భార్య పెట్టిన కేసులో క్రికెటర్ షమీకి అరెస్ట్ వారెంట్.. 15 రోజుల్లో లొంగిపోవాలని ఆదేశం

మొహమ్మద్ షమీ

ఫొటో సోర్స్, FACEBOOK

    • రచయిత, ప్రభాకర్ ఎం
    • హోదా, బీబీసీ కోసం

మైదానంలో అద్భుత ప్రదర్శన ఇస్తున్నా, గృహ హింస కేసులో మాత్రం భారత ఫాస్ట్ బౌలర్ మొహమ్మద్ షమీకి అదృష్టం కలిసిరావడం లేదు.

షమీ గత ఏడాదిన్నరగా ఎక్కువగా వివాదాలతో పతాక శీర్షికల్లో నిలుస్తున్నాడు.

మొదట మ్యాచ్ ఫిక్సింగ్ ఆరోపణలు రాగా... ఆ తర్వాత భార్య హసీన్ జహా షమీ ఆయనపై గృహహింస, దాడి కేసులు పెట్టారు.

ఇప్పుడు భార్య వేసిన అలాంటి ఒక కేసులోనే కోల్‌కతా అలీపూర్ కోర్టు షమీ, అతని సోదరుడికి అరెస్టు వారెంట్ జారీ చేసింది.

షమీ ప్రస్తుతం భారత జట్టుతో కలిసి వెస్టిండీస్ పర్యటనలో ఉండడంతో కోర్టు ఆయన లొంగిపోడానికి, బెయిల్ కోసం అప్లై చేసుకోడానికి 15 రోజుల గడువు ఇచ్చింది.

కానీ అతడి సోదరుడిపై ఉన్న వారెంటును తక్షణం అమలు చేయాలని ఆదేశించింది.

షమీ

ఫొటో సోర్స్, Getty Images

ఇటు, చార్జిషీటు చూసిన తర్వాతే, తాము ఈ విషయంలో ఏదైనా ఒక నిర్ణయం తీసుకోగలమని భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు చెప్పింది.

"దీనిపై తక్షణం దర్యాప్తు చేయాల్సిన అవసరం ఉన్నట్టు తమకు అనిపించడం లేదని, చార్జిషీటు చూసిన తర్వాత ఈ కేసులో ఒక నిర్ణయం తీసుకుంటామని" బీసీసీఐకి సంబంధించిన ఒక అధికారి చెప్పారు.

హసీన్ జహా వేసిన కేసు విచారణకు హాజరు కావాలని కోర్టు సూచించినప్పటికీ, షమీ దానికి రాలేకపోయాడు. దీంతో కోర్టు అతడిపై అరెస్టు వారెంట్ జారీ చేయాలని నిర్ణయించింది.

"ఈ కేసులో షమీ ఇప్పటివరకూ ఒక్కసారి కూడా కోర్టుకు హాజరు కాలేదు. అందుకే అతడు, అతని సోదరుడు హాషిబ్ అహ్మద్‌పై వారెంట్ జారీ చేశారు. షమీ క్రికెట్ పర్యటనలో విదేశాల్లో ఉండడంతో అతడికి లొంగిపోయేందుకు 15 రోజుల గడువు ఇచ్చారు. కానీ అతడి సోదరుడి విషయంలో అది వర్తించద’ని హసీన్ లాయర్ అనిర్వాణ్ గుహా ఠాకురతా చెప్పారు.

మొహమ్మద్ షమీ

ఫొటో సోర్స్, TWITTER/GETTY

వరుస కష్టాల్లో షమీ

భార్య పెట్టిన గృహ హింస, అత్యాచారం కేసులో కోల్‌కతా పోలీసులు ఈ ఏడాది మార్చి 14న షమీ, అతడి సోదరుడిపై మెట్రోపాలిటన్ అలీపూర్ కోర్టులో చార్జిషీటు దాఖలు చేశారు. రాష్ట్ర ముఖ్యమంత్రి మమతా బెనర్జీని ఆమె నివాసంలో కలిసిన హసీన్ జహా ఈ కేసులో తనకు న్యాయం చేయాలంటూ కోరారు.

షమీని గత ఏడాది మార్చి నుంచి వరుస వివాదాలు చుట్టుముట్టాయి. మొదట ఆయన భార్య అతడిపై మ్యాచ్ ఫిక్సింగ్ ఆరోపణలు చేశారు. తర్వాత గృహ హింస, కొట్టారని, అత్యాచారం చేశారని కేసులు పెట్టారు. హసీన్ జహా ఆరోపణల తర్వాత భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు(బీసీసీఐ) గత ఏడాది మొహమ్మద్ షమీని సెంట్రల్ కాంట్రాక్ట్ నుంచి తొలగించింది.

తర్వాత అతడికి బీసీసీఐ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. కానీ ఐపీఎల్‌లో చెత్త ప్రదర్శనతో ఇంగ్లండ్ పర్యటనకు వెళ్లే భారత జట్టులో షమీకి చోటు లభించలేదు. అదే సమయంలో అతడు ఒక రోడ్డు ప్రమాదానికి కూడా గురయ్యాడు.

భార్య పెట్టిన గృహ హింస కేసులో కోల్‌కతా పోలీసులు గత ఏడాది ఐపీఎల్ టోర్నీ సమయంలో షమీని విచారించారు. అయితే షమీ మొదటి నుంచీ తనపై వస్తున్న ఆరోపణలు నిరాధారమని చెబుతున్నాడు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)