ఐఐటీ కాన్పూర్ ప్రొఫెసర్ భూతవైద్యం, మంత్రాలతో దెయ్యాన్ని తరిమికొట్టానంటూ వీడియో - ప్రెస్‌రివ్యూ

ఫొటో సోర్స్, IIT Mandi
ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఐఐటీ)-కాన్పూరు ప్రొఫెసర్ లక్ష్మీధర్ బెహరా వివాదంలో చిక్కుకున్నారని ఆంధ్రజ్యోతి తెలిపింది. భూతవైద్యం చేసి, తన స్నేహితుడి అపార్ట్‌మెంట్ నుంచి దెయ్యాన్ని పారదోలానని ఆయన ఓ వీడియోలో చెప్పారని వివరించింది.
పవిత్రమైన మంత్రాలను ఉచ్చరించి, తన మిత్రుడి తల్లిదండ్రులకు పట్టిన దెయ్యాన్ని వదిలించానని వీడియోలో బెహరా చెప్పారు. ఐదు నిమిషాల నిడివిగల ఈ వీడియోలో బెహరా తాను 1993లో చెన్నై వెళ్ళి, తన మిత్రునికి సహాయపడిన విషయాన్ని వివరించారు.
ఆయన తన మిత్రుడి కుటుంబ సభ్యులు దెయ్యాలబారిన పడ్డారని, మంత్రాలను ఉచ్చరించడం ద్వారా వారికి సాంత్వన కలిగించానని చెప్పారు. తాను భగవద్గీతను పఠిస్తానని చెప్పారు. ‘హరే రామ హరే కృష్ణ’ మంత్రాన్ని జపిస్తానని తెలిపారు. ఈ మంత్రాల మహిమను తన మిత్రునికి తెలియజేసి, వారి కుటుంబానికి సహాయపడ్డానని తెలిపారు.
ఈ వీడియో క్లిప్ గురించి లక్ష్మీధర్ బెహరాను జాతీయ మీడియా ప్రశ్నించినపుడు ఆయన స్పందిస్తూ, తాను ఏం చేశానో అదే చెప్పానన్నారు. దెయ్యాలు నిజంగానే ఉన్నాయన్నారు. చాలా విషయాలను ఆధునిక సైన్స్ వివరించలేదని తెలిపారు.
లక్ష్మీధర్ బెహరా ఇటీవలే ఐఐటీ-మండీ డైరెక్టర్‌గా నియమితులయ్యారు. లక్ష్మీధర్ ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్ డిపార్ట్‌మెంట్ ప్రొఫెసర్. ఐఐటీ-దిల్లీ నుంచి పీహెచ్‌డీ పట్టా పొందారు. జర్మన్ నేషనల్ సెంటర్ ఫర్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ నుంచి పోస్ట్ డాక్టరేట్ చేశారు. ఆయనకు రోబోటిక్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌లో ప్రత్యేక నైపుణ్యముంది’’అని కథనంలో పేర్కొన్నారు.

ఫొటో సోర్స్, Facebook/Akshay kumar
అక్షయ్ కుమార్ సెట్‌లో అగ్ని ప్రమాదం
బాలీవుడ్ హీరో అక్షయ్ కుమార్ నటిస్తున్న బచ్‌పన్ పాండే సెట్స్‌లో అగ్నిప్రమాదం చోటు చేసుకుందని సాక్షి తెలిపింది.
‘‘చివరిదశ షూటింగ్ జరుపుకుంటున్న ఈ మూవీ సెట్స్‌కు నిప్పంటుకోగా అప్రమత్తమైన సిబ్బంది వెంటనే మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. ఈ ప్రమాదంలో ఎవరూ గాయపడలేదు.
అక్షయ్ కుమార్ హీరోగా కనిపించనున్న ఈ సినిమాలో కృతీ సనన్, జాక్వెలిన్ ఫెర్నాండేజ్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. బాబీ సింహ, సిద్ధార్థ, లక్ష్మీ మీనన్ ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు.
ఈ మూవీ దక్షిణాది చిత్రం జిగార్తాండకు రీమేక్. అక్షయ్ కుమార్ సినిమాల విషయానికి వస్తే ప్రస్తుతం ఆయన సెల్ఫీ పేరుతో మరో సినిమా కూడా చేస్తున్నారు’’అని కథనంలో పేర్కొన్నారు.

ఫొటో సోర్స్, UGC
జొన్నలగడ్డలో తెదేపా ధర్నా ఉద్రిక్తతం.. చదలవాడకు అస్వస్థత
నరసరావుపేట మండలం జొన్నలగడ్డలో నరసరావుపేట తెదేపా ఇన్‌ఛార్జి చదలవాడ అరవిందబాబు ఆధ్వర్యంలో శనివారం నిర్వహించిన ధర్నా ఉద్రిక్తంగా మారిందని ఈనాడు తెలిపింది.
‘‘గురువారం రాత్రి జొన్నలగడ్డలో వైఎస్సార్ విగ్రహాన్ని గుర్తుతెలియని వ్యక్తులు మాయం చేశారు. దీంతో శుక్రవారం నరసరావుపేట ఎమ్మెల్యే గోపిరెడ్డి ఆధ్వర్యం లో వైకాపా శ్రేణులు గ్రామంలోని ప్రధాన రహదారిపై బైఠాయించి ధర్నా చేశారు. విగ్రహాన్ని మాయం చేసిన వారిని వెంటనే అరెస్టు చేయాలని ఎమ్మెల్యే పోలీసులను ఆదేశించారు.
ఈ నేపథ్యంలో వైకాపా నాయకుల ఫిర్యాదు మేరకు జొన్నలగడ్డ గ్రామానికి చెందిన తెదేపా నేతలు అనిల్, రాజేశ్‌లను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారిని నరసరావుపేట గ్రామీణ పోలీస్ స్టేషన్లో విచారించకుండా ఎక్క డికో తీసుకెళ్లి విచారిస్తున్నారని తెదేపా నాయకులు జొన్నలగడ్డలో ఆందోళనకు దిగారు.
వైకాపా నేతలే వైఎస్సార్ విగ్రహాన్ని మాయం చేసి తెదేపా నేతలపై ఆరోపణలు చేస్తున్నారని చదలవాడ అరవిందబాబు ఆరోపించారు. తెదేపా శ్రేణులు గుంటూరు- కర్నూలు రహదారిపై బైఠాయించి నిరసనకు దిగారు.
నరసరావుపేట గ్రామీణ పోలీసులు ధర్నా విరమించాలని తెదేపా నాయకులను కోరారు. వారు పట్టించుకోకపోవడంతో పోలీసులు బలవంతంగా తెదేపా నాయకులను అక్కడి నుంచి పంపించేందుకు ప్రయత్నించారు.
ఈ క్రమంలో పోలీసులు, తెదేపా కార్యకర్తల మధ్య తోపులాట జరిగింది. ఈ తోపులాటలో చెదలవాడ అస్వస్థతకు గురయ్యారు. పార్టీ శ్రేణులు వెంటనే ఆయన్ను ఆసుపత్రికి తరలించారు’’అని కథనంలో పేర్కొన్నారు.

ఫొటో సోర్స్, Facebook/SachinJoshi
టాలీవుడ్ నటుడు, నిర్మాత సచిన్ జోషి ఆస్తుల జప్తు
మనీలాండరింగ్ కేసులో టాలీవుడ్ నటుడు, నిర్మాత సచిన్ జోషి ఆస్తులను ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) జప్తు చేసిందని నమస్తే తెలంగాణ తెలిపింది.
‘‘మొత్తం రూ. 410 కోట్ల విలువైన ఆస్తులను జప్తు ఈడీ చేసింది. ఇందులో రూ.330 కోట్ల వరకు ఓంకార్ గ్రూప్‌నకు చెందిన ఆస్తులు కాగా... మిగిలిన రూ. 80 కోట్లు వైకింగ్ గ్రూప్ కంపెనీకి చెందినవని ఈడీ వెల్లడించింది.
ఎస్‌ఆర్‌ఏ ప్రాజెక్టులో భాగంగా సచిన్ జోషికి చెందిన ఓంకార్ గ్రూప్ అక్రమాలకు పాల్పడిందన్న ఆరోపణలపై ఈడీ చేపట్టిన దర్యాప్తులో భాగంగా ఈ మేరకు చర్యలు తీసుకుంది.
ఈ అక్రమాలపై గతంలో ఔరంగాబాద్ సిటీ చౌక్ పోలీస్ స్టేషన్‌లో కేసు కూడా నమోదైంది.
సచిన్ జోషి 2002లో వచ్చిన మౌనమేలనోయి సినిమాతో టాలీవుడ్‌కు పరిచయమయ్యారు. ఆ తర్వాత నిను చూడక నేనుండలేను, ఒరేయ్ పండు, నీజతగా నేనుండాలి, వీడెవడు వంటి తెలుగు సినిమాల్లో నటించారు.
తెలుగులో తమన్నా హీరోయిన్‌గా నటించిన నెక్ట్స్ ఏంటి సినిమాను కూడా నిర్మించారు’’అని కథనంలో పేర్కొన్నారు.
ఇవి కూడా చదవండి:
- ఆంధ్రప్రదేశ్: 'గుడిసె' ఉన్నట్లుండి సినిమా షూటింగ్ స్పాట్ ఎలా అయింది... జనాలెందుకు అక్కడికి క్యూ కడుతున్నారు?
- సెక్స్ కోరికలు వయసు పెరుగుతుంటే తగ్గిపోతాయా...
- ఉత్తర్‌ప్రదేశ్ ఎన్నికల్లో ముస్లింలు ఎటు వైపు... బీజేపీ పాలనపై వారు ఏమంటున్నారు?
- సరైన పద్ధతిలో ఉపవాసం ఎలా ఉండాలి, దానివల్ల కలిగే ప్రయోజనాలేంటి?
- పాతికేళ్ల కిందట పంది గుండెను మనిషికి అమర్చిన భారతీయ వైద్యుడిని జైలులో ఎందుకు పెట్టారు?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)











