ఇంగ్లిష్ మీడియం కోసం పోరాటం.. నాలుగేళ్లుగా స్కూళ్లు మూసేశారు.. ఇదేంటని అడిగితే కిడ్నాప్‌లు చేస్తున్నారు

ఫొటో సోర్స్, Getty Images
- రచయిత, పీటర్ టాహ్
- హోదా, కామెరూన్ జర్నలిస్ట్
మాతృభాష పేరుతో చెలరేగుతున్న ఘర్షణల్లో విద్యార్థులు పావులుగా మారుతున్నారు. వరుసగా నాలుగో ఏడాదీ పాఠశాలలు తెరచుకోలేదు. పైగా పిల్లలనూ ఆయుధాలు చేత పట్టుకొనేలా ప్రేరేపిస్తున్నారు.
ఆఫ్రికా దేశం కామెరూన్‌లో పరిస్థితి ఇది. ఇంగ్లిష్ మాట్లాడే ప్రాంతాలకు స్వాతంత్ర్యం ఇవ్వాలంటూ ఫ్రెంచ్‌కు అండగా నిలిచే ప్రభుత్వంపై అక్కడి వేర్పాటువాదులు పోరాటం చేస్తున్నారు.
వాయువ్య, నైరుతి ప్రాంతాల్లోని చాలా నగరాలు, పట్టణాలు, గ్రామాలను వేర్పాటువాదులు దిగ్బంధించారు.
వరుసగా నాలుగో ఏడాది కూడా పాఠశాలలు తెరవకుండా వారు చూస్తున్నారు. ఈ కల్లోలిత ప్రాంతాల్లో ప్రభుత్వం భారీగా బలగాలను మోహరించింది.
సెప్టెంబరు మొదటివారంలో పాఠశాలలు తెరచుకోవాల్సి ఉంది. అయితే, ఘర్షణలు మరింత పెరుగుతాయనే ఆందోళనల నడుమ ప్రాణాలను అరచేత పెట్టుకొని పిల్లలతో సహా ఇక్కడివారు వలస పోతున్నారు.

ఫొటో సోర్స్, Getty Images
6,00,000 మంది పిల్లలపై ప్రభావం
వాయువ్యంతోపాటు నైరుతి ప్రాంతాల్లో పాఠశాలలు మూడేళ్లుగా వెలవెలబోతున్నాయి. ఎవరూ రాకపోవడంతో చాలా పాఠశాలల్లో పిచ్చిమొక్కులు పెరిగిపోయాయి.
కొన్నిప్రాంతాల్లో పాఠశాలలకు భద్రత కల్పించేందుకు ప్రభుత్వం భద్రతా బలగాలను మోహరించింది. అయితే సాయుధ వేర్పాటువాదుల ప్రధాన లక్ష్యం బలగాలే కావడంతో.. ఇక్కడ దాడుల ముప్పు మరింత పెరుగుతోంది.
ఘర్షణల వల్ల దాదాపు ఆరు లక్షల మంది పిల్లల చదువుపై ప్రభావం పడిందని, 80 శాతానికిపైగా పాఠశాలలు మూతపడ్డాయని, 74 పాఠశాలలు శిథిలాలుగా మారిపోయాయని యూనిసెఫ్ తెలిపింది.
పాఠశాలల మూసివేతపై ధిక్కార స్వరం వినిపించిన 80 మంది విద్యార్థులు, ప్రిన్సిపల్, టీచర్‌ను గతేడాది కొందరు అపహరించుకుపోయారు. వారం రోజుల తర్వాత వారిని విడిచిపెట్టారు.
అయితే, ఇలాంటి ఘటనలతో తమకు సంబంధంలేదని వేర్పాటువాద సాయుధులు చెబుతున్నారు. కానీ వారే చేస్తున్నారని ప్రభుత్వం ఆరోపిస్తోంది.
2016లో ప్రధానంగా ఇంగ్లీషు మాట్లాడే ప్రాంతాల్లో పాఠశాలలు, కోర్టుల్లో ఫ్రెంచ్ వాడకాన్ని పెంచాలని ప్రభుత్వం నిర్ణయించింది. దీంతో ఒక్కసారిగా నిరసనలు వెల్లువెత్తాయి. వీటిని అణచివేసేందుకు ప్రభుత్వం బలగాలను మోహరించడంతో కొందరు పౌరులు ఆయుధాలు చేతపట్టారు. ఇదే తిరుగుబాటుగా మారిపోయింది.
ఘర్షణల వల్ల వేల మంది పౌరులు, వేర్పాటువాదులు, సైనికులు మరణించారు. ఐదు లక్షల మందికిపైగా వేరే ప్రాంతాలకు వలస పోయారు. కార్మికులకు జీతాల చెల్లింపులు ఆగిపోవడం, సంస్థలు దివాలా తీయడంతో ఆర్థిక వ్యవస్థ కుంటుపడింది.

ఫొటో సోర్స్, Getty Images
పిల్లల చేతిలో ఆయుధాలు
పెద్దసంఖ్యలో ఇక్కడ పిల్లలు అనాథలవుతున్నారు. వీరిలో కొందరు సాయుధ దళాల్లో చేరిపోతున్నారు. ఏంబజోనియా పేరుతో ప్రత్యేక దేశం ఏర్పాటు కోసం పోరాడుతున్న దళాల్లో వారు కనిపిస్తున్నారు.
చాలా మంది పిల్లలు తమ తల్లిదండ్రుల మరణానికి ప్రభుత్వ బలగాలే కారణమని, ఎలాగైనా ప్రతీకారం తీర్చుకోవాలని భావిస్తున్నారు.
మరోవైపు వేర్పాటువాదులు సైతం ప్రధానంగా పాఠశాలలనే లక్ష్యంగా చేసుకుంటున్నారు. ఇంగ్లిష్ మాట్లాడే భవిష్యత్తుతరం చిన్నారులను ఫ్రెంచ్‌కు మళ్లించాలనే ప్రభుత్వ ప్రయత్నాలను అడ్డుకోవాలని వారు భావిస్తున్నారు.
ఏంబజోనియా ఏర్పాటుపై చర్చలకు ప్రభుత్వం అంగీకరించేవరకూ పాఠశాలలు మూతపడే ఉంటాయని నొక్కిచెబుతున్నారు.

ఫొటో సోర్స్, Alamy
గడప దాటనివ్వట్లేదు
కల్లోలిత ప్రాంతాల్లో దాదాపు 80 లక్షల మంది నివాసముంటున్నారు. వీరంతా గడప దాటకుండా చూసేందుకు వేర్పాటువాదులు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు.
ప్రభుత్వ రవాణా సదుపాయాలు, దుకాణాలు, కార్యాలయాలు, మార్కెట్లు ఎప్పుడో మూతపడ్డాయి.
నాలుగు లక్షల మంది వరకూ జనాభా ఉండే ఇంగ్లీష్ నగరం బెమెండా గత వారం నుంచి నిర్బంధంలోనే ఉంది. మరికొన్ని ప్రాంతాలు సైతం ఈ వారంలో మూతపడ్డాయి.
రాజధాని యావుండే, వాణిజ్య నగరం దువాలాల్లోని సురక్షిత ప్రాంతాలకు వేల మంది పరుగులు తీస్తున్నారు. దీంతో రవాణా ఖర్చులను వాణిజ్య వాహనాల యజమానులు విపరీతంగా పెంచేస్తున్నారు.
కొందరు ఎక్కడకు వెళ్లాలో తెలియక బస్టాండుల్లోనే ఉండిపోతున్నారు. ఫలితంగా పరిస్థితులు మరింత దిగజారిపోతున్నాయి.
ఇంత జరుగుతున్నా.. ప్రభుత్వ అధికారులు మాత్రం దాటవేత సమాధానాలు ఇస్తున్నారు. వేరే ప్రాంతాలకు వలసపోతున్నవారిని.. విహారయాత్రల కోసం వెళ్తున్నవారిగా వాయువ్య ప్రాంత గవర్నర్ అడాల్ప్ లీలీ లాఫ్రిక్ అభివర్ణిస్తున్నారు.
ఇలాంటి వ్యాఖ్యల వల్ల చాలా మంది నిరాశలో కూరుకుపోతున్నారు. ఇంగ్లీషు మాట్లాడే కామెరూన్ ప్రాంతాల్లో తమకు, తమ పిల్లలకు ఇంకేం భవిష్యత్తు ఉంటుందని అనుకుంటున్నారు.
ఓ జర్నలిస్టుగా ఇక్కడ పనిచేయడం నాకు అత్యంత ప్రమాదకరం. అందుకే గత జనవరిలో బెమెండా నగరం నుంచి కెనడాకు వలస వచ్చేసాను.
ఇవి కూడా చదవండి:
- కమలాతాల్: "ఒక్క రూపాయికే ఇడ్లీ.. నేను చనిపోయే దాకా అమ్ముతా.. ఎప్పటికీ ధర పెంచను"
- కొల్లేరు: దేశంలో అతి పెద్ద మంచినీటి సరస్సుకు వచ్చిన ప్రమాదం ఏమిటి? పరిష్కారం ఎలా?
- తెలుగు భాష ఎప్పటిది? ద్రవిడ భాషలు ఎన్నాళ్ల నాటివి?
- ప్రపంచంలో అత్యంత వేగవంతమైన భాష తెలుగే: ఆస్ట్రేలియా ప్రొఫెసర్ పరిశోధన
- ఆ దేశంలో తెలుగుకున్న క్రేజ్ అంతా, ఇంతా కాదు!
- తెలుగు: అమెరికాలో అత్యంత వేగంగా వృద్ధి చెందుతున్న భాషల్లో అగ్రస్థానం
- బ్యాంకుల విలీనం: సంక్షోభం నుంచి భారత ఆర్థిక వ్యవస్థను, బ్యాంకింగ్ వ్యవస్థను గట్టెక్కిస్తుందా? - అభిప్రాయం
- తెలంగాణ రెవెన్యూ శాఖలో సంస్కరణలు అవసరమా, కాదా? ఉద్యోగుల భవిష్యత్తు ఏంకానుంది?
- చంద్రయాన్ 2: మరో ముఖ్య అంకం విజయవంతం.. ఆర్బిటర్ నుంచి వేరుపడిన 'విక్రమ్'
- ఆటోమొబైల్ సంక్షోభం: “మాకు తినడానికి తిండి లేదు.. పరిస్థితి ఎలా ఉందో తెలియాలంటే ఫ్యాక్టరీలకు వెళ్లి చూడండి”
- వైఎస్ రాజశేఖర రెడ్డి: హెలికాప్టర్ అదృశ్యం తర్వాత 25 గంటల్లో ఏం జరిగింది?
- శివాజీకి ముస్లింల పట్ల ద్వేషం నిజమేనా?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








