చైనా ఒత్తిడికి తలొగ్గేది లేదన్న తైవాన్ అధ్యక్షురాలు త్సై ఇంగ్ వెన్

ఫొటో సోర్స్, EPA
తీవ్ర ఉద్రిక్తతల నేపథ్యంలో చైనా ఒత్తిడికి తలొగ్గేది లేదని తైవాన్ అధ్యక్షురాలు త్సై ఇంగ్-వెన్ స్పష్టం చేశారు. ప్రజాస్వామ్య జీవన విధానాన్ని తైవాన్ కాపాడుకుంటుందని ఆమె పేర్కొన్నారు.
"మనం ఎంత ఎక్కువ సాధిస్తే, చైనా నుండి అంత ఒత్తిడిని ఎదుర్కొంటాం" అని ఆమె చెప్పారు.
చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్, "పునరేకీకరణను పూర్తి చేస్తాం" అని ప్రతిజ్ఞ చేసిన అనంతరం, తైవాన్ జాతీయ దినోత్సవం సందర్భంగా ఆమె తన ప్రసంగంలో ఈ వ్యాఖ్యలు చేశారు.
తైవాన్ తనను తాను సార్వభౌమ రాజ్యంగా భావిస్తుండగా, చైనా దానిని విడిపోయిన ప్రావిన్స్‌గానే పరిగణిస్తోంది.
ఏకీకరణను సాధించడానికి సైనిక శక్తి వాడుకునే అంశాన్ని చైనా తోసిపుచ్చలేదు.
ఇటీవలి రోజుల్లో తైవాన్ వైమానిక రక్షణ వలయంలోకి చైనా రికార్డు స్థాయిలో సైనిక విమానాలను పంపింది. ఆదివారం తైవాన్ జాతీయ దినోత్సవాన్ని పురస్కరించుకుని, ఆ దేశాధ్యక్షురాలికి ముందస్తు హెచ్చరికగానే సైనిక విమానాలను పంపారని విశ్లేషకులు భావిస్తున్నారు.
బీజింగ్‌కు ధీటుగా నిలబడతానని హామీ ఇచ్చిన అనంతరం గత ఏడాది జరిగిన ఎన్నికల్లో భారీ మెజారిటీతో త్సై ఇంగ్ వెన్ తిరిగి గెలుపొందారు. తైవాన్ ప్రజాస్వామ్య రక్షణే తన మొదటి కర్తవ్యమని ఆదివారం తన ప్రసంగంలో వెల్లడించారు.
తైవాన్ "హడావిడిగా వ్యవహరించదు". కానీ రక్షణ వ్యవస్థలను బలోపేతం చేసుకుంటూ "చైనా మన కోసం నిర్దేశించిన మార్గంలో తైవాన్ నడవాలని ఎవరూ బలవంతం చేయలేరు" అని నిరూపిద్దాం అన్నారు.
చైనా చూపే మార్గం, 2.3 కోట్ల మంది తైవాన్ ప్రజలకు "స్వేచ్ఛా, ప్రజాస్వామ్య జీవన విధానాన్ని లేదా సార్వభౌమత్వాన్ని" అందించలేదని ఆమె చెప్పారు.
తైవాన్ వైమానిక రక్షణ జోన్‌లో చైనా సైనిక విమానాలు ప్రవేశించి, జాతీయ భద్రత, విమానయాన భద్రతను తీవ్రంగా ప్రభావితం చేశాయని, "పరిస్థితి గత 72 సంవత్సరాలలో లేనంత క్లిష్టంగా ఉందని" ఆమె అన్నారు.
ఆమెను "వేర్పాటువాది" గా చైనా ముద్ర వేసింది. దీనిని ఆమె ఖండించారు. చైనా నాయకులతో సమానంగా చర్చించాలనే ప్రతిపాదనను త్సై పునరుద్ఘాటించారు.
తైవాన్ యుద్ధ విమానాల విన్యాసం అనంతరం ఆమె ప్రసంగించారు.
త్సై ప్రసంగాన్ని తిలకిస్తున్న ఒక వ్యక్తి తైవానీలు చైనాతో ఏకీకరణను అంగీకరించబోరని ఏఎఫ్‌పీ వార్తా సంస్థతో చెప్పారు.
"చైనా ప్రస్తుతం నిరంకుశంగా ఉంది. ప్రత్యేకించి షీ జిన్ పింగ్ హయాంలో అది మరింత దిగజారింది. పునరేకీకరణ ఇప్పుడు సముచితం కాదు" అని మరొకరు అన్నారు.

ఫొటో సోర్స్, EPA
చైనా, తైవాన్ సంబంధాలు ఎందుకు దెబ్బతిన్నాయి...
1940లలో అంతర్యుద్ధం సమయంలో చైనా, తైవాన్ విడిపోయాయి. అయితే, అవసరమైతే బలవంతంగా ద్వీపాన్ని ఏదో ఒక సమయంలో తిరిగి స్వాధీనం చేసుకుంటామని బీజింగ్ నొక్కి చెప్పింది.
తైవాన్ పరిపాలన ఎలా సాగుతోంది?
ఈ ద్వీపానికి సొంత రాజ్యాంగం ఉంది. ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైన నాయకులు ఉంటారు. తైవాన్ సాయుధ దళంలో దాదాపు 3 లక్షల మంది సైనికులు ఉన్నారు.
తైవాన్‌ను ఎవరు గుర్తిస్తారు?
కొన్ని దేశాలు మాత్రమే తైవాన్‌ను గుర్తించాయి. చాలా దేశాలు చైనా ఆధీనంలో ఉన్నట్టే గుర్తిస్తున్నాయి. అమెరికాకు తైవాన్‌తో అధికారిక సంబంధాలు లేవు. కానీ, ద్వీపానికి తనను తాను రక్షించుకునే మార్గాలను అందించే చట్టం ఉంది.
చైనా అధ్యక్షుడు షీ జిన్ పింగ్ శనివారం మాట్లాడుతూ శాంతియుతంగా ఏకీకరణ జరగాలన్నారు. కానీ, చైనా ప్రజలు వేర్పాటువాదాన్ని వ్యతిరేకించే మంచి సంప్రదాయాన్ని కలిగి ఉన్నారని హెచ్చరించారు.
"మాతృభూమి పూర్తి పునరేకీకరణ చారిత్రక కర్తవ్యం. ఇది కచ్చితంగా నెరవేరుతుంది" అని షీ అన్నారు.
ఇటీవల పెరిగిన ఉద్రిక్తతల వల్ల, చైనా, తైవాన్ మధ్య సంబంధాలు చివరిసారిగా కనిపించిన స్థాయికి మాత్రం క్షీణించలేదు. చైనా క్షిపణి పరీక్షలతో 1996లో అధ్యక్ష ఎన్నికలకు అంతరాయం కలిగించడానికి ప్రయత్నించినప్పుడు, వాటిని నిరోధించడానికి అమెరికా ఈ ప్రాంతానికి విమాన వాహక నౌకలను పంపింది.

ఫొటో సోర్స్, Getty Images
అమెరికా సుదీర్ఘకాలంగా "వన్ చైనా" విధానాన్ని అనుసరిస్తోంది. దీనిలో భాగంగా తైవాన్ కంటే చైనాకే గుర్తింపును ఇస్తుంది.
కానీ, ఈ ఒప్పందం తైవాన్‌తో "బలమైన అనధికారిక" సంబంధాన్ని అమెరికా కొనసాగించడానికి కూడా అనుమతిస్తుంది. వాషింగ్టన్-తైవాన్ సంబంధాల చట్టంలో భాగంగా తైవాన్‌కు అమెరికా ఆయుధాలను విక్రయిస్తుంది. తైవాన్ తనను తాను రక్షించుకోవడానికి అమెరికా సహాయం చేయాలని కోరింది.
ఇటీవల అమెరికా జాతీయ భద్రతా సలహాదారు జేక్ సుల్లివన్ బీబీసీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో.. తైవాన్ జలసంధి అంతటా "శాంతి, స్థిరత్వాన్ని దెబ్బతీసే" ఏ చర్యలకైనా వ్యతిరేకంగా అమెరికా నిలబడి మద్దతుగా నిలుస్తుంది అన్నారు.
ఇవి కూడా చదవండి:
- యూపీ: ‘రైతుల్ని కారుతో గుద్ది చంపిన కేసు’లో కేంద్ర మంత్రి కొడుకు ఆశిష్ మిశ్రా అరెస్ట్
- 'వృద్ధాప్యం ఒక వ్యాధి, దాన్ని నయం చేయవచ్చు' -హార్వర్డ్ శాస్త్రవేత్త డేవిడ్ సింక్లెయిర్
- ఎయిర్ ఇండియా మళ్లీ టాటా గూటికి చేరడం వల్ల ఎలాంటి మార్పులు రావచ్చు?
- అస్సాంలో ముస్లిం యువకుడి హత్యపై ఓఐసీ ప్రకటన.. ఇస్లామిక్ దేశాల జోక్యంపై భారత్ ఏమందంటే..
- హెటిరో ఫార్మా సంస్థలో ఐటీ సోదాలు, రూ. 142 కోట్ల నగదు స్వాధీనం
- పాకిస్తాన్లో భూకంపం, స్పెయిన్‌లో బద్దలైన అగ్నిపర్వతం... ఈ వారం విశేషాల ఫోటో ఫీచర్
- "చపాతీని కొలవడానికి నా భర్త రోజూ స్కేలు తీసుకొని భోజనానికి కూర్చుంటాడు!"
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








