"నా ఇల్లు ఎవరో దొంగిలించారు".. పోలీసులకు రిపోర్ట్ చేసిన ఇంటి యజమాని

ఇంటిని అమ్మేశారు
    • రచయిత, షారీ వాల్
    • హోదా, బీబీసీ ప్రతినిధి

బ్రిటన్‌లో ఒక వ్యక్తి హడావుడిగా తన ఇంటికి వచ్చారు. కానీ అప్పటికే తన ఇల్లు పూర్తిగా ఖాళీగా ఉండడం చూసి ఆయన షాకయ్యాడు. ఆయనకు తెలీకుండా ఆ ఇంటిని ఎవరో అమ్మేశారు.

యజమాని రెవరెండ్ మైక్ హాల్‌కు ఆయన పొరిగింటి వారు ఆ విషయం చెప్పారు. దాంతో ఆయన ఆఘమేఘాలమీద తన ఇంటి దగ్గరకు చేరుకున్నాడు. అక్కడ అప్పటికే తన ఇంటికి పనులు జరుగుతుండడం ఆయన చూశాడు. అక్కడున్న వేరే వ్యక్తి ఆ ఇల్లు ఇప్పుడు తనదన్నాడు. నేనే ఆ ఆ ఇంటికి యజమాని అన్నాడు.

ఈ కేసును పరిశీలించిన బీబీసీ ఇది గుర్తింపు చౌర్యానికి సంబంధించినదిగా కనిపెట్టింది.

మైక్ హాల్ గుర్తింపును దొంగిలించిన కొందరు అతడి ఇంటినే అమ్మేశారు. అతడి బ్యాంక్ నుంచి డబ్బు కూడా స్వాహా చేశారు. పోలీసులు మాత్రం ఆయనతో మొదట ఇది ఫ్రాడ్ కేసు కిందికి రాదని చెప్పారు. కానీ, ఇప్పుడు మళ్లీ ఈ కేసుపై దర్యాప్తు చేస్తున్నారు.

ఆ ఇంటి యజమాని మైక్ హాల్ అక్కడ ఉండడం లేదు. ఆయన ఉద్యోగరీత్యా నార్త్ వేల్స్‌లో ఉంటున్నారు. ఆగస్టు 20న తనకు ఫోన్ చేసిన తమ పక్కింటి వారు "మీ ఇంట్లో ఎవరో ఉన్నారు, లైట్లు కూడా వెలుగుతున్నాయి" అని చెప్పారని తెలిపారు.

వీడియో క్యాప్షన్, ఇక్కడ సగం ఇల్లు కొనుక్కోవచ్చు...

తర్వాత రోజే అక్కడికి చేరుకున్నారు

బీబీసీ రేడియో 4 కార్యక్రమం 'యూ అండ్ యువర్స్'లో మైక్ హాల్ మాట్లాడారు.

"నేను తలుపు తెరవాలని ప్రయత్నించాను. కానీ అది తెరుచుకోవడం లేదు. తర్వాత కాసేపటికి ఒకాయన వచ్చి తలుపు తెరిచారు. నేను ఆయన్ను పక్కకు తోసి లోపలికెళ్లాను. ఆయన అక్కడ ఏం చేస్తున్నాడో నాకు అర్థం కాలేదు. లోపల కనిపించింది చూడగానే షాకయ్యాను. అక్కడ ఫర్నిచర్, కార్పెట్, పరదాలు ఏవీ లేవు" అని చెప్పారు.

ఇంట్లో ఉన్న వ్యక్తి తాను బిల్డర్‌నని, అక్కడ పని చేయిస్తున్నానని ఆయనకు చెప్పాడు.

మైక్ హాల్ ఆయనతో "నేను ఈ ఇల్లు అమ్మలేదు. ఇది నా ఇల్లు" అన్నాడు.

తర్వాత ఆయన పోలీసులకు ఫోన్ చేశారు. కానీ బిల్డర్ నుంచి వెళ్లి కొత్త యజమాని తండ్రిని అక్కడకు తీసుకొచ్చారు. ఆయన రాగానే ఆ ఇంటిని తాను జులైలో కొనుగోలు చేశానని, ఇప్పుడు అది తనదేనని చెప్పారు.

వీడియో క్యాప్షన్, హైదరాబాద్: వాటర్ పైపులో సింగిల్ బెడ్ రూమ్ ఇల్లు... ఈ ఇంటిని ఎక్కడికైనా తీసుకుపోవచ్చు

పోలీసుల స్పందన

"ఆ తర్వాత మేం ఇంటి రిజిస్ట్రేషన్‌కు సంబంధించిన ఆన్‌లైన్ రికార్డులు చెక్ చేశాం. అక్కడ ఆగస్టు 4న నిజంగానే అది వేరే ఎవరి పేరునో నమోదై ఉంది" అని మైక్ హాల్ చెప్పారు.

దాంతో, పోలీసులు "మేం ఇప్పుడు ఏం చేయలేం, ఇది న్యాయ పరమైన అంశం, మీరు మీ వకీళ్లతో మాట్లాడాల్సి ఉంటుంది" అన్నారు.

"అసలే నా ఇంటి పరిస్థితి చూసి షాక్‌లో ఉన్న నాకు, పోలీసులు ఇది క్రిమినల్ కేసు కాదని చెప్పడంతో ఏం చేయాలో అర్థం కాలేదు. వాళ్లు అలా చెప్పడం నేను అసలు నమ్మలేకపోయాను".

బీబీసీ ఆ తర్వాత మైక్ హాల్‌ స్థానిక బెడ్‌ఫోర్డ్‌షైర్ పోలీసులను సంప్రదించేలా చేసింది. వారు ఇప్పుడు దీనిపై దర్యాప్తు ప్రారంభించారు. ఈ కేసులో ఇప్పటివరకూ ఎవరినీ అరెస్ట్ చేయలేదని పోలీసులు చెప్పారు.

బీబీసీ మైక్ హాల్ గుర్తింపును దేని ద్వారా దొంగిలించారో ఆ డ్రైవింగ్ లైసెన్స్ సంపాదించింది. ఇల్లు అమ్మిన తర్వాత ఆ డబ్బులు జమ చేసిన బ్యాంక్ అకౌంట్‌ వివరాలు కూడా సేకరించింది. ఇంటి దొంగతనానికి సంబంధించిన ఫోన్ రికార్డింగ్స్ కూడా బీబీసీకి లభించాయి.

ఇల్లు అమ్మేశారు

ఫొటో సోర్స్, Getty Images

కోటీ 31 లక్షలకు అమ్ముడైన ఇల్లు

దొంగిలించిన వారు ఆ ఇంటిని 131,000 పౌండ్ అంటే దాదాపు కోటీ 31 లక్షల రూపాయలకు అమ్మారు. న్యాయంగా చూస్తే ఇప్పుడు ఈ ఇల్లు కొత్త యజమానిదే అవుతుంది.

ఇంటి విక్రయానికి సంబంధించి మాట్లాడిన వకీల్ ఇది పోలీసులు దర్యాప్తు చేయాల్సిన కేసు అంటున్నారు. అందుకే, దీనిపై తాము అప్పుడే ఏం మాట్లాడలేమని చెప్పారు.

"మేం పోలీసులకు సహకరిస్తాం. మా వృత్తిపరమైన బాధ్యతను పూర్తిగా నెరవేరుస్తాం" అని ఒక లా సంస్థ బీబీసీకి చెప్పింది.

మరోవైపు బ్రిటన్‌లో ఇళ్ల క్రయవిక్రయాలను రిజిస్టర్ చేసే లాండ్ రిజిస్ట్రీ సంస్థ.. ఇలాంటి ఫ్రాడ్ కేసులకు సంబంధించి గత ఏడాది 35 లక్షల పౌండ్లు పరిహారంగా చెల్లించింది.

"నకిలీ ఇంటి యజమానులుగా మారే ప్రయత్నాలను అడ్డుకోడానికి.. మేం ప్రొఫెషనల్స్‌తో, వకీళ్లతో కలిసి పనిచేస్తుంటాం. వారిపై, వారి దర్యాప్తుపై ఆధారపడుతుంటాం. కానీ, మేం అన్ని ప్రయత్నాలు చేస్తున్నా.. ప్రతి ఏటా ఎక్కడో ఒకచోట ఫ్రాడ్ కేసులు నమోదవుతూనే ఉన్నాయి" అని లాండ్ రిజిస్ట్రీ సంస్థ చెప్పింది.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)