ఉత్తర కొరియా: 'అజేయ సైనిక శక్తి'ని నిర్మిస్తామని ప్రకటించిన కిమ్ జోంగ్ ఉన్ -Newsreel

రక్షణ శాఖ ప్రదర్శన సమయంలో ఉత్తర కొరియా అధినేత కిమ్ జోంగ్ ఉన్

ఫొటో సోర్స్, Reuters

ఫొటో క్యాప్షన్, రక్షణ శాఖ ప్రదర్శన సమయంలో ఉత్తర కొరియా అధినేత కిమ్ జోంగ్ ఉన్

'ఎదురులేని సైనిక శక్తి'ని నిర్మిస్తామని ఉత్తర కొరియా అధినేత కిమ్ జోంగ్ ఉన్ అన్నారు. అమెరికా వైరి విధానాలు అనుసరిస్తున్న నేపథ్యంలో కిమ్ ఈ ప్రకటన చేశారని స్థానిక అధికారిక మీడియా రిపోర్ట్ చేసింది.

ఆయుధాల తయారీ అంతా ఆత్మరక్షణ కోసమేనని, యుద్ధం ప్రారంభించడానికి కాదని కిమ్ అన్నారు. రకరకాల భారీ క్షిపణులతో రక్షణ శాఖ ఏర్పాటు చేసిన ప్రదర్శనను తిలకిస్తూ కిమ్ ఈ వ్యాఖ్యలు చేశారు.

ఉత్తర కొరియా ఇటీవలే సరికొత్త హైపర్సోనిక్, యాంటీ-ఎయిర్‌క్రాఫ్ట్ మిసైళ్లను పరీక్షించింది. ఇదే సమయంలో దక్షిణ కొరియా కూడా సబ్ మెరీన్ నుంచి ప్రయోగించే క్షిపణిని పరీక్షించింది.

ఉత్తర కొరియా రాజధాని ప్యాంగ్యాంగ్ లో నిర్వహించిన 'సెల్ఫ్ డిఫెన్స్ - 2021' ప్రదర్శన వద్ద ప్రసంగించిన కిమ్, తన పొరుగుదేశంతో యుద్ధం చేయాలని తమకు లేదని దక్షిణ కొరియాను ఉద్దేశించి అన్నారు.

"మేం యుద్ధం గురించి మాట్లాడడం లేదు. కానీ, యుద్ధాన్ని నివారించడం గురించి మాట్లాడుతున్నాం. జాతీయ భద్రత కోసం యుద్ధ నిరోధక సంపత్తిని పెంచుకుంటున్నాం" అని కిమ్ అన్నారు. ఉత్తర, దక్షిణ కొరియాల మధ్య అమెరికా చిచ్చు పెడుతోందని ఆయన ఆరోపించారు.

అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ చాలా సార్లు ఉత్తర కొరియాతో చర్చలకు సుముఖంగా ఉన్నట్లు ప్రకటించారు. అయితే, ఆంక్షలు సడలించాలంటే ఆ దేశం ముందుగా అణ్వస్త్రాలను వదిలేయాలని బైడెన్ డిమాండ్ చేశారు. ఆ డిమాండ్‌ను ఉత్తర కొరియా మొదటి నుంచీ తిరస్కరిస్తూ వస్తోంది.

લાઇન

మా ఎన్నికల్లో అక్రమాలు జరిగాయి, రౌడీయిజం చేశారు - ప్రకాశ్ రాజ్

ఆత్మగౌరవం కోసమే ‘మా’ సభ్యత్వానికి రాజీనామా చేశానని ప్రకాశ్ రాజ్ అన్నారు.
ఫొటో క్యాప్షన్, ఆత్మగౌరవం కోసమే ‘మా’ సభ్యత్వానికి రాజీనామా చేశానని ప్రకాశ్ రాజ్ అన్నారు.

'మా' అసోసియేషన్ ఎన్నికల్లో గెలిచిన తమ ప్యానల్ మెంబర్స్ 11 మంది రాజీనామా చేస్తున్నారని నటుడు ప్రకాశ్ రాజ్ ప్రకటించారు. ఆ పోస్టుల్లో మీకు కావాల్సిన వారిని నియమించుకుని స్వేచ్ఛగా పని చేయాలని కొత్త అధ్యక్షుడు మంచు విష్ణుకు ప్రకాశ్ రాజ్ సూచించారు.

అసోసియేషన్‌కు తమ మద్దతు ఎప్పుడూ ఉంటుందని హైదరాబాద్‌లో మంగళవారం నిర్వహించిన మీడియా సమావేశంలో ప్రకాశ్ రాజ్ అన్నారు.

‘మా’ ఎన్నికల్లో అక్రమాలు జరిగాయని, రౌడీయిజం చేశారని ఈ సందర్భంగా ప్రకాశ్ రాజ్ ఆరోపించారు.

అందరినీ కలుపుకుపోయే తత్వం మంచు విష్ణులో ఉందని తాము భావించడం లేదని ప్రకాశ్ రాజ్ అన్నారు. విష్ణుతో కలిసి పని చేసే వాతావరణం కనిపించడం లేదని ఎన్నికైన తమ ప్యానల్ సభ్యులు భావిస్తున్నారని ప్రకాశ్ రాజ్ వెల్లడించారు.

ఇది బాధతో చేసిన రాజీనామాలు కావని, వీటిని ఆమోదించాలని, ఓటేసిన ఓటర్ల నమ్మకాన్ని నిలబెట్టాలని కొత్త అధ్యక్షుడు విష్ణుకు ప్రకాశ్ రాజ్ సూచించారు.

తమ ప్యానల్‌లో ఉన్నవారంతా ప్రశ్నించే మనస్తత్వం ఉన్నవారని, వారు అసోసియేషన్‌లో ఉంటే నిత్యం గొడవలే అవుతాయని ప్రకాశ్ రాజ్‌తోపాటు, నటుడు శ్రీకాంత్ కూడా అన్నారు.

తెలుగువాడు కానివాడు అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేయడానికి వీల్లేదంటూ అసోసియేషన్ బైలాస్‌లో మార్పులు చేయకుండా ఉంటానని హామీ ఇస్తే అసోసియేషన్ సభ్యత్వానికి రాజీనామను ఉపసంహరించుకుంటానని ప్రకాశ్ రాజ్ ప్రకటించారు.

ఓటేయడానికి మాత్రమే నా సభ్యత్వం అవసరమనుకుంటే అసోసియేషన్‌లో ఉండబోనని ఆయన తేల్చి చెప్పారు.

తమ ప్యానల్ సభ్యుల పట్ల మోహన్ బాబు దురుసుగా ప్రవర్తించారని, దాడికి ప్రయత్నించారని ప్రకాశ్ రాజ్ ప్యానల్ సభ్యుడు, నటుడు బెనర్జీ ఆరోపించారు. అసోసియేషన్ పెద్దలు కూడా ఈ దాడిని ఆపడానికి ప్రయత్నించలేదని ఆయన అన్నారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి)