BHU: సంస్కృతం ప్రొఫెసర్ ఫిరోజ్ ఖాన్ రాజీనామా.. ధర్నా విరమించుకున్న విద్యార్థులు

ఫిరోజ్ ఖాన్

ఫొటో సోర్స్, FIROZ KHAN

ఫొటో క్యాప్షన్, ఫిరోజ్ ఖాన్
    • రచయిత, సమీరాత్మజ్ మిశ్రా
    • హోదా, బీబీసీ కోసం

బనారస్ హిందూ విశ్వవిద్యాలయంలో కొద్ది రోజులుగా నడుస్తున్న వివాదం విషయంలో ఆఖరికి సంస్కృతం డిపార్ట్‌మెంట్‌లో సహాయక ప్రొఫెసర్‌గా పనిచేస్తున్న ఫిరోజ్ ఖాన్‌ రాజీనామా చెయ్యాల్సి వచ్చింది.

ఆయనకి ఆయుర్వేదం డిపార్ట్‌మెంట్‌లో ముందు పనిచేసిన అసిస్టెంట్ ప్రొఫెసర్ స్థాయిలోనే ఇంకొక పదవి ఇచ్చారని తెలుస్తోంది. అయితే, ఫిరోజ్ ఖాన్ ఈ కొత్త బాధ్యతలను చేపట్టారా? లేదా? అన్న విషయాన్ని మాత్రం యూనివర్శిటీ అధికారికంగా ఇంకా ప్రకటించలేదు.

ఫిరోజ్ ఖాన్‌ను తొలగించాలని ధర్నాకు దిగిన విద్యార్థులకు ఫిరోజ్ ఖాన్ రాజీనామా విషయాన్ని డిపార్ట్‌మెంట్ హెడ్ అయిన ప్రొఫెసర్ కౌశలేంద్ర పాండే తెలిపారు.

'సంస్కృతం డిపార్ట్‌మెంట్‌లో సహాయక ప్రొఫెసర్‌గా పనిచేస్తున్న డాక్టర్ ఫిరోజ్ ఖాన్‌ తన పదవికి డిసెంబర్ 9వ తేదీన రాజీనామా చేశారు' అని ఆయన అక్కడ ఉన్న విద్యార్థులకు చెప్పారు.

అలాగే ధర్నాకు దిగిన విద్యార్థులందరూ ఇక తమతమ పరీక్షలమీద దృష్టి పెట్టాలని విజ్ఞప్తి చేశారు.

విద్యార్థుల డిమాండ్ ఏంటి?

సంస్కృతం నేర్పడానికి ఒక ముస్లిం ప్రొఫెస‌ర్‌ని నియమించడంపై విద్యార్థులు ప్రశ్నలు లేవెత్తి, ఫిరోజ్ ఖాన్ నియామకాన్ని వ్యతిరేకించారు.

సుమారు నెలరోజులుగా ధర్నాలో కూర్చున్న విద్యార్థులు వారి సెమిస్టర్ పరీక్షలకు కూడా హాజరు కాకపోవడంతో పరీక్షల్ని రెండుసార్లు వాయిదా వెయ్యాల్సి వచ్చింది.

ఫిరోజ్ ఖాన్ రాజీనామా ఇవ్వడంతో విద్యార్థులు కూడా వారి దీక్షను విరమించుకున్నారు.

బనారస్ హిందూ విశ్వవిద్యాలయం మూడు విభాగాల్లో సంస్కృత భాషను నేర్పబడుతుంది.

కళ, ఆయుర్వేదం, సంస్కృత విద్య ధర్మం అనేవి ఇక్కడి విభాగాలు.

ధర్మశాస్త్రం నేర్పించబడే సంస్కృత విద్య ధర్మం విభాగంలో డాక్టర్ ఫిరోజ్ ఖాన్ ముందుగా నియమితులయ్యారు.

హిందూ ధర్మం నేర్పించడానికి ఒక ముస్లింని ఎలా నియమిస్తారని విద్యార్థులు ప్రశ్నించడం మొదలుపెట్టారు.

ధర్నాలో కూర్చున్న ఒక విద్యార్థి చక్రపాణి ఓఝా మాట్లాడుతూ.. డాక్టర్ ఫిరోజ్ ఖాన్ సంస్కృతం నేర్పడంలో కానీ, ఆయనతో కానీ తమకు ఎటువంటి సమస్య లేదన్నారు.

"కానీ, సమస్య ఏంటంటే అసలు హిందువులు తప్ప వేరేవారు నియమితులయ్యే అవకాశం లేని ఆ విభాగంలో ఆయన్ని ఎలా నియమించగలరు అన్నదే మా ప్రశ్న" అని ఆయన అన్నారు.

ఇంతకుముందే విశ్వవిద్యాలయం పరిపాలన విభాగం డాక్టర్ ఫిరోజ్ ఖాన్ నియామకం.. నియమాలకు అనుగుణంగానే అయ్యిందని, ఎటువంటి పరిస్థితిలో ఆయన నియామకం రద్దు చెయ్యడం జరగదని చెప్పింది.

కానీ, విద్యార్థులు ధర్నా విరమించుకోకపోవడంతో ఆయుర్వేదం డిపార్ట్‌మెంట్‌లో ఒక కొత్త పదవిని విడుదల చేశారు. ఆ విషయం బయటకి వచ్చిన వెంటనే అందరికి అది డాక్టర్ ఫిరోజ్ ఖాన్ కోసం ఏర్పాటు చేసిన పదవి అని అర్ధం అయిపోయింది.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)