ఆ గేదె పెరుగు తిన్నవారంతా రేబిస్ టీకా కోసం క్యూకట్టారు, అసలేం జరిగిందంటే...

ఫొటో సోర్స్, AMIT KUMAR
- రచయిత, సయద్ మోజిజ్ ఇమామ్
- హోదా, బీబీసీ ప్రతినిధి
ఉత్తరప్రదేశ్‌లోని బదౌన్ జిల్లాలో ఒక విందులో రైతా తిన్న దాదాపు 200 మందికి పైగా ప్రజలు రేబిస్ టీకాలు వేయించుకున్నారు.
బదౌన్ జిల్లాలోని పిప్రౌల్ గ్రామంలో ఓ వ్యక్తి కర్మకాండల తర్వాత జరిగిన విందులో రైతాను వడ్డించారు. ఆ రైతా కోసం ఉపయోగించిన పెరుగు, కుక్క కరిచిన గేదె పాలతో తయారైందని, ఆ గేదె చనిపోయినట్లు తమకు తర్వాత తెలిసిందని గ్రామస్థులు చెప్పారు.
గేదెకు రేబిస్ వచ్చి చనిపోయినట్లు వారు తెలిపారు.
"రేబిస్ వ్యాధి సోకిన జంతువు లేదా పశువుల పచ్చిపాలు లేదా మాంసం తిన్న తర్వాత యాంటీ రేబిస్ ఇంజెక్షన్ తీసుకోవడం అవసరం" అని లఖ్‌నవూలో నివసిస్తున్న డాక్టర్ బకార్ రజా చెప్పారు.
"ఒకసారి రేబిస్ వ్యాధి సోకితే, చికిత్స చాలా కష్టం. కాబట్టి ముందు జాగ్రత్త చర్యగా టీకాలు వేయించుకోవడం మంచిది" అని బదౌన్ చీఫ్ మెడికల్ ఆఫీసర్ రామేశ్వర్ మిశ్రా చెప్పారు.


ఫొటో సోర్స్, Getty Images
గ్రామంలో ఏం జరిగింది?
పిప్రౌల్ గ్రామంలో చనిపోయిన ఓ వ్యక్తి కర్మ డిసెంబర్ 23న జరిగింది. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విందుకు పెద్ద సంఖ్యలో జనం వచ్చారు. విందులో రైతాను వడ్డించారు.
కుక్క కరిచినట్లు చెబుతున్న గేదెను కొంతకాలం విడిగా ఉంచినా, దాని పాలను ఇతర గేదెల పాలతో కలిపినట్లు తెలిసిందని గ్రామస్థులు తెలిపారు.
కుక్క కరిచిన గేదె డిసెంబర్ 26న చనిపోయింది. దానిలో రేబిస్ లక్షణాలు కనిపించాయి.
ఈ విషయం తెలియడంతో విందులో పాల్గొన్నవారు చాలామంది డిసెంబర్ 27న రేబిస్ వ్యాక్సీన్ కోసం ఆసుపత్రికి వెళ్లారు.
"ఆ గేదె కుక్క కరిచి చనిపోయిందని తెలిసింది. అందుకే టీకా వేయించుకోవడానికి వచ్చా" అని ఉఝానిలోని ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చిన కౌశల్ కుమార్ చెప్పారు.
విందుకు హాజరైన వారిలో కొంతమంది తమకు ఆ జబ్బు వచ్చే ప్రమాదం ఉందని ఆందోళన చెందుతున్నారని ఆయన అన్నారు.

ఫొటో సోర్స్, AMIT KUMAR
వైద్యులు ఏం చెప్పారు?
ముందు జాగ్రత్తగా రేబిస్ టీకా వేయించుకోవాలని గేదె మరణం గురించి తెలుసుకున్న వైద్యులు కూడా సూచించారు. దీంతో విందులో పాల్గొన్నవారిలో చాలామంది కమ్యూనిటీ హెల్త్ సెంటర్లు, ప్రైవేటు ఆసుపత్రులకు వెళ్లారు.
"నాకు ఇన్ఫెక్షన్ సోకుతుందేమోనని భయంగా ఉంది" అని విందుకు హాజరైన ధర్మ అనే వ్యక్తి చెప్పారు.
డిసెంబర్ 28 నాటికి 166 మందికి యాంటీ రేబిస్ వ్యాక్సీన్ ఇచ్చినట్లు చీఫ్ మెడికల్ ఆఫీసర్ రామేశ్వర్ మిశ్రా చెప్పారు. ఇప్పటి వరకు దాదాపు 250 మంది ఈ వ్యాక్సీన్ వేయించుకున్నట్లు తెలిసింది.
రేబిస్ చాలా తీవ్రమైన వ్యాధి అని, అనుమానం వస్తే ముందు జాగ్రత్త ముఖ్యమని ఆరోగ్య శాఖ అధికారులు చెబుతున్నారు.
డిసెంబర్ 27న ఆరోగ్యశాఖ సిబ్బంది గ్రామానికి వచ్చారు. ప్రజలు భయపడాల్సిన అవసరం లేదని, సకాలంలో అన్ని మోతాదుల వ్యాక్సీన్ వేసుకోవాలని సూచించారు.
ప్రస్తుతానికి గ్రామంలో ఎవరికీ రేబిస్ లక్షణాలు కనిపించలేదు.

ఫొటో సోర్స్, AMIT KUMAR
రేబిస్ గణాంకాలు ఏం చెబుతున్నాయి?
"వ్యాధి సోకిన జంతువు లేదా పశువుల పచ్చి పాలు లేదా మాంసం తిన్న తర్వాత యాంటీ-రేబిస్ ఇంజెక్షన్లు తప్పనిసరి. మరిగించిన పాలతో ప్రమాదం తక్కువగా ఉన్నప్పటికీ రేబిస్‌ను నయం చేయడం కష్టం కాబట్టి ముందు జాగ్రత్తగా టీకా ఇవ్వాలి" అని లఖ్‌నవూకు చెందిన డాక్టర్ బకార్ రజా చెప్పారు.
‘‘వైరస్ ఏ ఉష్ణోగ్రత వద్ద లేదా ఎంతసేపు ఉంటుందో తెలియదు’’ అని బలరాంపూర్‌లోని గవర్నమెంట్ డాక్టర్ గౌరీ శంకర్ వర్మ అన్నారు.
"కుక్క కరిచినప్పుడు ముందు జాగ్రత్త చర్యగా అందరికీ ఐదు డోసుల యాంటీ-రేబిస్ టీకా ఇవ్వాలి. మొదటి డోసు తర్వాత మూడు రోజులకి రెండో డోసు, ఏడో రోజున మూడో డోసు, పద్నాలుగో రోజున నాలుగో డోసు, 28వ రోజున చివరి డోసు తీసుకోవాలి" అని ఆయన చెప్పారు.
రేబిస్ ప్రాణాంతక వ్యాధి అనీ, సకాలంలో టీకాలు వేయించుకోవడం వల్ల దీనిని పూర్తిగా నివారించవచ్చని వైద్యులు చెబుతున్నారు.
దేశవ్యాప్తంగా కుక్కకాట్ల బారిన పడుతున్న వారి సంఖ్య పెరుగుతోంది.
2023లో దాదాపు 30 లక్షల మంది కుక్కకాటు బారిన పడ్డారు
"2024లో దేశవ్యాప్తంగా 37 లక్షలకుపైగా కుక్క కాటు కేసులు నమోదయ్యాయి. ఈ కాలంలో రేబిస్ వ్యాధితో 54 మంది చనిపోయారు" అని కేంద్ర మత్స్య పశు సంవర్ధక, పాడి పరిశ్రమ శాఖ సహాయ మంత్రి ఎస్పీ సింగ్ బఘేల్ 2025 జులై 22న లోక్‌సభకు ఇచ్చిన లిఖిత పూర్వక సమాధానంలో చెప్పారు.
ఈ డేటాను జాతీయ రేబిస్ నియంత్రణ కార్యక్రమం కింద సేకరించారు.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














