రష్యాలో మళ్లీ కరోనా కలకలం: స్కూళ్లు, రెస్టారెంట్లు, షాపులు మూత.. పాక్షిక లాక్‌డౌన్ ప్రకటించిన ప్రభుత్వం - BBC Newsreel

మాస్కో

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, మాస్కోలో పాక్షిక లాక్‌డౌన్

రష్యాలో కరోనావైరస్‌ కేసులు భారీగా పెరుగుతున్నాయి. యూరప్‌లో ఇప్పుడు కోవిడ్ ప్రభావం ఎక్కువగా ఉన్న దేశాలలో రష్యా ఒకటి.

కేసులు పెరుగుతుండటంతో రష్యాలో పాక్షిక లాక్‌డౌన్ విధించారు.

మాస్కోలోని స్కూళ్లు, రెస్టారెంట్లను మూసేశారు. సూపర్ మార్కెట్లు, మెడికల్ షాపులు మినహా అన్ని రకాల దుకాణాలు మూతపడ్డాయి. హోటళ్లలో టేక్అవే సర్వీస్ మాత్రమే అందుబాటులో ఉంది.

కోవిడ్ ఇన్ఫెక్షన్లను కట్టడి చేసేందుకు రష్యా ప్రభుత్వం రేపటి నుంచి తొమ్మిది రోజుల పాటు ఉద్యోగులకు సెలవులు ఇచ్చింది.

గడిచిన 24 గంటల్లో రష్యాలో 1159 మంది కోవిడ్‌తో చనిపోయారు. రష్యాలోని 85 ప్రాంతాల్లో మొత్తం 40,096 కొత్త కేసులు నమోదయ్యాయి. రష్యాలో ఇదొక రికార్డ్.

కరోనా కారణంగా రష్యాలో 2,30,000 కంటే ఎక్కువ మందే చనిపోయారని అధికారికంగా ప్రకటించారు. యూరప్‌ దేశాలతో పోలిస్తే కోవిడ్‌తో ఇక్కడే ఎక్కువ మంది చనిపోయారు. మరణాల సంఖ్య ఎక్కువగా ఉన్న ప్రపంచ దేశాల్లో రష్యా ఒకటి.

అయితే, రష్యాలో కోవిడ్ మృతుల సంఖ్య 4 లక్షలకు పైగానే ఉంటుందని ప్రభుత్వ గణాంక ఏజెన్సీ రోస్‌స్టాట్ అంచనా వేసింది. ప్రభుత్వ అధికారిక లెక్కల కంటే ఇది చాలా ఎక్కువ.

రష్యాలో వ్యాక్సీన్ వేసుకున్న వారి సంఖ్య కూడా చాలా తక్కువగా ఉంది. అక్టోబర్ 23 నాటికి దేశ జనాభాలో 32.8శాతం మంది మాత్రమే వ్యాక్సీన్ వేసుకున్నారని 'అవర్ వరల్డ్ ఇన్ డేటా' వెబ్‌సైట్ పేర్కొంది.

రష్యాలో లాక్‌డౌన్

ఫొటో సోర్స్, SERGEI SAVOSTYANOV / TASS

కనిపించని లాక్‌డౌన్ ప్రభావం

రిచర్డ్ గాల్పిన్, బీబీసీ న్యూస్ మాస్కో

పాక్షిక లాక్‌డౌన్ విధించినప్పటికీ పెద్దగా మార్పు కనిపించడం లేదు. వీధులు సాధారణం కంటే కొద్దిగా తక్కువ రద్దీగా ఉన్నాయి. కానీ రోడ్లపై చాలా కార్లు తిరుగుతున్నాయి. టాక్సీలు నడుస్తున్నాయి.

మెట్రో రైళ్లలో కూడా రద్దీ కనిపిస్తోంది. హోటళ్ల నుంచి ఆహారాన్ని డెలివరీ చేసే వారి సంఖ్యా ఎక్కువగానే ఉంది.

ఒక ప్రధాన షాపింగ్ భవన నిర్మాణ పనులు కొనసాగుతున్నాయి. కాకపోతే కాస్త నెమ్మెదిగా నడుస్తున్నాయి.

పరిస్థితి చూస్తుంటే ఇది లాక్‌డౌన్‌లా అనిపించడం లేదు. తర్వాత ఏం జరగబోతోందన్న టెన్షన్ మాత్రం మాస్కో ప్రజల్లో ఉంది. ప్రస్తుతం అమలు చేస్తున్న ఆంక్షలు కరోనావైరస్ నియంత్రణకు సరిపోవని భావిస్తే.. రాబోయే రోజులు లేదా వారాల్లో పూర్తిస్థాయి లాక్‌డౌన్ విధిస్తారా?

మాస్కో మెట్రో రైలు

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, మాస్కో మెట్రో రైలులో రద్దీ

వ్యాక్సీన్లు వేసుకోవాలని ప్రభుత్వం విస్తృతంగా ప్రచారం చేస్తోంది. వ్యాక్సినేషన్ డ్రైవ్‌లు చేపడుతోంది. కానీ స్పూత్నిక్ వి వ్యాక్సీన్‌పై చాలామంది రష్యన్లు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. కానీ ఈ టీకా.. కోవిడ్‌పై ప్రభావవంతంగా పని చేస్తుందని అంతర్జాతీయంగా గుర్తించారు.

అక్టోబర్ 30 నుంచి నవంబర్ 9 వరకు పాక్షిక లాక్‌డౌన్‌ విధించడంతో చాలామంది రష్యన్లు సెలవులో వెళ్లాలని నిర్ణయం తీసుకున్నారు.

రష్యన్లు ఎక్కువగా వెళ్లే ఈజిప్ట్‌లోని రిసార్ట్ హోటళ్లు పూర్తిగా నిండిపోయాయి. ఈజిప్ట్‌కు వెళ్లే రష్యా విమానాల్లో టికెట్లు కూడా పూర్తిగా అమ్ముడయిపోయాయి.

కొత్త ఆంక్షలతో భయాందోళనకు గురైన కొందరు ప్రజలు నిత్యవసర సరుకులను కొని నిల్వ చేసుకున్నారని రష్యన్ న్యూస్ సర్వీస్ వెస్టి పేర్కొంది.

ఓరెన్‌బర్గ్‌లోని సెంట్రల్ మార్కెట్‌లో మాంసం, చేపల కోసం పెద్ద పెద్ద క్యూలైన్లు కనిపించాయని తెలిపింది.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)