్రయల్స్
- పేద ప్రజల "రెండు రూపాయల డాక్టర్" ఇస్మాయిల్ హుస్సేన్
- ‘చైనాలో అధికార సంఘర్షణ రావొచ్చు... కొత్త ప్రపంచ వ్యవస్థలో భారత్‌ది ముఖ్య పాత్ర’-రామ్ మాధవ్
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








