సర్దార్ వల్లభాయ్ పటేల్ అంటే మోదీకి ఎందుకంత ఇష్టం?

ఫొటో సోర్స్, TWITTER/BJP4INDIA
- రచయిత, ఘన్‌శ్యామ్ షా
- హోదా, బీబీసీ కోసం
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, ఉక్కు మనిషి సర్దార్ వల్లభాయ్ పటేల్ ఇద్దరిదీ గుజరాత్ రాష్ట్రమే. దేశ తొలి హోంమంత్రి వల్లభాయ్ పటేల్, దేశ ప్రధాన మంత్రిగా బాధ్యతలు చేపట్టిన రెండో గుజరాతీ నరేంద్ర మోదీ.
2006 నుంచి మోదీ ప్రసంగాలను గమనిస్తే, ఆయన గుజరాత్ గురించి, సర్దార్ పటేల్ గురించి ఎప్పుడూ ప్రస్తావిస్తూ వస్తున్నారన్న విషయం అర్థమవుతుంది.
నరేంద్ర మోదీ తన ఇమేజ్‌ను పెంచుకోవాలంటే అందుకు ఓ బలమైన ప్రముఖ వ్యక్తి ముఖం అవసరం. అలాంటి శక్తిమంతమైన వ్యక్తి సర్దార్ పటేల్. గుజరాత్ ప్రజల హృదయాల్లో సుస్థిర స్థానం సంపాదించుకున్నారాయన.
ఉక్కు మనిషిగా అందరికీ సుపరిచితమైన సర్దార్, క్లిష్ట పరిస్థితుల్లోనూ గట్టి నిర్ణయాలు తీసుకోవడంలో, మెరుగైన పాలన అందించడంలో ఆయనకు ఆయనే సాటి. తనలోనూ అలాంటి లక్షణాలు ఉన్నాయని చాటుకోవాలని మోదీ అనుకున్నారు.

ఫొటో సోర్స్, Getty Images
మోదీ ప్రసంగాల్లో సర్దార్
మోదీ తన ప్రసంగాల్లో 2006 తర్వాత మాత్రమే సర్దార్ పటేల్ పేరును మరీమరీ ప్రస్తావించడం ప్రారంభించారు. అంతకుముందు ఆయన పేరును అంతగా చెప్పేవారు కాదు.
ఎన్డీఏ కూటమి 2004లో కేంద్రంలో అధికారం కోల్పోయింది. ఆ తర్వాత, నరేంద్ర మోదీ తన రాజకీయ వ్యూహాన్ని మార్చారు.
కేంద్రంలోని యూపీఏ ప్రభుత్వం గుజరాత్ పట్ల వివక్ష చూపిస్తోందంటూ 2005-06లో మోదీ ఆరోపణలు గుప్పించడం మొదలుపెట్టారు. కేంద్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం గుజరాత్‌కు అన్యాయం చేస్తోందంటూ విమర్శించడం ఆయన అజెండాలో భాగమైంది.
అలాగే, సర్దార్ వల్లభాయ్ పటేల్‌కు నెహ్రూ కుటుంబం తీవ్ర అన్యాయం చేసిందంటూ విమర్శించడం కూడా మోదీ ప్రారంభించారు. గతం నుంచీ గుజరాత్ పట్ల కాంగ్రెస్ పార్టీ చిన్నచూపు చూస్తోందన్న వాదనను ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లేందుకు సర్దార్ పేరును ఉదహరించేవారు.

ఫొటో సోర్స్, Getty Images
సర్దార్, మోదీ, హిందుత్వ
మతాల మధ్య సామరస్యాన్ని మహాత్మా గాంధీ కోరుకునేవారు. అయితే, ఈ విషయంలో వల్లభాయ్ పటేల్, గాంధీల మధ్య అభిప్రాయభేదాలు ఉండేవి.
సర్దార్ హిందువు కాబట్టి ఆయనను మోదీ ఇష్టపడ్డారు.
ముస్లింల పట్ల సర్దార్ పటేల్‌లో కొంతమేర అసూయ ఉండేది. అయితే, గుజరాత్ ఒక హిందుత్వ లేదా హిందూ రాష్ట్రంగా అవతరించాలని మాత్రం ఆయన ఎన్నడూ భావించలేదు. ముస్లింలు కూడా అందరితో సమానమే అన్నట్లుగా ఆయన చూసేవారు. మతం పేరుతో ప్రజలను విభజించాలని అనుకునేవారు కాదు.

ఫొటో సోర్స్, Photo division
మోదీ, సర్దార్‌ల మధ్య తేడా
సర్దార్ వల్లభాయ్ పటేల్ విగ్రహం నిర్మాణం కోసం నరేంద్ర మోదీ ప్రభుత్వం దాదాపు రూ. 3,000 కోట్లు ఖర్చుచేసింది. కానీ, దానివల్ల స్థానిక రైతులకు, ఆదివాసీలకు ఎలాంటి ప్రయోజనమూ లేదు.
ఇక్కడి చుట్టుపక్కల ప్రాంతాల్లో సరైన సాగునీటి సదుపాయం లేదు. ఆదివాసీల భూములకు సంబంధించిన సమస్యలు పరిష్కారం కావాల్సి ఉంది. ఆ సమస్యల గురించి నరేంద్ర మోదీ పట్టించుకోలేదు.
కానీ, సర్దార్ పటేల్ మాత్రం రైతులకు ఎప్పుడూ వెన్నుదన్నుగా నిలిచేవారు. రైతులకు ఎలాంటి అన్యాయం జరగకూడదని, కూలీలకు, కార్మికులకు ఎట్టిపరిస్థితుల్లోనూ నష్టం కలిగించకూడదని భావించేవారు.
సమాజంలో ఎగువ, దిగువ తరగతుల మధ్య ఎలాంటి ఉద్రిక్తతలు తలెత్తకూడదని సర్దార్ అనుకునేవారు. అన్ని వర్గాల మధ్య పరస్పర సహకారం, సామరస్యాన్ని ఆయన కోరుకున్నారు, కానీ, తగాదాలను మాత్రం కాదు.
షెడ్యూల్డు కులాలవారికి, పేదలకు ఆయన వ్యతిరేకి కాదు. అలా అని వాళ్లు ఇబ్బందుల్లో ఉన్నప్పుడు వారివెంట ఉండేవారు కూడా కాదు. అంటే, నిమ్న వర్గాల సమస్యలకు సర్దార్ ఎక్కువగా ప్రాధాన్యం ఇచ్చేవారు కాదు. ఇప్పుడు మోదీ కూడా అలాగే చేస్తున్నారు.

ఫొటో సోర్స్, Reuters
విగ్రహం వెనుకస్వార్థం ఉందా?
గుజరాత్‌లో నీటి కొరత తీవ్రమవుతోంది. 'స్టాట్యూ ఆఫ్ యూనిటీ' నిర్మించిన ప్రాంతంలో పలువురు రైతులు భూములు కోల్పోయారు. వారి సమస్యలను నరేంద్ర మోదీ పట్టించుకోవట్లేదు.
ప్రపంచంలోనే అత్యంత ఎత్తయిన విగ్రహం నిర్మించాలని నరేంద్ర మోదీ నిర్ణయించడం వెనుక స్వార్థం కూడా దాగి ఉంది.
ఈ విగ్రహం ద్వారా సర్దార్ పటేల్ అంతటి పేరు తనకు కూడా రావాలని, భావి తరాలు సర్దార్‌తో పాటు తన పేరును కూడా గుర్తుచేసుకోవాలని ఆయన కోరుకుంటున్నారు.

ఫొటో సోర్స్, TWITTER/AMIT SHAH
సర్దార్, మోదీ, ఎన్నికలు
సర్దార్ పటేల్ విగ్రహాన్ని ప్రతిష్ఠాత్మకంగా నిర్మించడం ద్వారా గుజరాత్‌లోని పాటీదార్లలో ఉన్న అసంతృప్తిని మోదీ దూరం చేయగలరని చాలామంది అభిప్రాయం. ఈ విగ్రహం ఏర్పాటు ద్వారా రానున్న ఎన్నికల్లో పాటీదార్ల ఓట్లు రాబట్టుకోవచ్చన్న ఆలోచనలో మోదీ ఉన్నట్లు తెలుస్తోంది.
సౌరాష్ట్ర ప్రాంతంలోని రైతుల పరిస్థితి చాలా దయనీయంగా ఉంది. ఇక్కడి రైతుల్లో ఉన్న అసంతృప్తి గత ఎన్నికల్లో కనిపించింది. పాటీదార్లలోని ధనవంతులు మోదీ వైపు ఉండొచ్చు. కానీ, రైతులు, ఉపాధి లేక ఇబ్బంది పడుతున్న యువత మాత్రం అంత సులువుగా మోదీకి మద్దతు ఇవ్వకపోవచ్చు.
ఈ విగ్రహం ప్రభావం గుజరాత్‌లో కొంతమేర ఉండొచ్చు. కానీ, ఇతర రాష్ట్రాల్లో ఎలాంటి ప్రభావమూ చూపలేదు. కాబట్టి, వచ్చే ఎన్నికల్లో నరేంద్ర మోదీకి స్టాట్యూ ఆఫ్ యూనిటీ ప్రయోజనం చేకూరుస్తుందనడం పొరపాటే.
(ఈ కథనంలో వ్యక్తపరిచిన అభిప్రాయాలు రచయిత వ్యక్తిగతం. రచయిత ప్రస్తావించిన విషయాలకు, అభిప్రాయాలకు బీబీసీ బాధ్యత వహించదు)
ఇవి కూడా చదవండి:
- ప్రపంచంలోనే ఎత్తయిన పటేల్ విగ్రహాన్ని ఎలా నిర్మించారు?
- అభిప్రాయం: 2019 ఎన్నికల దిశగా బీజేపీ కుల సమీకరణలు ఎలా ఉండబోతున్నాయి?
- ఇలా చేస్తే మీ భాగస్వామిని మోసం చేయడమా? కాదా?
- స్త్రీ గౌరవం రెండు కాళ్ల మధ్య లేదు : బీబీసీ ఇంటర్వ్యూలో రేణూ దేశాయ్
- ‘తిలక్ ఇంకొన్నాళ్లు బతికుంటే భారత్-పాకిస్తాన్‌లు విడిపోయేవి కాదు’
- పవన్ కల్యాణ్: 'కులాలను కలిపేస్తాం.. మతాల ఊసెత్తం!'
- ఈ విశ్వంలో ఏలియన్స్ ఉన్నాయా? లేవా?
- పుట్టగొడుగులు తింటే మెదడు ‘శుభ్రం’!
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








