సెన్సెక్స్ పతనం: స్టాక్ మార్కెట్లు ఎందుకు ఇంతలా పడిపోయాయి? ఇన్వెస్టర్లకు ఎంత నష్టం

స్టాక్ మార్కెట్లు క్రాష్

ఫొటో సోర్స్, Getty Images

దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు సోమవారం భారీ నష్టాలతో ముగిశాయి. ట్రేడింగ్ ప్రారంభం నుంచే భారీ నష్టాలతో మొదలైంది. 2400 పాయింట్ల నష్టంతో మొదలైన సెన్సెక్స్ 2600 పాయింట్ల వరకు నష్టాలను చూసింది.

ఇక నిఫ్టీ సైతం ట్రేడింగ్ ప్రారంభం నుంచే నష్టాలు చూసింది. చివర్లో కోలుకుని 24,000కి పైన ముగిసినప్పటికీ మధ్యాహ్నం ఒంటి గంట ప్రాంతంలో 729 పాయింట్ల నష్టంలో 23,983 వద్ద ట్రేడ్ అయింది.

గత వారం 25 వేల మార్కును తాకి రికార్డు సృష్టించిన నిఫ్టీ వారం చివర్లో మాత్రం అమ్మకాల తాకిడిని ఎదుర్కొంది.

ప్రస్తుతం అంతర్జాతీయంగా వస్తోన్న ప్రతికూల సంకేతాలతో దేశీయ మార్కెట్లూ నష్టాలు చవిచూశాయి.

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌
ఫొటో క్యాప్షన్, బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి.
మార్కెట్ల పతనం

ఫొటో సోర్స్, Getty Images

శుక్రవారం అమెరికా విడుదల చేసిన జులై నెల జాబ్స్ డేటాలో అంచనాల కంటే ఉద్యోగాల కల్పన తగ్గిపోయినట్లు తేలింది.

నిరుద్యోగ రేటు మూడేళ్ల గరిష్ఠానికి చేరింది. దీంతో ఆ దేశంలో మాంద్యం భయం మొదలైంది.

దీంతో అక్కడి మార్కెట్లు నష్టాలు ఎదుర్కొంటున్నాయి.

దీంతోపాటు మిడిల్ ఈస్ట్‌లో జియోపాలిటిక్స్ ప్రమాదకరంగా మారాయి. ఈ భయాలన్నీ ప్రస్తుతం ఆసియా మార్కెట్లను దెబ్బతీస్తున్నాయి.

జపాన్ నిక్కీ 225 ఇండెక్స్ ఏకంగా 13 శాతం క్రాష్ అయి ఏడు నెలల కనిష్ఠానికి పడిపోయింది.

2011 అంతర్జాతీయ ఆర్థిక సంక్షోభం తర్వాత జపాన్ నిక్కీ ఇంత పెద్ద మొత్తంలో నష్టాలను చూడడం మళ్లీ ఇప్పుడే.

తైవాన్‌లోని ప్రధాన స్టాక్ సూచీ కూడా 7.7 శాతం నష్టపోయింది. చిప్ దిగ్గజం టీఎస్‌ఎంసీ షేర్లు 8.4 శాతం పడిపోయాయి.

దక్షిణ కొరియా కోస్పి ఇండెక్స్ 6.6 శాతం పడింది. శాంసంగ్‌తో పాటు చిప్ మాన్యుఫాక్చరింగ్ కంపెనీలు నష్టాలు పాలయ్యాయి.

క్రిప్టోకరెన్సీలు కూడా నష్టాలను ఎదుర్కొన్నాయి. ఒక బిట్ కాయిన్ ధర 53 వేల డాలర్లకు చేరుకుంది. ఫిబ్రవరి నుంచి ఇదే కనిష్ఠ స్థాయి.

భారత్, తైవాన్, దక్షిణ కొరియా, ఆస్ట్రేలియా, హాంకాంగ్, షాంఘై అన్ని స్టాక్ మార్కెట్లు నష్టాలను నమోదు చేశాయి.

మార్కెట్లు

ఫొటో సోర్స్, Getty Images

కనిష్ఠాలకు రూపాయి

స్టాక్ మార్కెట్లు భారీగా నష్టపోతుండటంతో డాలర్ మారకంలో దేశీయ కరెన్సీ రూపాయి విలువ కూడా జీవన కాల కనిష్ఠ స్థాయిలకు పడిపోయింది.

డాలర్ మారకంలో రూపాయి విలువ శుక్రవారం రూ. 83.75గా ఉంటే.. సోమవారం రూ. 83.85 వద్ద ట్రేడైంది.

ఇదే సమయంలో బ్యాంకు ఆఫ్ జపాన్ వడ్డీ రేట్లను పెంచడంతో అమెరికా డాలర్‌తో పోలిస్తే యెన్ బలపడింది.

విదేశీ ఇన్వెస్టర్లకు టోక్యో స్టాక్స్‌ మరింత ఖరీదైనవిగా మారాయి.

గ్లోబల్ మార్కెట్ల పతనం, అమెరికాలో మాంద్యం భయాలు, జియోపాలిటిక్స్ కారణంగా రూపాయి విలువ పడిపోయిందని విశ్లేషకులు చెప్పినట్లు వార్తా సంస్థ ఏఎన్ఐ పేర్కొంది.

అమెరికాలో మాంద్యం భయాలతో భారత్, ఎమర్జింగ్ మార్కెట్ల నుంచి పెద్ద ఎత్తున నిధులు తరలిపోతున్నాయని విశ్లేషకులు చెప్పారు.

జులై జాబ్స్ డేటా అంచనాల కంటే తగ్గడంతో అమెరికా సెంట్రల్ బ్యాంకు ఫెడరల్ రిజర్వు వడ్డీ రేట్లకు కోత పెడుతుందని మార్కెట్ వర్గాలు అంచనావేస్తున్నాయి.

రూ. లక్షల కోట్లు హరించుకుపోయాయి

స్టాక్ మార్కెట్లు పడిపోవడంతో, దేశీయ ఇన్వెస్టర్ల సంపద రూ.17 లక్షల కోట్లు హరించుకుపోయిందని ఎకనమిక్ టైమ్స్ రిపోర్టు చేసింది.

బీఎస్ఈలో అన్ని లిస్టెడ్ కంపెనీల మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.440.16 లక్షల కోట్లకు పడిపోయిందని తెలిపింది.

జులై 2 తర్వాత తొలిసారి నిఫ్టీ 24 వేల మార్కు కిందకు వచ్చినట్లు ఎకనామిక్ టైమ్స్ రిపోర్టు చేసింది. బడ్జెట్ డే రోజు నిఫ్టీ 24,074కి పడిపోయింది.

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)