అంబానీ నుంచి అదానీ, టాటా నుంచి బిర్లా దాకా.. ఎవర్నీ వదలని బ్లాక్ మండే, ఇంత పతనానికి కారణమేంటి?

ఫొటో సోర్స్, Getty Images
- రచయిత, కుందవరం నాగేంద్ర సాయి
- హోదా, బీబీసీ కోసం
అంబానీ నుంచి అదానీ వరకూ… టాటా నుంచి బిర్లా దాకా.. జిందాల్ నుంచి సందులో ఉండే చిన్న మైక్రో క్యాప్ కంపెనీ వరకూ.. సోమవారం నెలకొన్న మార్కెట్ల పతనం ఎవ్వరినీ వదల్లేదు. దశాబ్దాల చరిత్ర ఉన్నా, అత్యంత పటిష్టమైన నాయకత్వం ఉన్నా, ఏదీ కంపెనీలను నష్టాల నుంచి కాపాడలేకపోయింది.
స్టాక్ మార్కెట్లో సోమవారం ఒక బ్లాక్ మండే. చరిత్రలో నిలిచిన అతి భారీ పతనాల్లో ఇది కూడా ఒకటి. అమెరికా అధ్యక్షుడు డోనల్డ్ ట్రంప్ సుంకాల విధింపు తర్వాత జరుగుతున్న పరిణామాల్లో భాగంగా ఈ వారం ప్రారంభంలోనే ప్రపంచ మార్కెట్లతో సహా భారతీయ మార్కెట్లు కూడా తీవ్రంగా ప్రభావితమయ్యాయి.
వాస్తవానికి యూఎస్, యూరప్, ఏషియా మార్కెట్లలోని సూచీలతో పోలిస్తే భారతీయ మార్కెట్లు కాస్త మెచ్యూర్డ్‌గా, షాక్‌ను గట్టిగా తట్టుకున్నాయనే చెప్పొచ్చు.
ఎందుకంటే హాంకాంగ్ మార్కెట్స్ ఏకంగా 13.2 శాతం, చైనా షాంఘై ఇండెక్స్ 7.3 శాతం, జపాన్ నిక్కీ 7.8 శాతం నష్టపోగా, నిఫ్టీ మాత్రం 3.2 శాతమే నష్టపోయింది.
సోమవారం నష్టాల దెబ్బకు బీఎస్‌ఈలో సుమారుగా రూ.13 లక్షల కోట్లకు పైగా మార్కెట్ క్యాపిటలైజేషన్ తగ్గిపోయింది. సెన్సెక్స్ 2,226 పాయింట్లు, నిఫ్టీ 742 పాయింట్ల నష్టాలతో ముగిశాయి.

టాటా, అంబానీ కూడా మినహాయింపు కాదు
సోమవారం ట్రేడింగ్‌లో నిఫ్టీ50లో హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు, ఐసీఐసీఐ బ్యాంకు, రిలయన్స్ ఇండస్ట్రీస్, ఎల్ అండ్ టీ, ఇన్ఫోసిస్ కంపెనీల స్టాక్స్ టాప్ లూజర్స్. ఈ ఐదు స్టాక్సే సుమారు 320 పాయింట్ల నెగిటివ్ కంట్రిబ్యూషన్ చేశాయి. అంటే, నిఫ్టీ 750 పాయింట్ల పతనంలో 320 పాయింట్ల పతనం ఈ టాప్ ఐదు స్టాక్స్ వల్లే.
టాటా గ్రూప్ సోమవారం ట్రేడింగ్‌లో సుమారు రూ.లక్షన్నర కోట్ల మార్కెట్ క్యాపిటలైజేషన్‌ను కోల్పోయింది. ముఖ్యంగా టాటా మోటార్స్ స్టాక్ 10 శాతం కుప్పకూలింది.
ఎందుకంటే టాటా మోటార్స్‌కు చెందిన జాగ్వార్ ల్యాండ్ రోవర్ సుంకాల దెబ్బకు భయపడి ప్రస్తుతానికి తన ఉత్పత్తులను యూఎస్‌కు పంపడాన్ని తాత్కాలికంగా నిలిపేసింది.
ఇదే కోవలో టాటా స్టీల్, టీసీఎస్, ట్రెంట్, ఇండియన్ హోటల్స్, టాటా కన్స్యూమర్ ప్రొడక్ట్స్, టాటా పవర్ కూడా నష్టాలను చవిచూశాయి.
ఇక రిలయన్స్ ఇండస్ట్రీస్ ఒక దశలో ఇంట్రాడేలో 7.5శాతం కోల్పోయి 52వారాల కనిష్ట స్థాయిని తాకింది. ఏడాది కాలంలో రిలయన్స్ 22 శాతం నష్టాలను చవిచూసింది.

ఫొటో సోర్స్, Getty Images
బ్లాక్ మండేకి కారణాలు ఏంటి ?
ట్రంప్ సుంకాలు - పరస్పర సుంకాలు (రెసిప్రోకల్ టారిఫ్స్)
అమెరికా అధ్యక్షుడు డోనల్డ్ ట్రంప్ ఏప్రిల్ 2వ తేదీ సుంకాల ప్రకటన చేసినప్పటి నుంచి మార్కెట్లలో తీవ్రత మరింతగా పెరిగింది. 180 దేశాల మీద ఆయన సుంకాలు విధించడం పరోక్షంగా అమెరికా ఆర్థిక స్థితిగతులపైనే నెగిటివ్ ఎఫెక్ట్ చూపిస్తుందనేది మెజారిటీ ఆర్థికవేత్తలు చెబుతున్న మాట.
అమెరికన్ ఫెడరల్ రిజర్వ్ చీఫ్ జెరోమ్ పావెల్ కూడా అదే చెబుతున్నారు. ఈ టారిఫ్‌ల ఎఫెక్ట్ వల్ల అమెరికా ఆర్థిక వ్యవస్థ మరింతగా నీరసించడంతో పాటు మాంద్యం దిశగా వెళ్లే ప్రమాదం ఉందనేది ప్రస్తుతం అర్థమవుతున్న అంశం.
ముందే అంతంతమాత్రంగా ఉన్న అమెరికా ఆర్థిక వ్యవస్థకు ఈ సుంకాల ప్రభావం ఆజ్యం పోసినట్టు అయింది.
ఇప్పటికే యూఎస్‌లో ద్రవ్యోల్బణం తీవ్రంగా పెరిగి, వడ్డీ రేట్లు రికార్డు స్థాయిలో ఉన్నాయి. పరస్పర సుంకాలను చైనా, యూరప్ కూడా విధిస్తే మరింతగా పరిస్థితి దిగజారుతుందనే భయాలు కూడా మార్కెట్లను కిందికి పడేశాయి.

ఫొటో సోర్స్, Getty Images
వివిధ రంగాలపై ప్రభావం
ఒకవేళ ఈ సుంకాల ప్రభావంతో అమెరికా మాంద్యంలోకి జారుకుంటే ఏమవుతుందనే భయాలే మెటల్స్, రియల్ ఎస్టేట్, బ్యాంకింగ్, ఐటీ రంగాలపై తీవ్ర ప్రభావాన్ని చూపించాయి.
వాస్తవానికి ఏప్రిల్ 2 ప్రకటన తర్వాత మార్కెట్లు పెద్దగా రియాక్ట్ కాలేదు. ఎప్పుడైతే అమెరికా మార్కెట్లలో పతనం మొదలైందో అప్పుడే మిగిలిన మార్కెట్లలో కూడా సెల్ ఆఫ్ స్టార్ట్ (తీవ్ర అమ్మకాల ఒత్తిడి మొదలు) అయింది.
రొయ్యల నుంచి ఐటీ ఉద్యోగాల వరకూ..
అమెరికాలో మాంద్యం వస్తే మనకేంటి? స్టాక్ మార్కెట్ నష్టపోతే మనకు ఏంటి? అని అనుకోవడానికి వీల్లేదు. ఎందుకంటే ఇవన్నీ మనందరిపై ఖచ్చితమైన ప్రభావాన్ని చూపుతాయి.
ఉదాహరణకు.. ఐటీ రంగాన్నే తీసుకుందాం. ఒకవేళ యూఎస్‌లో ఏదైనా మాంద్యంలాంటి పరిస్థితులు వస్తే, కంపెనీలన్నీ మెల్లిగా తమ ఖర్చులను తగ్గించుకుంటాయి. ఆ సమయంలో వాళ్లు ఆర్డర్లను కూడా తగ్గిస్తారు.
భారతదేశంలో మెజార్టీ ఐటీ సంస్థలు యూఎస్ ఆర్డర్స్‌పై ఆధారపడుతున్నాయి కాబట్టి ఇక్కడ ఉద్యోగాల్లో కోత ఉంటుంది. ఇప్పటికే కొత్త నియామకాలు దాదాపుగా ఆగిపోయాయి. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) పేరుతో ఉద్యోగాలను పెద్ద ఎత్తున తీసేస్తున్నాయి కంపెనీలు. ఇప్పుడు ఒకవేళ మాంద్యం వస్తే ఐటీ ఉద్యోగాలకు ఎసరొస్తుంది.
ఐటీ ఉద్యోగాలు తగ్గిపోయినా, పోతున్నా రియల్ ఎస్టేట్ ఎఫెక్ట్ అవుతుంది. రియల్ ఎస్టేట్ పడితే స్టీల్, సిమెంట్ సహా వివిధ బిల్డింగ్ ఉత్పత్తుల సంస్థలు ఎఫెక్ట్ అవుతాయి.
రోజువారీ క్యాబ్ డ్రైవర్లు, టిఫిన్ సెంటర్లకు కూడా ఆ వేడి తాకుతుంది. వాహనాలు కొనేవాళ్ల సంఖ్య తగ్గుతుంది. ఓవైపు ఉద్యోగాలు పోతుంటే, జనాలు మెల్లిగా ఖర్చులను నియంత్రణలో ఉంచుకుంటారు. ఇలా ఒక్క సెక్టార్ ఎఫెక్ట్ అయితే, దాన్ని గొలుసుకట్టు (క్యాస్‌కేడింగ్ ఎఫెక్ట్) ప్రభావాలు ఆఖరి వరకూ వచ్చి తగిలే తీరతాయి.
ఇక రొయ్యల ఎగమతుల విషయానికే వద్దాం. భారత్ నుంచి ప్రతీ ఏటా యూఎస్‌కు సుమారు రెండు బిలియన్ డాలర్ల (రూ.17 వేల కోట్ల) విలువైన రొయ్యలను ఎగుమతి చేస్తాం. ఇప్పుడు ఈ 26 శాతం సుంకాల ప్రభావంతో ఇండియా నుంచి దిగుమతి చేసుకోవడం ఖరీదైన వ్యవహారమవుతుంది.
వియత్నాం, థాయిలాండ్ లాంటి దేశాలు భారత్ నుంచి రొయ్యలను కొని ప్రాసెస్ చేసి యూఎస్‌కు పంపిస్తాయి. అయితే, ఈక్వెడార్ (వీళ్లపై సుంకం 10 శాతమే) లాంటి దేశాల నుంచి ఆక్వాను దిగుమతి చేసుకుంటే ఖర్చు చాలా తక్కువగా ఉంటుంది.
అందుకే ముఖ్యంగా ఏపీ నుంచి ఎగుమతి అయ్యే రొయ్యలకు కొద్ది రోజుల నుంచి గిరాకీ దారుణంగా పడిపోయిందని రైతులు చెబుతున్నారు. ఇలా ఒక్కో రంగానికి ఒక్కోరకమైన ఎఫెక్ట్ ఉంది.

ఫొటో సోర్స్, Getty Images
భవిష్యత్తు ఏంటి ?
అమెరికా సుంకాలు విధిస్తే భారతీయులు కూడా వణికిపోవాల్సిందేనా? ఇక ప్రత్యామ్నాయమే లేదా అని అనుకోవచ్చు.
వాస్తవానికి అంతగా బెంబేలెత్తిపోవాల్సిన పనిలేదు. ఎందుకంటే కొన్ని రంగాలను మినహాయిస్తే, అత్యధికంగా దేశీయ వినియోగంపైనే ఆధారపడిన ఆర్థిక వ్యవస్థ భారత్‌ది. దేశీయంగా వినియోగమే భారతీయ మార్కెట్లకు, కంపెనీలకు ఊతమిచ్చే అంశం.
గ్లోబల్‌గా ఏదైనా చిన్న సంఘటన జరిగినా, స్టాక్ మార్కెట్స్ తీవ్రంగా రియాక్ట్ కావడాన్ని భారతీయులుగా గతంలో అనేక సందర్భాల్లో చూశాం. ఒడిదుడుకులనేవి స్టాక్ మార్కెట్ రక్తంలో, నరనరంలో, కణకణంలో జీర్ణించుకుపోయి ఉంటాయి. అందుకే ఇంత తీవ్రమైన ఎఫెక్ట్‌ను చూస్తున్నాం.
కొద్దిగా ఏదైనా పాజిటివ్ సంకేతం వచ్చినా, మళ్లీ వేగంగా రికవర్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అందుకే ఇన్వెస్టర్స్ ప్యానిక్ బటన్ ప్రెస్ చేసి, పూర్తిగా బయటికి వెళ్లిపోవాల్సిన అవసరం ఎంతమాత్రమూ లేదు.

ఫొటో సోర్స్, Getty Images
‘పాజిటివ్ పాయింట్స్ మర్చిపోవద్దు’
టారిఫ్స్ ఎఫెక్ట్ క్రాస్ ఫైర్‌లో కొన్ని రంగాలు భారీగా లాభపడే అవకాశాలు కూడా ఉన్నాయి. ముఖ్యంగా యూఎస్ మాంద్యం భయాలతో ముడిచమురు ధరలు గణనీయంగా తగ్గాయి.
అమెరికా క్రూడాయిల్ ధరలు రెండు రోజుల్లో ఒక దశలో 60 డాలర్ల దిగువకు పడిపోయాయి. నాలుగేళ్ల కనిష్టానికి ధరలు దిగివచ్చాయి. ఇది భారత్‌లాంటి ఆర్థిక వ్యవస్థలకు ఎంతో లాభం చేకూర్చే అంశం.
ఎందుకంటే భారత్ దిగుమతి బిల్లులో అధిక శాతం డబ్బులను క్రూడాయిల్‌కే చెల్లిస్తోంది. ఇప్పుడు క్రూడ్ ధరలు తగ్గడం పరోక్షంగా దేశ ఆర్థిక స్థితిని మెరుగుపరుస్తుంది.
మరోవైపు డాలర్ ఇండెక్స్ ఆరు నెలల కనిష్టానికి పడిపోయింది. మాంద్యం భయాలు, ద్రవ్యోల్బణం కారణంగా యూఎస్ డాలర్ బలహీనమవుతోంది. మరోవైపు రూపాయి ఈ నెల రోజుల్లో బలం పుంజుకుంది.
డాలర్‌తో పోల్చి చూసినప్పుడు రూ.87.35 రికార్డ్ స్థాయి నుంచి రూ.85.34 స్థాయికి రూపాయి దిగి రావడాన్ని చూస్తున్నాం. ఇది కూడా భారత్‌కు కొద్దో గొప్పో పాజిటివ్ అంశంగానే చూడొచ్చు.
ఎమర్జింగ్ ఎకానమీస్‌లో (అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థలలో) భారత్ అత్యధిక వృద్ధి రేటును నమోదు చేసే అవకాశముంది. ఈ ఏడాది సుమారు 6.5 నుంచి 6.8 శాతం మధ్య జీడీపీ గ్రోత్ నమోదు కావొచ్చు.
ఏషియాలో ఇదే వన్ ఆఫ్ ది బెస్ట్ గ్రోత్‌గా చెప్పొచ్చు. అందుకే భారత్ మరీ బేలగా, భయపడాల్సిన పనేం లేదు.
మార్చి 2025లో కూడా జీఎస్టీ వసూళ్లు రూ.1.96 లక్షల కోట్లుగా నమోదయ్యాయి. ఈ మధ్యకాలంలో నెలకు రూ.1.75 నుంచి రూ.2 లక్షల కోట్ల మధ్య జీఎస్టీ వసూళ్లు అవుతున్నాయి. ఈ జోరు ఇలానే కొనసాగే అవకాశాలున్నాయి.
ప్రత్యక్ష పన్నులు కూడా మెరుగవుతున్నాయి. ఈ ఏప్రిల్ నుంచి వ్యక్తిగత ఆదాయపు పన్నులలో కూడా కేంద్రం తీపికబురు చెప్పింది. పన్ను శ్లాబుల్లో కోత వల్ల సుమారు రూ.లక్ష కోట్ల వరకూ ఆర్థిక వ్యవస్థలోకి రాబోతోంది. ఇది దేశీయ వినియోగాన్ని మరింతగా పెంచవచ్చు.

ఫొటో సోర్స్, Getty Images
భయమంతా రిటైలర్లతోనే…
మార్చి 2025 నెలలో కొత్తగా ఓపెన్ అయిన డీమ్యాట్స్ సంఖ్య 20.4 లక్షలుగా నమోదైంది. ఏప్రిల్ 2023 తర్వాత ఇదే అత్యంత కనిష్ట వృద్ధి రేటు. ఫిబ్రవరి నెలలో 30.3 లక్షల డీమ్యాట్ ఖాతాలు తెరవగా, ఇప్పుడు ఆ సంఖ్య గణనీయంగా తగ్గిపోతోంది.
మార్కెట్లో గత ఐదు నెలలుగా వస్తున్న నష్టాలు, ఫారిన్ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్ల అమ్మకాలతో డీమ్యాట్ ఖాతాలు ప్రారంభిస్తున్న వాళ్ల సంఖ్య తగ్గుతోంది. దీన్ని బట్టి కొత్తగా వస్తున్న వాళ్లు తగ్గుతున్నారని అర్థం చేసుకోవాలి.
SIPs ఆపేస్తున్నారు :
కోవిడ్ తర్వాతి నుంచి మార్కెట్ ఈ ఐదేళ్లలో సుమారు 150 శాతం పెరగడంలో రిటైల్ ఇన్వెస్టర్ల పాత్ర చాలా కీలకం. ముఖ్యంగా సిస్టమాటిక్ ఇన్వెస్ట్‌మెంట్ పద్ధతుల (సిప్‌ల) ద్వారా నెలకు మార్కెట్లోకి సుమారు రూ.26 వేల కోట్ల వరకూ వచ్చి చేరేది. అయితే గత మూడు నెలలుగా సిప్ ఇన్వెస్ట్‌మెంట్స్ తగ్గుతున్నాయి.
ఫిబ్రవరి నెలలో సిప్ క్యాన్సిలేషన్స్ ఏకంగా 122 శాతం పెరిగాయి. సిప్‌ల ద్వారా పెట్టుబడులు తగ్గిపోతూ, రిడింప్షన్ మరింతగా పెరిగినప్పుడే మార్కెట్లకు అసలైన సిస్టమాటిక్ రిస్క్.
ఇతర దేశాల ప్రభావం ఎలా ఉన్నా, రిటైల్ ఇన్వెస్టర్ల నుంచి వస్తున్న మద్దతు వల్లే భారతీయ మార్కెట్ ఇంకా పటిష్టంగా నిలుచుని ఉంది.
విదేశీ ఇన్వెస్టర్లు గత ఐదు నెలల నుంచి అమ్మేస్తూ వచ్చినా, ఇండియన్ మార్కెట్లు పెద్దగా రియాక్ట్ కాకపోవడానికి రిటైల్ ఇన్వెస్టర్ల నుంచి వస్తున్న నిధులే కారణం. అందుకే డీమ్యాట్ అడిషన్స్, సిప్స్ భారతీయ మార్కెట్లను బాగా ప్రభావితం చేస్తాయి. భవిష్యత్తుకు దిశానిర్దేశం చేస్తాయి.

ఫొటో సోర్స్, Getty Images
రిటైల్ ఇన్వెస్టర్లు ఏం చేయాలి?
అందరూ ప్యానిక్‌లో ఉన్నప్పుడు ఇన్వెస్ట్ చేయాలి, అందరూ ఈ సబ్జెక్ట్ గురించి మాట్లాడుతున్నప్పుడు మనం దూరంగా జరగాలి అనేది వారెన్ బఫెట్ వంటి వాళ్లు చెప్పే సూత్రం.
ఇలాంటి నష్టాల మార్కెట్లో పెట్టుబడి పెట్టడం మంచి అవకాశం. కానీ ఏ రంగాల్లో, ఏ స్టాక్‌లో ఇన్వెస్ట్ చేస్తున్నాం అనేది చాలా ముఖ్యం.
ఉదాహరణకు రూ.100 ఉన్న ఒక స్టాక్, రూ.1000కి పెరిగి.. పీక్ నుంచి పడి రూ.600లో ఉందనుకుందాం. అప్పుడు నలభై శాతం కరెక్ట్ అయినట్టు పైకి కనిపించినా, కింది నుంచి ఇంకా స్టాక్ 500 శాతం ఖరీదైనదిగా ఉన్నట్టే లెక్క.
పడినప్పుడల్లా కొనడం మంచి సూత్రమే అయినా, ఏం కొంటున్నాం, ఎంత ధరకు కొంటున్నాం, ఎంత కాలం హోల్డ్ చేస్తున్నాం అనేదే ముఖ్యం.
ఒకవేళ అవగాహన లేకపోతే నిఫ్టీ బీస్, మ్యూచువల్ ఫండ్స్ వంటి వాటిల్లో పెట్టుబడి పెట్టడం మంచిది.

ఫొటో సోర్స్, Getty Images
నిపుణులు ఏం సలహా ఇస్తున్నారు ?
‘‘మనం స్టాక్ మార్కెట్ చరిత్రలో సుమారు ఐదు నుంచి ఆరు వరకూ అతి భారీ నష్టాలను చూశాం. కోవిడ్ సమయంలో పక్కన పెడితే మిగిలినవన్నీ సిస్టమాటిక్ రిస్క్‌తో ఆర్థికపరమైన అంశాలతో ముడిపడినవే. కానీ, ఈసారి జరిగిన, జరుగుతున్న ఉత్పాతం మిగిలిన వాటికంటే భిన్నం. ఆర్థికవ్యవస్థలు, కరెన్సీలు, ఈక్విటీలు, కమాడిటీలు అన్నీ ఈ సుంకాల ప్రభావానికి తగిన విధంగా సర్దుబాటు చేసుకోవాల్సిన అవసరం ఉంది. రియల్ ఎస్టేట్ వంటి కొన్ని ఇంటర్ రిలేటెడ్ సెక్టార్స్ రాబోయే రోజుల్లో తీవ్రంగా ప్రభావితమయ్యే అవకాశం ఉంది.’’ అని ఇండిపెండెంట్ మార్కెట్ ఎనలిస్ట్ ప్రభల బాలసుబ్రమణ్యం చెప్పారు.
‘‘కొత్తగా మార్కెట్లోకి వద్దామని అనుకుంటున్న రిటైల్ ఇన్వెస్టర్లు ఇప్పటికిప్పుడే మార్కెట్లోకి దూకి డబ్బులు పెట్టాల్సిన అవసరం లేదు. జనవరి - మార్చి క్వార్టర్ ఫలితాల్లో కొన్ని రంగాలు షాక్ ఇచ్చే సూచనలున్నాయి. అందుకే ఈ ఫలితాల సీజన్ అయిన తర్వాత ఒక నిర్ణయం తీసుకోవడం మంచిది.’’ అని తెలిపారు.
‘‘ఇప్పటికే మార్కెట్లో ఉన్న ఇన్వెస్టర్లు రెండు, మూడు క్వార్టర్ల నుంచి ఏదైనా స్టాక్ సరిగ్గా పెర్ఫార్మ్ చేయకపోతే దానిని అమ్మేసి, లాస్ బుక్ చేసుకున్నా తప్పులేదు. మీ పోర్ట్‌ఫోలియోలను రీషఫుల్ చేసుకునేందుకు ఇదే మంచి సమయం. ప్రపంచవ్యాప్త వాణిజ్య, కామర్స్ డైనమిక్స్ మారబోతున్నాయి. ఈ సర్దుబాట్లకు మరింత సమయం పట్టొచ్చు. అందుకే ఫియర్ ఆఫ్ మిస్సింగ్ ఔట్ (ఫోమో) అవసరం లేదు. మంచి అవకాశాలు మనకు ముందు మరిన్ని వస్తాయి.'’ అని ఎనలిస్ట్ ప్రభల బాలసుబ్రమణ్యం చెప్పారు.
''కొన్ని రంగాలు ప్రపంచ మార్కెట్లతో ప్రత్యక్ష సంబంధం లేకుండా డొమెస్టిక్ కన్సంప్షన్ (దేశీయ వినియోగం) మీద ఆధారపడి ఉంటాయి. ఈ సమయంలో మనం వాటిపై దృష్టిపెట్టొచ్చు. ముఖ్యంగా ఎఫ్‌ఎంసీజీ, ట్రాన్స్మిషన్ - డిస్ట్రిబ్యూషన్, పవర్, ఫార్మా కంపెనీలు, హాస్పిటల్స్, బ్యాంకింగ్, నాన్ బ్యాంకింగ్ ఫైనాన్స్ కంపెనీలు, హాస్పిటాలిటీ రంగాల వైపు ఇన్వెస్టర్లు దృష్టిసారించవచ్చు. వీటిల్లో క్వాలిటీ స్టాక్స్‌ను ఎంపిక చేసుకోవాలి. ఫండమెంటల్స్ మెరుగ్గా ఉండడంతో పాటు నాయకత్వానికి పటిష్ట ట్రాక్ రికార్డ్ ఉండాలి. '' అని మార్కెట్ ఎనలిస్ట్ శేషు అంపేరాయని తెలిపారు.
''రిటైల్ ఇన్వెస్టర్లు ఈ టైమ్‌లో ప్యానిక్ కావాల్సిన అవసరం లేదు. ఈ వాణిజ్య యుద్ధం వల్ల యూఎస్ - చైనా మధ్య మరింత దూరం పెరగొచ్చు. పరోక్షంగా భారత్‌లాంటి దేశాలకు ప్రయోజనం చేకూరుస్తుంది. డొమెస్టిక్ థీమ్స్‌ను ఎంపిక చేసుకుని, దశల వారీగా పెట్టుబడులు పెట్టుకోవచ్చు. ఇలాంటి తీవ్రమైన పరిస్థితులే లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్లకు మంచి ఆపర్చునిటీగా మారతాయి.' అని అంపేరాయని అన్నారు.
(గమనిక: ఈ కథనంలోని అంశాలు రచయిత అభిప్రాయాలు. ఆర్థిక అంశాలపై మీరు ఎలాంటి నిర్ణయాలు తీసుకోవాలనుకున్నా నిపుణులను సంప్రదించగలరు.)
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














