లిప్‌కిస్ ఎప్పటిది, మనుషులకు పూర్వమే ఈ సంస్కృతి ఉందా?

ఫొటో సోర్స్, Getty Images
- రచయిత, విక్టోరియా గిల్
- హోదా, బీబీసీ ప్రతినిధి
అధరచుంబనం (నోటితో నోటిపై పెట్టుకునే ముద్దు) కేవలం మనుషులకు మాత్రమే పరిమితం కాదు. కోతులు, ఎలుగుబంట్లు ఇతర జంతువులోనూ ఈ ప్రవర్తన ఉంది. అయితే అసలీ ముద్దు ఎలా పుట్టిందో తెలుసుకునే ప్రయత్నం చేశారు పరిశోధకులు.
నోటిపై నోటితో ముద్దు పెట్టుకోవడం 2 కోట్ల 10 లక్షల ఏళ్ల కిందట, మనుషులు, వానరాలు ఉద్భవించడానికి ముందు వాటి పూర్వీకులలో ఈ ప్రవర్తన ఉండవచ్చని వారి అధ్యయనం సూచించింది.
నియాండర్తల్ మానవులు కూడా లిప్ కిస్ పెట్టుకుని ఉండవచ్చని ఈ అధ్యయనంలో తెలిపారు.
ముద్దు అనేది అంతు చిక్కని పరిణామాత్మక పజిల్ లాంటిదని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. అందుకే దీనిపై అధ్యయనం చేస్తున్నారు.
ముద్దు వల్ల సంరక్షణ లేదా బిడ్డలు పుట్టడం లాంటి ప్రయోజనాలేవీ లేవు. అయినప్పటికీ పెదవులతో పెదవులపై ముద్దు పెట్టుకునే సంస్కృతి మనుషుల్లోనే కాదు, జంతువుల్లోనూ కనిపిస్తుంది.

ఇతర జంతువులు కూడా ముద్దుపెట్టుకోవడాన్ని గుర్తించిన శాస్త్రవేత్తలు అది ఎప్పుడు ఎలా పుట్టిందనే విషయం తెలుసుకోవడానికి ఒక వరుస క్రమాన్ని నిర్మించే ప్రయత్నం చేశారు.
ఈ పరిశోధనలో భాగంగా వారు వివిధ జంతువుల ప్రవర్తనను పోల్చి చూశారు. ఇందు కోసం వాళ్లు ముద్దును శృంగార భరితం కాని కోణంలో నిర్వచించాల్సి వచ్చింది.

ఫొటో సోర్స్, Getty Images
2.1వందల కోట్ల ఏళ్ల క్రితం..
ఉద్రేకపూరిత ఉద్దేశాలేవీ లేకుండా నోటిపైన నోరు కలవడాన్ని వారు ముద్దుగా వర్ణించినట్లు ది జర్నల్ ఎవల్యూషన్ అండ్ హ్యూమన్ బిహేవియర్‌లో ప్రచురితమైన అధ్యయనం తెలిపింది. పెదాలతో పెదాల మీద ముద్దు పెట్టడాన్ని'పెదాల కదలిక లేదా ఆహారాన్ని అందించని నోటి భాగాల కలయిక" అని పరిశోధకులు నిర్వచించారు.
"మనుషులు, చింపాంజీలు, గొరిల్లాలు ముద్దు పెట్టుకుంటాయి" అని ప్రధాన పరిశోధకురాలు డాక్టర్ మటిల్డా బ్రిండ్లే వివరించారు.
"వారి పూర్వీకులు ముద్దు పెట్టుకుని ఉండవచ్చు" అని ఆమె అన్నారు.
"బహుశా రెండు వందల కోట్ల ఏళ్ల క్రితం ఉన్న పెద్ద కోతుల్లో ముద్దు పెట్టుకోవడం మొదలై ఉండవచ్చని మేం భావిస్తున్నాం" అని బ్రిండ్లే చెప్పారు.

ఫొటో సోర్స్, Getty Images
నియాండర్తల్స్‌లోనూ కిస్సింగ్ కల్చర్
ఈ అధ్యయనంలో భాగంగా శాస్త్రవేత్తలు తోడేళ్ళు, ప్రియరీ కుక్కలు, ధృవపు ఎలుగుబంట్లు అల్బాట్రోస్ పక్షుల్లోనూ ముద్దు విషయంలో తమ నిర్వచనానికి తగిన ప్రవర్తనను గుర్తించారు.
పెదాలపై పెదాలతో ముద్దు పెట్టుకోవడానికి మూలం ఎక్కడ అనేది తెలుసుకోవడానికి వాళ్లు ప్రత్యేకంగా కోతులు, చింపాంజీల మీద దృష్టి సారించారు.
40 వేల ఏళ్ల క్రితం మన సమీప పూర్వీకులైన పురాతన నియాండర్తల్ మానవులు కూడా ముద్దు పెట్టుకున్నట్లు ఇదే అధ్యయనం తేల్చింది.
నియాండర్తల్ డీఎన్ఏపై గతంలో జరిగిన ఒక పరిశోధనలో ఆధునిక మానవులు, నియాండర్తల్‌లు నోటి సూక్ష్మజీవిని పంచుకున్నారని తేలింది. ఇది మన లాలాజలంలో కనిపించే ఒక రకమైన బ్యాక్టీరియా.
"దీనర్థం ఏంటంటే వాళ్లు రెండు రకాలుగా విడిపోయిన తర్వాత కూడా ఒకరినొకరు ముద్దు పెట్టుకుని ఉండాలి" అని డాక్టర్ బ్రిండ్లే చెప్పారు.

ఫొటో సోర్స్, Chester Zoo
ఎందుకు మొదలైంది?
ఈ అధ్యయనం ముద్దు ఎప్పుడు మొదలైంది అనే దానిపైనే ప్రధానంగా దృష్టి పెట్టింది. అయితే ఎందుకు అలా చేశారనే ప్రశ్నకు సమాధానం కనుక్కోలేకపోయింది.
ముద్దు అనేది కోతుల పూర్వీకులు నోటిని శుభ్రపరిచే ప్రవర్తన నుంచి లేదా తమ భాగస్వామి ఆరోగ్యాన్ని, సాన్నిహిత్యపు సానుకూలతను తెలుసుకునే అంచనాల నుంచి పుట్టి ఉండవచ్చని వివిధ రకాల థియరీలు ఉన్నాయి.
ముద్దు ఎందుకు పెట్టుకున్నారు అనేది తెలుసుకోవడం వల్ల అది మరో ద్వారాన్ని తెరుస్తుందని డాక్టర్ బ్రిండ్లే భావిస్తున్నారు.
"జంతువుల మధ్య బంధాన్ని పంచుకోవడాన్ని అర్థం చేసుకోవడంలో ఇది చాలా ముఖ్యమైనది. మనం దీన్ని అధ్యయనం చేస్తూనే ఉండాలి. మనుషుల మధ్య శృంగారపరమైన అంశాలున్నందున దీన్ని పక్కన పెట్టలేం" అని ఆమె అన్నారు.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














