దక్షిణ కొరియా: ఉత్తర కొరియాను విమర్శించే లౌడ్ స్పీకర్ ప్రసారాలను ఎందుకు నిలిపేసింది?

ఉత్తర కొరియా, దక్షిణ కొరియా, కొరియా యుద్ధం, లౌడ్ స్పీకర్లు

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, ఉత్తర కొరియా సరిహద్దుల్లో లౌడ్ స్పీకర్లను దక్షిణ కొరియా నిలిపివేసింది.
    • రచయిత, జోల్ గ్వింటో, జీన్ మెకంజీ
    • హోదా, బీబీసీ ప్రతినిధులు

రెండు దేశాల మధ్య ‘పరస్పర నమ్మకాన్ని పునరుద్ధరించే ప్రయత్నం’లో భాగంగా, ఉత్తర కొరియా సరిహద్దు వెంట లౌడ్ స్పీకర్ల క్యాంపెయిన్‌ను నిలిపివేసినట్టు దక్షిణ కొరియా సైన్యం తెలిపింది.

రెండు కొరియాల మధ్య సంబంధాలను మెరుగుపరచాలంటూ ప్రచారం చేసి అధ్యక్షుడిగా ఎన్నికైన లీ జే-మ్యుంగ్, ఎన్నికైన వారం తర్వాత ఈ నిర్ణయం తీసుకున్నారు.

లౌడ్ స్పీకర్ క్యాంపెయిన్‌ను ఉత్తర కొరియా, యుద్ధ కవ్వింపు చర్యగా భావిస్తుంది. వాటిని పేల్చివేస్తామని గతంలో బెదిరించింది.

లౌడ్ స్పీకర్ల క్యాంపెయిన్‌ను గతంలో ఆరు సంవత్సరాల పాటు నిలిపివేశారు. అయితే గత ఏడాది దక్షిణకొరియా సరిహద్దు వెంట చెత్తను మోసుకెళ్లే బెలూన్లను పంపాలన్న ఉత్తర కొరియా ప్రయత్నాలకు ప్రతిస్పందనగా గత ఏడాది జూన్‌లో వాటిని తిరిగి ప్రారంభించింది దక్షిణ కొరియా.

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌
ఫొటో క్యాప్షన్, బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి
ఉత్తర కొరియా, దక్షిణ కొరియా, కొరియా యుద్ధం, లౌడ్ స్పీకర్లు
ఫొటో క్యాప్షన్, ఉత్తర కొరియా, దక్షిణ కొరియా మధ్య ఉద్రిక్తతలు తగ్గించే ప్రయత్నాలు జరుగుతున్నాయి.

కొరియాల మధ్య ఉద్రిక్తతలు తగ్గించే ప్రయత్నం

ఇటీవలి సంవత్సరాల్లో ఉభయ కొరియాల నుంచి, విదేశాల నుంచి వచ్చే ప్రసారాలలో దక్షిణకొరియాలో ప్రజాస్వామ్యం గురించి, జీవన విధానం గురించి వార్తలు, సమాచారం ఎక్కువగా ఉంది.

దక్షిణ కొరియాతో కాస్త దురుసుగా వ్యవహరించిన గత అధ్యక్షుడు యూన్ సుక్ యోల్ హయాంలో రెండు కొరియాల మధ్య సంబంధాలు క్షీణించాయి.

దేశ వ్యతిరేక శక్తులు, ఉత్తర కొరియా సానుభూతిపరుల నుంచి బెదిరింపులు వస్తున్నాయని చెబుతూ, డిసెంబరులో దక్షిణ కొరియాలో మార్షల్ లా విధించినందుకు యూన్‌ను అభిశంసించి, పదవి నుంచి తొలగించారు .

ఆయన తర్వాత అధ్యక్షుడిగా ఎన్నికైన లీ, ఉత్తర కొరియాతో చర్చలు తిరిగి ప్రారంభించడం, రెండు దేశాల మధ్య ఉద్రిక్తతలను తగ్గించడం వంటి వాగ్దానాలు చేశారు.

‘‘కొరియాల సంబంధాలపై నమ్మకాన్ని పునరుద్ధరించడం, కొరియా ద్వీపకల్పంలో శాంతిని సాధించడం ఈ చర్య లక్ష్యం’’ అని సైన్యం ఒక ప్రకటనలో తెలిపింది.

ఉత్తర కొరియా, దక్షిణ కొరియా, కొరియా యుద్ధం, లౌడ్ స్పీకర్లు

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్

‘ఉత్తర కొరియా పాలనను స్వాగతిస్తున్నట్టుంది’

కానీ ఉత్తర కొరియన్ల మానవ హక్కులను మెరుగుపరచాలని వాదించే సంస్థలు ఈ చర్యను విమర్శించాయి.

"లౌడ్ స్పీకర్‌లు ఉత్తర కొరియా ప్రజలకు కీలకమైన వారధి. వాటిని మనం మరచిపోలేమని గుర్తు చేస్తున్నాయి. వాటిని ఆపివేయడం ద్వారా, తన ప్రజలను ఏకాకులుగా ఉంచడానికి కిమ్ జోంగ్ ఉన్ చేస్తున్న ప్రయత్నాలను మనం బలోపేతం చేసినట్లే" అని సియోల్‌లో ఉన్న డేటాబేస్ సెంటర్ ఫర్ నార్త్ కొరియన్ హ్యూమన్ రైట్స్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ హనా సాంగ్ అన్నారు.

"కొత్త ప్రభుత్వం తీసుకున్న మొదటి చర్యల్లో ఒకటైన లౌడ్ స్పీకర్లను నిలిపివేత అన్నది ఇబ్బందికరమైన సంకేతం. ఉత్తర కొరియా పాలనను స్వాగతిస్తున్న రోజులకు మనం తిరిగి వస్తున్నట్లుగా ఇది ఉంది'' అని ఆమె అన్నారు.

కానీ, సరిహద్దు వెంట నివసిస్తున్న వారు ఈ చర్యను స్వాగతించారు. దక్షిణ, ఉత్తర కొరియాల రెండింటి నుంచి వచ్చే లౌడ్ స్పీకర్ల శబ్దం వల్ల తమ జీవితాలు అస్తవ్యస్తంగా మారాయని వారు చాలాకాలంగా ఆరోపిస్తున్నారు. కొన్నిసార్లు అర్ధరాత్రి సమయంలో కూడా ఈ శబ్దాలు వస్తాయని తెలిపారు.

ఉత్తర కొరియా, దక్షిణ కొరియా, కొరియా యుద్ధం, లౌడ్ స్పీకర్లు

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, దాదాపు ఏడాది తర్వాత సరిహద్దుల్లో లౌడ్ స్పీకర్ల మోత ఆగిపోయింది.

దాదాపు ఏడాది తర్వాత లౌడ్ స్పీకర్లకు విరామం

"ధ్వని ద్వారా ఉత్తరకొరియా చేసే మానసిక యుద్ధానికి ఈ నిర్ణయం ముగింపు పలికి, మా ప్రాంతంలో నివసించేవారు వారి సాధారణ దైనందిన జీవితాలకు తిరిగి రావడానికి వీలు కల్పిస్తుందని మేం ఆశిస్తున్నాం" అని దక్షిణ కొరియా సరిహద్దు ప్రాంతమైన గంగ్వా కౌంటీ ఒక ప్రకటనలో తెలిపింది.

యోన్‌హాప్ వార్తా సంస్థ నివేదిక ప్రకారం, ఉత్తర కొరియా ఇకపై చెత్తతో నిండిన బెలూన్‌లను సరిహద్దు గుండా పంపబోదన్న విషయాన్ని కూడా సైన్యం పరిగణనలోకి తీసుకుంది.

అయితే, మైకులు, లౌడ్ స్పీకర్లను తొలగించడానికి బదులుగా నిలిపివేయడం ద్వారా, అవసరమైతే వాటిని మళ్లీ ఉపయోగించవచ్చని సైన్యం సంకేతమిస్తున్నదని యోన్‌హాప్ అభిప్రాయపడింది.

ఈ ప్రసారాలు సరిహద్దు వెంబడి పగటిపూట 10 కిలోమీటర్ల వరకు, రాత్రిపూట 24 కిలోమీటర్ల వరకు వినొచ్చని సియోల్ తెలిపింది.

2024 జూన్‌లో లౌడ్ స్పీకర్ల క్యాంపెయిన్ తిరిగి ప్రారంభించిన దాదాపు ఒక సంవత్సరం తర్వాత వాటిని నిలిపివేశారు. ఈ ఏడాది కాలంలో రెండు దేశాలు బెలూన్‌లతో చెత్తను పంపడం వంటి పరస్పర ప్రతీకార చర్యలకు దిగాయి.

1953లో శాంతి ఒప్పందం లేకుండా కొరియా యుద్ధం ముగిసినప్పటి నుంచీ రెండు దేశాలు సాంకేతికంగా ఇప్పటికీ యుద్ధంలోనే ఉన్నాయి.

దక్షిణకొరియా సరిహద్దుల్లో డజన్ల కొద్దీ లౌడ్ స్పీకర్ల ద్వారా పాప్ మ్యూజిక్ నుంచి ఉత్తరకొరియాలోని ముఖ్యమైన పరిణామాల విశ్లేషణల వరకు ప్రసారం చేస్తుంటారు.

ఈ ప్రసారాలన్నీ ఉత్తర కొరియా సైన్య బలగాలకూ, సరిహద్దుల్లో ఉండే ప్రజలకు స్పష్టంగా వినిపిస్తుంటాయి.

దక్షిణ కొరియాకు దీటుగా ఉత్తరకొరియా కూడా తన సరిహద్దుల్లో దక్షిణ కొరియా, దాని మిత్రదేశాలను విమర్శిస్తూ స్పీకర్ల ద్వారా ప్రచారం చేస్తుంటుంది.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)