కరోనావైరస్: పిల్లలపై కోవిడ్‌ మహమ్మారి తీవ్రమైన ప్రభావం చూపుతోందా?

పిల్లలపై కోవిడ్‌ మహమ్మారి ప్రభావం

ఫొటో సోర్స్, Jupiter Images / Heide Benser

    • రచయిత, నిక్ ట్రిగల్
    • హోదా, బీబీసీ హెల్త్ క‌రస్పాండెంట్

కరోనావైరస్‌తో చిన్నారులు తీవ్రమైన ఇబ్బందులు పడిన సందర్భాలు చాలా తక్కువ. వారిలో మరణాల సంఖ్య కూడా తక్కువే. కానీ కోవిడ్‌కు అత్యధిక సంఖ్యలో బాధితులు అయ్యింది మాత్రం వారే.

లాక్‌డౌన్ కాలంలో వేధింపులు, వారి బాగోగుల‌ను పట్టించుకోలేని స్థితి కారణంగా ఏర్పడ్డ మానసిక సమస్యలు చిన్నారులను వెంటాడాయి. భావితరాలను కోవిడ్ మహమ్మారి కోలుకోలేని దెబ్బతీసిందని నిపుణులు అంటున్నారు.

స్కూళ్లు మూసివేయడంతో చిన్నారుల చదువులు కుంటుపడ్డాయన్నది వాస్తవం. అయితే స్కూళ్లను కేవలం చదువుకునే ప్రదేశాలుగానే చూడలేం. పిల్లల మానసిక, శారీరక అభివృద్ధికి అవి కేంద్రాలు. కుటుంబాలలోని ఇబ్బందుల కార‌ణంగా వారు ఎదుర్కొనే మానసిక సమస్యల నుంచి బైటపడటానికి ఉపకరించే ప్రదేశాలు స్కూళ్లు.

‘‘మనం స్కూళ్లను మూసేయడం ద్వారా పిల్లల జీవితాలనే మూసేశాం’’ అని రాయల్ కాలేజ్‌ ఆఫ్ పీడియాట్రిక్స్ అండ్ చైల్డ్ హెల్త్‌కు ప్రెసిడెంట్‌గా పని చేస్తున్న ప్రొఫెసర్ రస్సెల్ వినర్ వ్యాఖ్యానించారు. జనవరి ఆరంభంలో బ్రిటన్ ఎంపీల ఆధ్వర్యంలో జరిగిన ఎడ్యుకేషన్‌‌ సెలెక్ట్ కమిటీ సమావేశంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.

చిన్నారికి కరోనా స్క్రీనింగ్

ఫొటో సోర్స్, Getty Images

ఒంటరితనం, నిద్ర లేమి మొదలుకొని పిల్లలపై అనేక దుష్ప్రభావాలకు కరోనా కారణమైందని ప్రొఫెసర్ వినర్ అన్నారు.

అలాగని స్కూళ్ల మూసివేత ఒక్కటే చిన్నారుల‌కు పెను స‌మ‌స్య‌ కాదు. కరోనా కారణంగా ఉపాధి కోల్పోవడంతో వివిధ కుటుంబాలపై పడిన ఒత్తిడి ప్రత్యక్షంగా, పరోక్షంగా చిన్నారులపైనా ప్ర‌భావం చూపింది.

పిల్ల‌లు ఒంటరితనంలో బాధపడుతున్న సందర్భాలలో ఇంగ్లండ్‌లో ఇచ్చే కౌన్సిలింగ్‌ ఇటీవలి కాలంలో కనీసం 10% పెరిగిందని నేషనల్‌ సొసైటీ ఫర్‌ ద ప్రివెన్షన్ ఆఫ్‌ క్రుయాల్టీ టు చిల్డ్రన్‌ (NSPCC)కు చెందిన చైల్డ్‌లైన్‌ సర్వీస్‌ గణాంకాలలో తేలింది.

‘‘ఇంత దారుణమైన ప్రభావం ఇంతకు ముందెన్నడూ లేదు’’ అని ఈ సర్వీస్‌లో 2009 నుంచి పని చేస్తున్న నీల్ హోమర్‌ అన్నారు.

‘‘నేను చాలా బాధలో ఉన్నాను. ఒంటరితనంతో బాధపడుతున్నాను. ఎలాంటి ఆలోచనలు లేకుండా నిర్వికారంగా ఉంటున్నాను’’- ఇది ఓ పదహారేళ్ల కుర్రవాడు హెల్ప్ లైన్‌కు కాల్‌ చేసి చెప్పుకున్న స‌మ‌స్య‌. ఇలాంటి కాల్స్ త‌మ‌కు అనేకం వచ్చాయని NSPCC చైల్డ్‌లైన్ వెల్లడించింది.

పిల్లలపై కోవిడ్‌ మహమ్మారి ప్రభావం

ఫొటో సోర్స్, PA Media

పెరిగిన మానసిక సమస్యలు

కరోనా కారణంగా పిల్లల మానసిక స్థితి మీద తీవ్ర ప్రభావం పడినట్లు అనేక సర్వేలు, నివేదికలలో వెల్లడైంది. ‘ది మెంటల్ హెల్త్ ఆఫ్‌ చిల్డ్రన్ అండ్ యంగ్‌ పీపుల్ ఇన్‌ ఇంగ్లాండ్‌-2020’ నివేదికలో అనే సంచలన విషయాలు బైటపడ్డాయి.

3,000మంది చిన్నారులకు సంబంధించిన మానసిక స్థితిగతులను పరిశీలించినప్పుడు 16ఏళ్ల వయసున్న ప్రతి ఆరుగురిలో ఒకరు మానసిక సమస్యలను ఎదుర్కొంటున్నట్లు తేలింది. అంతకు మూడు సంవత్సరాల ముందు వెలువడిన నివేదికలో ప్రతి తొమ్మిది మందిలో ఒకరికి ఇలాంటి సమస్యలున్నట్లు వెల్లడైంది.

కుటుంబంలో ఏర్పడిన సమస్యలు తమపై ప్రభావం చూపాయని, స్నేహితుల‌కు దూరమై ఒంటరితనంతో ఇబ్బంది పడ్డామని, వైరస్ విషయంలో తీవ్రమైన భయానికి లోనయ్యామని చిన్నారులు చెప్పారు.

గతంలో ఎన్నడూ లేని స్థాయిలో యువతీ యువకులు ఆందోళనకు లోనయ్యారని ‘ది ప్రిన్సెస్‌ ట్రస్ట్‌’కు చెందిన జోనాథన్ టౌన్‌సెండ్ చెప్పారు. ‘‘ఇది వారిలో భవిష్యత్తుపై ఆశలు కోల్పోయేలా చేసింది’’ అన్నారాయన.

పిల్లలపై కోవిడ్‌ మహమ్మారి ప్రభావం

ఫొటో సోర్స్, Getty Images

ఎదుగుదలపై ప్ర‌భావం

పదహారేళ్లు దాటిన యువతీయువకులే కాదు, చిన్నారులు, పసికందుల్లో కూడా పరిస్థితి అందుకు భిన్నంగా ఏమీ లేదు. మానవుడి మానసిక, శారీరక అభివృద్ధిలో మొదటి మూడు సంవత్సరాల వయసు కీలక పాత్ర పోషిస్తుంది.

ఎదుగుదలకు సంబంధించి దీన్నే వెయ్యిన్నొక్క రోజుల ప్రణాళిక (1,001 days agenda) అని కూడా పిలుస్తారు. ఈ వయసులో చిన్నారులు ఇబ్బందులు ఎదుర్కొంటే అది జీవితాంతం వారిపై ప్రభావం చూపిస్తుంది.

ఇంగ్లండ్‌లో ఇంటింటికి వెళ్లి చిన్నారులలో శారీర‌క వృద్ధి, ఎదుగుగ‌ల క్ర‌‌మాన్ని పరిశీలించే నర్సులు చాలామంది కోవిడ్‌ ఫ్రంట్‌లైన్ వారియర్స్‌గా మారిపోయారు. దీంతో పిల్లల పెరుగుదలలో మంచి చెడులను పట్టించుకునే వారి విజిట్‌లు కొన్ని ప్రాంతాలలో సగానికి సగం పడిపోయాయి.

సామాజిక దూరం కారణంగా ఇలాంటి సర్వీసులన్నింటినీ కేవలం ఆన్‌లైన్‌ ద్వారానే పొందడానికి తల్లిదండ్రులు ప్రయత్నించారు. చిన్నారులకు సమాజంతో కలిసే అవకాశాలు చాలా వరకు దూరం కావ‌డం వారి పరిణితిపై ప్రభావం చూపింది.

కోవిడ్ కారణంగా పిల్లలపై కనిపించని ప్రభావం ఎంతో ఉంద‌ని ‘ఇనిస్టిట్యూట్ ఆఫ్ హెల్త్ విజిటింగ్’ సంస్థకు అధిపతిగా పని చేస్తున్న అలిసన్‌ మోర్టాన్‌ అన్నారు.

పిల్లలపై కోవిడ్‌ మహమ్మారి ప్రభావం

ఫొటో సోర్స్, Getty Images/Tatiana Maksimova

బందిఖానాలో దివ్యాంగులు

ఇంగ్లండ్‌లో పది లక్షల మంది దివ్యాంగులుంటే అందులోని ప్రతి పదిమందిలో ఒకరు కదలలేని స్థితిలో ఉంటారు. అలాంటి వారిపైనా, వారి కుటుంబాలపైనా కరోనా మహమ్మారి తీవ్రమైన ప్రభావం చూపింది.

కదల్లేని పరిస్థితులున్న దివ్యాంగుల్లో కొందరికి నిత్యం వైద్య సిబ్బంది సహకారం అవసరం ఉంటుంది. కానీ చాలామంది నర్సులు, వైద్య సిబ్బంది ఫ్రంట్‌లైన్ విధులకు వెళ్లడంతో దివ్యాంగుల వైద్యసాయానికి విఘాతం ఏర్పడింది.

‘‘ఈ పరిస్థితి కారణంగా దివ్యాంగులైన చిన్నారులు ఒక‌ర‌కంగా బందీలు అయిపోయారు’’ అన్నారు డేమ్‌ క్రిస్టైన్ లెనెహన్. ఆమె ‘కౌన్సిల్ ఫ‌ర్ డిజబుల్డ్‌ చిల్డ్రన్‌’ సంస్థకు డైరెక్టర్‌గా పని చేస్తున్నారు. ‘‘వారిలో చాలామందికి చదువు దూరమైంది’’ అన్నారామె.

దివ్యాంగులైన వారిలో సగంమందికి ఆన్‌లైన్ విద్యను ఉపయోగించుకునే వీలు కలగలేదు. అంగవైకల్యం ఉన్నా, స్వతంత్రంగా తమ పని చేసుకోగలిగే వారు కూడా ఇబ్బందిపడ్డారని లెనెహన్ అభిప్రాయపడ్డారు.

పిల్లలపై కోవిడ్‌ మహమ్మారి ప్రభావం

ఫొటో సోర్స్, Getty Images

చిన్నారులకు వేధింపులు

కరోనా లాక్‌డౌన్ కాలంలో చిన్నారులపై వేధింపులు పెరిగాయని తేలింది. గత ఏడాది ఏప్రిల్‌ నుంచి సెప్టెంబర్ మధ్య కాలంలో ఇంగ్లాండ్‌లో చిన్నారులపై హింస, లైంగిక వేధింపులకు సంబంధించి 285 ఫిర్యాదులు అందినట్లు ‘కౌన్సిల్స్ ఆఫ్ చైల్డ్ డెత్స్ అండ్ ఇన్సిడెంట్స్ ఆఫ్‌ సీరియస్‌ హామ్’ సంస్థ వెల్లడించింది.

అంతకు ముందు ఏడాది అదే సమయంలో నమోదైన కేసులకన్నా ఇవి సుమారు 25% ఎక్కువ.

అయితే ఇది పైకి కనిపించే కోణ‌మేన‌ని, కనిపించని అనేక కోణాలు, ఘటనలు ఉన్నాయని ఇంగ్లండ్‌లోని చిల్డ్రన్స్ కమిషనర్‌గా పని చేస్తున్న అన్నే లాంగ్‌ఫీల్డ్‌ వ్యాఖ్యానించారు.

ఇలాంటి ఘటనలపై సామాజిక కార్యకర్తలు, వైద్య సిబ్బంది, స్కూల్ నర్సుల నుంచి అందాల్సిన రిపోర్టులు చాలా వరకు అందలేదని, ఇంకా ఈ సంఖ్య ఇంకా ఎక్కువే ఉంటుందని ఆమె అంటారు. దీన్నిబట్టి చూస్తే అసలు ప్రభావం లెక్కలోకి రానట్లేనని ఆమె అభిప్రాయపడ్డారు.

కరోనా మహమ్మారికి ముందు నుంచి ఇంగ్లండ్‌, వేల్స్‌ ప్రాంతాలలో లైంగిక దాడులు, గృహహింస, మత్తు పదార్ధాలు, మానసిక సమస్యల కారణంగా జరిగే హింసలకు గురైన పిల్లలు సుమారు 20లక్షలమంది వరకు ఉన్నారని తేలింది.

కరోనావైరస్

ఫొటో సోర్స్, Getty Images

కరోనా లాక్‌డౌన్ కాలంలో అది కచ్చితంగా పెరిగి ఉంటుందన్న ఆందోళన వ్యక్తం చేస్తున్నారు సామాజిక కార్యకర్తలు.

ఇంగ్లండ్‌లోని చిన్నారుల్లో ప్రతి ముగ్గురిలో ఒకరు మాత్రమే మానసిక సమస్యలకు చికిత్సను పొందగలిగారని లాంగ్‌ఫీల్డ్ వెల్లడించారు. లాక్‌డౌన్ కారణంగా ఈ త‌ర‌హా వైద్య సహకారం మీద కూడా ప్రభావం పడిందని ఆమె చెప్పారు.

కరోనా లాక్‌డౌన్‌ కాలంలో చిన్నారులను క‌నిపెట్టుకుని చూడాల్సిన అవసరముంద‌ని అన్నే లాంగ్‌ఫీల్డ్ అన్నారు. ఆ సమయంలో వారే అతి పెద్ద బాధితులని ఆమె అంటారు.

అయితే ఈ వాదనను కొట్టి పారేస్తున్నారు సునిల్ భోపాల్‌. ఆయన పేద, మధ్య తరగతి దేశాలలో చిన్నారుల ఆరోగ్యంపై పని చేసే ఇంటర్నేషనల్ హెల్త్ గ్రూప్‌కు చైర్మన్‌గా పని చేస్తున్నారు.

చిన్నారులు కొంత ఇబ్బందిపడిన మాట వాస్తవమేనని, అయితే వారు ఇలాంటి పరిస్థితుల నుంచి బైటపడతారని భోపాల్ అన్నారు. అయితే ‘స్నేహితులతో ఆడుకోవడం నిషేధం’ అనే పరిస్థితులున్న ప్రపంచంలో పిల్లల ఎదుగుదల కష్టమేనని సునీల్ అంగీక‌రించారు.

‘‘పిల్లలు, వారి కుటుంబాలు నిషేధాజ్జలలో ఉన్నాయనడం అతిశయోక్తి అని నేను అనుకోను’’ అన్నారు సునీల్ భోపాల్‌

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)