'ఇట్లు అమ్మ' సినిమా రివ్యూ: సమాజంలోని సమస్యలను అసామాన్యంగా నిలబెట్టి ప్రశ్నించిన తల్లి కథ

ఫొటో సోర్స్, BOMMAKU CREATIONS/FB
- రచయిత, సరిత
- హోదా, బీబీసీ కోసం
హింస, అసమానతలు లేని సంఘాన్ని స్థాపించడం తల్లులంతా ఏకం కావడం వల్లనే అవుతుందని చెప్పే సరికొత్త ఆవిష్కరణ 'ఇట్లు అమ్మ'.
ప్రతి చావూ ఎవరో ఒక తల్లికి గర్భశోకమే. "ఈ రుద్రభూమి లో తమ బిడ్డలను కోల్పోయిన తల్లుల రోదనలతో రాలిన కన్నీళ్లకు శ్మశానంలోని రాళ్లు కరిగి పోయాయి'' అని గుర్రం జాషువా సత్యహరిశ్చంద్ర నాటకంలో బాధపడతారు.
అట్లాంటి ఎంతో మంది తల్లుల శోకం ఈ ‘ఇట్లు అమ్మ’. తల్లి బాధను ప్రతి మనిషి అర్థం చేసుకోగలిగితే ఎవర్ని ఎవరూ కత్తులతో బాంబులతో చంపుకోరు. యుద్ధాలు, మారణహోమాలు జరగవు. లోకంలో హింస ఉండదు. ప్రేమ మాత్రమే వికసిస్తుంది అని చెప్పే గాంధేయ మార్గాన్ని మళ్లీ తేవాలి అని అనుకునే ఓ తల్లి పిచ్చి ఆశ ఈ సినిమా .
"అంకురం" సినిమాతో 1993 లో ఓ కొత్త ఒరవడి సృష్టించిన దర్శకుడు సి.ఉమామహేశ్వరరావు డైరెక్షన్లో మళ్లీ రేవతి ప్రధాన పాత్రధారిగా వచ్చిన ఆలోచనాత్మక, సందేశాత్మక చిత్రం ‘ఇట్లు అమ్మ’
ఏ బాదరబందీ లేకుండా, బయట ప్రపంచంతో పెద్దగా సంబంధం లేకుండా బతుకుతున్న ఆ తల్లి కొడుకుల జీవితంలో అనూహ్య పరిణామం, కొడుకు హత్య కావడం, ఆ తల్లి వేదన ఆమెను ఏ మార్గంలో నడిపించింది అన్నది మిగిలిన కథ.
సినిమా చర్చించిన అంశాలు:
పెరుగుతున్న జనాభా మూలాన హంతకులను పట్టుకోవటానికి అవుతున్న ఆలస్యం గురించి. వ్యవస్థ అసహాయత గురించి. ఈ ప్రాసెస్‌లో అమాయక పేదలకు పడుతున్న శిక్షలు, ఆకలి కేకలు, కార్పొరేట్ దోపిడీ అన్యాయం గురించి. ముఖ్యంగా మనిషి అంటే మనిషికి పట్టనితనం గురించి.
ఇట్లా ఎన్నో సామాజిక సమస్యలను అసామాన్యంగా, చాలా గట్టిగా ఓ మార్గంలో నిలబెట్టి, ప్రశ్నించింది ఈ సినిమా.
రచయిత, దర్శకుడు ఉమామహేశ్వరరావు ఆలోచనలను రేకెత్తించే చిత్రాలను రూపొందిస్తారని పేరు. ఈ కాలంలో పెరుగుతున్న హింస, దారుణాల మధ్య గాంధేయ తత్వాన్ని మరోసారి తెరపైకి తెచ్చారు.
కంటికి కన్ను, తలకు తల అన్నట్టు విధ్వంసాలు, కులచిచ్చులు రేగుతున్న ఈ తరుణంలో ఇది గొప్ప ప్రయత్నం.
కథ కాలక్రమం చాలా గందరగోళంగా ఉంది. నేటి డిజిటల్ ప్రపంచంలో లెటర్లు రాయటం అనే ఆలోచన కూడా కాలం చెల్లిన సిద్ధాంతంగా కనిపిస్తుంది. ఈ లోపాలు మినహా, కథనం నెమ్మదిగా సాగినా, మానవ సంబంధాలు అనే అంశాన్ని సున్నితంగా వ్యక్తీకరించగలిగింది.
"స్త్రీలు బయటకొచ్చి మరొకరి కోసం పోరాటం చేస్తారా" అని ఆశ్చర్యపోయిన లోకజ్ఞానం లేని ఒక అమ్మ, తన కొడుకు హత్య వెనుక సత్యశోధన క్రమంలో, బయటకు వచ్చి ప్రకృతి సంపదను దోచుకున్న వ్యవస్థ గురించి, సాటి మనుషుల కోసం నిలబడటమే సంఘధర్మం అని చెప్పలిగేంత మారగలిగిన, పోరాటం చెయ్యగలిగిన ఈ అమ్మ...రష్యన్ ఉద్యమ సమయంలో, ఆనాడు భర్త దెబ్బలకు వణికిపోతున్న ఓ ఇల్లాలు, అచ్చూ అలాగే కొడుకు మీద ప్రేమతో, ఆ తర్వాత అణగారిన వర్గాల కోసం ఉద్యమించి, స్ఫూర్తిగా నిలిచిన రష్యన్ రివల్యూషనరీ రైటర్ మక్సిమ్ గోర్కీ ‘అమ్మ’ను అప్రయత్నంగా గుర్తు చేస్తుంది.

ఫొటో సోర్స్, Sathiya Karthi/FB
సీనియర్ నటి రేవతి 'అమ్మ' పాత్రకు సంపూర్ణ న్యాయం చేశారు.
ప్రజా గాయకుడు గోరటి వెంకన్న ‘అద్దాల అంగడి మాయ’ పాట పంచభూతాలను కొనుక్కోవాల్సిన ఖర్మ పట్టించిన కార్పొరేట్ మాయాజాలాన్ని మరోసారి వినిపిస్తుంది. తెలుగు రాని పాత్రలు, సొంతగా డబ్ చెప్పుకోవడం అభినందనీయం.
గోరటి వెంకన్న పాట, సుచిత్రా చంద్రబోస్ అద్భుతమైన కొరియోగ్రఫీ ప్లస్.
ఇది సందేశాత్మక చిత్రం, గాంధేయ తత్వాన్ని సున్నితంగా గుర్తు చేయటం దీని లక్ష్యం. ఎందుకంటే ఇది ప్రస్తుత కాలంలో బలహీనపడుతోంది.
నపుంసకులను నేరస్థులుగా, అనాథ పిల్లలను బాల నేరస్థులుగా మార్చే వ్యవస్థకు ‘ఇట్లు అమ్మ’ ఒక బలమైన ప్రశ్న. వారికి తగినంత ప్రేమ, సంరక్షణ ఇవ్వాలని అది సాటి మనిషిగా మన బాధ్యతని గుర్తుచేసింది.
కొడుకును ఎవరు చంపారని వేదన పడుతూ అనుక్షణం జ్ఞాపకాల్లో కుమిలిపోతూ, ఆ తర్వాత అసలు తన కొడుకును ఎందుకు చంపాల్సి వచ్చింది? కారణం తెలిస్తే చాలు అని శోధన మొదలుపెట్టిన ఆ తల్లి మధ్యలో గాంధేయ మార్గానికి పరిచయం అవుతుంది.
గాంధీజీ "సత్యశోధన" నుంచి అంబేడ్కర్, గోర్కి వరకు ఎందరినో చదువుతుంది. ఈ క్రమంలో ఎదురైన మనుషుల నుంచి ఎంతో నేర్చుకుంటుంది. అలా సత్యం కోసం అన్వేషిస్తుంది. తెలుసుకుంటుంది. ఎందరినో ఆ మార్గంలో నడపటానికి ఉద్యమిస్తుంది.
ఇట్లాంటి సినిమాల అవసరం ఇది:
1997లో ఆరేళ్ల పిల్ల మీద అత్యాచారం కేసులో చేయని నేరానికి అరెస్టయిన ఓ స్వీపర్ ఆర్ముగమ్ మునుస్వామి 11 ఏళ్ల తర్వాత నిర్దోషిగా బయటకు వచ్చారు. నిర్దోషి అని కోర్టు తేల్చడానికి కారణం అతన్ని అరెస్టు చేసిన సబ్ ఇన్‌స్పెక్టర్ తన సూసైడ్ లెటర్ లో పై అధికారుల ఒత్తిడి వల్లనే అతన్ని అరెస్ట్ చేయాల్సి వచ్చిందని రాయడం.
ఇట్లా బడాబాబుల నేరాలు కప్పిపుచ్చడానికి బలి అవుతున్న పేద నిర్దోషులు ఎందరో! మూడున్నర లక్షల మంది అండర్ ట్రయల్ ఖైదీల్లో ఎంత మంది అమాయక పేదలో! అలాగే ఆకలి కేకల వల్ల నేరస్తులుగా మారుతున్న యువత ఎంతమందో!!
"The poor people are stupid from poverty and the rich from greed" అంటాడు మాక్సిమ్ గోర్కీ.
కార్పొరేట్ ధనదాహం ప్రకృతిని సైతం దోచేసింది. ప్రేమ లేనితనం మనిషికి మనిషిని దూరం చేస్తోంది. వీటన్నింటికీ పరిష్కారం అసమానతలు పోవటమేనని, సాటి మనిషి కోసం నిలబడాలనీ చెప్పే ఇట్లాంటి 'ఇట్లు అమ్మ' ల వల్ల ఇంకా నాలుగు వానలు పడతాయని, మనుషుల్లో ప్రేమతత్వం చిగురిస్తుందని కొంత ఆశ.
(రచయిత అభిప్రాయాలు వ్యక్తిగతం)
ఇవి కూడా చదవండి:
- పాకిస్తాన్ అణు పితామహుడు ఏక్యూ ఖాన్: 'ప్రపంచంలోనే అత్యంత ప్రమాదకరమైన వ్యక్తి'
- ‘మా' సభ్యత్వానికి ప్రకాశ్ రాజ్ రాజీనామా
- విరాట్ కోహ్లీ: ‘కింగ్ ఈజ్ బ్యాక్.. ధోనీ మరోసారి ఎగిరి గంతేసేలా చేశాడు’
- ‘వ్యాక్సీన్ వేసుకోను అన్నందుకు నా ఉద్యోగం తీసేశారు’
- చైనా ఒత్తిడికి తలొగ్గేది లేదన్న తైవాన్ అధ్యక్షురాలు త్సై ఇంగ్ వెన్
- విధేయత పేరుతో వేలాడేవారిని పార్టీ నుంచి రాహుల్ గాంధీ తప్పించగలరా
- సమంత, అక్కినేని నాగ చైతన్య విడాకులు: విడిపోతున్నామని ప్రకటించిన హీరో, హీరోయిన్
- చైనా ప్రపంచానికి సాయం చేస్తోందా, లేక అప్పుల ఊబిలో ముంచేస్తోందా?
- పాకిస్తాన్ నుంచి అఫ్గానిస్తాన్‌కు డాలర్ల స్మగ్లింగ్ జరుగుతోందా... పాక్ రూపాయి పడిపోవడానికి అదే కారణమా?
- నిజమైన గూఢచారులు జేమ్స్బాండ్లాగే ఉంటారా? సీక్రెట్ సర్వీస్‌లో పనిచేసే ఆఫీసర్ ఏం చెబుతున్నారు
- డన్‌కర్క్: ‘చరిత్ర చెప్పని, పుస్తకాల్లో చోటు దక్కని’ 300 మంది భారత సైనికుల కథ
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి)








