కరోనావైరస్: కొత్త మ్యుటేషన్ల వల్ల కోవిడ్ మళ్లీ విజృంభిస్తోందా? దేశంలో కరోనా కొత్త రకాలను కనిపెట్టే పని ఎంత వరకూ వచ్చింది?

ఫొటో సోర్స్, Reuters
- రచయిత, సౌతిక్ బిస్వాస్
- హోదా, బీబీసీ ప్రతినిధి
ప్రపంచాన్ని భయపెట్టిన కరోనావైరస్ కూడా ఇతర వైరస్ లాగానే ఒకరి నుంచి మరొకరికి వ్యాప్తి చెందుతూ దాని స్వరూపాన్ని నెమ్మదిగా మార్చుకుంటూ వస్తోంది.
కరోనావైరస్ మ్యుటేషన్లలో చాలా రకాల వైరస్ ప్రవర్తనలో పెద్దగా తేడాలు లేవు. వాటిని పెద్దగా పట్టించుకోనవసరం లేదు.
కానీ కొన్ని మ్యుటేషన్లు మాత్రం మానవ శరీరంలోని స్పైక్ ప్రొటీన్లకు అంటుకుని, వాటిని మార్చి శరీర కణాలలోకి ప్రవేశించే అవకాశం ఉంది.
ఇలాంటి వైరస్‌ల వల్ల మరింత ఎక్కువగా ఇన్ఫెక్షన్ వ్యాప్తి చెందటమే కాదు, వ్యాధి తీవ్రత కూడా పెరగవచ్చు. ఇవి వ్యాక్సీన్లకు కూడా లొంగకపోవచ్చు. ఇలాంటి ప్రమాదకర వైరస్ మ్యుటేషన్లను యూకే, సౌత్ ఆఫ్రికా, బ్రెజిల్లో ఇప్పటికే గుర్తించారు. ఇదిప్పుడు కొన్ని డజన్ల దేశాలకు వ్యాప్తి చెందింది.
అత్యంత అధికంగా ఒకరి నుంచి ఒకరికి వ్యాపించే ఈ వైరస్ మ్యుటేషన్లు వ్యాప్తి చెందడం వల్ల దేశంలో నాలుగో దశ కోవిడ్ కేసులు పెరిగే అవకాశం ఉందని గత వారం అమెరికాలో ఒక ఉన్నత వైద్యాధికారి హెచ్చరించారు.
బ్రెజిల్లో కనిపించిన వైరస్ మరింత ప్రమాదకరంగా ఉందని, గతంలో సోకిన ఇన్ఫెక్షన్ తర్వాత వచ్చిన రోగ నిరోధక శక్తి కూడా ఈ వైరస్‌తో పోరాడలేదని శాస్త్రవేత్తలు అంటున్నారు. అమెరికా, యూరప్‌లలో పెరిగిన కేసులకు బ్రిటన్‌లో కనిపించిన కొత్త వేరియంట్ కారణం కావచ్చని అంటున్నారు.
ప్రపంచ వ్యాప్తంగా జీనోమ్ పరిశోధకులు.. ఈ ప్రమాదకర మ్యుటేషన్లను వేటాడే ప్రయత్నం చేస్తున్నారు. వైరస్ సోకిన రోగి నుంచి సేకరించిన స్వాబ్ ద్వారా వైరస్ జీనోమ్ నిర్మాణ తీరును విశ్లేషించి అందులో మార్పులను శాస్త్రవేత్తలు కనిపెట్టగల్గుతున్నారు.

ఫొటో సోర్స్, Reuters
కరోనావైరస్ ప్రవేశించిన దేశాలలో భారతదేశం ప్రపంచంలో ఐదవది. భారతదేశంలో తొలి కోవిడ్ కేసు గత సంవత్సరం జనవరిలో కేరళలో నమోదయినప్పటి నుంచి ఇప్పటి వరకు 1 కోటి 10 లక్షలకు పైగా కోవిడ్ కేసులు నమోదయ్యాయి. కోవిడ్ వల్ల దేశంలో 150,000 మరణాలు చోటు చేసుకున్నాయి.
కోవిడ్-19 ఇన్ఫెక్షన్ కలిగించే సార్స్-కోవ్-2 వైరస్‌లో స్థానిక నమూనాల జన్యు చరిత్రను పరిశోధించటానికి పరిమితంగా ఉన్న వ్యవస్థను భారతదేశం ఇప్పుడిపుడే బలోపేతం చేస్తోంది.
ఇది చాలా కీలకమైన సమయం. దేశ వ్యాప్తంగా నమోదయ్యే కేసులు తక్కువగానే ఉన్నప్పటికీ కొన్ని రాష్ట్రాలు మాత్రం ఇన్ఫెక్షన్ల సంఖ్య పెరుగుతున్నట్లు చెబుతున్నాయి. దీంతో కొత్త వైరస్ రకాలే ఈ కేసులు పెరగడానికి కారణమేమో అనే భయం పట్టుకుంది.
మూడు విదేశీ వేరియంట్లలో దేశంలో 242 కేసులు నమోదయ్యాయని ఇండియా చెబుతోంది. అందులో యూకే రకం ఎక్కువగా ఉన్నట్లు తెలుపుతోంది.
అయితే, ఈ కొత్త వేరియంట్ల వల్లే కేసులు పెరుగుతున్నాయా లేదా అనే విషయాన్ని మాత్రం స్పష్టంగా చెప్పలేమని శాస్త్రవేత్తలు అంటున్నారు. కేసులు తగ్గిపోవడంతో ప్రజలు వైరస్ విషయంలో తీసుకోవల్సిన జాగ్రత్తలు పాటించకపోవడం వలన కూడా కేసులు పెరగడానికి ఒక కారణమని అంటున్నారు.
కేసులు కొత్తగా పెరిగిన మహారాష్ట్ర, తెలంగాణలలో కనిపించిన వేరియంట్ శాంపిళ్ళను జన్యు శాస్త్రవేత్తలు పరిశీలిస్తున్నారు.
‘‘ఈ కొత్త వేరియంట్లకు, కేసులు పెరగడానికి ఏమైనా సంబంధముందేమోనని పరిశోధించడానికి మరిన్ని శాంపిళ్లను సేకరిస్తున్నాం. మేమింకా ఈ ఫలితాలతో పూర్తిగా సంతృప్తి చెందలేదు’’ అని నేషనల్ సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ డైరెక్టర్ డాక్టర్ సుజీత్ కుమార్ సింగ్ చెప్పారు.

ఫొటో సోర్స్, EPA
అయితే, ఈ వైరస్ ప్రవర్తనా తీరు పరిశీలన భారతదేశంలో సరైన రీతిలో జరగటం లేదని, కొంత మంది శాస్త్రవేత్తలు జనవరిలో ప్రచురించిన ఒక అధ్యయనంలో విచారం వ్యక్తం చేశారు. భారతదేశంలో ఒక కోటికి పైగా కేసులు నమోదైతే, కేవలం 6,400 జన్యువులనే డిపాజిట్ చేశారని ఆ అధ్యయనం చెబుతోంది.
అయితే, కొత్తగా ఏర్పాటు చేసిన 10 జీనోమ్ ల్యాబులు ఈ జన్యు నిర్మాణక్రమ పరిశీలనను వేగవంతం చేసి వాటి ఫలితాలను వెంటనే ప్రచురించాలనే పనిని అప్పగించారు.
‘‘ఈ కొత్త వేరియంట్లను నిరంతరం పర్యవేక్షిస్తూ ఇవి జనాభాలోకి మరింత వ్యాప్తి చెందకుండా చూడాలి. ఇప్పుడు వ్యాప్తి చెందనంత మాత్రాన భవిష్యత్తులో కూడా వ్యాప్తి చెందవు అని అనుకోవడానికి అయితే లేదు. అలాగే వీటి వ్యాప్తికి మూలాలను కూడా తొందరగా సేకరించేలా చూడాలి’’ అని వైరాలజిస్ట్ డాక్టర్ షాహిద్ జమీల్ అన్నారు.
ఇలాంటి పరిస్థితుల్లోనే వైరస్ జీనోమ్ సీక్వెన్సింగ్ ప్రాముఖ్యత సంతరించుకుంటుంది. ఈ పనులను వేగవంతం చేయడానికి భారతదేశం 100 కోట్ల రూపాయల బడ్జెట్ కేటాయించింది. పాజిటివ్ వచ్చిన కనీసం 5 శాతం శాంపిళ్లను గోల్డ్ స్టాండర్డ్ పీసీఆర్ పరీక్షల ద్వారా సీక్వెన్సింగ్ చేయాలని భారతదేశం లక్ష్యంగా పెట్టుకుంది. "ఈ లక్ష్యాన్ని చేరుకోవడం సాధ్యమే" అని ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ జీనోమిక్స్ అండ్ ఇంటెగ్రేటివ్ బయాలజీ డైరెక్టర్ డాక్టర్ అనురాగ్ అగర్వాల్ చెప్పారు.
జనాభాలో వైరస్ ప్రవర్తించే తీరును తెలుసుకునేందుకు గత 10 నెలల్లో భారతదేశం 22 రాష్ట్రాల నుంచి 6,000 పైగా కరోనావైరస్ శాంపిళ్లను సీక్వెన్సింగ్ చేశారు. ఇందులో ప్రధానంగా వైరస్‌లో ఒకే రకమైన వేరియంట్ కనిపించింది. ఇది యూరప్ నుంచి వచ్చి ఉండవచ్చని భావిస్తున్నారు.

ఫొటో సోర్స్, Getty Images
ఇప్పటి వరకు దేశంలో 7,600 మ్యుటేషన్లు నమోదయ్యాయి. "చాలా వాటి వలన పెద్ద తేడాలు ఏమీ లేవు" అని సెల్యులార్ అండ్ మాలిక్యులార్ బయోలజి డైరెక్టర్ డాక్టర్ రాకేష్ మిశ్రా చెప్పారు.
‘‘దేశంలో ఇతర నగరాలలో కంటే బెంగళూరులో వైరస్ మ్యుటేషన్లలో ఎక్కువ రకాలు కనిపించాయి’’ అని ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ పరిశోధకులు చెప్పారు.
దీనిని బట్టి చూస్తే వైరస్ గతంలో కంటే వేగంగా వ్యాప్తి చెందుతోందని అర్ధమవుతోంది అని పరిశోధకులు భావిస్తున్నారు.
బెంగళూరులో కనిపించిన వైరస్ జన్యువులలో 27 రకాల మ్యుటేషన్లు ఉన్నట్లు గుర్తించారు. ఒక్కో శాంపిల్లో 11 రకాల మ్యుటేషన్లు ఉన్నాయని చెప్పారు. ఇది జాతీయ సగటు (8.4), అంతర్జాతీయ సగటు (7.3) కంటే ఎక్కువ.
భారతదేశం లాంటి దేశాలలో ఈ వైరస్ సీక్వెన్సింగ్ పెద్ద ఎత్తున చేయడం అంత సులభమైన పనేమీ కాదు.

శాంపిళ్లను స్థానికంగా సేకరించాలి. ఈ పని చేయడానికి వివిధ స్థాయిలలో ఆటోమేషన్ వేదికలు కూడా ఉన్నాయి. ఈ సేకరణకు అవసరమైన కొన్ని పరికరాలు చాలా ఖరీదైనవి. వీటిని దిగుమతి చేసుకోవల్సి ఉంటుంది.
ఈ శాంపిళ్లను ఫ్రీజర్లలో నిల్వ చేస్తారు. జీనోమ్‌లను మెషీన్లు మ్యాప్ చేస్తాయి. ఒక శాంపిల్ సీక్వెన్సింగ్ కోసం సుమారు 5,500 రూపాయిలు ఖర్చవుతుంది. వీటిని శిక్షణ పొందిన వ్యక్తులు సేకరించి, ప్రత్యేకమైన సీసాలలో భద్రపరిచి, దేశ వ్యాప్తంగా ఉన్న పరిశోధన శాలలకు పంపించాలి.
మిగిలిన రాష్ట్రాల కంటే కేరళ ఈ విషయంలో మెరుగ్గా పని చేసింది. ఈ రాష్ట్రం దిల్లీలో ఉన్న జీనోమ్ సీక్వెన్సింగ్ ల్యాబ్‌కి ప్రతి వారం ప్రతి జిల్లా నుంచి 25 శాంపిళ్లను పంపిస్తోంది.
ఒక శాంపిల్ సీక్వెన్స్ చేయాలంటే కనీసం 48 గంటలు పడుతుంది. కానీ, ఐసోలేషన్లో ఉన్న అంతర్జాతీయ ప్రయాణికుల శాంపిళ్ల సీక్వెన్సింగ్‌ను మరింత తొందరగా చేయవలసి ఉంటుంది. అయితే, సీక్వెన్సింగ్ ప్రక్రియ మొత్తం చేయకుండా ఒక ప్రత్యేక వేరియంట్‌ని మాత్రం తమ ల్యాబ్ 24 గంటల్లో గుర్తించే మార్గం కనిపెట్టినట్లు డాక్టర్ మిశ్రా చెప్పారు.

ఫొటో సోర్స్, Reuters
కరోనావైరస్ ప్రవర్తనా శైలిని తెలుసుకోవడానికి సీక్వెన్సింగ్ చాలా ముఖ్యమని కేంబ్రిడ్జ్ వైరాలజిస్ట్ ప్రొఫెసర్ రవీంద్ర కుమార్ గుప్త చెప్పారు. అయితే, వైద్యరంగానికి అతి తక్కువ బడ్జెట్ కేటాయించే భారతదేశం లాంటి దేశాలు ఈ పని చేస్తాయా అని ఆయన సందేహిస్తున్నారు.
‘‘వైరస్ సీక్వెన్సింగ్ చేయడం చాలా ముఖ్యం. దాని కంటే.. ఎక్కువ మంది జనాభాకు వ్యాక్సీన్ ఇవ్వడం కూడా చాలా ముఖ్యం. కేవలం సీక్వెన్సింగ్ చేయడం వలన ప్రాణాలు కాపాడగలగడం కానీ, విధానాలలో మార్పు తేవడం కానీ జరగదు’’ అని ఆయన వ్యాఖ్యానించారు.
‘‘మహమ్మారి చివరి దశ’’లో భారతదేశం ప్రవేశించిందని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ హర్ష వర్ధన్ ప్రకటించిన సమయంలోనే.. ఈ వైరస్ కొత్త మ్యుటేషన్లను కనిపెట్టే ప్రయత్నాన్ని కూడా ముమ్మరం చేశారు.
"ప్రస్తుతం భారతదేశం పరిస్థితి బాగుంది. కేసులు, మరణాలు తగ్గుముఖం పట్టాయి. ఆసుపత్రులు నిండి లేవు. మరోవైపు వ్యాక్సీన్ వేసే ప్రక్రియ కూడా వేగవంతం అవుతోంది" అని డాక్టర్ మిశ్రా చెప్పారు.
"అయితే, ఈ ప్రక్రియ అంతటినీ ఒక ప్రమాదకరమైన వేరియంట్ నాశనం చేయవచ్చు. అది స్వదేశంలో కూడా పుట్టినది కావచ్చు" అన్నారాయన.
ఇవి కూడా చదవండి:
- మహాత్మా గాంధీ: పాకిస్తాన్‌కు రూ.55 కోట్లు ఇవ్వాలన్న డిమాండే హత్యకు కారణమా?
- మెహులీ ఘోష్: జాతరలో బెలూన్లు కాల్చిన ఈ షూటర్ గురి ఇప్పుడు ఒలింపిక్స్‌పై
- గీతా గోపీనాథ్‌పై అమితాబ్ బచ్చన్ ప్రశంసల మీద ఎందుకు విమర్శలు వెల్లువెత్తుతున్నాయి?
- ఆంధ్రప్రదేశ్: హిందూ దేవతల విగ్రహాలు ధ్వంసం చేశానన్న ప్రవీణ్ చక్రవర్తి అసలు ఎవరు?
- వైట్ టైగర్: హాలీవుడ్ సినిమాల్లో అసలైన భారతదేశాన్ని చూపించేదెప్పుడు
- కాసిం సులేమానీ హత్య ఐఎస్‌కు వరంగా మారుతుందా
- మగాళ్లు రేప్ ఎందుకు చేస్తారు? అలాంటి ఆలోచనలు వారికి ఎందుకు వస్తాయి?
- సుభాష్ చంద్రబోస్ 'ద గ్రేట్ ఎస్కేప్': బ్రిటిష్ వాళ్ల కళ్లుగప్పి నేతాజీ దేశం ఎలా దాటారు?
- కోడి రామ్మూర్తి నాయుడు: ‘కలియుగ భీముడు’గా పేరు తెచ్చుకున్న ఈ తెలుగు వీరుడి కథేంటి?
- సెక్స్ అపోహలు: లైంగిక భాగస్వాములు ఎవరికి ఎక్కువగా ఉంటారు... పరిశోధనలు ఏం చెబుతున్నాయి?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)









