ఆంధ్రప్రదేశ్‌లో గత రెండేళ్లలో 6 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు వచ్చాయా, ప్రభుత్వ ప్రచారంలో నిజమెంత?

ఏపీ జాబ్ కాలెండర్

ఫొటో సోర్స్, ugc

    • రచయిత, శంకర్ వడిశెట్టి
    • హోదా, బీబీసీ కోసం

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉద్యోగాల కల్పనకు జాబ్ క్యాలెండర్ విడుదల చేసింది. ఈ సందర్భంగా గత రెండేళ్లలో రాష్ట్రంలో ఆరు లక్షల మందికి ప్రభుత్వ ఉద్యోగాలు కల్పించినట్టు ప్రకటించింది.

అందులో సుమారు రెండు లక్షలు శాశ్వత ఉద్యోగాలుగా చెబుతోంది. శాశ్వత ఉద్యోగులతో పాటుగా అవుట్ సోర్సింగ్ ఉద్యోగాలు కల్పించి, ఉద్యోగభద్రతనిచ్చామని అంటోంది.

అంతేగాకుండా, అవుట్ సోర్సింగ్ సిబ్బంది కోసం ఏర్పాటు చేసిన కార్పోరేషన్ ద్వారా వారికి ప్రయోజనం కలిగినట్టు ప్రకటించింది.

కోవిడ్ విధుల కోసం నియమించిన తాత్కాలిక సిబ్బందిని కూడా ఉద్యోగులుగానే పేర్కొంది.

ఇంత పెద్ద సంఖ్యలో ఉద్యోగాల కల్పన గతంలో ఎప్పుడూ జరగలేదని కూడా ప్రభుత్వం చెప్పింది.

ప్రభుత్వం ప్రకటనలో...

ఆంధ్రప్రదేశ్‌లో ప్రభుత్వ ఉద్యోగాల విప్లవం జరిగిందన్నది ప్రభుత్వ వాదన. దేశ చరిత్రలోనే ఇది కనీవినీ ఎరుగని ప్రక్రియ అని కూడా అంటోంది.

రెండేళ్లలోనే జగన్ హయంలో 6,03,756 మందికి ఉద్యోగాలు కల్పించినట్టు పత్రికల్లో ప్రకటనలు కూడా ఇచ్చింది.

అంతేకాదు, అవినీతి, ఆశ్రిత పక్షపాతం, లంచాలకు కూడా తావు లేకుండా ఈ నియామకాలు చేసినట్టు తెలిపింది.

అవుట్ సోర్సింగ్ ఉద్యోగుల నియమాకాల్లో కూడా అవినీతి లేకుండా చేశామని చెబుతోంది.

దళారీల బెడద లేకుండా వారికి ప్రతీనెలా ఠంచనుగా 1వ తారీఖునే వేతనాలు వచ్చేలా ఆంధ్రప్రదేశ్ అవుట్ సోర్సింగ్ కార్పోరేషన్ ఏర్పాటు చేయడం ఉపయోగపడిందని కూడా అంటోంది.

ఏటా రూ.3,600 కోట్లు భారం పడుతున్నా, ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయడం ద్వారా 51,387 మందికి ఉద్యోగ భద్రత కల్పించామని ఘనంగా ప్రకటించింది.

జాబ్ కాలెండర్

ఫొటో సోర్స్, UGC

సచివాలయ ఉద్యోగాలన్నీ శాశ్వతమేనా

వైసీపీ అధికారం చేపట్టిన తర్వాత 2019 ఆగస్టు నుంచి గ్రామ, వార్డు సచివాలయ వ్యవస్థను ప్రారంభించారు. వాటి పరిధిలో రాష్ట్రవ్యాప్తగా 1,21,518 మందికి ఉద్యోగాలు కల్పించారు. ప్రభుత్వం చెబుతున్న దాని ప్రకారం ఇవన్నీ శాశ్వత ఉద్యోగాలు.

కానీ, ఇప్పటి వరకూ సచివాలయ ఉద్యోగులకు సర్వీస్ రిజిస్ట్రర్‌లో నమోదు ప్రక్రియ కూడా పూర్తికాలేదు. వారికి కేవలం ప్రొబేషనరీ పిరియడ్ పేరుతో ప్రస్తుతం నెలకు రూ. 15 వేలు వేతనం మాత్రమే ఇస్తున్నారు. పీఎఫ్ సహా ఇతర సదుపాయాలేమీ అందడం లేదు.

అవుట్ సోర్సింగ్ పద్ధతిలో 2,59,565 మందికి వాలంటీర్లుగా ఉద్యోగాలు కల్పించినట్టు ప్రభుత్వం ప్రకటించింది.

కానీ, వారికి అప్కోస్ ద్వారా వేతనాలు చెల్లిస్తున్నా, ఇతర ప్రయోజనాలు మాత్రం లేవు. అయితే తమకు తొలుత కేవలం నెలకు రూ. 5 వేలు మాత్రమే జీతంగా ఇవ్వడంతో వాలంటీర్లు ఆందోళన వ్యక్తం చేశారు. అదే సమయంలో వాలంటీర్ల సమస్యలు పరిష్కరించాలని విన్నవించిన నేపథ్యంలో నేరుగా సీఎం జగన్ కూడా స్పందించారు. వాలంటీర్లకు లేఖలు కూడా రాశారు.

ఫిబ్రవరి 16న రాసిన లేఖలో వారు ప్రభుత్వ ఉద్యోగులు కాదని, కేవలం వాలంటీర్లు మాత్రమేననే విషయాన్ని గుర్తించుకోవాలని పేర్కొన్నారు. పలువురు మంత్రులు కూడా ఇదే రీతిలో వ్యాఖ్యలు చేశారు.

తీరా, తాజా ప్రకటనలో మాత్రం వారిని ప్రభుత్వ ఉద్యోగాల జాబితాలో అవుట్ సోర్సింగ్ సిబ్బందిగా పేర్కొన్నారు.

ఉద్యోగాలు

ఫొటో సోర్స్, Getty Images

ఆప్కోస్ నియామకాలు కూడా పాతవే...

ప్రభుత్వం చెబుతున్న లెక్కల్లో ఆప్కోస్ ద్వారా 95,212 మందికి ఉద్యోగాలు కల్పించినట్టు పేర్కొన్నారు. కానీ, వాస్తవానికి గతం నుంచి పనిచేస్తున్న సిబ్బందిని కొత్తగా ఏర్పాటు చేసిన కార్పోరేషన్ పరిధిలోకి తీసుకురావడం విశేషం.

అవుట్ సోర్సింగ్, కాంట్రాక్ట్ సిబ్బంది అందరినీ రెగ్యులర్ చేస్తామని, ఎన్నికల ప్రచారంలో వాగ్దానం చేసిన జగన్ ఇప్పుడు దానికి భిన్నంగా... గతం నుంచి పనిచేస్తున్న సిబ్బందిని కార్పోరేషన్ ఉద్యోగులుగా చూపించడం విడ్డూరంగా ఉందని ఏపీ అవుట్ సోర్సింగ్, అండ్ కాంట్రాక్ట్ ఉద్యోగుల సంఘం గౌరవాధ్యక్షుడు ఏవీ నాగేశ్వర రావు అన్నారు.

"అప్కోస్ సిబ్బందికి ప్రతీ నెలా ఒకటో తేదీన వేతనాలు అందిస్తామని చెప్పిన ప్రకటన ఆచరణ రూపం దాల్చడం లేదు. ఆయా శాఖల నుంచి కార్పోరేషన్ కి నిధులు విడుదల చేసిన తర్వాతే అవుట్ సోర్సింగ్ సిబ్బందికి వేతనాలు వస్తున్నాయి. నేటికీ అనేక మందికి నెలల తరబడి వేతనాలు అందడం లేదు. ఆరోగ్యకేంద్రాలలో పనిచేసే వైద్యులకు కూడా రెండు నెలలుగా జీతాలు లేవు. నెల్లూరు జీజీహెచ్‌లో గత 8 నెలలుగా శానిటేషన్ సిబ్బందికి వేతనాలు అందడం లేదు. వైద్య ఆరోగ్య శాఖలో అవుట్ సోర్సింగ్ స్టాఫ్ నర్సులకు 4 నెలల వేతనాలు పెండింగ్ అనేక చోట్ల ఇదే పరిస్థితి ఉంది. కానీ ప్రభుత్వం మాత్రం ఒకటో తేదీన అందరికీ వేతనాలు అందుతున్నాయని ఘనంగా చెప్పుకుంటోంది. ఇది అర్థసత్యమే" అని ఏవీ నాగేశ్వర రావు చెప్పారు.

ఆర్టీసీ

ఆర్టీసీ సిబ్బంది కూడా కొత్త ఉద్యోగులేనా?

రవాణా, రోడ్లు భవనాల శాఖ పేరుతో ఆర్టీసీ ఉద్యోగులు 51,387 మందికి ఉద్యోగాలు కల్పించినట్టు ప్రభుత్వ ప్రకటనలో ఉంది.

కానీ, వాస్తవానికి వారంతా ఏపీఎస్ఆర్టీసీలో సుదీర్ఘకాలంగా పనిచేస్తున్న ఉద్యోగులే. ప్రభుత్వరంగ సంస్థ కార్పోరేషన్‌లో కూడా వారంతా శాశ్వత ప్రాతిపదికన ఉపాధి పొందుతున్న వారే.

ఆర్టీసీ ప్రభుత్వ రంగ సంస్థ నుంచి నేరుగా ప్రభుత్వ పరం కావడంతో వారు ప్రభుత్వ ఉద్యోగులుగా మారారు.

కానీ, దానిని కూడా ఉద్యోగాల కల్పనలో ప్రభుత్వం ప్రస్తావించింది. 6 లక్షల ఉద్యోగాల్లో ప్రభుత్వం 50 వేల మంది ఆర్టీసీ సిబ్బందిని కూడా కలిపేయడం విశేషం.

కోవిడ్ సేవల కోసం తాత్కాలిక ప్రాతిపదికన 26,325 మందిని నియమించినట్టు ప్రభుత్వమే చెబుతోంది. అత్యవసర సేవల కోసం తాత్కాలిక ప్రాతిపదికన నియమించిన ఉద్యోగులను ప్రభుత్వ ఉద్యోగాల కల్పనలో భాగంగా చూపించారు.

గత ఏడాది కరోనా ఉధృతి సమయంలో తీసుకున్న ఉద్యోగులను ఆ తర్వాత తొలగించారు.

సెకండ్ వేవ్ సందర్భంగా అదనంగా వైద్యులు సహా అనేక విభాగాల్లో నియామకాలు చేశారు. అంతేగాకుండా, కోవిడ్ విదులు నిర్వహించిన 104 సిబ్బందికి కూడా 12 నెలల వేతనాలు పెండింగ్‌లో ఉన్నాయని ఆయా సంఘాలు పలుమార్లు ప్రభుత్వానికి విన్నవించుకోవాల్సిన పరిస్థితి వచ్చింది.

వారిని కూడా ఉద్యోగుల జాబితాలో పేర్కొనడానికి ప్రభుత్వం వెనుకాడలేదు.

వేతనాలు

ఫొటో సోర్స్, Getty Images

వేతనాల పెంపు ప్రకటన కూడా అంతేనా

ప్రభుత్వం చెబుతున్నట్టు కింది స్థాయిలో వేతనాలు అమలుకావడం లేదని పలువురు చెబుతున్నారు. ఆస్పత్రుల్లో పనిచేసే పారిశుద్ద్య కార్మికులకు కనీసం వేతనం రూ.16 వేలకు పెంచామని ప్రభుత్వం చెబుతోంది.

కానీ, రాష్ట్రంలో ఏ ఒక్క ఆస్పత్రిలోనూ అది అమలుకావడం లేదని కార్మిక సంఘాలు అంటున్నాయి.

వచ్చే వేతనాలకు కూడా నెలల తరబడి ఎదురుచూడాల్సి వస్తోందని సీఐటీయూ ఆలిండియా ఉపాధ్యక్షురాలు జి.బేబీరాణి బీబీసీతోఅన్నారు.

"ఆస్పత్రుల్లో పనిచేసే కార్మికుల వేతనం రూ.16 వేలని ప్రభుత్వం ఆడంబరంగా చెప్పుకుంటోంది. కానీ వాస్తవంలో అవి ఎక్కడా రూ.12, 13వేలకు మించడం లేదు. యానిమేటర్ల వేతనం రూ. 10 వేలు అని చెబుతున్నా, అవి వారికి దక్కడం లేదు. మధ్యాహ్న భోజన పథకం కార్మికులకు వెయ్యి రూపాయల నుంచి రూ.3 వేలకు పెంచిన మాట వాస్తవం. కానీ, అవి కూడా సక్రమంగా చెల్లించడం లేదు. నెలల తరబడి వేచి చూడాల్సి వస్తోంది. వివిధ శాఖల్లో ఇదే పరిస్థితి ఉంది. దానిని సరిదిద్దకుండా పత్రికల్లో చెబుతున్న దానికి , క్షేత్రస్థాయి పరిస్థితికి పొంతన కుదరదు" అంటూ పేర్కొన్నారు.

ఏపీ ప్రభుత్వం ప్రకటన

ఫొటో సోర్స్, AP govt

ఇచ్చిన హామీని నిలబెట్టుకున్నాం...

రాష్ట్రంలో గత ప్రభుత్వం ఖాళీ పోస్టుల భర్తీలో నిర్లక్ష్యం చూపితే, తాము ప్రతికూల పరిస్థితుల్లో కూడా వాగ్దానాలు అమలు చేశామని సీఎం జగన్ అన్నారు.

జాబ్ క్యాలెండర్ విడుదల సందర్భంగా ఆయన మాట్లాడుతూ తమ ప్రభుత్వ హయంలో 6 లక్షల మందికి ప్రభుత్వ ఉద్యోగాలతోపాటూ, చాలీచాలని వేతనాలతో నెట్టుకొస్తున్న వారితో కలిపి మొత్తం 7,02,656 మందికి లబ్ధి చేకూర్చగలిగామన్నారు.

"గత ప్రభుత్వ హయంలో ఉద్యోగాలు ఎలా బ్రతికారు, వారికి ఎంత వేతనాలు ఇచ్చేవారు అన్నది ఓ సారి గుర్తు చేసుకోవాలి. ఉద్యోగుల విషయంలో పలుమార్పులు చేశాం. అవుట్ సోర్సింగ్ ఉద్యోగులకు నెలకు రూ. 7-8 వేలు మాత్రమే చేతికి వచ్చేవి. వారి వేతనాలకు గ్యారంటీ ఇచ్చాం. రూ. 12 వేలు ఇస్తున్నాం. గతంలో ఏ ప్రభుత్వాలు అమలు చేయని విధంగా కాంట్రాక్ట్ ఉద్యోగులకు మినిమమ్ టైమ్ స్కేల్ పెట్టాం. నోటిఫికేషన్ల విషయంలో కూడా ముందడుగు వేస్తున్నాం. రాష్ట్రానికి రెవెన్యూ తగ్గిపోయి, ప్రతికూల పరిస్థితులు ఉన్నప్పటికీ పిల్లలకు, మన గ్రామాల్లోనే ఉద్యోగాలు కల్పించాం. రాష్ట్రంలో ఉద్యోగాల విప్లవం జరుగుతోంది. కొత్తగా ఈ ఆర్థిక సంవత్సరంలోనే 10,143 మందికి ఉద్యోగాలు దక్కబోతున్నాయి" అని వివరించారు.

అయితే, ప్రభుత్వం చెబుతున్నట్టు రాష్ట్రంలో ఆరు లక్షల మందికి పైగా నిరుద్యోగులకు ఉపాధి లభించిందా అన్న ప్రశ్నకు కాదనే జవాబు వస్తుంది.

ప్రభుత్వం చెప్పిన లెక్కలను బీబీసీ పరిశీలించినప్పుడు వాటిలో తాత్కాలిక సచివాలయ ఉద్యోగులు, ఔట్ సోర్సింగ్, కాంటాక్ట్ ఉద్యోగులతో పాటు ఆర్టీసీ ఉద్యోగుల సంఖ్యను కూడా కలిపి చూపించినట్లు అర్థమవుతోంది.

అంటే, ప్రభుత్వం చెబుతున్న లెక్కలకు వాస్తవాలకు పొంతనలేదని తేలింది.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)