వెంకయ్యనాయుడు: అరుణాచల్‌ప్రదేశ్‌లో ఉప రాష్ట్రపతి పర్యటించడంపై చైనా అభ్యంతరం, ధీటుగా బదులిచ్చిన భారత్

భారత ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు

ఫొటో సోర్స్, @VPSecretariat

ఫొటో క్యాప్షన్, భారత ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు

భారత ఉపరాష్ట్రపతి ఎం. వెంకయ్యనాయుడు అరుణాచల్ పర్యటనపై బుధవారం చైనా అభ్యంతరాలు వ్యక్తం చేసింది.

"చట్టవిరుద్ధంగా, ఏకపక్షంగా ఏర్పడిన అరుణాచల్ ప్రదేశ్‌ను చైనా గుర్తించదు. ఆ ప్రాంతంలో భారత ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు పర్యటించడాన్ని చైనా తీవ్రంగా వ్యతిరేకిస్తోంది" అని ఆ దేశ విదేశీ వ్యవహారాల శాఖ ప్రతినిధి జావో లిజియాన్ అన్నారు.

ఇందుకు సమాధానం చెప్తూ భారత విదేశాంగ శాఖ ఓ ప్రకటన జారీ చేసింది.

"చైనా అధికార ప్రతినిధి చేసిన వ్యాఖ్యలు మా దృష్టికి వచ్చాయి. ఈ వ్యాఖ్యలను మేం తిరస్కరిస్తున్నాం. అరుణాచల్ ప్రదేశ్ భారతదేశంలో అంతర్భాగం. అవిభాజ్యం. దేశంలోని మిగతా రాష్ట్రాలను సందర్శించినట్లే నేతలు అరుణాచల్ ప్రదేశ్‌కు కూడా వెళుతుంటారు. భారతదేశంలో ఉన్న రాష్ట్రాన్ని, భారత నాయకులు సందర్శిస్తే అభ్యంతరాలు చెప్పడం భారత ప్రజల తర్కానికి, అవగాహనకు అందనిది."

అరుణాచల్ ప్రదేశ్‌పై చైనా వాదనలను భారత్ ఎప్పుడూ తిరస్కరిస్తూనే ఉంది. ఆ రాష్ట్రం భారతదేశంలో విడదీయరాని భాగం అని ఇప్పటికే స్పష్టం చేశాం’ అని ఆ ప్రకటనలో పేర్కొన్నారు.

వెంకయ్యనాయుడు

ఫొటో సోర్స్, Getty Images

లద్దాఖ్‌లో సరిహద్దు వివాదం

"రెండు దేశాల మధ్య కొనసాగుతున్న సరిహద్దు వివాదాలు మరింత జటిలం కాకుండా నిరోధించాలి. ద్వైపాక్షిక సంబంధాలు మెరుగుపడేలా చర్యలు తీసుకోవాలి. చైనా ఆందోళనలను భారతదేశం గౌరవించాలి. ఈ ప్రాంతంలో శాంతిని, స్థిరత్వాన్ని నెలకొల్పేందుకు తగిన చర్యలు తీసుకోవాలి" అని చైనా విదేశాంగ శాఖ ప్రతినిధి అన్నారు.

ఈ అంశంపై కూడా భారత ప్రభుత్వం సూటిగా స్పందించింది.

"మేం ఇంతకు ముందే చెప్పినట్టు, ద్వైపాక్షిక ఒప్పందాలను ఉల్లంఘిస్తూ, యథాస్థితిని తారుమారు చేసేందుకు చైనా ఏకపక్షంగా ప్రయత్నించడమే భారత-చైనా సరిహద్దుల్లో వివాదాలు చెలరేగడానికి కారణం" అంటూ జవాబిచ్చింది.

సంబంధంలేని విషయాలను కలపకుండా ద్వైపాక్షిక ఒప్పందాలను, ప్రోటోకాల్‌ను పాటిస్తూ, తూర్పు లద్దాఖ్‌లో వాస్తవాధీన రేఖ వెంబడి పరిస్థితులను చక్కదిద్దడానికి చైనా కృషి చేస్తుందని భారత ప్రభుత్వం ఆశాభావం వ్యక్తం చేసింది.

భారత, చైనాల మధ్య సరిహద్దు వివాదాలను పరిష్కరించడానికి రెండు దేశాలూ ఇటీవల 13 సార్లు సమావేశమయ్యాయి.

మోదీ

ఫొటో సోర్స్, Twitter/narendramodi

మోదీ, అమిత్ షా పర్యటనలపైనా అభ్యంతరం

2019 ఫిబ్రవరిలో ప్రధాని మోదీ అరుణాచల్ ప్రదేశ్‌ను సందర్శించినప్పుడు కూడా చైనా ఇలాగే అభ్యంతరం వ్యక్తంచేసింది.

ఆ సమయంలో కూడా భారత విదేశీ వ్యవహారాల శాఖ ఘాటుగానే స్పందించింది.

అరుణాచల్ ప్రదేశ్ భారత్‌లో అంతర్భాగమని, అక్కడ తమ నేతల పర్యటనపై అభ్యంతరాలు వ్యక్తంచేయొద్దని చైనాకు హెచ్చరించింది.

అక్కడికి ఏడాది తరువాత 2020 ఫిబ్రవరిలో కేంద్ర హోం మంత్రి అమిత్ షా అరుణాచల్ ప్రదేశ్‌లో పర్యటించినప్పుడూ చైనా ఇదే తరహాలో వ్యవహరించింది.

దక్షిణ టిబెట్‌లో అరుణాచల్ ప్రదేశ్ భాగమని పేర్కొంటూ అక్కడ అమిత్ షా ఎలా పర్యటిస్తారని ప్రశ్నించింది.

చైనా, భారత్‌ల మధ్య పరస్పర రాజకీయ విశ్వాసానికి భారత్ భంగం కలిగించిందని చైనా ఆరోపించింది.

అయితే, చైనా ఆరోపణలను భారత్ ఆ సందర్భంలోనూ తిప్పికొట్టింది.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)