క్రియోలిపోలిసిస్: శరీరంపై ఎలాంటి కోత పెట్టకుండానే పేరుకుపోయిన మొండి కొవ్వును కరిగించే చికిత్స

ఐల్సా బర్నో ముర్డోచ్‌

ఫొటో సోర్స్, AILSA BURN-MURDOCH

ఫొటో క్యాప్షన్, ఐల్సా బర్నో ముర్డోచ్‌
    • రచయిత, సాండ్రైన్ లుంగుంబు
    • హోదా, బీబీసీ ప్రతినిధి

కొవ్వును కరిగించడం లేదా క్రియోలిపోలిసిస్ అనేది ప్రసిద్ధ సౌందర్య ప్రక్రియ. ప్రపంచవ్యాప్తంగా క్లినిక్‌లు, స్పాలలో ఈ తరహా సౌందర్య చికిత్సలు ప్రతీ ఏడాది 80 లక్షలకు పైగా జరుగుతుంటాయని ఒక అంచనా.

కానీ ఈ ప్రక్రియ చాలా ఆలస్యంగా చర్చల్లోకి వచ్చింది.

1990 లలో సూపర్‌మోడల్‌గా ప్రసిద్ధి చెందిన కెనడా తార లిండా ఎవాంజిలిస్టా ఈ చికిత్స విధానంపై 50 మిలియన్ డాలర్ల (రూ. 374 కోట్లు) దావా వేశారు. ఈ చికిత్స వల్లే తాను 'వికృతంగా, అందవిహీనంగా' తయారయ్యానని ఆమె ఆరోపించారు.

క్రియోలిపోలిసిస్ చికిత్స అనంతరం అరుదైన సైడ్ ఎఫెక్ట్ 'పారాడాక్సికల్ ఎడిపోస్ హైపర్‌ప్లేసియా (పీఏహెచ్)'కు గురయ్యానని లిండా తెలిపారు.

తనకు వాగ్ధానం చేసిన దానికి పూర్తిగా విరుద్ధంగా కొవ్వు కణాలు పెరిగాయని ఆమె వెల్లడించారు. చికిత్సకు ముందు తనకు ఈ ప్రభావం గురించి ఎలాంటి సమాచారం ఇవ్వలేదని ఆమె అన్నారు.

లిండా ఆరోపణలు చేస్తోన్న కంపెనీని దీనిపై మాట్లాడాలని బీబీసీ కోరగా, వారు స్పందించలేదు.

ఆమె తన వెబ్‌సైట్‌లో 'చికిత్స తర్వాత రోగి ఫలితాలు మారవచ్చు. అరుదైన సైడ్ ఎఫెక్ట్స్‌కు కూడా గురి కావచ్చు' అని వ్యంగ్యంగా రాసుకొచ్చారు. క్రియోలిపోలిసిస్ చికిత్స చేయించుకున్న తర్వాతే లిండా ఈ విధంగా రాశారని ఆమె సలహాదారులు చెప్పారు.

కానీ ఇందులో ఉండే ప్రమాదాలేంటి? అసలు చికిత్స ఎలా ఉంటుంది? దీని గురించి ముగ్గురు వ్యక్తులు వారి సొంత అనుభవాలను పంచుకున్నారు.

కాస్మోటిక్ చికిత్స

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, శరీరంలో పేరుకుపోయిన కొన్ని కొవ్వు ప్యాకెట్లపై ఈ చికిత్సలో దృష్టి సారిస్తారు.

''వాక్యూమ్ క్లీనర్‌లో ఇరుక్కుపోయినట్లుగా అనిపిస్తుంది''

బ్రిటన్‌కు చెందిన 39 ఏళ్ల ఐల్సా బర్నో ముర్డోచ్‌కు కాస్మోటిక్ చికిత్సలు కొత్తేం కాదు. ఐల్సా టీనేజ్ నుంచే తాను అందంగా లేనని బాధపడేవారు. అందుకే తన కుటుంబానికి, స్నేహితులకు తెలియకుండా ఆమె 21 ఏళ్ల వయస్సులోనే లైపోసక్షన్‌, బ్రెస్ట్ ఇంప్లాంట్స్ అనే సౌందర్య చికిత్సలు చేయించుకున్నారు.

''నేను లైపోసక్షన్ సర్జరీ చేయించుకున్నా. కానీ నాకు తిండి విషయంలో, శరీర అందం విషయంలో కొన్ని అపోహలు ఉన్నాయి''

''అసలు నేను ఆ చికిత్సకు వెళ్లకుండా ఉండాల్సింది. ఎందుకంటే అప్పటికి నేను చాలా సన్నగానే ఉండేదాన్ని'' అని ఐల్సా బీబీసీతో చెప్పారు.

కరీబియన్ దీవులకు వెళ్లాక మళ్లీ ఆమెను పాత భయాలు వెంటాడాయి. తన శరీరం చూడటానికి బావుండదని ఆమె భావించారు. అందుకే గతేడాది ఆమె, కొవ్వును అతి తక్కువ ఉష్ణోగ్రతల్లో గడ్డకట్టించి కరిగించడం అనే క్రియోలిపోలిసిస్ చికిత్స విధానాన్ని ఎంచుకున్నారు.

రెండు నెలల పాటు మూడు సెషన్లలో వీపు, చేతులు, పొత్తికడుపు, తొడల భాగాల్లో చికిత్స చేయించుకున్నారు. ఇలాంటి సౌందర్య చికిత్స ఒకటి ఉంటుందని తెలుసుకున్న ఆమె, దీన్ని చవకగా అందించే వారి వైపు మొగ్గు చూపారు.

''నేను ఈ చికిత్స అందించే రెండు ప్రదేశాల్లో ఒకదాన్ని ఎంచుకోవాల్సి వచ్చింది. ఒకటేమో హెయిర్ సెలూన్ కింద ఏర్పాటు చేసిన గదిలో ఒక మహిళ నిర్వహించేది కాగా...రెండోది డిపార్ట్‌మెంట్ స్టోర్‌లో ఉన్న ఫ్యాన్సీ క్లినిక్'' అని ఆమె వెల్లడించారు.

''కానీ చికిత్సకు నిర్దేశించిన ధర నా నిర్ణయాన్ని ప్రభావితం చేసింది. ఖరీదైన ప్రదేశానికి వెళ్లకుండా నేను చవకగా ఈ సౌలభ్యాన్ని పొందాలనుకున్నా'' అని ఐల్సా చెప్పారు.

AILSA BURN-MURDOCH

ఫొటో సోర్స్, AILSA BURN-MURDOCH

ఫొటో క్యాప్షన్, తొలి సెషన్ అనంతరం ఐల్సా ఈ ఫొటో తీసుకున్నారు

ఈ కాస్మోటిక్ చికిత్స కోసం ఆమె 650 పౌండ్లు (రూ. 67,136) వెచ్చించారు. చికిత్స చేయాల్సిన శరీర భాగాలపై ఆధారపడి క్రియోలిపోలిసిస్ ధరలు మారుతుంటాయి.

యూకేలో ఒకసారి ఈ చికిత్స పొందాలంటే 400 పౌండ్ల (రూ. 41,320) నుంచి 800 పౌండ్ల (రూ. 82,639) వరకు ఖర్చు చేయాల్సి ఉంటుంది.

ఈ చికిత్సకు సంబంధించి తాను ఏ డాక్టర్‌ను సంప్రదించలేదని, ఈ సౌందర్య చికిత్స చేసేవారితో మాట్లాడిన రోజే చికిత్స చేయించుకున్నట్లు ఐల్సా వెల్లడించారు.

శరీరంలోని ప్రతీ భాగానికి చికిత్స చేయడానికి ఒక సెషన్ 45 నిమిషాల సమయం తీసుకుంటుంది. ఆ సమయంలో సదరు శరీర భాగం ఒక మిషన్‌ కు బిగిస్తారు.

''వ్యాక్యుమ్ క్లీనర్ మనల్ని లోపలికి లాక్కుంటే ఎలా ఉంటుందో అలా అనిపిస్తుంది. నా కడుపు గట్టిగా, గడ్డ కట్టిన బట్టర్‌లా తయారైంది. ముట్టుకుంటే చాలా చల్లగా, దృఢంగా అనిపించింది'' అని ఐల్సా గుర్తు చేసుకున్నారు.

''శరీరంపై దీర్ఘ చతురస్రాకారంలో గాయాలయ్యాయి. వీపుపై అవి మరీ ఎక్కువగా అయినట్లు నాకు గుర్తు. అక్కడ చర్మం ఊదా రంగులోకి మారింది. కానీ అవి అంతగా నొప్పిని కలిగించలేదు.'' అని ఆమె తెలిపారు.

''అనుకున్న ప్రణాళిక ప్రకారమే చికిత్స జరిగింది. కానీ దాని తర్వాత శరీరంలో పెద్ద మార్పులేమీ నాకు కనిపించలేదు. అనవసరంగా నేను డబ్బులు ఖర్చు చేశాను'' అని ఆమె అన్నారు.

చవకగా అయిపోవాలని అనుకున్నందుకే నాకు ఇలా జరిగి ఉంటుందేమో అనే అనుమానం కూడా వచ్చింది. ''కాస్త ఖరీదైన క్లినిక్‌లో చికిత్స చేయించుకుంటే, ఫలితాలు మరోలా ఉండేవేమో అని నేను అనుకున్నాను''

ఇదంతా చూశాక ఏమనిపించింది?

''వీపు భాగంలో అధిక కొవ్వు ఉండటంతో నాకు సిగ్గుగా అనిపించేది. ఆ భాగం కూడా అందంగా ఉండాలని నేను కోరుకున్నా. కానీ ఇప్పుడు నేను తెలివైనదాన్ని. నా శరీరం నాకు అసలు సమస్యే కాదని అర్థం చేసుకున్నా. ఆరోగ్యాన్ని కాపాడుకోవాలంటే శరీరంలోని కొవ్వును ఇలా తొలిగించడం సరైన పద్ధతి కాదని తెలుసుకున్నా'' అని ఆమె చెప్పారు.

లిండా ఎవాంజెలిస్టా

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, క్రియోలిపోలిసిస్ చికిత్స ద్వారా తనకు పారాడాక్సికల్ ఎడిపోస్ హైపర్‌ప్లాసియా వచ్చిందని లిండా చెప్పారు.

క్రియోలిపోలిసిస్ అంటే ఏంటి?

ఇదో నాన్ ఇన్వాసిస్ పద్ధతి. అంటే శరీరంపై ఎలాంటి కోత పెట్టకుండానే ఈ చికిత్సను చేస్తారు. శరీరంలో పేరుకుపోయిన మొండి కొవ్వును అతి తక్కువ ఉష్ణోగ్రత దగ్గర నాశనం చేయడమే దీని లక్ష్యం.

ప్రపంచవ్యాప్తంగా చాలా క్లినిక్‌లలో ఈ చికిత్స అందుబాటులో ఉంది. సాధారణంగా గడ్డం కిందిభాగం, తొడల చుట్టూ, పొత్తి కడుపు, చేతి పై భాగాల్లో పేరుకునే కొవ్వు కణాలను ఈ విధానంలో తొలిగిస్తారు.

ఊబకాయులకు, బరువు తగ్గాలనుకునే వారికి ఈ చికిత్స సరికాదు. చర్మం దెబ్బతినడం, దురద, చికిత్స జరిగిన ప్రదేశంలో తిమ్మిరి రావడం వంటి దుష్ప్రభావాలు ఎదురవుతాయి.

మోడల్ లిండా పేర్కొన్నట్లు 'పారాడాక్సికల్ ఎడిపోస్ హైపర్‌ప్లేసియా' అనే అరుదైన దుష్ప్రభావం కూడా కలుగుతుంది. దీనివల్ల కొవ్వు కణాలు కుచించుకుపోకుండా, వాటి పరిమాణం పెరుగుతుంటుంది.

అయితే ఇలా పురుషుల్లోనే చాలామంది అనుకుంటారు. కానీ, ఇలా అనుకోవడానికి సరైన కారణం కూడా లేదు.

JOANNE MUHAMMAD

ఫొటో సోర్స్, JOANNE MUHAMMAD

ఫొటో క్యాప్షన్, జానె ముహమ్మద్

ఈ చికిత్సలు పనిచేస్తాయా?

లండన్‌కు చెందిన ఫొటోగ్రాఫర్ జానె ముహమ్మద్ నాలుగేళ్ల క్రితం క్రియోలిపోలిసిస్ చికిత్స చేయించుకున్నారు. అప్పటికే ఆమె 15.9 కిలోల బరువు తగ్గారు.

''నాకు పొట్ట కొంచెం ఎక్కువగా ఉందనిపించింది. అది శరీరంలో పేరుకు పోయిన కొవ్వు వల్ల ఏర్పడింది. నేను ఎన్ని ఎక్సర్‌సైజ్‌లు చేసినా అది తగ్గదని అనిపించింది' అని బీబీసీతో ఆమె చెప్పారు.

''నాకంటూ ఒక ఇమేజ్ క్రియేట్ చేసుకోవడానికి ఆ నిర్ణయం తీసుకున్నా. చికిత్స చేయించుకున్న తర్వాత, ప్రతిరోజు ఉదయం లేవగానే అద్దంలో చూసుకుంటే నాకు అంతా బాగుందనే భావన కలిగింది'' అని ఆమె అన్నారు.

లండన్‌లోని ఒక క్లినిక్ ప్రత్యేక ఆఫర్ ప్రకటించింది. దీంతో మూడు సెషన్ల చికిత్స కోసం 450 పౌండ్లు వెచ్చించారామె. నిపుణుల పర్యవేక్షణలో ఒక ట్రైనీ ఈ సెషన్లను నిర్వహించారు.

''ప్రతీ దశలోను వారు చాలా జాగ్రత్తలు తీసుకున్నారు. చికిత్స చేయడానికి ముందు ఆమెకు డాక్టర్లు తగు సూచనలు ఇచ్చారు. చికిత్స తర్వాత కలిగే దుష్ప్రభావాల గురించి కూడా వారు నన్ను హెచ్చరించారు. ఒకవేళ ఈ విధానంలో ఏదైనా తప్పు జరిగి, నాకు హెచ్‌పీఏ ఏర్పడి ఉండే వారు తిరిగి డబ్బు చెల్లించి ఉండేవారు '' అని అన్నారామె.

''నేను తల్లిని. నా పొత్తి కడుపు దగ్గర ఉండే కొవ్వును వారు తొలిగించారు. చాలా అద్భుతంగా అనిపించింది. కానీ మళ్లీ నేను బిడ్డకు జన్మనివ్వాల్సి వచ్చింది. ఆ తర్వాత, అదే చికిత్స కోసం మళ్లీ నేను అదే క్లినిక్ వెళ్లాను. కానీ ఈ చికిత్సలను 'సులభమైన పరిష్కార మార్గాలుగా' భావించకూడదు'' అని ఆమె హెచ్చరించారు.

''ఈ చికిత్సలు సరైన ఫలితాలను ఇస్తాయి. కానీ మీరు ఎక్సర్‌సైజ్, నీరు బాగా తాగడం, ఆరోగ్యకరమైన జీవన విధానాన్ని పాటించడం వంటి వాటిపై దృష్టి సారించాలి'' అని ఆమె వివరించారు.

రైనర్ జువాటి

ఫొటో సోర్స్, RAINER JUATI

ఫొటో క్యాప్షన్, రైనర్ జువాటి

''తమ శరీరం నుంచి ఏం ఆశిస్తున్నారో ప్రతీ ఒక్కరూ ఎంచుకోగలగాలి''

ఘనాకు చెందిన మైనింగ్ ఇంజనీర్ రైనర్ జువాటి, తన రూపాన్ని మార్చుకోవాలని తీవ్రంగా భావించేవారు. క్రియోలిపోలిసిస్‌ గురించి విన్న ఆమె లిండా అనుభవాల కారణంగా ఆ విధానం తనకు సరైనది కాదని తెలుసుకున్నారు.

చిన్నతనంలో ఆమె బరువులో హెచ్చుతగ్గులు వస్తుండేవి. ఒక్కోసారి అతిగా బరువున్నందుకు, కొన్నిసార్లు అతిగా సన్నబడినందుకు ఆమెను చూసి పాఠశాలలో అందరూ నవ్వేవారు.

రూపాన్ని మార్చుకోవాలని అనుకోవడానికి ముఖ్య కారణం అక్కడి సంస్కృతితో పాటు సోషల్ మీడియా కూడా ఒక కారణమని ఆమె చెప్పారు.

ఒక ఏడాది పాటు డైట్ పాటించడం, ఎక్సర్‌సైజులు చేసినప్పటికీ మార్పు రాకపోవడంతో ఆమె సులభమైన మార్గాలను అన్వేషించడం మొదలు పెట్టారు.

''ఆఫ్రికన్ సంస్కృతి నుంచి వచ్చిన నాకు, లావుగా ఉంటే బంధువులు నవ్వుతారనే సంగతి తెలుసు'' అని 29 ఏళ్ల రైనర్ చెప్పారు.

''ఘనా దేశంలో అధిక బరువున్న వారిని హేళన చేయడానికి 'ఒబోలో' అనే పదాన్ని వాడతారు'' అన్నారామె.

''తమ శరీరం నుంచి తమకు కావాల్సిందేంటో ప్రతీ ఒక్కరు తెలుసుకోగలరని నేను నమ్ముతున్నా. ఘనాలో శస్త్రచికిత్సలు చాలా అరుదు. కానీ నేను ఇప్పుడు కాస్త అందరిలా సాధారణంగా కనబడగలుగుతున్నా'' అని రైనర్ అన్నారు.

‘‘క్రియోలిపోలిసిస్ చికిత్స విధానం, దానివల్ల కలిగే ప్రమాదాలు, ఇబ్బందుల గురించి ప్రస్తుతం అందరికీ అవగాహన ఉన్నప్పటికీ, చాలామంది వాటిపట్ల వెనక్కి తగ్గడం లేదు’’ అని ఆమె అభిప్రాయపడ్డారు.

కాస్మోటిక్ చికిత్స

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, నాన్ సర్జికల్ చికిత్స విధానాల వల్ల కూడా ప్రమాదాలు ఉంటాయని మేరీ హెచ్చరించారు

నిపుణులు ఏమంటున్నారు?

వినగానే అద్భుతంగా అనిపించే, సరైన అర్హతలు లేని వైద్యులు అందించే వైద్య విధానాల పట్ల జాగ్రత్తగా ఉండాలని బ్రిటిష్ అసోసియేషన్ ఆఫ్ ప్లాస్టిక్ సర్జన్స్ వైస్ ప్రెసిడెంట్ మార్క్ పసిఫికో హెచ్చరించారు.

''వైద్య చికిత్స కాబట్టి వైద్యం అందించేవారు రోగితో పారదర్శకంగా ఉండటం చాలా అవసరం'' అని పసిఫికో అన్నారు.

''క్రియోలిపోలిసిస్ విధానం ద్వారా అందంగా తయారవ్వాలని భావించేవారు...అది పెయిన్‌లెస్ కాదని, అన్నిసార్లు కోరుకున్న ఫలితాలు రావనే విషయాన్ని తెలుసుకుని ఉండాలి'' అని సూచించారు.

బ్రిటిష్ అసోసియేషన్ ఆఫ్ ప్లాస్టిక్ సర్జన్స్ ఇటీవల చేసిన అధ్యయనంలో, తమ సర్జన్లు 21 కేసుల్లో సమస్యల్ని ఎదుర్కొన్నట్లు వెల్లడైంది.

''పారాడాక్సికల్ ఎడిపోస్ హైపర్‌ప్లేసియా అనేది అరుదుగా వచ్చేది. కానీ ఇది సాధారణమైనదే'' అన్నారు పసిఫికో.

''హెచ్‌పీఏకు చికిత్స చేయాలంటే పొత్తి కడుపుపై చాలా పెద్ద ఆపరేషన్స్ చేయాల్సి ఉంటుంది. హెచ్‌పీఏతో పాటు కొవ్వు గడ్డకట్టించడం వల్ల ఒక్కోసారి అక్కడి చర్మ కణాలు చచ్చిపోవడం వంటి సమస్యలు ఎదుర్కోవాల్సి ఉంటుంది'' అని పసిఫికో వెల్లడించారు.

ఈ చికిత్స విధానాల కోసం కఠినమైన నిబంధనలు అమల్లోకి తీసుకురావాలని బ్రిటిష్ అసోసియేషన్ ఆఫ్ ప్లాస్టిక్ సర్జన్స్ పిలుపునిచ్చింది.

''ఈ చికిత్స విధానాల గురించి ప్రసారమయ్యే అడ్వర్టైజ్‌మెంట్‌లు ఆందోళన కలిగిస్తున్నాయి. సర్జరీ లేని ఇలాంటి చికిత్స విధానాలకు అసలు విశ్రాంతి తీసుకోవాల్సిన అవసరం లేదని అందులో చెబుతుంటారు. అందుకే శస్త్రచికిత్సల కంటే ఉత్తమమైనవని, వాటి తరహాలోనే అత్యుత్తమ ఫలితాలు పొందవచ్చని తప్పుదోవ పట్టిస్తుంటారు'' అని అసోసియేషన్ అధ్యక్షురాలు మేరీ ఓబ్రెయిన్ ఆందోళన వ్యక్తం చేశారు.

''శస్త్రచికిత్సలు కాని విధానాల వల్ల ఎటువంటి ప్రమాదాలు జరగవని అనుకోకూడదు. అందరూ ఇలా అనుకునే తప్పు చేస్తున్నారు'' అని ఆమె హెచ్చరించారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి)