కోనసీమ: ఇంటర్నెట్ ఆపేసిన ప్రభుత్వం.. సిగ్నల్స్ కోసం ‘వర్క్ ఫ్రమ్ హోమ్’ ఉద్యోగుల అగచాట్లు

వీడియో క్యాప్షన్, కోనసీమలో ఇంటర్నెట్ బంద్.. సాఫ్ట్‌వేర్ ఉద్యోగుల తిప్పలు..

గోదారి గట్టున ల్యాప్‌టాప్‌లతో కుస్తీ.. చెట్ల కింద..

బైకుల మీద.. సిగ్నల్‌ కోసం పాట్లు..

కోనసీమలోని 16 మండలాల్లో ప్రస్తుత పరిస్థితి ఇది. ఇక్కడ ఇంటర్నెట్‌పై ఆంక్షలు అమలవుతున్నాయి.

దీంతో ఇంటర్నెట్ ఉన్న ప్రాంతానికి వెళ్లి పని చేసుకోవాల్సి వస్తోందని వర్క్‌ ఫ్రమ్ హోం చేస్తున్న ఉద్యోగులు చెబుతున్నారు.

కోనసీమ పరిధిలోని 16 మండలాల్లో సుమారు 170 సెల్ టవర్ల పరిధిలో ఇంటర్నెట్‌పై ఆంక్షలు విధించారు.

ఆస్పత్రుల నుంచి ఆటోమొబైల్ షోరూమ్‌ల వరకూ, బ్యాంకుల నుంచి పెట్రోల్ బంకుల వరకు అన్నింటా సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తోందని స్థానికులు చెబుతున్నారు.

మే 24న అమలాపురంలో జరిగిన ఘటనల నేపథ్యంలో ఇంటర్నెట్‌పై ఆంక్షలు విధించింది ప్రభుత్వం.

కోనసీమ జిల్లా పేరుని అంబేడ్కర్ కోనసీమ జిల్లాగా మార్చడాన్ని వ్యతిరేకిస్తున్న కొందరు విధ్వంసం సృష్టించారు.

ఈ కేసు దర్యాప్తుతో పాటుగా శాంతియుత పరిస్థితులు నెలకొల్పేందుకంటూ ఇంటర్నెట్ మీద ఆంక్షలు విధించారు. ఇప్పటికే ఈ కేసుల్లో విడతల వారీగా 71 మందిని అరెస్ట్ చేశారు.

సోషల్ మీడియా ద్వారా కొందరు పుకార్లు వ్యాప్తి చేస్తుండడంతో ఇంటర్నెట్ మీద ఆంక్షలు కొనసాగిస్తున్నామని పోలీసులు చెబుతున్నారు.

ఇప్పటికే వారం రోజులు గడిచిపోయిన తరుణంలో మళ్లీ నెట్ సర్వీసుల పునరుద్దరణ ఎప్పుడు చేస్తారా అని కోనసీమ ప్రజలు ఎదురుచూస్తున్నారు. పరిస్థితి పూర్తిగా అదుపులోకి వచ్చిన తర్వాత నిర్ణయం తీసుకుంటామని ప్రభుత్వం చెబుతోంది.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)