పాకిస్తాన్‌కు మరో దెబ్బ: టూర్‌ రద్దు చేసుకున్న ఇంగ్లండ్ క్రికెట్ పురుషుల, మహిళల జట్లు

ఇంగ్లండ్, పాకిస్తాన్ క్రికెట్ జట్లు

ఫొటో సోర్స్, Getty Images

పాకిస్తాన్‌ పర్యటనను రద్దు చేసుకుంటున్నట్లు ఇంగ్లండ్ క్రికెట్ బోర్డు ప్రకటించింది. అక్టోబరులో ఇంగ్లండ్ మెన్, ఉమెన్స్ క్రికెట్ జట్లు పాకిస్తాన్‌లో పర్యటించాల్సి ఉంది.

2005వ సంవత్సరం తర్వాత తొలిసారి ఇంగ్లండ్ పురుషుల క్రికెట్ జట్టు పాకిస్తాన్ పర్యటన ఖరారైంది. ఇంగ్లండ్ మహిళల క్రికెట్ జట్టు ఇంతకు ముందు ఎప్పుడూ పాకిస్తాన్‌లో పర్యటించలేదు.

‘నిర్ధిష్టమైన, నమ్మదగిన ముప్పు’ ఉందంటూ న్యూజీలాండ్ పురుషుల క్రికెట్ జట్టు కూడా పాకిస్తాన్ పర్యటనను రద్దు చేసుకుంటున్నట్లు శుక్రవారం ప్రకటించింది.

ఈ నేపథ్యంలోనే ఇంగ్లండ్, వేల్స్ క్రికెట్ బోర్డు సోమవారం ఒక ప్రకటన చేసింది. ‘‘ఈ ప్రాంతంలో ప్రయాణం పట్ల ఆందోళనలు పెరుగుతున్నాయని మాకు తెలుసు’’ అని పేర్కొంది.

‘‘ఇప్పటికే కోవిడ్ వాతావరణ కట్టుబాట్లను సుదీర్ఘకాలం పాటు పాటిస్తూ, క్రికెట్ ఆడిన ఆటగాళ్లపై ఇది (పాకిస్తాన్ పర్యటన) మరింత ఒత్తిడి తెస్తుందని మేం విశ్వసిస్తున్నాం’’ అని వెల్లడించింది.

పాకిస్తాన్‌తో అక్టోబర్ 13, 14 తేదీల్లో రావల్పిండిలో జరగాల్సిన టీ20 మ్యాచ్‌లు రానున్న టీ20 ప్రపంచ కప్‌ సన్నాహకాలుగా ఉపయోగపడతాయని తొలుత ఈసీబీ భావించింది.

అలాగే, ఇంగ్లండ్ మహిళల జట్టు కూడా అక్టోబర్ 17, 19, 21 తేదీల్లో వన్ డే ఇంటర్నేషనల్ మ్యాచ్‌లు ఆడాల్సి ఉంది.

‘‘ఇప్పుడున్న పరిస్థితులో టీ20 ప్రపంచకప్‌కు సన్నద్ధమయ్యేందుకుగాను పాకిస్తాన్ టూర్‌కు వెళ్లడం సరికాదని భావిస్తున్నాం. ఈ నిర్ణయం పాకిస్తాన్ క్రికెట్ బోర్డుకు అసంతృప్తిని కలిగిస్తుందని మాకు తెలుసు. తమ దేశానికి అంతర్జాతీయ క్రికెట్‌ను తిరిగి తీసుకురావాలని పాక్ క్రికెట్ బోర్డు ఎంతగానో శ్రమించింది’’ అని ఈసీబీ తన ప్రకటనలో పేర్కొంది.

2009లో శ్రీలంక క్రికెట్ జట్టుపై ఒక గన్‌మెన్ దాడి చేసిన తర్వాత ఆరేళ్ల పాటు పాకిస్తాన్‌లో అంతర్జాతీయ క్రికెట్ మ్యాచ్‌లు జరగలేదు.

యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ వేదికగా పాకిస్తాన్ తన మ్యాచ్‌లు ఆడుతూ వచ్చింది.

2015వ సంవత్సరం నుంచి మళ్లీ పాకిస్తాన్‌లో అంతర్జాతీయ క్రికెట్ మొదలైంది.

దాడి జరిగిన 12 ఏళ్ల తర్వాత.. 2019లో శ్రీలంక జట్టు పాకిస్తాన్‌లో టెస్ట్ మ్యాచ్ ఆడింది.

పాకిస్తాన్ సూపర్ లీగ్ పోటీల్లో ఇంగ్లండ్ క్రికెటర్లు కూడా పాల్గొన్నారు.

ఈ ఏడాది దక్షిణాఫ్రికా జట్టు పాకిస్తాన్ పర్యటనకు వెళ్లింది.

పాకిస్తాన్ ఆతిథ్యం ఇచ్చిన ఏకైక మహిళా క్రికెట్‌ సిరీస్‌లో ఆడిన దేశాలు వెస్టిండీస్, నెదర్లాండ్స్ మాత్రమే ఉన్నాయి. స్వదేశంలో జరిగిన వారి చివరి క్రికెట్ సిరీస్ 2019 చివర్లో బంగ్లాదేశ్‌తో జరిగింది.

ఈ ఏడాది పాకిస్తాన్ జట్టు ఇంగ్లండ్‌లో పర్యటించింది

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, ఈ ఏడాది పాకిస్తాన్ జట్టు ఇంగ్లండ్‌లో పర్యటించింది

‘అవసరమైన సమయంలో వాళ్లు మాకు మద్దతు ఇవ్వలేదు’ - రమీజ్ రాజా

"ఇది సరికాదు, అంతర్జాతీయ మ్యాచ్‌లు ఆడడానికి మేం ఎంతో కృషి చేశాం" అని పాకిస్తాన్ క్రికెట్ బోర్డ్ చైర్మన్ రమీజ్ రాజా బీబీసీతో అన్నారు.

"నేను, మా దేశ క్రికెట్ అభిమానులు కూడా చాలా నిరాశకు గురయ్యాం. ఇప్పుడు మాకు ఇంగ్లండ్ అవసరం. మాది ఒక చిన్న క్రికెట్ సమాజం. మేం, ఇంగ్లండ్ ఇంకాస్త బాధ్యతాయుతంగా ఉంటుందని భావిస్తున్నాం. మేం గాయపడ్డాం. కానీ మేం ముందుకెళ్లాలి" అన్నారు.

2020, 2021లో కరోనా కాలంలో కూడా పాకిస్తాన్ ఇంగ్లండ్‌లో పర్యటించింది. ముఖ్యంగా 2020లో బ్రిటన్‌లో ఆడడానికి కఠిన బయో- సెక్యూరిటీ షరతులకు కూడా పాకిస్తాన్ ఒప్పుకుంది.

న్యూజీలాండ్ గత 18 ఏళ్లలో తొలిసారి పాకిస్తాన్‌ పర్యటనకు వచ్చింది. రావల్పిండిలో మూడు వన్డేలు, లాహోర్‌లో ఐదు టీ20లు ఆడాలనుకుంది.

అయితే, న్యూజీలాండ్ ప్రభుత్వం పాకిస్తాన్‌లో ముప్పు ఉందని హెచ్చరించడంతో మొదటి వన్డే జరిగే రోజున కివీస్ ఆటగాళ్లు పర్యటన నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించారు.

"పాకిస్తాన్‌కు పాశ్చాత్య జట్లు అవసరమైన సమయంలో, వారు మాకు మద్దతు అందించలేదు. భద్రత అనేది ప్రపంచంలో ఎక్కడైనా ఒక సమస్యగా ఉండచ్చు. పాశ్చాత్య జట్లు చేస్తున్నది చూసి మేం నిరాశకు గురయ్యాం. వారు మానసిక అలసట గురించి చెప్పుండవచ్చు, కానీ అది సరిపోదు" అన్నారు.

ఇంగ్లండ్ పురుషుల జట్టు 2022 చివర్లో పాకిస్తాన్‌తో మూడు టెస్టులు ఆడాల్సి ఉంది.

2022లో పాకిస్తాన్‌లో జరపబోయే పర్యటన ప్రణాళికలో తమ నిబద్ధతకు ఇది బలం చేకూరుస్తుందని ఈసీబీ వెల్లడించింది.

పాకిస్తాన్, ఇంగ్లండ్ క్రికెట్ జట్లు

ఫొటో సోర్స్, Getty Images

Presentational grey line

'ఇది పాకిస్తాన్ క్రికెట్ బోర్డుకు శరాఘాతం'

బీబీసీ ఉర్దూ ప్రతినిధి అబిద్ హుస్సేన్విశ్లేషణ

2022లో ఆస్ట్రేలియాలాంటి దేశాల టూర్‌లకు ఆతిథ్యమివ్వాలనుకుంటున్న పాకిస్తాన్ క్రికెట్ జట్టుకు ఇది నిజంగా శరాఘాతమే. ఈ నిర్ణయం తర్వాత పాకిస్తాన్‌లో జరగబోయే టోర్నమెంట్లు అనిశ్చితిలో పడ్డాయి.

తమ దేశానికి వచ్చే క్రికెట్ టీమ్‌లకు సంపూర్ణ భద్రత, రక్షణ కల్పించడానికి పాకిస్తాన్ గత కొన్నేళ్లుగా ప్రయత్నిస్తూనే ఉంది.

ఇప్పటికే పాకిస్తాన్ సూపర్ లీగ్ మ్యాచ్‌లను విజయవంతంగా పూర్తి చేసింది. వరల్డ్ లెవెన్ టోర్నీకి ఆతిథ్యమిచ్చింది. 2019 నుంచి శ్రీలంక, బంగ్లాదేశ్, జింబాబ్వే, దక్షిణాఫ్రికా జట్లు పాకిస్తాన్‌లో పర్యటించాయి.

ఇంగ్లాండ్ తీసుకున్న తాజా నిర్ణయంతో క్రికెట్ ఆడే దేశాల మధ్య పేద, ధనిక అంతరం మరోసారి బైటపడిందని పాకిస్తాన్ క్రికెట్ అభిమానులు భావిస్తున్నారు. ప్రభావవంతమైన దేశాలు తమ వ్యాపార ప్రయోజనాలకే ప్రాధాన్యమిస్తాయని తేలింది.

2016 నుంచి పాకిస్తాన్ ఇంగ్లాండ్ వెళ్లి ఆడుతూనే ఉంది. 2020లో యూకేలో కోవిడ్ తీవ్రంగా ఉన్నప్పటికీ పాకిస్తాన్ తన పర్యటనను కొనసాగించింది. ఆటగాళ్లు కఠినమైన నిబంధనలు, క్వారంటైన్‌లు పాటించారు.

2021 ఆరంభంలో తాము న్యూజీలాండ్, యూకేలో పర్యటించాం కాబట్టి, ఆ రెండు జట్లు కూడా తమ దేశంలో టోర్నమెంట్లు ఆడతాయని పీసీబీ భావించింది. కానీ, అది జరగట్లేదు.

Presentational grey line

ఈసీబీ తన ఆటగాళ్ల క్షేమాన్నే ఎంచుకుంది

బీబీసీ క్రికెట్ ప్రతినిధిజొనాథన్ ఆగ్న్యూ విశ్లేషణ

న్యూజీలాండ్ వైఖరికి ఇంగ్లండ్ వైఖరికి ఇక్కడ స్పష్టమైన, ఆసక్తికరమైన ఒక వ్యత్యాసం ఉంది.

అక్కడ న్యూజీలాండ్ వెనక్కు తగ్గడానికి భద్రతా ముప్పును కారణంగా చూపించారు. కానీ, ఈసీబీ ప్రకటనలో భద్రత అనే మాటే కనిపించలేదు.

రోజుల వ్యవధిలోనే ఇప్పుడు ఇంగ్లండ్ కూడా ఇలాంటి నిర్ణయం తీసుకోవడం వల్ల, తమ దేశంలో మళ్లీ సాధారణ స్థితి తీసుకురావడానికి ప్రయత్నిస్తున్న పాకిస్తాన్‌కు ఎదురు దెబ్బ తగులుతుంది.

కానీ టీ 20 ప్రపంచకప్, యాషెస్‌లో ఉక్కిరిబిక్కిరి చేసే సెక్యూరిటీ, బయో బబుల్స్‌లో ఉండాల్సి రావడంతో ఈసీబీ తమ ఆటగాళ్ల క్షేమానికే ప్రాధాన్యం ఇచ్చింది.

Presentational grey line

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి)