తెలంగాణలో గే వివాహం.. హైదరాబాద్‌లో పెళ్లికి సిద్ధమవుతున్న ఇద్దరు యువకులు - ప్రెస్ రివ్యూ

ఫొటో సోర్స్, GETTY IMAGES
హైదరాబాద్‌లో ఇద్దరు అబ్బాయిలు ప్రేమించి పెళ్లి చేసుకోబోతున్నారంటూ ఆంధ్రజ్యోతి ఓ కథనాన్ని ప్రచురించింది.
ఈ కథనం ప్రకారం.. ఆ ఇద్దరు యువకులు ఎనిమిదేళ్లుగా కలిసి జీవిస్తున్నారు. ఈ స్వలింగ సంపర్కుల వివాహం తెలంగాణలో జరగనుంది. తెలంగాణలో మొట్టమొదటి ‘గే’ వివాహం ఇదేనని చెబుతున్నారు.
పశ్చిమ బెంగాల్‌కు చెందిన సుప్రియో, ఓ హోటల్ మేనేజ్‌మెంట్ కళాశాలలో లెక్చరర్‌గా పనిచేస్తున్నారు. పంజాబ్‌కు చెందిన అభయ్ ఓ సాఫ్ట్‌వేర్ డెవల్‌పమెంట్ ఇండస్ట్రీలో పనిచేస్తున్నారు.
ఓ డేటింగ్ యాప్‌లో ఎనిమిదేళ్ల క్రితం ఇద్దరికి పరిచయం అయింది. ఒక గంట పాటు చాటింగ్‌తోనే ఇద్దరూ ఒకరకంటే ఒకరు ఇష్టపడ్డారు. అప్పటి నుంచి సహజీవనం చేస్తున్నారు.
తమ తల్లిదండ్రులు సనాతన భారతీయ ధర్మాలను విశ్వసిస్తారని, తొలుత పెళ్లికి అంగీకరించలేదని.. సమయం తీసుకొని వారు అర్థం చేసుకునేలా చేశామని సుప్రియో చెప్పారు.
మామూలు వివాహం మాదిరేగానే అన్ని పద్ధతులతో తమ పెళ్లి జరుగుతుందని, ఇప్పటికే షాపింగ్ మొదలు పెట్టామని, పెళ్లి ముహూర్తం కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నట్లు చెప్పారు.
ఇతర రాష్ట్రాల్లో ఇలాంటి పెళ్లిళ్లు జరిగినా, తెలంగాణలో మాత్రం ఇదే తొలిసారి అని చెప్పారు.

ఫొటో సోర్స్, Getty Images
రోజుకు 31 మంచి చిన్నారుల ఆత్మహత్యలు: ఎన్‌సీబీ రిపోర్ట్
దేశంలో 2020 సంవత్సరంలో రోజుకు 31 మంది చొప్పున చిన్నారులు(18 ఏళ్లలోపు వారు) బలవన్మరణాలకు పాల్పడినట్లు ప్రభుత్వ గణాంకాలు వెల్లడించాయని సాక్షి పత్రిక తెలిపింది.
పిల్లలు ఎదుర్కొనే మానసిక సమస్యలు కోవిడ్ మహమ్మారితో ఏర్పడిన పరిస్థితులతో మరింత పెరగడమే ఇందుకు కారణం కావచ్చునని నిపుణులు అంటున్నారు.
2020 సంవత్సరంలో దేశవ్యాప్తంగా 11,396 మంది బాలలు ఆత్మహత్య చేసుకున్నట్లు నేషనల్ క్రైం బ్యూరో నివేదిక తెలిపింది.
2019తో పోలిస్తే 18%, 2018 కంటే 21% ఇది ఎక్కువని పేర్కొంది. 2019లో 9,613 మంది, 2018లో 9,413 మంది బాలలు ఆత్మహత్యలకు పాల్పడినట్లు గణాంకాలు వెల్లడించాయి.
నివేదిక ప్రకారం.. 2020లో ప్రధానంగా కుటుంబసమస్యలతో 4,006 మంది, ప్రేమ వ్యవహారం కారణంగా 1,337 మంది, అనారోగ్య కారణాలతో 1,327 మంది ఆత్మహత్య చేసుకున్నారు. ఇవికాకుండా, సినీ హీరోల ఆరాధన, నిరుద్యోగం, ఆకస్మిక నష్టం, డ్రగ్స్ అలవాటు తదితర కారణాలతోనూ ఆత్మహత్యలు చేసుకున్న కేసులున్నాయి.
కోవిడ్ మహమ్మారితో స్కూళ్లు మూతబడటం, సామాజికంగా ఒంటరితనంతోపాటు పెద్దల్లో ఆందోళన వల్ల కూడా చిన్నారుల మానసిక ఆరోగ్య సమస్యలు మరింత ఎక్కువై, వారిలో విపరీత నిర్ణయాలకు కారణమై ఉండవచ్చని సేవ్ ది చిల్డ్రన్ సంస్థ డిప్యూటీ డైరెక్టర్ ప్రభాత్ కుమార్ అభిప్రాయపడ్డారు.
ఎన్‌సీబీ రిపోర్టుపై క్రై(చైల్డ్ రైట్స్ అండ్ యూ) సంస్థ పాలసీ రీసెర్చ్ డైరెక్టర్ ప్రీతి మహారా స్పందిస్తూ.. 2020లో బలవన్మరణాలకు పాల్పడిన 11,396 మందిలో బాలురు 5,392 మంది కాగా బాలికలు 6,004 మంది ఉన్నారన్నారు.
'రోజుకు 31 మంది, గంటకు సుమారు ఒకరు చొప్పున తనువు చాలించారు. చిన్నారులు ఇళ్లలోనే ఉండిపోవాల్సి రావడం, కుటుంబసభ్యులు, స్నేహితులు, ఉపాధ్యాయులు వారితో సన్నిహితంగా మాట్లాడేందుకు అవకాశం లేకపోవడం, కుటుంబసభ్యుల మరణం వంటివి ఈ పరిస్థితికి దారి తీసింది’ అని తెలిపారు.
‘దీనిని నివారించేందుకు తల్లిదండ్రులు ఎప్పటికప్పుడు తమ బిడ్డల మానసిక ఆరోగ్యాన్ని అంచనా వేస్తుండాలి’ అని మానసిక ఆరోగ్య నిపుణురాలు ప్రకృతి పొద్దార్ అన్నారని ఈ వార్తలో రాశారు.

ఫొటో సోర్స్, NAVEEN
నేడే రైతుల 'మహా పాదయాత్ర' ప్రారంభం
ఆంధ్రప్రదేశ్ ఏకైక రాజధానిగా అమరావతిని కొనసాగించాలన్న డిమాండ్‌తో ఆ ప్రాంత రైతులు తలపెట్టిన ‘మహా పాదయాత్ర’ సోమవారం ప్రారంభం కానుందని ఈనాడు తెలిపింది.
‘న్యాయస్థానం నుంచి దేవస్థానం’ పేరుతో చేపట్టే యాత్రకు అమరావతిలోని తుళ్లూరులో ఉదయం 9.05 గంటలకు శ్రీకారం చుడతారు. వేంకటేశ్వరస్వామి, న్యాయదేవత ప్రతిమలకు పూజలు, సర్వమత ప్రార్థనల అనంతరం రాజధాని ఉద్యమ జెండా ఊపి యాత్ర బయలుదేరుతుంది.
అంతకుముందు 9 మంది మహిళలు నేలపాడులోని హైకోర్టుకు హారతిచ్చి.. అక్కడి నుంచి పాదయాత్ర ప్రారంభమయ్యే ప్రదేశానికి చేరుకుంటారు.
ఏకైక రాజధానిగా అమరావతి పరిరక్షణ, ఇతర ప్రాంతాలకు ఉద్యమాన్ని విస్తరించడం లక్ష్యంగా చేపడుతున్న పాదయాత్ర మొత్తం 45 రోజులపాటు కొనసాగుతుంది. గుంటూరు, ప్రకాశం, నెల్లూరు, చిత్తూరు జిల్లాల్లోని 70 ప్రధాన గ్రామాల మీదుగా జరిగే యాత్ర డిసెంబరు 17న తిరుపతిలో ముగుస్తుంది. యాత్రలో పాల్గొనేవారి జాబితాను పోలీసులకు అందించినట్లు అమరావతి ఐకాస నేతలు చెప్పారు.
తొలి రోజు యాత్రలో భాగంగా రైతులు పెదపరిమి వరకూ వెళ్లి అక్కడ మధ్యాహ్న భోజనం చేస్తారు. అనంతరం ఏడు కిలోమీటర్ల దూరంలోని తాడికొండ వరకూ యాత్ర కొనసాగించి రాత్రి బస చేస్తారు. పాదయాత్ర కోసం అమరావతి పరిరక్షణ సమితి, అమరావతి రాజధాని ఐకాసలు ఏర్పాట్లు పూర్తి చేశాయి.
యాత్రలో పాల్గొనే ప్రతి ఒక్కరికీ గుర్తింపుకార్డులు ఇచ్చారు. వాలంటీర్ల కోసం ప్రత్యేక టీషర్టులు రూపొందించారు. కొవిడ్ నిబంధనలు పాటించేలా జాగ్రత్తలు తీసుకున్నారు. రమణ నేతృత్వంలోని అమరావతి సాంస్కృతిక వేదిక బృందం యాత్ర వెంట ప్రత్యేక వాహనంలో వెళ్తుంది. పాదయాత్ర సజావుగా జరిగేలా 9 కమిటీలు ఏర్పాటు చేసి, బాధ్యుల్ని నియమించారు.
రాజధాని రైతుల మహా పాదయాత్రకు తెదేపా, కాంగ్రెస్, సీపీఐ, సీపీఎం, ఆమ్‌ఆద్మీ, అమరావతి బహుజన ఐకాస, దళిత బహుజన ఫ్రంట్ తదితర రాజకీయ పార్టీలు, ప్రజా, రైతు సంఘాలు సంఘీభావం ప్రకటించాయి. యాత్రలో నేరుగా పాల్గొంటామని వెల్లడించాయి.
తెదేపా తరఫున ఎమ్మెల్యే బుచ్చయ్యచౌదరి హాజరై మద్దతు ప్రకటిస్తారు. కాంగ్రెస్ తరఫున కేంద్ర మాజీ మంత్రి రేణుకాచౌదరి భారీ కాన్వాయ్‌తో వచ్చి యాత్రకు సంఘీభావం ప్రకటిస్తారని పీసీసీ నేతలు తెలిపారు. శైవక్షేత్రం పీఠాధిపతి శివస్వామి, మరికొందరు పీఠాధిపతులు యాత్రకు మద్దతిచ్చారని ఐకాస నేతలు చెప్పారు.
ఇవి కూడా చదవండి:
- COP26: ‘‘ఉష్ణోగ్రతల కట్టడి లక్ష్యాన్ని చేరుకునేందుకు సమయం మించిపోతోంది’’
- అమరావతి: రైతులేమనుకుంటున్నారు?
- టీ20 వరల్డ్ కప్ IndvsNz: భారత్ సెమీస్ అవకాశాలు సంక్లిష్టం, 8 వికెట్ల తేడాతో న్యూజీలాండ్ విజయం
- భారత పర్యటనకు రావాలన్న మోదీ ఆహ్వానాన్ని అంగీకరించిన పోప్ ఫ్రాన్సిస్
- కాకినాడను సముద్రపు కోతల నుంచి కాపాడుతున్నది ఈ ఆడవులేనా?
- కార్డియాక్ అరెస్ట్ అంటే ఏంటి? ఇది ఎందుకు ప్రాణాలు తీస్తోంది?
- పునీత్ రాజ్‌కుమార్ మరణం: జిమ్‌లో ఈ తప్పులు చేయకండి
- హైదరాబాద్ నిజాం భారత సైన్యానికి ఎందుకు లొంగిపోయారు
- విరాట్ కోహ్లీ: స్థాయి లేనోడా? భయం లేనోడా? ఈ సంజ్ఞపై ఎందుకింత చర్చ?
- ‘ఆయన నన్ను పెళ్లి చేసుకోవాలనేం లేదు కానీ నేను ఒక్కరికంటే ఎక్కువ మందిని వివాహం చేసుకుంటా’
- ‘కోవిడ్ ప్రపంచాన్నంతా వణికించిందిగానీ, నాకొచ్చిన కష్టం ఏ ఆడపిల్లకీ రాకూడదు’
- ‘ఒకవైపు లాక్డౌన్.. మరోవైపు కరోనా భయం.. ఇవి చాలవన్నట్లు బాయ్‌ఫ్రెండ్ గోల..’
- ‘ఆయన గుర్తుకు వచ్చినప్పుడల్లా నేను ఆయన టీ షర్ట్ వేసుకుంటాను.. ఒక్కోసారి ఆయన మళ్లీ వస్తారని అనిపిస్తుంది’
- తెల్ల జుట్టు కనిపిస్తే ముసలితనం వచ్చేసినట్లేనా? ఎందుకు రంగేసుకుంటారు
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








