బిహార్‌లో కేరళకు చెందిన జాతీయ స్థాయి క్రీడాకారిణి ఆత్మహత్య.. ఏం జరిగింది?

ఫొటో సోర్స్, SEETU TEWARY/BBC
"ఇంతకు ముందు నువ్విలా ఉండేదానివి కాదు, నువ్వు చాలా మారిపోయావు. నువ్వెంత నవ్వుతూ మాట్లాడేదానివి. ఎవరినైనా కలిసినప్పుడు వారితో మాట్లాడటం చాలా ఆనందంగా ఉంటుంది. నీలో ఉండే ఆ పాత వ్యక్తినెంత ప్రేమిస్తున్నానో నీకు తెలుసా?
"కానీ, నీ అంతట నువ్వే మాట్లాడటం మానేసావు. నిన్ను నువ్వు ఎక్కడో పోగొట్టుకున్నట్లుగా మాట్లాడటం పూర్తిగా మానేసావు. కొన్ని జ్ఞాపకాలు తిరిగి పోగు చేసుకునేందుకు నువ్వు తిరిగి వస్తే బాగుంటుందనిపిస్తోంది".
లిథారా కే.సి అనే క్రీడాకారిణి మలయాళ భాషలో రాసిన చివరి లేఖ ఇది.
23 ఏళ్ల లిథారా కే.సి ఏప్రిల్ 26న పాట్నాలోని రాజీవ్ నగర్‌లోని అద్దెకుంటున్న గదిలో ఆత్మహత్యకు పాల్పడ్డారు.
ఈ విషయం గురించి కేరళ ముఖ్యమంత్రి పినరాయి విజయన్ ఏప్రిల్ 28న బిహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్‌కు లేఖ రాశారు. ఈ ఆత్మహత్యపై న్యాయమైన విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు.

ఫొటో సోర్స్, ANI
అసలేం జరిగింది?
కేరళలోని కోజికోడ్‌లోని కక్కాటిల్‌కు చెందిన లిథారా జాతీయ బాస్కెట్‌బాల్ క్రీడాకారిణి. 2018లో జాతీయ స్థాయిలో బాస్కెట్‌బాల్ ఫెడరేషన్ కప్ గెలిచిన కేరళ జట్టులో ఆమె సభ్యురాలు.
స్పోర్ట్స్ కోటా నుంచి ఆమెకు రైల్వేలో ఉద్యోగం వచ్చింది. లిథారా 2019, నవంబర్ 15 నుంచి తూర్పు మధ్య రైల్వేలోని దానాపూర్ డివిజన్‌లోని పర్సనల్ డిపార్ట్‌మెంట్ (పర్సనల్ డిపార్ట్‌మెంట్)లో జూనియర్ క్లర్క్‌గా పనిచేస్తున్నారు.
ఏప్రిల్ 26న, లి లిథారా సాయంత్రం 6 గంటలకు తన ఇంటికి తిరిగి వచ్చి గదికి తాళం వేసుకుంది. కేరళలో ఉంటున్న ఆమె తల్లిదండ్రులు అదే రోజు రాత్రి ఆమెను సంప్రదించడానికి ప్రయత్నించారు. కానీ, ఆమె దగ్గర నుంచి ఎటువంటి సమాధానం రాలేదు.
ఆ తర్వాత వారు గాభరా పడి నవంబర్ 15వ తేదీన ఇంటికి సమీపంలో నివసిస్తున్న ఒక తెలిసిన వ్యక్తిని సంప్రదించారు. కానీ లిథార ఆ వ్యక్తి కాల్ కు కూడా స్పందించలేదు.
అనంతరం లిథారా ఇంటికి వెళ్లి చూడగా ఆత్మహత్య విషయం వెలుగులోకి వచ్చింది.
ఈ సంఘటన గురించి లిథారా కుటుంబానికి సమాచారం అందింది, ఆ తర్వాత లిథారా తల్లి, మామ రాజీవ్, పొరుగింటి వ్యక్తి నిశాంత్ తో కలిసి పాట్నాకు వచ్చారు. పోస్టుమార్టం చేసి మృతదేహాన్ని వారికి అప్పగించారు.

ఫొటో సోర్స్, SEETU TEWARY/BBC
లిథారా కే.సి ఎవరు?
కోజికోడ్‌లో నివసించే లిథారా తండ్రి కరుణన్ కే.సి రోజువారీ కూలీ. లిథారా తల్లి క్యాన్సర్ రోగి.
వీరికి ముగ్గురు పిల్లలు ఉన్నారు, అందులో ఇద్దరు అమ్మాయిలు అంటే లిథారా అక్కలిద్దరూ వివాహం చేసుకున్నారు. లిథారా అందరి కంటే చిన్నది. ఆమె తల్లితండ్రులకు ఆర్ధికంగా చాలా తోడ్పడతారు.
నిశాంత్ బీబీసీ హిందీతో మాట్లాడుతూ, " లిథారా కుటుంబం ఆర్థికంగా చాలా బలహీనమైన నేపథ్యం ఉన్నవారు. ఆమె ప్రభుత్వ ఉద్యోగంలో ఉండటంతో కుటుంబానికి ఆమెపై ఆశ ఉంది. ఆమె కొన్ని లక్షల రూపాయిల ఋణం తీసుకుని ఉండవచ్చు. ఆమె ఏప్రిల్ 11న ఇంటికి వచ్చారు. మూడు రోజుల తర్వాత పాట్నా తిరిగి వెళ్ళిపోయింది. ఆమె ఎప్పుడూ నవ్వుతూ ఉండేది" అని చెప్పారు.

ఫొటో సోర్స్, SEETU TEWARY/BBC
కోచ్ రవి సింగ్ పై ఆరోపణలు
కోచ్ రవిసింగ్ నిత్యం వేధించేవాడని లిథారా తన కుటుంబంతో చాలాసార్లు చెప్పిందని నిశాంత్ చెప్పారు. ఆమెతో కలిసి ఆడిన ఇతర క్రీడాకారిణులతో కూడా కోచ్ ప్రవర్తన వల్ల లిథారా మనస్తాపానికి గురైందని చెప్పారు.
పాట్నాలోని రాజీవ్ నగర్ పోలీస్ స్టేషన్‌లో ఏప్రిల్ 27న నమోదు చేసిన ఎఫ్‌ఐఆర్‌లో లిథారా మామ రాజీవ్ రాసిన వివరాలిలా ఉన్నాయి.
"బాస్కెట్‌బాల్ కోచ్ శారీరకంగా, మానసికంగా వేధిస్తున్నాడని లిథారా నాకు ఫోన్‌లో ముందే చెప్పింది. అతను తనపై ఒత్తిడి పెంచుతున్నాడు. అతని ఉన్నత స్థాయి కారణంగా. అతనిపై ఫిర్యాదు చేయలేకపోతున్నాను అని కూడా చెప్పింది. కోచ్ రవి సింగ్ వల్లే లిథారా మానసిక ఒత్తిడికి గురై ఆత్మహత్య చేసుకుందని నేను బలంగా విశ్వసిస్తున్నాను".
ఈ విషయమై కోచ్ రవి సింగ్‌ను బీబీసీ హిందీ సంప్రదించగా, ఆయనొక పెళ్ళికి వెళ్లినట్లు ఆయన కుటుంబ సభ్యులు చెప్పారు.
అయితే, ఆయనపై చేసిన ఆరోపణలన్నీ నిరాధారమైనవని లిథారా ఆత్మహత్య చేసుకున్నతర్వాత స్థానిక మీడియాతో చెప్పారు.
"కొందరు అబ్బాయిలు, అమ్మాయిలు ఆడటానికి మైదానానికి కూడా రాలేదు. నేను ఏప్రిల్ 19న నా సీనియర్ అధికారులకు దీనిపై లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేసాను. మహిళా క్రీడాకారిణులకు ఏదైనా సమస్య ఉంటే వారు పై అధికారులకు ఫిర్యాదు ఇవ్వాలి. కానీ, నాపై అలాంటి ఫిర్యాదు ఎవరూ చేయలేదు" అని కోచ్ అన్నారు.
రాజీవ్ నగర్ పోలీస్ స్టేషన్ ఇన్‌చార్జి నీరజ్ కుమార్ సింగ్ మాట్లాడుతూ.. ఈ విషయమై విచారణ కొనసాగుతోందని, కోచ్‌ని రెండు సార్లు విచారణకు పిలిచామని తెలిపారు.
ఈ విషయమై తూర్పు మధ్య రైల్వే హాజీపూర్ హెడ్‌క్వార్టర్స్ చీఫ్ పబ్లిక్ రిలేషన్స్ ఆఫీసర్ వీరేంద్ర కుమార్ మాట్లాడుతూ.. "పోలీసులు ఈ కేసును విచారిస్తున్నారు. విచారణ ఫలితాల ఆధారంగా రవి సింగ్‌పై చర్యలు తీసుకుంటాం. కోచ్ పదవి నుండి ఆయనను తొలగించాం" అని చెప్పారు.
లిథారా వేధింపులకు గురైనట్లు ఏమైనా ఫిర్యాదు చేశారా అని ప్రశ్నించినప్పుడు.. "నాకు తెలిసినంతవరకు అలాంటి ఫిర్యాదు చేసినట్లు లేదు" అని వీరేంద్ర కుమార్ అన్నారు.

ఫొటో సోర్స్, ANI
భాష సమస్య
లిథారా బిహార్‌లో భాష సమస్యతో ఇబ్బంది పడుతోంది. ఈ విషయాన్ని ఆమె కుటుంబ సభ్యులు, సహోద్యోగులు కూడా ధృవీకరించారు.
"తనకు హిందీ రాదని, చాలా ఇబ్బందిగా ఉందని తల్లిదండ్రులతో చెప్పింది" అని నిశాంత్ చెప్పారు.
1965లో 16ఏళ్ల వయసులో పద్మశ్రీ గ్రహీత సుధా వర్గీస్ కూడా కేరళ నుంచి బిహార్ వచ్చారు. ఆమె ప్రస్తుతం బిహార్ లో 'సైకిల్ వాలా దీదీ' గా ప్రసిద్ధి చెందారు. కానీ ఒకప్పుడు ఆమె కూడా ఇలాంటి సమస్యనే ఎదుర్కొన్నారు.
"అవతలి వ్యక్తి ఏమి మాట్లాడుతున్నారో అర్ధం కాక, మీరు చెప్పాలనుకున్నది ఎలా వ్యక్తీకరించాలో తెలియక, విచిత్రమైన ఇబ్బందుల్లో పడతారు. ఈ అమ్మాయి కూడా తన సమస్యను ఎవరికీ చెప్పలేకపోయింది. అర్థం చేసుకొనేవారు ఎవరూ లేరు. నేను కూడా ఇక్కడకు రాగానే మా నాన్న నాకు హిందీ రాదనే విషయాన్ని గుర్తు చేశారు. అయితే అందుకేమి చేయాలో నాకు తెలుసు" అని ఆమె అన్నారు.
మార్చి 8న, తూర్పు మధ్య రైల్వేలోని హాజీపూర్ ప్రధాన కార్యాలయంలో, క్రీడా రంగంలో ఘనత సాధించిన మహిళా క్రీడాకారిణులను సత్కరించారు, అందులో లిథారా కూడా ఒకరు.
ఏప్రిల్ 28న కేరళ ముఖ్యమంత్రి పినరాయి విజయన్ కూడా ముఖ్యమంత్రి నితీష్ కుమార్‌కు రాసిన లేఖలో, "లిథారా ఆత్మహత్యకు దారితీసే పరిస్థితులు లేవని కుటుంబ సభ్యులు విశ్వసిస్తున్నారని, అందుకే ఆమె అకాల మరణంపై విచారణ జరపాలని అభ్యర్థించారు.
లిథారా కుటుంబం ఇప్పుడు తమ కూతురికి 'న్యాయం' కావాలని కోరుతున్నారు. అయితే ఈ ఘటనపై బిహార్ క్రీడా మంత్రికి ఇంకా సమాచారం లేదు.
బిహార్ క్రీడల మంత్రి అలోక్ రంజన్ ఝా మాట్లాడుతూ, "ఈ విషయం నా దృష్టికి రాలేదు. ఆ మహిళ వేరే రాష్ట్రానికి చెందిన క్రీడాకారిణి మాత్రమే కాకుండా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగంలో ఉంది కాబట్టి, ఆ విషయం గురించి నాకు తెలియదు" అని అన్నారు.
గమనిక: (మానసిక సమస్యల, ఆందోళనల పరిష్కారానికి హెల్ప్‌లైన్ నంబర్ 08046110007)
ఇవి కూడా చదవండి:
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)












