'అరమూర మల్లెపూలకు రూ. లక్ష'- నటి నవ్య నాయర్‌కు ఎయిర్‌పోర్ట్‌లో జరిమానా ఎందుకు వేశారు?

నటి నవ్య నాయర్, ఆస్ట్రేలియా ఎయిర్‌పోర్ట్

ఫొటో సోర్స్, Navya nair/Facebook

    • రచయిత, విజయానంద్ అర్ముగం
    • హోదా, బీబీసీ ప్రతినిధి

విమానాశ్రయంలోకి మల్లెపూలు తీసుకెళ్లినందుకు కేరళ నటి నవ్య నాయర్‌కు ఆస్ట్రేలియా ఎయిర్‌పోర్ట్ అధికారులు రూ.1.14 లక్షల జరిమానా విధించారు.

ఈ జరిమానా చెల్లించడానికి 28 రోజుల గడువు ఇచ్చారని నవ్య నాయర్ తెలిపారు.

విమానంలో మల్లెపూలు పెట్టుకుంటే వచ్చే ఇబ్బంది ఏంటి? ఆస్ట్రేలియా చట్టం ఏం చెబుతుంది?

ఆస్ట్రేలియాలోని విక్టోరియా రాష్ట్రంలో నివసించే మలయాళీ సంఘం వాళ్లు సెప్టెంబర్ 6న ఓనం పండుగను జరుపుకోవాలని అనుకున్నారు.

ఈ కార్యక్రమానికి కేరళ నటి నవ్య నాయర్ ప్రత్యేక అతిథిగా హాజరయ్యారు. కొచ్చి విమానాశ్రయం నుంచి సింగపూర్ వెళ్లి అక్కడి నుంచి మెల్‌బోర్న్ వెళ్లినట్లు ఆమె తన ఇన్‌స్టాగ్రామ్ పేజీలో తెలిపారు.

''మెల్‌బోర్న్‌కు వెళ్లే ముందు మా నాన్న నాకు మల్లెపూల మాల కొనిచ్చారు. దాన్ని రెండు భాగాలు చేసి నాకు ఇచ్చారు'' అని నవ్య నాయర్ చెప్పారు.

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్
ఫొటో క్యాప్షన్, బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరేందుకు ఇక్కడ క్లిక్ చేయండి
విక్టోరియాలో మలయాళీ సంఘం ఆధ్వర్యంలో జరిగిన ఓనం ఉత్సవాలకు నటి నవ్య నాయర్ ప్రత్యేక అతిథిగా హాజరయ్యారు

ఫొటో సోర్స్, Navya nair/Facebook

ఫొటో క్యాప్షన్, విక్టోరియా రాష్ట్రంలో మలయాళీ సంఘం ఆధ్వర్యంలో జరిగిన ఓనం ఉత్సవాలకు నటి నవ్య నాయర్ ప్రత్యేక అతిథిగా హాజరయ్యారు

'15 సెం.మీ మల్లె పూల మాలకు 1.14 లక్షల జరిమానా'

కొచ్చి నుంచి సింగపూర్ వెళ్ళేటప్పుడు మల్లెపూలు వాడిపోతాయని, ఒక భాగాన్ని తలలో, మరో భాగాన్ని పర్సులోని క్యారీ బ్యాగ్‌లోను పెట్టుకోవాలని తన తండ్రి చెప్పినట్లు నవ్య నాయర్ తెలిపారు.

15 సెం.మీ మల్లెపూలను హ్యాండ్‌బ్యాగ్‌లో తీసుకెళ్ళినందుకు ఆస్ట్రేలియా విమానాశ్రయ అధికారులు 1980 ఆస్ట్రేలియన్ డాలర్లు (రూ. 1.14 లక్షలు) జరిమానాగా చెల్లించాలని చెప్పినట్లు నవ్య వెల్లడించారు.

''నేను తెలియక చేశాను. అయితే, దాన్ని సాకుగా చెప్పలేం. పూలు తీసుకురావడం చట్టవిరుద్ధం. ఇది కావాలని చేయలేదు. 28 రోజుల్లోపు జరిమానా చెల్లించమన్నారు'' అని నవ్య నాయర్ తెలిపారు.

విక్టోరియాలో జరిగిన ఓనం ఉత్సవంలో నవ్య నాయర్ మాట్లాడుతూ, ''నేను లక్ష రూపాయల విలువైన మల్లెపూలను నా తలలో పెట్టుకున్నాను'' అని నవ్వుతూ చెప్పారు.

నటి నవ్య నాయర్, ఆస్ట్రేలియా ఎయిర్‌పోర్ట్‌లో మల్లెపూలపై నిషేధం

ఫొటో సోర్స్, Navya nair/Facebook

పూలు, పండ్లపై నిషేధం ఎందుకు?

''ఆస్ట్రేలియాది ప్రత్యేకమైన జీవావరణ వ్యవస్థ. విదేశీ పూలు, పండ్లు, విత్తనాలు తమ దేశంలోకి ప్రవేశిస్తే తమ దేశ పర్యావరణం మారిపోతుందని వారు భావిస్తారు'' అని ఆస్ట్రేలియాలో నివసిస్తున్న భారతీయ వ్యాపారవేత్త జయచంద్రన్ తంగవేల్ చెప్పారు. ఆయన గత 22 ఏళ్లుగా ఆస్ట్రేలియాలో వ్యాపారం చేస్తున్నారు.

''విమానంలో తాజా పండ్లు, కూరగాయలు తీసుకురావడానికి అనుమతి లేదు. పూలను తీసుకురావడానికి అనుమతించరు. నెయ్యితో చేసిన ఏ వస్తువునైనా తీసుకురాకూడదనే నియమం ఉంది'' అని బీబీసీతో చెప్పారు.

''ఆస్ట్రేలియాకు వచ్చే ముందు సింగపూర్ విమానాశ్రయంలో ఆహారం కొనుక్కొని తినొచ్చు. అందులో మిగిలిన ఆహారాన్ని విమానంలో తీసుకురావచ్చు. అయితే, ఇమ్మిగ్రేషన్ అధికారుల తనిఖీకి వెళ్లే ముందు దాన్ని చెత్తబుట్టలో పడేయాలి'' అని జయచంద్రన్ తంగవేల్ తెలిపారు.

ఆస్ట్రేలియా కస్టమ్స్ అధికారులను 'ఆస్ట్రేలియన్ బోర్డర్ ఫోర్స్' అని పిలుస్తారు. వీరు ఆస్ట్రేలియాలోకి ప్రవేశించే ప్రయాణికుల సామాన్లను తనిఖీ చేస్తారు.

జయచంద్రన్ తంగవేల్

ఫొటో సోర్స్, Jayachandran Thangavelu Handout

ఫొటో క్యాప్షన్, ఆస్ట్రేలియాలో నివసించే భారత వ్యాపారవేత్త జయచంద్రన్ తంగవేల్

ఆస్ట్రేలియా చట్టం ఏం చెబుతుంది?

తమ దేశంలోకి వచ్చే విదేశీ ప్రయాణికులు జరిమానాల బారిన పడకుండా ఆస్ట్రేలియా ప్రభుత్వం కొన్ని సూచనలు విడుదల చేసింది. తమ దేశంలోకి తీసుకురావాల్సిన, తీసుకురాకూడని వస్తువుల జాబితా విడుదల చేసింది. ఆ జాబితా ప్రకారం కింది వస్తువులను ఇన్‌కమింగ్ ప్యాసింజర్ అరైవల్ కార్డ్‌లో డిక్లేర్ చేయాల్సి ఉంటుంది.

  • అన్ని ఆహార పదార్థాలు, మొక్కల ఉత్పత్తులు, జంతు ఉత్పత్తులు
  • కొన్ని రకాల ఆయుధాలు
  • కొన్ని రకాల మందులు
  • 10,000 ఆస్ట్రేలియన్ డాలర్ల కంటే ఎక్కువ నగదు

బయో సెక్యూరిటీ పేరుతో తీసుకురాకూడని కొన్ని వస్తువుల జాబితాను కూడా ఆస్ట్రేలియా ప్రభుత్వం వెలువరించింది. దాని ప్రకారం:

  • తాజా పండ్లు, కూరగాయలు
  • కోడి మాంసం, పంది మాంసం
  • గుడ్లు, పాల ఉత్పత్తులు
  • మొక్కలు, విత్తనాలు

ఈ వస్తువులు ఆస్ట్రేలియాలో పురుగులు, వ్యాధుల రాకకు కారణమై దేశంలోని ప్రత్యేక వాతావరణాన్ని నాశనం చేయగలవని ఆస్ట్రేలియా ప్రభుత్వం పేర్కొంది.

ఈ జాబితాలో ఉన్న ఏ వస్తువునైనా దేశంలోకి వచ్చే ప్రయాణికులు తప్పనిసరిగా డిక్లేర్ చేయాలని సూచనల్లో పేర్కొన్నారు.

అలా డిక్లేర్ చేయకపోతే 5,500 ఆస్ట్రేలియన్ డాలర్ల వరకు జరిమానా విధించడం, వీసా రద్దు చేయడం, నిర్బంధానికి గురవడం వంటివి ఎదుర్కోవాల్సి ఉంటుందని తెలిపింది.

ఈ పరిస్థితి రాకుండా చూసుకునేందుకు బోర్డర్ ఆఫీసర్స్ నుంచి తమ సామగ్రికి సంబంధించిన సలహాలు తీసుకోవచ్చని సూచించింది.

మల్లెపూలు

పూలను తీసుకురావడంపై నిషేధం, కానీ...

''విమానం ద్వారా పూలను తీసుకురావడంపై ఆస్ట్రేలియాలో నిషేధం ఉంది. కానీ, ఆస్ట్రేలియాలో మల్లెపూలను అమ్ముతారు. ఒక మూర మల్లెపూల ధర 40 డాలర్ల వరకు ఉంటుంది'' అని బీబీసీతో జయచంద్రన్ తంగవేల్ చెప్పారు.

''పూలను దిగుమతి చేసుకున్నప్పుడు వాటిని క్వారంటైన్ చేసి తనిఖీ చేస్తారు. పూల స్వభావం, సాగు వివరాలు, ఉపయోగించిన ఎరువులు వంటి అన్ని వివరాలను పరిశీలించి సర్టిఫికేట్‌తో అమ్మకానికి పంపుతారు'' అని ఆయన వివరించారు.

విమానాశ్రయంలోకి ప్రవేశించిన తర్వాత అనుసరించాల్సిన పద్ధతులను ఆయన వివరించారు.

తనిఖీ ప్రక్రియ ఏమిటి?

''ఆస్ట్రేలియా ప్రభుత్వం నిషేధించిన వస్తువులను తీసుకురాకూడదు. పొరపాటున తీసుకువస్తే, ఇన్‌కమింగ్ ప్యాసింజర్ కార్డును నింపేటప్పుడు వాటిని తప్పనిసరిగా డిక్లేర్ చేయాలి.

విమానాశ్రయం నుంచి బయటికి వచ్చేటప్పుడు గ్రీన్ చానెల్, రెడ్ చానెల్ అనే రెండు ప్రవేశ ద్వారాలు ఉంటాయి. ప్రయాణికులు తీసుకువచ్చిన వస్తువులను బట్టి ఏ చానెల్ నుంచి వాళ్లు వెళ్లాలో అధికారులు నిర్ణయిస్తారు.

గ్రీన్ చానెల్ అయితే ఎలాంటి తనిఖీ లేకుండా బయటకు వెళ్ళిపోవచ్చు. రెడ్ చానెల్ అయితే తీసుకువచ్చిన అన్ని వస్తువులను తనిఖీ చేస్తారు. అధికారులు సంతృప్తి చెందితేనే బయటకు వెళ్లడానికి ప్రయాణికులకు అనుమతి ఇస్తారు'' అని బీబీసీకి జయచంద్రన్ వివరించారు.

నిషేధిత వస్తువు ఉంటే, ప్రయాణికుడి అనుమతితో దాన్ని చెత్తబుట్టలో పడేస్తారని ఆయన చెప్పారు.

''ఆ వస్తువును పడేయడానికి ప్రయాణికుడు వ్యతిరేకిస్తే, ఆ వస్తువును క్వారంటైన్ చేసి మరొక విభాగానికి పంపుతారు. ఆ తర్వాత సంబంధిత అధికారిని కలవడానికి ఒకరోజు సమయం ఇస్తారు.

అప్పటికీ సరైన వివరణ ఇవ్వకపోతే ఆ వస్తువును చెత్తబుట్టలో పడేస్తారు. అలాగే దానికి సంబంధించిన జరిమానా చెల్లించాల్సి ఉంటుంది'' అని ఆయన చెప్పారు.

అశోక్ రాజా

ఫొటో సోర్స్, Ashok Raja Handout

ఫొటో క్యాప్షన్, తిరుచ్చికి చెందిన మాజీ పైలట్ అశోక్ రాజా

'మట్టి అంటినా ఫైన్ వేస్తారు'

ఆస్ట్రేలియా, న్యూజీలాండ్ దేశాలు రెండూ ఒకే విధమైన నియమాలను అనుసరిస్తున్నాయని తిరుచ్చికి చెందిన మాజీ పైలట్ అశోక్ రాజా బీబీసీతో అన్నారు.

''వైవిధ్యమైన భౌగోళిక స్థితి, జీవవైవిధ్యం కారణంగా తమ దేశంలోకి ఎటువంటి ఇతర జాతులు లేదా పదార్థాలను ప్రవేశపెట్టకూడదని వారు నిశ్చయించుకున్నారు. ఆస్ట్రేలియా ప్రభుత్వం, బయోసెక్యూరిటీని చాలా కీలకంగా పరిగణిస్తుంది'' అని ఆయన చెప్పారు.

తన బంధువు ఒకరు ఆస్ట్రేలియాకు తన క్రికెట్ బ్యాట్‌ను తీసుకెళ్లేందుకు ప్రయత్నించినప్పుడు మట్టి ఉందనే కారణంతో దాన్ని అధికారులు దేశంలోకి అనుమతించలేదని అశోక్ రాజా తెలిపారు. ఏ దేశపు మట్టి కూడా తమ దేశంలోకి ప్రవేశించకూడదనే నియమాన్ని ఆస్ట్రేలియా కఠినంగా పాటిస్తుందని చెప్పారు.

''మీరు చెప్పులు వేసుకొని వెళ్తే వాటికి మట్టి లేకుండా చూసుకోవాలి. విదేశీ మట్టి, స్థానిక నేలను చెడగొట్టకుండా నిరోధించడమే వారి ప్రాథమిక లక్ష్యం'' అని జయచంద్రన్ తంగవేల్ తెలిపారు.

జరిమానా, శిక్ష పడకుండా ఎలా తప్పించుకోవాలి?

''ఒక దేశంలో పాటించే నిబంధనల గురించి ఎయిర్‌లైన్స్ యాజమాన్యం మనకు చెప్పదు. మీరు విమానాశ్రయంలో దిగిన తర్వాత అన్ని వివరాలు డిక్లరేషన్ ఫామ్‌లో పేర్కొనాలి. మీరు సమాచారాన్ని అందిస్తే, శిక్ష పడే అవకాశం ఉండదు'' అని మాజీ పైలట్ అశోక్ రాజా అంటున్నారు.

''మీరు ఒక వస్తువును డిక్లేర్ చేయకుండా తీసుకువస్తే, అది మీ మొదటి నేరం అవుతుంది. ఈ నేరానికి మీకు క్షమాపణ లేదా జరిమానా విధిస్తారు. ఇది మీరు తీసుకువెళ్లే వస్తువు, సంబంధిత అధికారులపై ఆధారపడి ఉంటుంది. కొందరు క్షమించి వదిలేస్తారు. కొన్నిసార్లు ఈ ప్రక్రియ జైలు శిక్ష వరకు వెళుతుంది'' అని జయచంద్రన్ తంగవేల్ తెలిపారు.

''మీ వెంట వస్తువులు తీసుకెళ్లేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. మీరు ఏది తీసుకెళ్తున్నా దాన్ని డిక్లేర్ చేయాలి. దీనిపై ఏదైనా సందేహం ఉంటే, బోర్డర్ పోలీస్ ఆఫీసర్స్‌ను సంప్రదించాలి. వారు సహాయం చేస్తారు'' అని ఆయన వివరించారు.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)