పిల్లలకిచ్చే కోవిడ్ వ్యాక్సీన్ల గురించి మనకేమి తెలుసు?

ఫొటో సోర్స్, Reuters
- రచయిత, జోసీ గ్లాసియస్
- హోదా, బీబీసీ ఫ్యూచర్
2021 ఆగస్టు చివరలో, టాలియా ష్ముయెల్ తన ఐదేళ్ల కొడుకుకు కోవిడ్ టీకా వేయించేందుకు జెరూసలేంలోని స్థానిక ఆరోగ్య క్లినిక్‌కు తీసుకువెళ్లారు. బాబుకు పుట్టుకతోనే వచ్చిన గుండె జబ్బుతోపాటు శ్వాసనాళాలు కూడా కుంచించుకుపోయాయి. దాంతో, ఆ బాలునికి కరోనావైరస్ సోకే ముప్పు ఎక్కువగా ఉంటుంది.
"అతను ఎప్పుడైనా జబ్బుపడినప్పుడు, అది సాధారణంగా న్యుమోనియాగా మారుతుంది. అతను తీవ్ర అనారోగ్యానికి గురవుతాడు" అని ష్ముయెల్ చెప్పారు.
ష్ముయెల్‌కు ముగ్గురు పిల్లలు. చిన్న వయసు కలిగిన తన కొడుకుకు వ్యాక్సిన్ వేయించడానికి, ఇజ్రాయెల్ ఆరోగ్య మంత్రిత్వ శాఖ నుంచి ప్రత్యేక అనుమతి తీసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది.వ్యాక్సీన్ వేయించాలనే నిర్ణయం సరైందనే నమ్మకంతో ఆమె ఉన్నారు.
"నా భర్త, నేను పరిశోధనా విశ్లేషకులుగా పని చేస్తున్నాం. మేం ప్రతీ విషయాన్ని విశ్లేషించాం. మేము అనేక విభిన్న అంశాలను తనిఖీ చేశాం. టీకాతో దుష్ప్రభావాలు కూడా ఉండే అవకాశం ఉందని నిర్ధరించుకున్నాం. అయితే, అవి కోవిడ్19 వల్ల కలిగే దుష్ప్రభావాల తీవ్రత కంటే తక్కువని తెలుసుకున్నాం" అని చెప్పారు.
ప్రపంచవ్యాప్తంగా వివిధ దేశాలు 12 ఏళ్లు నిండిన పిల్లలకు కోవిడ్19 వ్యాక్సిన్లను ఇవ్వడం ప్రారంభిస్తున్న తరుణంలో, భవిష్యత్తు ఎలా ఉండబోతోందననే అంశం పట్ల ఇజ్రాయెల్ ఒక అవలోకనాన్ని కల్పిస్తోంది.
ఈ ఏడాది మొదట్లో ఇజ్రాయెల్ దేశంలో ఉన్న అత్యధిక మంది వయోజనులకు వేగంగా టీకాలను అందచేసింది.
జూన్‌లో పాఠశాలల్లో కోవిడ్ వ్యాప్తి మొదలయిన తర్వాత, 12 ఏళ్లు నిండిన పిల్లలకు కూడా టీకాలు వేయాలని సిఫారసు చేసింది. ప్రస్తుతం వీరికి మూడవ మోతాదుగా బూస్టర్ షాట్‌లను ఇస్తోంది.
జులై నుంచి కొన్ని అసాధారణమైన పరిస్థితులలో ఉన్న 5 నుంచి 11 సంవత్సరాల పిల్లలకు కూడా టీకాలు అందిస్తోంది.
ఫైజర్-బయోఎన్‌టెక్ వ్యాక్సీన్ పిల్లలకు సురక్షితమని చెబుతున్నప్పటికీ కూడా పిల్లల విషయంలో దీనిపై నిర్ణయం తీసుకోవడం చాలా కష్టం.
కోవిడ్-19 కు లోనయ్యే ముప్పు పిల్లల్లో తక్కువగా ఉండటం వల్ల వారికిచ్చే టీకా చిన్నపాటి ప్రతికూల ప్రభావం చూపినా కూడా టీకాను సమర్ధించడం కష్టమవుతుంది.

ఫొటో సోర్స్, Reuters
"టీకా పని చేస్తుంది" అని స్విట్జర్లాండ్‌లోని బేసెల్‌లో యూనివర్శిటీ చిల్డ్రన్స్ హాస్పిటల్ పీడియాట్రిక్ ఇన్ఫెక్షియస్ వ్యాధుల నిపుణులు నికోల్ రిట్జ్ చెప్పారు.
"అయితే చిన్న వయసు పిల్లలకు టీకా ఇచ్చే విషయంలో మరింత జాగ్రత్త అవసరం. ఇది పుట్టిన తొలి ఏడాదిలోనే అందించే టీకా అవుతుంది. టీకా ఇచ్చేవారి వయసు తగ్గుతున్న కొలదీ టీకా సురక్షితమని చెప్పేందుకు మరింత సమాచారాన్ని సేకరించాల్సి ఉంటుంది. పిల్లల దగ్గర నుంచి ఈ సమాచారం సేకరించడం కూడా కష్టమే" అని అన్నారు.
ఇజ్రాయెల్ పిల్లలకు వ్యాక్సిన్లను ఎటువంటి సమస్యలు లేకుండా సాఫీగానే అందజేసింది. ఇప్పటి వరకు 12 నుండి 15 సంవత్సరాల మధ్య వయసులో ఉన్న సగం మందికి పైగా టీకాలు వేసింది. దీని పట్ల అక్కడక్కడా చిన్న స్థాయిలో నిరసనలు జరిగాయి.
అయితే, చాలా మంది ఇజ్రాయెలీ తల్లిదండ్రులు వయసులో పెద్ద పిల్లలకు టీకాలు వేయించడానికి సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తోంది. అక్టోబర్ 2021 నాటికి 53.7% మంది 12 నుండి 15 సంవత్సరాల వయస్సు గల పిల్లలు, 84% మంది 16 నుండి 19 సంవత్సరాల వయస్సు వారు మొదటి డోసు టీకా పొందారని ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది.
చిన్న పిల్లలకు వ్యాక్సీన్ ఇవ్వడం పట్ల చాలా మంది తల్లితండ్రులు ఉత్సాహాన్ని ప్రదర్శించారు. పిల్లలు వైరస్ బారిన పడతారనే భయం, లాక్‌డౌన్‌ల గురించి ఆందోళన, తరచుగా నిర్బంధాలు, చదువులో వెనుకబడిపోవడం, పిల్లలు రిమోట్‌గా నేర్చుకోలేకపోవడం గురించి చాలా మంది తల్లితండ్రులు ఆందోళన వ్యక్తం చేశారు.

ఫొటో సోర్స్, Getty Images
డెల్టా వేరియంట్ వ్యాప్తి, భవిష్యత్తులో తలెత్తబోయే లాక్డౌన్ గురించి భయాలను పెంచింది.
జూన్ 2021 మధ్య నుంచీ మాస్క్ పెట్టుకోవాలనే నిబంధనను ఇజ్రాయెల్ తొలగించింది .
మొత్తం జనాభాలో 60% మందికి టీకా ప్రక్రియ మొత్తం పూర్తి చేసే విధంగా విజయవంతమైన ప్రచారం చేసింది. కోవిడ్-19తో తీవ్ర దుష్ప్రభావం ఉండే వృద్ధులలో, టీకాలు మరింత ఎక్కువగా వేశారు.
70 ఏళ్లు దాటిన వారిలో దాదాపు 90 శాతం మంది ఇజ్రాయిలీలకు టీకాలు వేశారు. పది రోజుల తర్వాత, డెల్టా వేరియంట్ వ్యాప్తి చెందడంతో, ఇన్‌డోర్‌లో మాస్క్ నిబంధనను తిరిగి అమలులోకి తెచ్చారు. వేసవి చివరి నాటికి, ఇజ్రాయెల్‌లో డెల్టా వేరియంట్ తీవ్ర రూపం దాల్చింది.
సెప్టెంబర్ 1న ఇజ్రాయెల్లో ప్రభుత్వ పాఠశాలలు తెరిచిన తర్వాత, కోవిడ్ బారిన పడిన పిల్లల సంఖ్య గణనీయంగా పెరిగింది.
నెల రోజుల వ్యవధిలో, ఇజ్రాయెల్‌లో 54 శాతం కంటే ఎక్కువగా పాజిటివ్ కేసులు 0 నుండి 19 సంవత్సరాల వయస్సు గల పిల్లలలోబయటపడినట్లు ఇజ్రాయెల్ ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది.
కొంతమంది పిల్లలు ఒక రోజు పాఠశాలకు వెళ్లిన తర్వాత ఐసోలేషన్‌లోకి వెళ్లారు.
వరుసగా రెండో సంవత్సరం, యూదుల కొత్త సంవత్సరాన్ని ఇంటి లోపలే జరుపుకోవాలని ప్రణాళిక చేసిన ఇజ్రాయెలీలు నెమ్మదిగా స్థానిక పార్కులలో బహిరంగ ప్రార్థనలను నిర్వహించడం మొదలుపెట్టారు.
వారు చెట్ల కింద సంప్రదాయక షోఫర్‌ను ఊదుతుండగా, వ్యాయమం చేసుకుంటూ అటు వైపుగా వెళ్తున్న వారు ఆగి, దానిని వీక్షించారు.
పిల్లలకు టీకాలు వేయడం వల్ల, కోవిడ్ వ్యాప్తిని విచ్ఛిన్నం చేయవచ్చని నిపుణులు భావిస్తున్నారు.
"మహమ్మారిని నియంత్రించడానికి, వీలైనంత చిన్న వయసు నుండే పిల్లలకు టీకాలు వేయడం అవసరం అని నేను భావిస్తున్నాను" అని ఇజ్రాయెల్ లోని హైఫా యూనివర్శిటీలోని పబ్లిక్ హెల్త్ ప్రొఫెసర్, ఎపిడెమియాలజిస్ట్ మాన్‌ఫ్రెడ్ గ్రీన్ చెప్పారు.
"ఇది చాలా వేగంగా సంక్రమించే వ్యాధి అని మాకు తెలుసు. డెల్టా రూపంలో అది మరింత వ్యాప్తి చెందుతోంది" అని ఆయన వివరించారు.
జనాభాలో 60 శాతం నుండి 70 శాతం మందికి రోగ నిరోధక శక్తి వస్తే మహమ్మారిని నియంత్రించవచ్చని ప్రజారోగ్య అధికారులు ఆశించారు. కానీ, ఆ శాతం మరింత ఎక్కువగా ఉండాలని వారిప్పుడు గ్రహించారు. పిల్లలకు టీకాలు వేయడం వల్ల జనాభాలో రోగ నిరోధక శక్తి లేని వ్యక్తుల సంఖ్య తగ్గిపోతుంది.

ఫొటో సోర్స్, Getty Images
"పిల్లలు పాఠశాలల్లో గుమిగూడడంతో, వైరస్ మరింత వ్యాప్తి చెందే అవకాశం ఉంది" అని గ్రీన్ చెప్పారు. ఒక వేళ వైరస్ సోకినా దాని ప్రభావం చాలా తక్కువగా ఉండవచ్చు. కానీ, దీనర్ధం పిల్లలందరూ ఈ వైరస్ ప్రభావం నుంచి తేలికగా బయటపడతారని కాదు.
అమెరికాలోని 2021 జూన్ చివరి నుంచి ఆగస్టు మధ్య వరకూ ఆసుపత్రిలో చేరిన పిల్లలు, యుక్త వయసు వారి సంఖ్య అయిదు రేట్లు పెరిగినట్లు యూఎస్ సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ డేటా చెబుతోంది.
ఇజ్రాయెల్‌లో అక్టోబర్‌లో సీరియస్ లక్షణాలతో ఉన్న రోగుల్లో 0 నుండి 19 సంవత్సరాల వయసు పిల్లలు 0.2 శాతం నుండి 0.5 శాతం మధ్యలో ఉన్నారు.
మహమ్మారి ప్రారంభమైనప్పటి నుండి ఇజ్రాయెల్‌లో 0 నుండి 19 సంవత్సరాల వయస్సు గల మొత్తం 12 మంది పిల్లలు కోవిడ్ -19తో మరణించారని ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది.
వైరస్ సోకిన తర్వాత పిల్లల్లో కూడా దీర్ఘకాలిక లక్షణాలు కనిపించే ప్రమాదం ఉంది. ఎక్కువగా తలనొప్పి, అలసట తదితర లక్షణాలు కనిపిస్తాయి. దీన్ని "దీర్ఘకాలిక కోవిడ్"గా పిలుస్తున్నారు.
ఇటీవల యూకేలో 5 నుండి 17 సంవత్సరాల వయసులో ఉన్న 2,58,790 మంది పిల్లలపై నిర్వహించిన అధ్యయనంలో , కోవిడ్ -19 సోకిన 1,734 మంది పిల్లలలో 2 నుంచి 4 శాతం మంది పిల్లలు దీర్ఘకాలిక లక్షణాలతో బాధపడుతున్నట్లు తెలిసింది.
ఇజ్రాయెల్‌లో మూడు నుంచి 18 సంవత్సరాల వయసు గల 13,864 మందితో నిర్వహించిన అధ్యయనంలో కోవిడ్-19 నుండి కోలుకున్న పిల్లల్లో 11 శాతం మంది నిద్రలేమి, ఏకాగ్రత సమస్యలతో సహా దీర్ఘకాలిక సమస్యలతో బాధపడుతున్నట్లు తెలిసింది.
ఈ అంశాల దృష్ట్యా 5 నుంచి 11 ఏళ్ల మధ్య వయసులో ఉన్న పిల్లలకు కూడా టీకాలు వేయడం అవసరమని గ్రీన్ చెబుతున్నారు.
12 - 15 సంవత్సరాల వయసు పిల్లలకు వ్యాక్సీన్ వేసిన ఇజ్రాయెల్ అనుభవం వ్యాక్సీన్ సురక్షితమే అని తెలియచేస్తోంది. వీటికి చెప్పుకోదగ్గ ప్రతికూల ప్రభావాలేవీ కనిపించలేదని చెప్పారు.
ఇజ్రాయెల్‌లో ఫైజర్-బయో ఎన్ టెక్ వ్యాక్సీన్ తీసుకున్న 16 నుండి 24 సంవత్సరాల వయసు గల 3000 నుంచి 6000 మంది పురుషులలో కనీసం ఒకరు మయోకార్ డైటిస్ అనే అరుదైన గుండె కండరాల వాపుకు గురయ్యారు. అయితే దీనికి చికిత్స చేయవచ్చని గ్రీన్ చెప్పారు.
కానీ, 16 ఏళ్ళు నిండిన వారి పై జరిపిన అధ్యయనంలో కోవిడ్-19 వైరస్ సోకిన తర్వాత మయోకార్ డైటిస్ కు గురయ్యే ప్రమాదం "గణనీయంగా పెరిగినట్లు తెలిసింది.
ఇజ్రాయెల్ పబ్లిక్ హెల్త్ అధికారులు దీని పట్ల మరింత జాగ్రత్తగా ఉండాలనే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.
"12 సంవత్సరాల లోపు వయస్సు ఉన్న పిల్లలకు టీకాలు వేయడం క్లిష్టమైన వైద్య, నైతిక, సామాజిక అంశాలను, ప్రశ్నలను లేవనెత్తుతుంది" అని టెల్ అవైవ్ విశ్వవిద్యాలయ ఆరోగ్య పాలసీ నిపుణులు, ఇజ్రాయెల్ ఆరోగ్య మంత్రిత్వ శాఖ కోవిడ్-19 సలహా ప్యానెల్ సభ్యులు ఆడి నివ్-యగోడా ఒక ఈ-మెయిల్లో పేర్కొన్నారు.
మరోవైపు, 5 నుంచి 12 సంవత్సరాల మధ్య వయసు ఉన్న పిల్లలకు టీకాలు వేయడం వల్ల కోవిడ్ -19 వ్యాప్తిని తగ్గించడంలో చాలా సహాయకారిగా ఉంటుందని అన్నారు.
నికోల్ రిట్జ్ కూడా ఇదే విధమైన ఆందోళనను వ్యక్తం చేశారు.
"మిమ్మల్ని మీరు రక్షించుకోవడానికి చిన్న పిల్లలకు టీకాలు వేస్తున్నారా లేదా సమాజాన్ని రక్షించడానికి వారికి టీకాలు వేస్తారా?" అని ఆమె ప్రశ్నించారు.
ఊబకాయం, మధుమేహం లేదా ఊపిరితిత్తుల వ్యాధులు ఉన్న వారు టీకా ద్వారా ప్రయోజనం పొందవచ్చని రిట్జ్ వివరించారు.

ఫొటో సోర్స్, Getty Images
యూఎస్ లో ఫైజర్ బయో ఎన్ టెక్ వ్యాక్సీన్ తీసుకున్న 80.9 లక్షల మంది 12 నుంచి 17 సంవత్సరాల వయసు గల పిల్లల పై గమనించిన కోవిడ్ -19 సురక్షతకు సంబంధించిన అంశాలను పొందుపరిచిన సీడీసీ నివేదికను రిట్జ్ పేర్కొన్నారు.
వ్యాక్సినేషన్ తీసుకున్న తర్వాత 9,246 మందికి ప్రతికూల ప్రభావాలు ఎదురైనట్లు వ్యాక్సీన్ అడ్వెర్స్ రిపోర్టింగ్ సిస్టం నమోదు చేసింది.
అంటే, వ్యాక్సీన్ తీసుకున్న ప్రతీ 1000 మందిలో ఒకరికి ప్రతికూల ప్రభావాలు ఎదురయ్యాయి.
ఇందులో చాలా వరకు కళ్ళు తిరగడం, తలనొప్పి లాంటి తేలికపాటి లక్షణాలే కనిపించాయి.
9.3 శాతం మందికి మాత్రం గుండె నొప్పి, వాంతులు, జ్వరం, మైయో కార్ డైటిస్ లాంటి తీవ్రమైన లక్షణాలు కనిపించాయి. మైయో కార్ డైటిస్ సోకి ఎవరూ మరణించినట్లు నివేదికలు రాలేదు" అని సిడిసి నివేదిక పేర్కొంది.
డెల్టా వేరియంట్ కేసులు పెరగడం వాళ్ళ కూడా పిల్లలకు టీకాలు వేయడంపై కొంతమంది పరిశోధకులు తమ అభిప్రాయాన్ని మార్చుకునేలా చేసింది.
"డెల్టా వేరియంట్ వ్యాప్తి చెందుతున్న నేపధ్యంలో క్లినికల్ ట్రయల్స్ పూర్తి చేసి టీకా సురక్షితమని తేలిన వెంటనే 5 నుంచి 11 ఏళ్లమధ్య వయసులో ఉన్న పిల్లలకు వ్యాక్సిన్ సత్వరమే ఇవ్వాలి" అని కాలిఫోర్నియా యూనివర్సిటీకి చెందిన అంటువ్యాధి వైద్య నిపుణురాలు మోనికా గాంధీ ఈ-మెయిల్‌లో బీబీసీతో చెప్పారు.
ఈ సంవత్సరం ప్రారంభంలో ఆ వయసు వారికి టీకాలు వేయాల్సిన అవసరం ఉంటుందని ఆమె భావించలేదు. కానీ డెల్టా వైరస్ మొత్తం చిత్రాన్నే మార్చేసింది.
వేగంగా వ్యాప్తి చెందుతున్న ఈ వైరస్ నుంచి కాపాడుకునేందుకు వృద్ధులను, పిల్లలను రక్షించేందుకు పిల్లలకు టీకాలు వేయడాన్ని సమర్థిస్తాను" అని అన్నారు.
గ్రీన్ కూడా ఈ అభిప్రాయంతో ఏకీభవించారు. " పిల్లలకు ఏ విధమైన ఉపయోగమూ లేకుండా కేవలం సమాజానికి మాత్రమే మేలు చేసే టీకాను ఎందుకివ్వాలని కొందరు వాదిస్తారని నాకు తెలుసు. పిల్లలు సమాజానికి అవతల బ్రతుకుతున్న జీవులు కాదు. ఇదే నేను వారు సమాజంలో భాగం. వారి తల్లిదండ్రులు, తాత మామ్మలు, వారి పొరుగు వారు అనారోగ్యం బారిన పడితే ఆ ప్రభావం పడేది పిల్లల పైనే. ఇదే నేనిచ్చే సమాధానం" అని అన్నారు.
ఇన్ని రకాల అధ్యయనాలు, గణాంకాల మధ్య పిల్లలకు వ్యాక్సీన్ ఇప్పించాలా వద్దా అని నిర్ణయం తీసుకోవడం పెద్దవాళ్లకు కష్టమవుతుంది.
కానీ, వ్యాక్సీన్ ఇవ్వడం వల్ల కొంత ఉపశమనం, ఆశ లభిస్తాయి.
"నేను వేయించగల్గితే, 12 ఏళ్ల కంటే తక్కువ వయసు కలిగిన నా పిల్లలకు ఒక సెకనులో టీకాలు వేయిస్తాను" అని ఇజ్రాయెల్‌లో మోడీన్ నగరానికి చెందిన ఫ్రీలాన్స్ రచయిత, ఎడిటర్ గిలా రోజ్ చెప్పారు. ఆమెకొక 18 సంవత్సరాలు, 15 సంవత్సరాల వయసు ఉన్న పిల్లలు ఉన్నారు. వారిద్దరికీ వ్యాక్సిన్లు వేయించారు. ఆమెకు 11 సంవత్సరాల వయసులో ఒకరు, 7 సంవత్సరాల వయసులో ఉన్న కవలలు ఉన్నారు.
పిల్లలకు వ్యాక్సీన్ ప్రక్రియను వేగవంతం చేయడానికి ఒక వైపు డెల్టా వేరియంట్ వ్యాప్తి, తరచుగా చోటు చేసుకుంటున్న లాక్ డౌన్‌లు, క్వారంటైన్‌లు కారణమని రోజ్ అభిప్రాయపడ్డారు.
స్కూళ్ళు రోజుల తరబడి మూసి ఉంచడం వారికి చాలా ఇబ్బందిని కలుగచేస్తున్నాయి" అని అన్నారు.
వరుసగా స్కూలు చదువు మూడవ ఏడాది కూడా ఇబ్బందులకు లోనవుతుంది" అని అన్నారు.
చిన్న పిల్లలకు టీకాలు వేయించడం గురించి రోజ్‌కు ఎటువంటి సంకోచం లేదు.
నేను పిల్లలకు టీకాలు వేయించేందుకు నిల్చునే క్యూలో ముందుంటాను.
ఈ పరిస్థితిని మార్చేందుకు కావాల్సింది పిల్లలకు టీకాలు వేయించడమేనేమో అని అనుకుంటున్నాను" అని అన్నారు.
ఇవి కూడా చదవండి:
- Ivermectin: కోవిడ్-19పై ఈ ఔషధం అద్భుతంగా పోరాడుతోందా? ఈ వార్తల్లో నిజమెంత
- కరోనా సైడ్ ఎఫెక్ట్స్: కాలి వేళ్ల మీద పుండ్లు ఎందుకు ఏర్పడుతున్నాయి?
- చైనా అరుణాచల్ ప్రదేశ్‌ను 'దక్షిణ టిబెట్' అని ఎందుకు అంటోంది
- కరోనావైరస్: వ్యాక్సీన్ తీసుకున్న తర్వాత ఆల్కహాల్ తాగొచ్చా?
- కరోనా వైరస్ సర్వే: మన శరీరంలో యాంటీబాడీస్ ఉంటే వైరస్ మళ్లీ సోకదా?
- కోటమైసమ్మ ఆలయం: కొన్ని హిందూ ఆలయాల్లో మద్యం, మాంసాలను నైవేద్యంగా ఎందుకు పెడతారు
- కోవిడ్: 24 కోట్ల వ్యాక్సీన్లు వృథా అయిపోతున్నాయా, ధనిక దేశాలే కారణమా
- కోవిడ్-19 వ్యాక్సీన్: టీకా వేసుకుంటే నపుంసకత్వం వస్తుందా?
- కోవిడ్ వ్యాక్సినేషన్: వ్యాక్సీన్ తీసుకున్న తర్వాత కూడా కరోనావైరస్ సోకుతుందా?
- సిరియా: ఇస్లామిక్ స్టేట్ శిబిరాలలో చిన్నారుల జీవితాలు మగ్గిపోవాల్సిందేనా, అక్కడ కూడా మతాన్ని నూరిపోస్తున్నారా
- కరోనావైరస్: వ్యాక్సీన్లు తీసుకున్న తర్వాత దుష్ప్రభావాలు వస్తే ఏం చేయాలి?
- కోవిడ్-19: డెల్టా, డెల్టా ప్లస్, లామ్డా వేరియంట్లు అంటే ఏమిటి... ఇవి వ్యాక్సీన్లకు లొంగుతాయా
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి)








