అమెజాన్.. ఫ్లయింగ్ సెక్యూరిటీ డ్రోన్లు.. ల్యూనా గేమ్స్ సర్వీస్ ఆవిష్కరణ

సెక్యూరిటీ డ్రోన్

ఫొటో సోర్స్, AMAZON

    • రచయిత, లియో కెలియాన్, క్రిస్ ఫాక్స్
    • హోదా, టెక్నాలజీ రిపోర్టర్లు

అమెజాన్ సంస్థ స్మార్ట్ హోం సెక్యూరిటీ విభాగం రింగ్.. ఎగిరే కెమెరాను ఆవిష్కరించింది. ఇంట్లోకి దొంగలు పడ్డట్లు సెన్సర్లు గుర్తించినపుడు ఈ కెమెరా ఆటోమేటిక్‌గా లాంచ్ అవుతుంది.

ఇంట్లో నివసించేవారు బయటకు వెళ్లినపుడు మాత్రమే యాక్టివ్‌గా ఉండేలా దీనిని డిజైన్ చేశారు. ఇది ఇంటి లోపల మాత్రమే పనిచేస్తుంది. భవనంలో ఒక అంతస్తుకు మాత్రమే పరిమితమవుతుంది.

అలాగే ఆన్‌లైన్ గేమ్స్ స్ట్రీమింగ్ సర్వీస్‌ను కూడా అమెజాన్ ఆవిష్కరించింది. దానితోపాటు వాయిస్ యాక్టివేటెడ్ స్క్రీన్‌ను కూడా మార్కెట్‌లోకి ప్రవేశపెట్టింది.

అయితే.. డ్రోన్ కెమెరా అనేది వణుకు పుట్టించే నిఘా ఉత్పత్తి అని ఒక బిగ్ బ్రదర్ వాచ్ అనే ప్రచారోద్యమ బృందం అభివర్ణించింది.

''డాటా సేకరించే కంపెనీకి అనుసంధానంగా ఎగిరే ఇంటర్నెట్ కెమెరాలను తమ ఇంట్లో మోహరించాలని ఎవరైనా కోరుకుంటారని అమెజాన్ ఎందుకు భావిస్తోందో ఊహించటం కష్టం'' అని ఆ బృందం ప్రతినిధి సిల్కీ కార్లో పేర్కొన్నారు.

సెక్యూరిటీ డ్రోన్

ఫొటో సోర్స్, Amazon

అయేత.. సమాజం మీద, పెరుగుతున్న నిఘా మార్కెట్ మీద అమెజాన్ ఉత్పత్తి ప్రభావాన్ని గుర్తించటం ముఖ్యమన్నారు.

దీనికి 'ఆల్వేస్ హోమ్ క్యామ్' అని పేరు పెట్టింది అమెజాన్. ఇంట్లోకి ఎవరైనా చొరబడినట్లు అనుమానం వచ్చినపుడు ఈ క్యామ్ లాంచ్ అవుతుంది. యజమానులకు స్మార్ట్ ఫోన్ అలర్ట్ పంపిస్తుంది. వారు ఈ క్యామ్ ద్వారా లైవ్ ఫుటేజీని వీక్షించవచ్చు.

ఈ యంత్రాన్ని డిజైన్ చేసినపుడు గోప్యత అంశానికి అంత్యంత ప్రాధాన్యతనిచ్చామని అమెజాన్ చెప్పింది.

''ఇది లాంచ్ అయి కదులుతున్నపుడు మాత్రమే నివేదిక పంపిస్తుంది. కదలకుండా ఉన్నపుడు ఇది డాక్‌లో కూర్చుని ఉంటుంది. ఆ సమయంలో కనీసం రిపోర్ట్ కూడా చేయలేదు'' అని రింగ్ విభాగం అధ్యక్షురాలు లేలా రౌహీ పేర్కొన్నారు.

''పైగా దీనిని పెద్దగా శబ్దం చేసేలా తయారు చేశాం. కాబట్టి గోప్యతకు భంగం వాటిల్లదు'' అని చెప్పుకొచ్చారు.

సెక్యూరిటీ డ్రోన్

ఫొటో సోర్స్, Amazon

ఈ పరికరం ధరను 250 డాలర్లుగా నిర్ణయించారు. దీనిని మార్కెట్‌లోకి విడుదల చేసినపుడు తొలుత అమెరికాలో మాత్రమే అందుబాటులో ఉంటుంది.

ఈ ఆల్వేస్ హోం క్యామ్ చాలా మందికి సైన్స్ ఫిక్షన్ సినిమాల్లో చూసే అద్భుతమైన డ్రోన్ కెమెరాగా కనిపిస్తుందని సీసీఎస్ ఇన్‌సైట్ కన్సల్టెన్సీ ప్రతినిధి బెన్ ఉడ్ వ్యాఖ్యానించారు.

స్మార్ట్‌ హోం టెక్నాలజీని ఇష్టపడే వారు దీనిపట్ల చాలా ఆసక్తి చూపవచ్చునని అభిప్రాయపడ్డారు. దానితో పాటే.. భవిష్యత్తులో ఇంట్లో టెక్నాలజీ పాత్ర, గోప్యతల అంశంపై భారీ చర్చనూ రేకెత్తించే అవకాశం ఉందన్నారు.

కారులో ఉపయోగించటానికి కూడా రింగ్ సంస్థ ఓ కొత్త సెక్యూరిటీ కెమెరాను ఆవిష్కరించింది. కారును పార్క్ చేసినపుడు పరిసారాల్లో కదలికల మీద ఈ కెమెరా నిఘా పెడుతుంది.

కారు ప్రయాణిస్తున్నపుడు డ్రైవర్ కారును రోడ్డు పక్కన నిలిపినట్లయితే అక్కడ ఏం జరుగుతోందో కూడా ఈ కెమెరా రికార్డు చేయగలదు.

ఎకో షో 10

ఫొటో సోర్స్, Amazon

ఫొటో క్యాప్షన్, ఎకో షో 10

రింగ్ ఉత్పత్తుల మీద గతంలో విమర్శలు వచ్చాయి. యూజర్లు రికార్డు చేసిన దృశ్యాలను అధికారులకు అందించాలని ఆ సంస్థ ప్రోత్సహించినపుడు.. మనుషుల జీవితాల్లోకి చొరబడే నిఘా సాంకేతికతలను సాధారణ విషయంలా మార్చేస్తోందని విమర్శకులు తప్పుపట్టారు.

అయితే.. ప్రస్తుతం మార్కెట్‌లో ఉన్న తన ఉత్పత్తులు - ఇండోర్ వీడియో డోర్‌బెల్స్, ఇండోర్ వీడియో కెమెరాలు, స్మార్ట్ అలారం సిస్టమ్‌ల ద్వారా వాటిని ఉపయోగిస్తున్న ప్రాంతాలు మరింత సురక్షితంగా మారాయని ఆ సంస్థ చెప్పుకొస్తోంది.

కోవిడ్ మహమ్మారి కారణంగా ఆర్థిక పరిస్థితి తిరోగమనంలో ఉండటంతో ఈ ఏడాది ప్రపంచ వ్యాప్తంగా స్మార్ట్ హోం ఉత్పత్తులపై వినియోగదారుల వ్యయం దాదాపు 15 శాతం తగ్గి 4,400 కోట్ల డాలర్లకు పడిపోతుందని మార్కెట్ రీసెర్చ్ సంస్థ స్ట్రాటజీ అనలిటిక్స్ అంచనా. అయితే 2021లో ఈ వ్యయం మళ్లీ పెరుగుతుందని జోస్యం చెప్పింది.

అమెజాన్ ఉత్పత్తులను వాటిని తయారు చేసేందుకు అయ్యే ఖర్చుకన్నా తక్కువ ధరకు అమ్ముతూ పోటీ వ్యతిరేక ప్రవర్తనకు పాల్పడుతోందని ప్రత్యర్థి సంస్థలు గతంలో ఆరోపించాయి. మార్కెట్ వాటాను ఆక్రమించుకోవటానికి ఇలా చేస్తోందని తప్పుపట్టాయి.

లూనా గేమ్స్ సర్వీస్

ఫొటో సోర్స్, Amazon

గేమ్స్ స్ట్రీమింగ్

అమెజాన్ చేసిన మరో పెద్ద ప్రకటన.. చాలా కాలంగా వినిపిస్తున్న క్లౌడ్-బేస్డ్ గేమ్స్ స్ట్రీమింగ్ సర్వీస్.

లూనా రిమోట్ కంప్యూటర్ సర్వర్లలో గేమ్స్‌ను రన్ చేస్తుంది. దీనివల్ల ప్లేయర్లు ఒక కంట్రోలర్ మినహా కన్సోల్ కానీ, ఇతర నిర్దిష్ట డివైజ్‌లు కానీ కొనాల్సిన అవసరం ఉండదు.

లూనా ప్లస్ చానల్ ద్వారా.. కంట్రోల్, రెసిడెంట్ ఈవిల్, బయోహాజార్డ్, సోనిక్ మానియా, మెట్రో: ఎక్సోడస్ వంటి పాత గేమ్‌లను కూడా ఆఫర్ చేస్తోంది. ఇందుకు నెలకు 6 డాలర్లు చార్జీగా ప్రకటించింది.

అయితే.. చాలా మంది గేమర్లు రాబోయే 'ఉబిసాఫ్ట్ చానల్' పట్ల ఆసక్తిగా ఉన్నారు.

లాంచ్ చేసినపుడు వెబ్‌బ్రౌజర్ ద్వారా అమెజాన్‌కు చెందిన ఫైర్ టీవీ డాంగిల్స్‌, విండోస్, మాక్ ఓఎస్ కంప్యూటర్లతో లూనా పనిచేస్తుంది. ఐఫోన్, ఐప్యాడ్లలో కూడా పనిచేస్తుంది.

కన్సోల్

ఫొటో సోర్స్, Amazon

ఏడాది కిందట లాంచ్ అయిన గూగుల్ స్టేడియాతో లూనా పోటీ పడుతుంది.

గేమింగ్ రంగంలో ఆటగాళ్ల డబ్బుల కోసం పోటీపడుతున్న ఇతర సంస్థల్లో ఎక్స్‌బాక్స్ గేమ్స్ పాస్, ప్లేస్టేషన్ నౌ, యాపిల్ ఆర్కేడ్, ఈఏ ప్లే వంటివి ఉన్నాయి.

అయితే.. బాగా పాపులర్ అయిన ట్విట్చ్ ప్లాట్‌ఫామ్ అమెజాన్ సొంతమే అయినందున అది లూనాను ప్రొమోట్ చేయటానికి ఉపయోగపడగలదు.

‘‘డ్రోన్ టెక్నాలజీ ఎంత వేగంగా అభివృద్ధి చెందిందో సులభంగా మరచిపోగలం'' అంటారు బీబీసీ నార్త్ అమెరికా టెక్నాలజీ రిపోర్టర్ జేమ్స్ క్లేటన్.

''ఆల్వేస్ హోం క్యామ్ అనేది 1980ల నాటి సైన్స్ ఫిక్షన్ సినిమాల్లో కనిపించిన కల్పితం. కానీ 2020 నాటికి ఎగిరే సెక్యూరిటీ డ్రోన్ల టెక్నాలజీ నిజమైపోయింది'' అని పేర్కొన్నారు.

ఎకో

ఫొటో సోర్స్, Amazon

అమెజాన్ తన డెలివరీ నెట్‌వర్క్‌ను వేగవంతం చేయటానికి చాలా ఏళ్లుగా డ్రోన్లను ఉపయోగిస్తుందని క్లేటన్ గుర్తుచేశారు. ఆ డ్రోన్లు నిఘా సేవలు కూడా అందించగలవని అమెజాన్ భాగస్వాములు గతంలోనే సూచించారని ప్రస్తావించారు.

''కానీ ఇంట్లో భద్రత కోసం డ్రోన్లను ఉపయోగించటమనేది కొత్త విషయం'' అంటారాయన.

అమెజాన్ తాజా వర్చువల్ ఈవెంట్‌లో కొత్తగా ప్రకటించిన ఉత్పత్తుల్లో.. ఎకో స్మార్ట్ స్పీకర్‌ను ఇంకా ఆధునీకరించటంతో పాటు.. చిన్నవైన ఎకో డాట్ స్మార్ట్ స్పీకర్ల తయారీ కూడా ఉన్నాయి.

ఎకో షో 10 స్మార్ట్ స్క్రీన్ కొత్త వెర్షన్‌ను కూడా అమెజాన్ లాంచ్ చేసింది. ఇది మనుషులు తిరుగుతున్నపుడు వారివైపు తిరుగుతుంటుంది. ఇందులోని కెమెరాను జూమ్ చేయటానికి వీలుగా 13 పిక్సెల్స్‌కు పెంచారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)