చిన్నపిల్లల్లో టైప్-1 డయాబెటిస్ దూకుడుకు కారణమేంటో కనిపెట్టిన శాస్త్రవేత్తలు

టైప్-1 డయాబెటిస్ తొలిసారి నిర్ధరణ అయినప్పుడు ఆసుపత్రిలో ఉన్న గ్రేసీ నయీ

ఫొటో సోర్స్, Nye family

ఫొటో క్యాప్షన్, పిల్లల్లో టైప్ 1 డయాబెటిస్‌ దూకుడుకు కారణమేంటో శాస్త్రవేత్తలు గుర్తించారు
    • రచయిత, జేమ్స్ గల్లాఘెర్
    • హోదా, హెల్త్ కరస్పాండెంట్

చిన్నపిల్లల్లో టైప్-1 డయాబెటిస్ ప్రారంభమయ్యే సమయంలో అది తీవ్రంగా, దూకుడుగా ఉండటానికి గల కారణాలను శాస్త్రవేత్తలు గుర్తించారు.

రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించే ప్యాంక్రియాస్‌ కణాలపై రోగనిరోధక వ్యవస్థ దాడి చేయడం వల్ల టైప్-1 డయాబెటిస్ వస్తుంది.

చిన్నారులలో, ముఖ్యంగా ఏడేళ్లలోపువారిలో ప్యాంక్రియాస్ ఇంకా అభివృద్ధి దశలోనే ఉండటం వల్ల ఈ కణాలు దెబ్బతినే ప్రమాదం ఉందని పరిశోధనా బృందం వెల్లడించింది.

అయితే కొత్తగా అభివృద్ది చేసిన మందులు ప్యాంక్రియాస్ పరిపక్వం చెందడానికి, డయాబెటిస్‌‌ను అడ్డుకోవడానికి రోగులకు సమయాన్ని ఇవ్వగలవని వారు చెబుతున్నారు.

యూకేలో దాదాపు 4,00,000 మంది డయాబెటిస్ బాధితులు ఉన్నారు.

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్
ఫొటో క్యాప్షన్, బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి
గ్రేసీ (పింక్ గ్లాసెస్)తో నయీ కుటుంబం...

ఫొటో సోర్స్, Nye family

ఫొటో క్యాప్షన్, గ్రేసీ (పింక్ గ్లాసెస్)తో నయీ కుటుంబం...

కొద్దిపాటి జలుబులా మొదలై...

మెర్సీసైడ్‌కు చెందిన ఎనిమిదేళ్ల గ్రేసీ, 2018లో ఓ రోజున హఠాత్తుగా జబ్బు పడింది. ఇది కొద్దిపాటి జలుబులా మొదలై, వేగంగా విస్తరించింది.

‘‘నర్సరీకి వెళ్లి బుడిబుడి అడుగులేస్తూ ఆటపాటలతో సంతోషంగా పెరగాల్సిన ఈ ఏడాది వయస్సు ఉన్న పాప, కేవలం 48 గంటల్లోనే దాదాపు చనిపోయేంత ప్రమాద స్థితికి చేరుకుంది'' అని గ్రేసీ తండ్రి గారెత్ చెప్పారు.

''పాపకు డయాబెటిస్ నిర్ధరణ కావడం మా జీవితంలో ఇప్పటికీ అత్యంత బాధాకరమైన సంఘటనగా మిగిలిపోయింది'' అన్నారు ఆయన. ఈ ఘటనతో గ్రేసీ ఏం తింటుంది, ఎప్పుడు తింటుంది, రక్తంలో చక్కెర స్థాయి ఎలా ఉందనే విషయాలన్నీ నిరంతరం గమనించడంతోపాటు ఇన్సులిన్ హార్మోన్ ఇచ్చేవారు.

ఇప్పుడు గ్రేసీకి గ్లూకోజ్ మానిటర్, ఇన్సులిన్ పంప్ ఉన్నాయి. ఆమె డయాబెటిస్‌ను అదుపులోఉంచుతోందని గారెత్ చెప్పారు.

గ్రేసీ ఒక సూపర్‌స్టార్ అన్నారు.

డయాబెటీస్

ఫొటో సోర్స్, Getty Images

పరిశోధనతో కొత్త మందులకు అవకాశం

అయితే, గ్రేసీ లాగా చిన్న వయస్సులో, ముఖ్యంగా ఏడేళ్లలోపు డయాబెటిస్ నిర్ధరణ అయిన పిల్లల్లో, టినేజ్ లేదా ఆ తదుపరి వయసులో డయాబెటిస్ నిర్ధరణ అయినవారి కంటే ఈ వ్యాధి ఎందుకు తీవ్రంగా ఉంటుందనేదీ ఇప్పటి దాకా అంతుచిక్కని రహస్యంగా మిగిలిపోయింది.

సైన్స్ అడ్వాన్సెస్ పత్రికలో ప్రచురితమైన తాజా అధ్యయనం దీని కారణాన్ని స్పష్టంగా తెలిపింది. ప్యాంక్రియాస్‌లో ఉండే బీటా కణాల అభివృద్ధి దీని కేంద్రబిందువని తెలిపింది. రక్తంలో చక్కెర స్థాయిలు పెరిగినప్పుడు ఇన్సులిన్‌ను విడుదల చేసేవి బీటా కణాలే.

ఎక్సెటర్ విశ్వవిద్యాలయ పరిశోధకులు 250 మంది దాతల ప్యాంక్రియాస్ నమూనాలను పరిశీలించి, బీటా కణాలు వయస్సు పెరుగుతున్నకొద్దీ ఎలా పరిపక్వం పొందుతాయో, అలాగే టైప్–1 డయాబెటిస్‌లో వాటి పరిణామం ఎలా ఉంటుందో అధ్యయనం చేశారు.

చిన్న వయసులో ఈ కణాలు చిన్న గుంపులుగా లేదా ఒంటరిగా మాత్రమే ఉంటాయి. వయస్సు పెరిగే కొద్దీ వీటి సంఖ్య పెరిగి లాంగర్‌హాన్స్ దీవులు అని పిలిచే పెద్ద సమూహాలుగా మారుతాయి.

అయితే రోగనిరోధక వ్యవస్థ దాడి ప్రారంభమైన తరువాత చిన్న గుంపులుగా ఉన్న కణాలు త్వరగా నాశనమై, పరిపక్వత సాధించే అవకాశం లేకుండా పోతుంది. పెద్ద గుంపులుగా ఉన్న కణాలు కూడా దాడికి గురవుతాయి, కానీ వాటి నిర్మాణం బలంగా ఉండటం వల్ల కొంతకాలం ఇన్సులిన్ ఉత్పత్తి కొనసాగుతుంది, దీని వలన వ్యాధి తీవ్రత కొంత తగ్గుతుంది.

ఈ అధ్యయనం టైప్–1 డయాబెటిస్‌ను అర్థం చేసుకోవడంలో కీలక మలుపు అని ఎక్సెటర్ విశ్వవిద్యాలయానికి చెందిన డాక్టర్ సారా రిచర్డ్సన్ బీబీసీకి చెప్పారు. ఇప్పుడు డయాబెటిస్ నిర్థరణ అవుతున్న పిల్లలకు భవిష్యత్తు మరింత ఆశాజనకంగా ఉంటుందని ఆమె తెలిపారు. ఆరోగ్యవంతులైన పిల్లలకు ఈ వ్యాధి ఉందో లేదో స్క్రీనింగ్ చేయడానికి, వ్యాధి రాకుండా వాయిదా వేయడానికి కొత్త ఇమ్యునోథెరపీ మందులు అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది.

రోగనిరోధక వ్యవస్థ బీటా కణాలపై దాడి చేయడాన్ని ఆపివేసి, అవి పరిణితి చెందడానికి సమయం ఇవ్వగల 'టెప్లిజుమాబ్' అనే ఇమ్యునోథెరఫీ ఔషధానికి యూకే అనుమతి ఇచ్చింది. అయితే, ఇది ఇంకా నేషనల్ హెల్త్ సర్వీసు (ఎన్‌హెచ్‌ఎస్) ద్వారా అందుబాటులోకి రాలేదు.

''పిల్లలలో టైప్-1 డయాబెటిస్ చికిత్స కోసం మా వద్ద కొత్త మందులు ఉన్నందున, యువకులలో ఈ వ్యాధి మొదలవ్వకుండా నివారించడానికి లేదా ఆలస్యం చేయడానికి అవి సహాయపడతాయని భావిస్తున్నాం'' అని డాక్టర్ రిచర్డ్‌సన్ అన్నారు.

డయాబెటిస్ కారణాలపై పరిశోధన

ఫొటో సోర్స్, Diabetes UK

'ఇన్సులిన్ అవసరాన్ని నివారించవచ్చు...'

ఈ పరిశోధన టైప్–1 డయాబెటిస్ గ్రాండ్ ఛాలెంజ్ కార్యక్రమంలో భాగంగా స్టీవ్ మోర్గన్ ఫౌండేషన్, డయాబెటిస్ యూకే బ్రేక్‌త్రూ టీ1డీ సంస్థలు కలిసి నిర్వహించాయి. బ్రేక్‌త్రూ టీ1డీ సంస్థలో రీసర్చ్ పార్ట్‌నర్‌షిప్స్ డైరెక్టర్ రాచెల్ కానర్ ఈ అధ్యయనాన్ని "పజిల్‌లో మిస్సింగ్ భాగం"గా అభివర్ణించారు.

''పెద్దల కంటే పిల్లలలో టైప్-1 డయాబెటిస్ ఎందుకు చాలా వేగంగా విస్తరిస్తుందో వివరిస్తూ ఈ పరిశోధన మాకు పజిల్‌లోని ఒక ముఖ్యమైన భాగాన్ని అందించింది'' అని బ్రేక్‌త్రూ టీ1డీ రీసెర్చ్ పార్టనర్‌షిప్స్ డైరెక్టర్ రాచెల్ కానర్ చెప్పారు.

డయాబెటిస్ యూకే రీసెర్చ్, క్లినికల్ డైరెక్టర్ డాక్టర్ ఎలిజబెత్ రాబర్ట్‌సన్ మాట్లాడుతూ, ''చిన్న పిల్లలలో టైప్-1 డయాబెటిస్ ఎందుకు అంత తీవ్రంగా ఉంటుందో కనుగొనడం ద్వారా, రోగనిరోధక వ్యవస్థ దాడిని నెమ్మదింపజేయడానికి లేదా నిరోధించడానికి ఉద్దేశించిన కొత్త ఇమ్యునోథెరీపీలను అభివృద్ధి చేయడానికి మార్గం సుగమమైంది. ఇది పిల్లలకు ఇన్సులిన్ థెరఫీ లేకుండా మరిన్ని సంవత్సరాల విలువైన జీవితాన్ని అందించే అవకాశం ఉంది. ఏదొక రోజు ఇన్సులిన్ అవసరాన్ని పూర్తిగా నివారించవచ్చు'' అన్నారు.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)