వరవరరావును తక్షణమే ఆస్పత్రిలో చేర్చండి: బాంబే హైకోర్టు ఆదేశం

వరవరరావు

ఫొటో సోర్స్, FACEBOOK/BHASKER KOORAPATI

భీమా కోరేగావ్ కేసులో అరెస్టయి రెండేళ్లుగా విచారణ ఖైదీగా ఉన్న విరసం నేత వరవరరావును చికిత్స కోసం 15 రోజుల పాటు నానావతి ఆస్పత్రిలో చేర్పించాలని బాంబే హైకోర్టు ఆదేశించింది. చికిత్సకయ్యే ఖర్చును రాష్ట్ర ప్రభుత్వమే భరించాలని కూడా చెప్పింది.

ఆస్పత్రిలో వరవరావును ఆయన కుటుంబ సభ్యులు ఆస్పత్రి నియమనిబంధనల మేరకు సందర్శించటానికి కూడా హైకోర్టు అనుమతించింది.

వరవరరావు బెయిల్ అంశంపై విచారణను డిసెంబర్ మూడో తేదీకి వాయిదా వేసింది.

హైకోర్టుకు తెలియజేయకుండా వరవరరావును ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ చేయరాదని.. ఆయన ఆరోగ్య పరిస్థితిపై వైద్య నివేదిక కాపీని డిసెంబర్ మూడో తేదీన కోర్టుకు సమర్పించాలని హైకోర్టు నిర్దేశించింది.

వరవరరావు భార్య హేమలత తరఫున వాదనలు వినిపించిన న్యాయవాది ఇందిరా జైసింగ్.. ''కోర్టు అనుమతి లేకుండా'' ఆయనను ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ చేయరాదని ఆదేశించాలని గట్టిగా కోరారు. అయితే.. హైకోర్టు మాత్రం 'కోర్టుకు సమాచారం ఇవ్వకుండా డిశ్చార్జ్ చేయరాదు' అని ఉత్తర్వులు ఇచ్చింది.

హేమలత

''నా భర్త పూర్తిగా మంచంపట్టారు. ఎటువంటి వైద్య సహాయకులు లేరు. ఆయనకు అమర్చిన కాథటర్‌ను గత మూడు నెలలుగా మార్చలేదు. దీనివల్ల ఆయనకు యూరినరీ ఇన్‌ఫెక్షన్ వచ్చింది. ఆయన డిమెన్షియాతో కూడా బాధపడుతున్నారు'' అంటూ వరవరరావు భార్య న్యాయవాది ద్వారా కోర్టుకు నివేదించారు.

''కోర్టు ఎటువంటి వెసులుబాటూ కల్పించకపోయినట్లయితే.. ఆయనకు అవసరమైన చికిత్స అందించకపోయినట్లయితే.. ఆయన అనారోగ్య పరిస్థితి రీత్యా ఆయనకు ఏమైనా జరిగినట్లయితే అది కస్టడీలో మరణం అవుతుంది'' అని చెప్పారు.

ఇదిలావుంటే.. వరవరరావు బెయిల్ దరఖాస్తుపై విచారణను పెండింగ్‌లో ఉంచిన బాంబే హైకోర్టు.. ఆయనను కిడ్నీ, లివర్, హార్ట్, బ్రెయిన్ సమస్యలకు వైద్య పరీక్షలు, చికిత్స కోసం తక్షణమే నానావతి ఆస్పత్రికి తరలించాలని నిర్దేశించిందని వరవరరావు బంధువు ఎన్.వేణుగోపాల్ తెలిపారు. నవంబర్ 13, 17 తేదీల్లో నిర్వహించిన వైద్య పరీక్షల నివేదికల్లో వెల్లడైన అంశాల మేరకు కోర్టు ఈ ఉత్తర్వులు ఇచ్చినట్లు చెప్పారు.

భీమా కోరేగావ్

ఫొటో సోర్స్, MAYURESH KONNUR

భీమా కోరేగావ్ కేసులో రెండేళ్ల కిందట అరెస్టు...

మహారాష్ట్రలోని పుణె సమీపంలో బీమా కోరేగాం హింసలో మావోయిస్టుల ప్రమేయం ఉందని.. ఆ కేసు దర్యాప్తు సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్రమోదీ హత్యకు మావోయిస్టులు కుట్ర పన్నిన విషయం వెలుగు చూసిందని.. ఇందులో విరసం నేత పెండ్యాల వరవరరావు సహా తొమ్మిది మంది ఉద్యమకారుల ప్రమేయం ఉందంటూ మహారాష్ట్ర పోలీసులు వారిని అరెస్ట్ చేశారు.

వరవరరావు వయసు 80 ఏళ్లు దాటింది. ఆయన ఆరోగ్యం విషమించిందని, కనీసం నడిచే స్థితిలో కూడా లేరని ఇటీవల ఆయన కుటుంబ సభ్యులు ఆందోళన వ్యక్తం చేశారు. జైలు సిబ్బంది వరవరావును అసలు పట్టించుకోవడం లేదని ఆరోపించారు.

గత జూలై నెలలో కోవిడ్ వ్యాధి సోకటం వల్ల వరవరరావును జేజే ఆస్పత్రిలో చేర్చాలని బాంబే హైకోర్టు ఆదేశించింది. ఆ సమయంలో వరవరరావు కుటుంబ సభ్యులు జేజే ఆసుపత్రికి వెళ్లినప్పుడు ట్రాన్సిట్ వార్డులో మూత్రంతో తడిసి ఉన్న బెడ్‌పై వరవరరావు స్థిమితం లేకుండా కనిపించినట్లు తమకు సమాచారం అందిందని ఎన్‌హెచ్ఆర్‌సీ పేర్కొంది.

పోస్ట్‌ X స్కిప్ చేయండి
X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

హెచ్చరిక: థర్డ్ పార్టీ కంటెంట్‌లో ప్రకటనలు ఉండొచ్చు

పోస్ట్ of X ముగిసింది

భార్యను, కూతుర్లను ఆయన వెంటనే గుర్తుపట్టలేకపోయారని, ట్రాన్సిట్ వార్డులో ఎలాంటి చికిత్స సదుపాయాలూ లేవని నర్సులు వారికి చెప్పారని తెలిపింది.

ఎన్‌హెచ్‌ఆర్‌సీ ప్రత్యేక పర్యవేక్షకురాలు మజా దరువాలా నుంచి కూడా తలోజా జైలులో వరవరరావు ఎదుర్కొంటున్న ఇబ్బందుల గురించి ఫిర్యాదు అందినట్లు తెలిపింది.

60 ఏళ్లకు పైబడి, అనారోగ్య సమస్యలతో ఉన్నవారికి కోవిడ్ ముప్పు ఎక్కువగా ఉంటుందని, ఈ నేపథ్యంలో వరవరరావు పరిస్థితి కూడా ఆందోళన కలిగిస్తోందని ఎన్‌హెచ్‌ఆర్‌సీ వ్యాఖ్యానించింది.

ఆలస్యం చేయకుండా, వెంటనే ఆయన్ను ఏదైనా ప్రముఖ సూపర్ స్పెషాలిటీ ప్రైవేట్ ఆసుపత్రిలో చేర్చాలని మహారాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది.

ప్రస్తుతం విచారణ ఖైదీగా వరవరరావు ప్రభుత్వం అదుపులో ఉన్నారని, చట్టబద్ధమైన సంరక్షక హోదాలో ఆయన వైద్య ఖర్చులన్నీ ప్రభుత్వమే భరించాల్సి ఉంటుందని స్పష్టం చేసింది.

కోవిడ్ చికిత్స అనంతరం వరవరరావును మళ్లీ జైలుకు తరలించారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)