నాన్న చేతి మీద కూతురి బర్త్ డే టాటూ.. ఆ ఫ్యామిలీ అమెరికా వెళ్లడానికి అదే ఆటంకమా?

ఫొటో సోర్స్, Pete Belton
- రచయిత, జేక్ హోర్టన్
- హోదా, బీబీసీ వెరిఫై
బ్రిటన్‌కు చెందిన ఓ వ్యక్తి తన చేతిపై ఉన్న టాటూను అమెరికా ప్రభుత్వం ఓ క్రిమినల్ గ్యాంగ్ సభ్యులను గుర్తించడానికి ఉపయోగిస్తుందని తెలిసి ఆందోళన చెందుతున్నారు.
డెర్బీషైర్‌కు చెందిన ఆయన చేతిపై ఉన్న టాటూ అమెరికన్ ప్రభుత్వ పత్రాల్లో కనిపించింది.
వెనిజ్వెలాకు చెందిన ప్రమాదకరమైన గ్యాంగ్‌ను ఎలా గుర్తించాలనే వివరాలు ఆ పత్రాల్లో ఉన్నాయి. అయితే టాటూ ఉన్న ఈ బ్రిటిషర్‌కు, ఆ గ్యాంగ్‌కు ఎలాంటి సంబంధం లేదు.
ట్రెన్ డి అరాగ్వా(టీడీఏ) అనే క్రిమినల్ గ్యాంగ్ సభ్యులను, అలాంటి అనుమానం ఉన్నవారిని గుర్తించేందుకు డిపార్ట్‌మెంట్ ఆఫ్ హోమ్‌లాండ్ సెక్యూరిటీ(డీహెచ్ఎస్) డాక్యుమెంట్‌లో పేర్కొన్న గుర్తుల్లో తన చేతిపై ఉన్న టాటూ ఉండటం చూసి ఆశ్చర్యపోయానని 44 ఏళ్ల పీట్ బెల్టన్ చెప్పారు.
"డెర్బీషైర్‌కు చెందిన సాధారణ మధ్య వయస్కుడిని నేను" అని ఆయన బీబీసీతో చెప్పారు.
‘కాస్త ఇబ్బందిగా, మొదట తమాషాగా అనిపించింది’ అని బెల్టన్ అన్నారు.
కానీ, ఇప్పుడు దీనిపై ఆందోళన తనకు ఆందోళన మొదలైందని.. ఆగస్ట్‌లో భార్య, కుమార్తెతో కలిసి మయామీ వెళ్లేందుకు టికెట్‌లు బుక్ చేసుకోవడంతో, ఆ పర్యటన చివరకు గ్వాంటనామో జైలులో ముగుస్తుందేమో అని భయంగా ఉందన్నారు.

ట్రంప్ ప్రభుత్వం ఇప్పటికే టీడీఏ గ్యాంగుకు చెందిన వందల మందిని ఎల్ సాల్వడర్‌లోని భారీ భద్రత ఉన్న జైలుకు తరలించింది.
మరోవైపు ఆ జైలులో ఉన్నవారిలో కొందరిని టాటూల ఆధారంగా తప్పుగా గుర్తించారని, టీడీఏ సభ్యులుగా పొరపాటుపడ్డారని వారివారి న్యాయవాదులు చెబుతున్నారు.
టీడీఏ సభ్యులను గుర్తించేందుకు హోమ్‌ల్యాండ్ సెక్యూరిటీ డిపార్ట్‌మెంట్ 9 టాటూలను ఆధారంగా చేసుకుంది. అందులో బెల్టన్ మోచేతి మీద ఉన్న టాటూ కూడా ఒకటి.
తన కుమార్తె జన్మించిన రోజు, సమయానికి గుర్తుగా బెల్టన్ తన చేతిపై ఆ టాటూ వేయించుకున్నారు.
బెల్టన్ చేతి మీద ఉన్నలాంటి టాటూతో పాటు నక్షత్రాలు, కిరీటాలు, మైఖేల్ జోర్డాన్ లోగో 'జంప్‌మాన్'ను పోలిన నమూనాలను టీడీఏ గ్యాంగ్ సభ్యులు పచ్చబొట్లు పొడిపించుకున్నట్లు హోమ్‌లాండ్ సెక్యూరిటీ అనుమానిస్తోంది.
"టీడీఏ సభ్యులు వేయించుకుంటున్న టాటూలు’’ అంటూ కోర్టులో దాఖలు చేసిన పత్రాల్లో కొన్నిటిని పేర్కొన్నారు.

ఫొటో సోర్స్, Pete Belton
అయితే ఈ చిత్రాలను ‘రివర్స్ ఇమేజ్ సెర్చ్’ విధానంలో చెక్ చేసినప్పుడు వాటిలో కొన్ని మొదట టాటూ వెబ్‌సైట్‌లలో కనిపించాయి. అంతేకానీ, వెనెజ్వెలా టీడీఏ గ్యాంగ్‌కు వీటికి సంబంధం ఉన్నట్లు లేదు.
బెల్టన్ చేతిపై ఉన్న టాటూను ‘బీబీసీ వెరిఫై’ రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేసినప్పుడు పదేళ్ల కిందటి ఇన్‌స్టాగ్రామ్ పోస్ట్‌లో అది కనిపించింది. నాటింగ్‌హామ్‌లోని ఓ టాటూ ఆర్టిస్ట్ ఈ చిత్రాన్ని పదేళ్ల కిందట తొలిసారి ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసినట్లు తేలింది.
ఈ ఇన్‌స్టాగ్రామ్ పోస్ట్‌లోని టాటూ ఇమేజ్ క్వాలిటీతో పోల్చితే డిపార్ట్‌మెంట్ ఆఫ్ హోమ్‌లాండ్ పత్రాలలో ఉన్న టాటూ ఇమేజ్ నాణ్యత నాసిరకంగా ఉంది. ఇన్‌స్టాగ్రామ్‌లో ఈ చిత్రాన్ని 2016లో పోస్ట్ చేశారు.
అయితే, 2016లో నాటింగ్‌హామ్ టాటూ ఆర్టిస్ట్ ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసిన టాటూ చిత్రం, ఆ చిత్రంలో కనిపిస్తున్న చేయి... డీహెచ్ఎస్ పత్రాలలోని టాటూ, చేయి ఒకటే.
బెల్టన్ చేతి మీద ఉన్న అదే చిత్రం టీడీఏ గురించి 2024 సెప్టెంబర్‌లో ‘టెక్సస్ డిపార్ట్‌మెంట్ ఆఫ్ పబ్లిక్ సేఫ్టీ’ విడుదల చేసిన నివేదికలోనూ ఉంది.

టాటూల ఇమేజ్‌లు పోలీసుల దగ్గరకు ఎలా వచ్చాయో తెలుసుకునేందుకు ‘బీబీసీ వెరిఫై’.. అమెరికన్ హోమ్ ల్యాండ్ సెక్యూరిటీ, టెక్సస్ డిపార్ట్‌మెంట్ ఆఫ్ పబ్లిక్ సేఫ్టీ విభాగాలను సంప్రదించింది. వారి నుంచి ఎలాంటి సమాధానం రాలేదు.
తమ నిఘా విభాగాలు ఇచ్చిన సమాచారంపై తమకు నమ్మకం ఉందంటూ డిపార్ట్‌మెంట్ ఆఫ్ పబ్లిక్ సేఫ్టీ విభాగం ఒక ఈ మెయిల్ పంపింది.
అయితే బెల్టన్ చేతి మీద ఉన్న టాటూ అమెరికన్ పత్రాల్లో ఎందుకు కనిపించిందనే విషయంలో స్పష్టత రాలేదు. తనను ఆ గ్యాంగ్‌తో ముడిపెడతారేమోనని బెల్టన్ ఆందోళన చెందుతున్నారు.
తన చేతికి ఉన్న టాటూ తాను సొంతగా వేయించుకున్నదేనని, తనకు వెనిజ్వెలా గ్యాంగ్‌తో ఎలాంటి సంబంధాలు లేవంటూ బెల్టన్ తన టాటూకు సంబంధించిన అనేక చిత్రాలను ఆధారంగా చూపించారు.

కేవలం టాటూల ఆధారంగానే ఎవరినీ దేశం నుంచి బయటకు పంపలేదని గత నెలలో కోర్టుకు సమర్పించిన పత్రాలలో ఓ ఇమిగ్రేషన్, కస్టమ్స్ ఎన్‌ఫోర్స్‌మెంట్(ఐసీఈ) అధికారి పేర్కొన్నారు.
వెనిజ్వెలా గ్యాంగ్‌తో సంబంధాలు ఉన్నాయా లేదా అని గుర్తించేందుకు ఇమిగ్రేషన్ అధికారులు 'ఏలియన్ ఎనిమీ వేలిడేషన్ గైడ్’ అనే పాయింట్ల ఆధారిత విధానాన్ని అమలు చేస్తున్నట్లు కోర్టుకు సమర్పించిన పత్రాలు సూచిస్తున్నాయి.
ఇందులో ఒక స్కోర్ కార్డు కూడా ఉంటుంది. దీని ప్రకారం కొన్ని కేటగిరీలలో మొత్తం 8 పాయింట్లు వచ్చినట్లయితే వారిని అరెస్ట్ కానీ, అమెరికా నుంచి పంపించేయడం కానీ చేస్తారు.
ఎవరైనా టీడీఏకు విధేయులుగా ఉన్నా, అలా ఉంటున్నట్లు తెలిపే టాటూలు వేయించుకున్నా వారికి సగం పాయింట్లు ఇవ్వొచ్చు.
టాటూలు వంటి ఆధారాలను ప్రాతిపదికగా తీసుకునే సింబాలిజమ్ కేటగిరీలోనే 8 పాయింట్లు వస్తే అలాంటివారిని టీడీఏ సభ్యులు అని తేల్చడానికి ముందు మరింత దర్యాప్తు చేస్తారు.

టీడీఏ సభ్యుడని చెప్పడానికి టాటూలు ఒక్కటే ఆధారం కాదని టీడీఏపై పుస్తకం రాసిన వెనిజ్వెలా ఇన్వెస్టిగేటివ్ జర్నలిస్టు రోనా రిస్గెజ్ అన్నారు.
‘టీడీఏ తన గ్యాంగు సభ్యులను గుర్తించడానికి టాటూలను ఉపయోగించదు’ అని ఆమె అన్నారు.
"ఎవరినైనా టీడీఏ సభ్యులని తేల్చడానికి వారి నేర చరిత్ర గురించి పోలీసులు దర్యాప్తు చేయాలి. అంతేకానీ, టాటూలు, దుస్తులు, జాతీయత ఆధారంగా నేరస్థులను గుర్తించరాదు’’ అన్నారామె.
లాయర్లు కూడా ఇదే అంశం గురించి కోర్టుల్లో వాదిస్తున్నారు. తమ క్లయింట్లను టాటూల ఆధారంగా నేరగాళ్లుగా ముద్ర వేసి దేశం నుంచి తరిమేసి, జైళ్లలో పెడుతున్నారని వారు కోర్టు దృష్టికి తెస్తున్నారు.
రియల్ మాడ్రిడ్ ఫుట్‌బాల్ క్లబ్ లోగో అయిన కిరీటం బొమ్మను టాటూాగా వేయించుకున్న ఒకరిని అమెరికా నుంచి బహిష్కరించినట్లు ఆయన లాయర్లు కోర్టు దృష్టికి తీసుకు వచ్చారని అమెరికన్ మీడియాలో కథనాలు వచ్చాయి.
మరో కేసులో కిరీటంలో మామ్, డాడ్ అని ఉన్న టాటూ వేసుకున్న మేకప్ ఆర్టిస్టును వెనిజ్వెలా గ్యాంగు సభ్యుడనే ఆరోపణలతో ఎల్ సాల్వడర్ జైల్లో పెట్టినట్లు ఆయన లాయర్లు చెప్పారు.
ఇక డెర్బీషైర్‌కు వస్తే బెల్టన్, ఆయన కుటుంబం తమ అమెరికా పర్యటనను రద్దు చేసుకోవాలని భావిస్తోంది.
అమెరికా వెళ్తే తమ పరిస్థితి ఎలా ఉంటుందోనని ఈ కుటుంబం ఆందోళన చెందుతోంది.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














